టగ్ ఆఫ్ వార్ -౩

తార స్థాయిలో వినిపిస్తున్న శంకర్ గొంతు తుళ్ళిపడేలా చేసింది.

“ఉహు, ఇప్పుడు, ఇక్కడ తేలాల్సిందే. “

ఉలిక్కిపడింది వసుంధర.

“ఏం తేలాలి? ఏం తేలాలని అంటున్నావు. మా పిల్లకింకా పదహారేళ్ళు నిండలేదు. మైనర్ పిల్లను  పెళ్లి చేసుకోడం నేరం కదా ఇన్స్పెక్టర్ గారూ , నిజానికి లోకం తెలియని పిల్లను పెళ్లి చేసుకున్నందుకు వాడిని అరెస్ట్ చెయ్యాలి ” విరుచుకు పడింది వసుంధర తల్లి రత్న బాల.

“ అవునవును పదహారేం ఖర్మ , పన్నెండే అనయినా అనగలరు “ వ్యంగ్యంగా పలికింది శంకర్ స్వరం .

“ కాపోతే ఇరవై ఆరా? ఇంకా ఇంటర్ కూడా పూర్తి కాలేదు”

“  మాటికో సబ్జెక్ట్ తప్పితే ముప్పై ఆరు వచ్చినా పాసవదు’. నాకు తెలుసు ఇలాటి ఇరకాటాలు వెదుక్కుంటారని, అందుకే ఎందుకైనా మంచిదని బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను కూడా” అంటూ హీరోలా సర్ర్ మని జేబులోంచి పర్స్ లాగి నాలుగు మడతలుగా పెట్టిన కాగితాన్నీ బయటకు తీసి జాగర్త గా మడతలు తీసిఇన్స్పెక్టర్ ముందుంచాడు.

నిజమే వసుంధర బక్క పలచగా వయసుకన్న చిన్నగా కనిపించినా నిజానికి ఇరవై ఏళ్ళు దాటాయి.

ఈ లోగా శంకర్ తల్లి ఆదేమ్మ అందుకుంది.

“ మనకెందుకు బిడ్డా ఈ పెద్దింటి పిల్లలు , ఈ పెళ్ళిళ్ళు? ఏ పూటకాపూట నాలుగ్గింజలు తెచ్చుకు బతికేటోల్లం, ఈపిల్లను మనం సాకలేం. ఒగ్గెయ్యి బిడ్డా మన తోవ్వన మనం బోదాం.” కొడుక్కు నచ్చజెప్పాలని తాపత్రయ పడుతోంది.అవును మరి.తెల్లారి లేచి నాలుగిల్లల్లో పనులు చేసుకు సంపాదిస్తేనే  రోజులు వెళ్ళమారుతున్నాయి. తమకు సరిపడాపిల్లయితే తనతో పాటు మరో అయిదారిల్లు చేసుకు రాగలదు. ఈ గొప్పింటి బిడ్డను భరించడం అంటే మాటలా?

“ఛస్..నీ యమ్మ నోర్ముయ్ , పండ్లు రాల్తయ్ … నాకు నచ్చినట్టు నే జేస్తా , నువ్వోతివి నాకు జెప్పెతందుకు “ గయ్ మన్నాడు శంకర్.

ఆరు నూరైనా పిల్లను పంపమని వసుంధర తల్లి రత్నబాల తండ్రి జమదగ్ని.

చూసి చూసి , వినీ వినీ చిరాకు పుట్టింది ఇన్స్పెక్టర్ కి.

“చత్, పనీ పాడు లేక తెగ బలిసి కొట్టుకుంటున్నారు. మీ ఇంటి తగాయిదాలన్నీ తెచ్చి ఈడ దిస్కసంలు పెట్టేందుకు పని లేని మంగలోల్లమనుకుంటున్నారా? పొండి, పొండి. మీరు మీరు సంజాయించుకుని రండి . మల్లి సోమారం రండి.నాగ్గనక తిక్కరేగిందో నీ యమ్మ అందర్నీ లోపలకు తోసి మక్కెలిరగ దీస్తా..పొండి,పొండి” అంటూ విసుక్కున్నాడు.

పైసా రాలని కేసని అర్ధమైపోయిందతనికి.

వసుంధర ఒళ్లంతా సిగ్గుతో చచ్చిపోయింది. ఎదో సినిమాల్లో రిక్షా వాడిని చేసుకుని ఎంత మజాగా బతికారని ఆలోచించిందే తప్ప ఈ పర్యవసానాలన్నీ కలలో కూడా ఉహించ లేదు.

“మా పిల్లను మేం తీసుకు పోతం”

“పొండి”

“అట్లెట్ల ? నాతో పెళ్ళయినాక” శంకర్ ముందుకొచ్చాడు.

మళ్ళీ మోదలా!

కాని అలసిపోయిన ఇన్స్పెక్టర్  మొదలవనివ్వలేదు.

“ అవును వారం రోజులు టైమిస్తున్నా , మీలో మీరు తేల్చుకుని రండి. అప్పటిదాకా పిల్ల ఆలల ఇంటికాడనే ఉంటది. చల్  రెండు వేలు కట్టిపొండి.”

“రెండు వేలా ..?” రెండు వైపులా వారూ నోరెళ్ళ బెట్టారు.

“అవును లేదంటే కేస్ రాస్తా , లోపలకుతోస్తా”

“రాస్కో ..తోస్కో.నాకు మా యమ్మకూ పనైనా తప్పుతాది”

“ముదనష్టపు దానా తిని కూచుని ఎంత పని చేసావే..ఇప్పుడు చూడు” కూతురి మీద చెయ్యెత్తబోయింది రత్న బాల.

“నన్నిలా సతాయిస్తే ఏ విషమో తాగుతాను. లేదంటే ఉరిపెట్టుకుంటాను” పిడుగుల్లా వచ్చాయి వసుంధర బొంగురు స్వరం లోంచి మాటలు.

“ పిల్లను బెదిరించో సతాయించో మరో కేస్ చెయ్యకండి. నయానో భయానో నచ్చజెప్పుకోండి.”

రత్నబాల పర్స్ ఓపెన్ చేసి ఉన్న డబ్బు తీసి అతని చేతిలోపెట్టి చేతులు జోడించింది.

ఎవరిదారిన వాళ్ళు బయటకు నడిచి ఇళ్ళు చేరేసరికి రాత్రి ఏడు దాటింది.

*********************************

తెల్లారేసరికి చెప్పా పెట్టకుండా , ఏ సమాచారమూ ఇవ్వకుండా,ఇంటిముందు ఆటోలు దిగిన చెల్లెలి కుటుంబాన్ని చూసి తెల్లబోయాడు రఘురామయ్య.

అప్పుడో ఇప్పుడో పండుగలకో , శుభకార్యాలకో కలుసుకోడం పరిపాటే అయినా

ఇలా అకారణంగా రావడం ఆశ్చర్యకరమే . రెండు ఆటల్లో చెల్లెలు , బావగారు వాళ్ళిద్దరి పిల్లలు దిగాక అమ్మయ్య అందరు బాగానే ఉన్నారనుకున్నాడు. ఎవరికైనా అనారోగ్యమా ? ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ కోసం వచ్చారా?

సందేహాలు మనసులోనే దాచుకుని బ్రష్ చేసుకుంటున్న పని పూర్తీ కానిచ్చి ‘

“రండి రండి అంతా క్షేమమే కదా “ అంటూ లోనికి ఆహ్వానించాడు.

“ఆ.. ఒకసారి చూసి వెళ్దామని ..” అంటూ లోపలకు నడిచింది రత్నబాల.

“ రండి వదినా , పిల్లలు బాగున్నారా / ఓ వసు, సాహితి కూడా వచ్చారా ? రండి రండి “ అంటు వాళ్ళ బాగ్ లు అందుకుని ఆదిలో పెట్టి వచ్చి, మొహాలు కడుక్కోండి , కాఫీలు తెస్తాను” అంటు వంట గదిలోకి వెళ్ళింది చంప.

సాహితి గబగబా బ్రష్ చేసుకుని అత్తకు సాయపడెందుకు వంటగదిలోకి నడిచింది.

రత్నబాల కూడా బ్రష్ చేసుకుని వంటింట్లోకి వెళ్తూ ,

“ ఊ , బ్రష్ చేసుకో” అంటూ వంట గదిలోకి వెళ్తూ , “ సాహితీ అత్తకు నె సాయం చెస్తాగాని అక్కతోపాటు ఉండు “ అని కూతుర్నిబయటకు పంపింది.

ఏమో ఎప్పుడు ఎవరి కన్ను గప్పి మళ్ళీవాడింటికి వెళ్లిపోతుందేమోనని బెంగ గానే వుంది. రాత్రి అప్పటికప్పుడు ఆలోచించుకుని తెల్లవారితే ఇంకేం జరుగుతుందో నన్న భయంతో బయలుదేరి మూడో కంటికి తెలియకుండా అన్నగారింటికి వచ్చారు.

కాఫీ డికాషన్ ఫిల్టర్ లోంచి గిన్నెలోకి వంపుతున్న చంప పక్కకు జరిగి కాస్త గొంతు తగ్గించి ,” వదినా మేమిప్పుడో పెద్ద భారం నీ మీద పెట్టడానికి వచ్చాము.నువ్వు తప్ప నాకింక ఎవరున్నారు చెప్పు. “ అలా అంటుంటే రత్న బాల కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“ఛ ఛా అలా కన్నీల్లేమిటి చిన్న పిల్లలా … కష్టాల్లో ఒకరికొకరం కాకపొతే ఇహ ఈ బంధుత్వాలెందుకు చెప్పు “

నెమ్మదిగా జరిగినది వివరించింది. మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రావడం మొదలు బయలు దేరి వచ్చేవరకూ.

వింటున్న చంప మాన్పడిపోయింది.

“నిజంగా ఎందుకలా చేసింది?”

“నోరు విప్పితేగా ..చెప్పింది ఒక్కటే మాట. ఏదైనా అడిగితె విషం తాగుతా నంటుంది లేదా ఉరివేసుకుంటానని.”

“పిల్ల కాస్త కుదుట పడనీ , నెమ్మదిగా మీ అన్నయ్యకు చెప్తాను ముందు మనం పెద్ద వాళ్ళం ఆలోచిద్దాం ఏం చెయ్యాలని ..”

అంటూ కాఫీలు గ్లాసుల్లో పోసి “ పద , బెంగ పడకు “అంటూ హాల్లోకి నడిచింది.

ఉదయం టిఫిన్లు ముగించి పెద్దవాళ్ళంతా హాల్లో కూర్చుంటే . సాహితి, వసుంధర రఘురామయ్య ఇద్దరు కూతుళ్ళు శిల్ప ,శాలిని పైన పిల్లల గదిలో సీడి వేసుకుని కొత్త సినిమా ఒకటి చూస్తున్నారు.

“అన్నయ్యా జరిగిందేమిటో వదిన చెప్పిందిగా , ఏం చెయ్యాలో మాకేం తోచడం లేదు. ఎప్పటి కప్పుడు ఈ సమస్యలేమిటో.. “

“సమస్యలొచ్చాయని  బెంగ పడితే ఎలారా తల్లీ, సానుకూలంగా పరిష్కరించు కోవాలి గాని.. ఆలోచిస్తున్నాను, ఏం చేద్దామా అని ..మనందరం సంయమనంతో కొంచం ఓపిక పడితే పరిష్కారం పెద్ద సమస్య కాదు. ముందు మనం ఏం చెయ్య గలం అనేది చూడాలి . తరువాత వసు ఎందుకలా చేసింది అనేది తెలుసు కోవాలి.”

ఆయన మళ్ళీ మళ్ళీ పోలీస్ స్టేషన్ లొ ఏం జరిగిందనేది ప్రతి చిన్న వివరంతో సహా అడిగి తెలుసుకున్నాడు.

రెండు మూడు సార్లు విన్నాక “ ఎంత సేపూ నీది తప్పు నీది తప్పు అంటూ ఒకరినొకరు  నిందించుకునే మీ అహాలే కాని అసలు వాడేందుకు పెళ్లి చేసుకున్నాడో ఏం ఆశ పడుతున్నాడో కనుక్కున్నారా?

పోనీ ఇప్పటికీ మించిపోయిందేం లేదు , ఖచ్చితంగా వాడేదో ఆశించే పెద్ద ప్లాన్ తో చేసుకున్నాడే తప్ప ప్రేమించో కాపరం చెయ్యాలనో కాదనేది స్పష్టం. అయితే ఇప్పుడే అడిగి వాడికి సమయం ఇచ్చేకంటే చివరి నిమిషం లోమంతనాలు సాగించటం ఉత్తమం . ఈ లోగా వాసును నెమ్మదిగా మాట్లాడించి విషయం రాబట్టడం అవసరం. ఇప్పుడు వేడిని వదిలించుకున్నా మరొకడి ఉచ్చులో పడదని ఏమిటి నమ్మకం ? అందుకే ముందు తన మనసులో ఉన్నదేమిటో ఎందుకిలాంటి పనికి ఒడిగట్టిందో కనుక్కుని నచ్చజెప్పాలి. అయినా ఇద్దరికిద్దరూ ఉద్యోగాలంటూ చూసుకున్నారే గాని పెరిగే పిల్లల గురించి పట్టించుకోలేదు. “

“ అది కాదన్నయ్యా ..” ఎదో చెప్పాలని ప్రయత్నించింది రత్నబాల.

ఆమె ను మధ్యలోనే ఆపేసి , “ మనను మనం సమర్ధించు కుందుకు ఎన్నైనా కారణాలు దొరుకుతాయి. కాని ఎవరి మనసుకి వాళ్ళు అలోచించుకుంటే నిజం అర్ధమవుతుంది “ అని ఆగి . చంప వంక చూశాడు

– స్వాతీ శ్రీపాద

(ఇంకా వుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.