సినిమాలో స్త్రీలు రాయలేనిది ఏదైనా వుందంటే,ద్వంద్వార్ధం – సినీ రచయిత్రి ఉమర్జీ అనూరాధతో ముఖాముఖి

తెలుగు సినిమాల్లో ఎందరో రచయితలున్నారు కానీ రచయిత్రులు…? వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎప్పుడో ఒకనాడు ఒకసారి ఒక భానుమతీ రామకృష్ణ, సావిత్రి, ఆ తరువాత మరొక సారి విజయనిర్మల ! వాళ్లు కూడా వాళ్ల సొంతసినిమాలకు రాసుకున్నారు. కానీ ఇతరుల సినిమాలకు మాటలు రాయలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి మాటల రచయిత్రి – శ్రీమతి ఉమర్జీ అనూరాధ కావూరి. అదీ తన మొదటి సినిమాతోనే సున్నితమైన మాటలతో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నారు. ఆమె మాటల గురించి ఆమెతో ఎవరైనా ఏమైన మెచ్చుకుంటే ఆమె నవ్వేస్తారు. ఇదీ… అంతా ఒక్కరి గొప్పతనం వల్లే అయిపోదండి అంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆవిడది.

మహిళా దినోత్సవం సందర్భంగా చెరువు దుర్గా ప్రసూన శ్రీమతి ఉమర్జీ అనూరాధ గారితో జరిపిన ముఖాముఖి విహంగ పాఠకుల కోసం ప్రత్యేకం…

నమస్కారం మేడమ్. మీ తల్లిదండ్రుల వివరాలు చెప్తారా ?

* నమస్కారం, నన్ను కన్నవాళ్ళు ఒకరైతే పెంచిన వాళ్ళు ఒకరు. సుశీల, నాగరాజన్ గార్లు కన్నవాళ్ళు. పెంచినవాళ్ళేమో రాధాబాయి, శ్రీనివాసరావు గార్లు. నా చిన్నప్పుడు మా అమ్మగారికి బాగా జబ్బు చేసింది. అప్పుడు మా పెద్దమ్మ రాధాబాయి గారు నన్ను తీసికెళ్ళి తన సొంత బిడ్డలా పెంచుకున్నారు. తర్వాత మా అమ్మ నన్ను తీసికెళ్ళిపోవాలనుకున్నా నేను మా పెద్దమ్మని వదిలి రానని మారాంచేయడంతో అక్కడే ఉండిపోయాను. అలా నాకు ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు అన్నమాట.

బావుంది. మరి వాళ్ళ గురించి, మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాకేవైనా…?

* ఆఆఆఆ… పదో క్లాసు వరకూ పెదనాన్న పెద్దమ్మల దగ్గరే పెరిగా. నేను అయిదో తరగతి చదివేటప్పుడే మా పెదనాన్న రిటైర్ అయ్యారు. ఆయన నాకు ఒక ఫ్రెండ్ లాంటి వారు అని చెప్పాలి. ఇవ్వాళ్టికీ ఆయన్ని తల్చుకుంటే నాకు ఏడవాలనిపిస్తుంది. నా చిన్నతనం అంటే ముందు మా పెదనాన్న గురించే చెప్పాలి. తర్వాత మా పెద్దమ్మ గురించి. మా అమ్ములు అక్క గురించి. సంగీతన్న గురించి. హుమ్. అదో పెద్ద పుస్తకమే అవుతుంది. మళ్లీ ఎప్పుడన్నా చెప్తా.

కనీసం ఏవైనా కొన్నిసంఘటనలు అయినా చెప్పండి ప్లీజ్…

* అసలు నాకీ సినిమాల పిచ్చి గానీ రచనల మీద ఆసక్తి కలగడానికి కానీ మా పెదనాన్నే ప్రధాన కారణం అని చెప్పాలి. నాకు ఊహ తెలిసిన తరువాత నేను చూసిన మొదటి సినిమా శంకరాభరణం . అది మా పెదనాన్నే తీసుకెళ్ళి చూపించారు. ఏ థియేటరో గుర్తు లేదు. విజయవాడ లో రిక్షాలో వెళ్ళాం. నాకు ఆ సినిమా చూపించమని మా నాన్న నాగరాజన్ గారే చెప్పారు మా పెదనాన్నతో. అది నాకు బాగా గుర్తుంది. మా పెదనాన్న కూతురు అమ్ములు అక్క పెళ్ళి జరుగుతోంది హైద్రాబాద్ లో. అదే టైంలో శంకరాభరణం రిలీజైంది. మా నాన్నగారు ఒంటరిగా అనుకుంటా ఆ సినిమాకి వెళ్ళొచ్చారు. ఆ రోజు పెళ్ళి పందిట్లో మా నాన్న పెదనాన్నతో, ’ పుట్టి ( నా ముద్దుపేరు) కి మీరు శంకరాభరణం చూపించండి. చాలా బాగుంది’ అన్నారు. విజయవాడ వెళ్ళగానే మా పెదనాన్న నన్ను ఆ సినిమాకి తీసికెళ్ళారు. మొదటి నుంచీ చివరిదాకా ఏడుస్తూనే ఉన్నా. ఎందుకేడుస్తున్నానో నాకే తెలీదు. కొన్ని సార్లు బాధ కొన్ని సార్లు సంతోషం. ప్రతిసారీ గుండెలో, గొంతులో ఏదో నొప్పిలా ఒక బాధ. వస్తుంటే దారంతా ఏడుస్తూనే ఉన్నా. ఆ సినిమా మా పెదనాన్న నాకు ఐదు సార్లు చూపించారు.

అబ్బ. చాలా బాగుంది. తర్వాత?

* అప్పుడే నాకు సినిమాలంటే ఆసక్తి కలిగింది. ప్రతి సినిమా ఒక శంకరాభరణం లా ఉంటుందని అనుకునే దాన్ని. వరసగా కొన్ని సినిమాలు చూసాక అర్ధమైంది నాకు అన్ని సినిమాలు ఒకేలా ఉండవు అని. మా పెదనాన్న నెలకో సినిమా కి తీసుకెళ్ళేవారు. ఆయనా నేనే. మా పెద్దమ్మ ఎప్పుడూ ఇంటిపనుల్లోనే ఉండేది. వచ్చేవాళ్ళూ, పోయే వాళ్ళు అదీ కాక, మా పెద్దమ్మ ఏంటంటే అందరికీ తలలో నాలుకన్నమాట. అందరి సమస్యలూ ఆవిడవే. అందరి సంతోషాలూ ఆవిడవే. సినిమాలు ఆవిడ లిస్టులో చివరి అంశం. మా పెదనాన్న, నేను వెళ్ళిపోయేవాళ్ళం సుబ్బరంగా. అలానేను ఆయనతో కల్సి మేఘసందేశం, షోలే, ముత్యాల ముగ్గు, వంశ వృక్షం, శ్రీ వారికి ప్రేమలేఖ, స్వర్ణ కమలం, సూత్ర ధారులు, సిరివెన్నెల, ఇలా చాలా చూసా. ఆయన తర్వాత నాకు సినిమా పిచ్చి ముదరడానికి ఇంకోరు కూడా కారణం. సంగీతన్న. ఇతనెవరంటే మా పెద్దనాన్న దగ్గర పనిచేసిన ఒకాయన ఆయన పేరు గుర్తు లేదు, ఆయన భార్య మాత్రం గుర్తుంది మరియమ్మ అని. వాళ్ళబ్బాయి అన్నమాట. మా పెద్దమ్మ దగ్గరే పెరిగాడు చాలాకాలం. అలా నాకు అన్నయ్య అయ్యాడు. నేను పాకడం, లేచి నిలబడడానికి ప్రయత్నిస్తున్న టైం నుంచే నన్ను చంకనేసుకుని సంగీతన్న సినిమాలకి పిల్చికెళ్ళేవాడట.

హ్హహ్హహ్హ… బానే ఉంది. మరి ఇంట్లో తిట్టే వాళ్ళు కాదా? చిన్నపిల్లని సినిమాకేంట్రా అని?

* హ్హహ్హహ్హ… తెలిస్తే కదా.. ఒరేయ్ ‘పుట్టి’ని ఆడించరా కాస్సేపు అంటే సంగీతన్న సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడంట. అదే ఆడించడం. సంగీతన్న ఏ.ఎనార్ ఫ్యాన్. రిలీజైన ప్రతి ఏ.ఎన్నార్ సినిమాకి నన్ను భుజమ్మీద ఎక్కించుకుని పోయేవాడంట. ఈ బండారం ఎప్పుడు బయట పడిందంటే, ఒక సారి సెకండ్ షో కి ఇంట్లో చెప్పకుండా నన్ను బంగారుబాబు సినిమాకి తీసికెళ్ళాడు. అక్కడితో ఆగకుండా నాకు స్ట్రాంగ్ టీలు రెండు తాగించాడు. నేను నిద్ర పోకుండా ఆ సినిమా చూడాలని, నాకు ఆ సంఘటనకి సంబంధించి రెండు విజువల్స్ బాగా గుర్తున్నాయి. నన్ను ఎత్తుకుని, సాసర్ లో టీ పోసి నా చేత టీ తాగించడం, రెండోది ఆ ఏ ఎన్నార్ కర్చీఫ్ పట్టుకుని చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది అని డ్యాన్స్ చేయడం.

బాగుంది బావుంది తర్వాత?

* ఆ పాట వచ్చినప్పుడు థియేటర్ లో సంగీతన్న అయితే నన్ను ఎత్తుకుని నిలబడి ఒకటే డ్యాన్సులు, సంగీతన్నతో పాటు మిగతావాళ్ళు ఎవరో. ఒక పండగలా గడిచింది. ఆ కాస్సేపు. ఇంటికి వచ్చేశాం. నేను రెండు టీలు తాగా కదా. నిద్ర పోలేదు. ఈ పాట పాడడానికి ట్రై చేయడం. డ్యాన్స్ చేయడం. మా అక్క ( పెద్దమ్మ కూతురు అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె నాకు సొంత అక్క కన్నా ఎక్కువ.) అమ్ములు అక్కకి తెల్సి పోయింది. సంగీతన్న నన్ను సెకండ్ షో సినిమాకి తీసుకుపోయాడని. ఏవే నిన్న సంగీత ఎక్కడకి తీసుకుపోయాడు అని అడిగింది. నేను చెప్పలేనని సంగీతన్న కాన్ఫిడెన్స్. నేనేదో ఎలా చెప్పానో తెలీదు. మొత్తానికి అర్ధమైపోయింది మా అక్కకి. ఇంక తిట్లే తిట్లు సంగీతన్నకి. ఆ రోజు సంగీతన్న అలవాటు చేసిన టీని ఇప్పటికీ వదల్లేపోతున్నాను.
అలా సంగీతన్న నాకు ఇంటర్మీడియట్ దాకా సినిమాలు చూపెట్టాడు. మేమిద్దరం నెలకోసారి సరుకులు కొనడానికి విజయవాడ బీసెంట్ రోడ్డులో ఉన్న ఆంజనేయా స్టోర్స్ అనుకుంటా పేరు గుర్తు లేదు. అక్కడికి వెళ్ళి వెచ్చాల పట్టీ ఇచ్చేసి, అవి కట్టిపెట్టమని చెప్పి నేరుగా హాలుకి వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్ళం. అలా దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం, గురుశిష్యులు, శ్రీవారి ముచ్చట్లు, ఒకటి కాదు ప్రతి ఏ.ఎన్నార్ సినిమా అనుకోండి. ఆయన తర్వాత ఆయన కొడుకు నాగార్జున గారు హీరోగా విక్రమ్ విక్రమ్ తో పరిచయం అయ్యారు కదా. ఆ సినిమాకి కూడా సంగీతన్నే తీసుకెళ్ళాడు. నన్ను షిఫ్ట్ చేశాడన్న మాట ఏ ఎన్నార్ నుంచీ నాగార్జున పార్టీకి. ఒకసారి దెబ్బలాడా. ఎప్పుడూ వాళ్ళ సినిమాలేనా? ఇంకోళ్ళ సినిమా చూపెట్టవా? అని. అప్పుడు హిందీ సినిమా ‘హీరో’కి తీసుకెళ్ళాడు. అలా హీరో, కార్ వాన్, లావారీస్, ఖుర్బానీ, కూలీ ఇలా కొన్ని హిందీ సినిమాలు చూపెట్టాడు కానీ తెలుగులో మాత్రం ఇంకో హీరో సినిమా చూపెట్లా ఇంతవరకూ. సో ఆ రకంగా సినిమా పిచ్చి ముదరడానికి సంగీతన్నే కారణం అని చెప్పాలి.

అయితే రచన అనేది ఎప్పట్నించీ మొదలుపెట్టారు?

* ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నాకు ఉన్నట్టుండి రామాయణాన్ని పద్యాలుగా రాయాలి అనిపించింది. మా పెదనాన్నని రాత్రికి రాత్రి వెళ్ళి అడిగా. నాకు తెల్లకాగితాలు కావాలని. మంగళగిరిలో కరెంటు ఉండేది కాదు మా ఇంట్లో అప్పట్లో. లాంతరు దీపమే. మా పెదనాన్న నాకు కేలెండరు ఇచ్చి దాని వెనక రాసుకోమ్మా. ఈ రాత్రికి. రేపు పొద్దున నీకు తెల్లకాగితాలు కొనిస్తా అన్నారు. రాత్రికి రాత్రి ఆ వెలుగులో కూర్చుని రాసేసా. ఒక పద్యంలో రామాయణం మొత్తం అయిపోయింది. ఇదేంటి ఇలా అయిపోయింది అని తెల్లబోయా. మా పెదనాన్న బోసినోటితో నవ్వారు. ఆ నవ్వు నేనిప్పటికీ మర్చిపోలేను. ఆయనలో నాకు రాయాలన్న ఆసక్తి రావడం పట్ల ఆనందం, ఒక్క పద్యంలోనే రాసేసానన్న నవ్వు అన్నీ కనిపించాయి. అప్పుడన్నారు ఆయన, నువ్వు ముందు చిన్న చిన్న కవితలు, నాటకాలు రాయి. తర్వాత రామాయణం రాద్దూ గానీ అన్నారు. ఆ తర్వాత సంవత్సరం మా స్కూల్లో టీచర్స్ డే వచ్చింది. మా పెదనాన్న మా తెలుగు టీచర్ విద్యాధరికి చెప్పార్ట. మా అమ్మాయి బాగా రాస్తుంది అని. మా టీచర్ పిలిచి నన్ను ఏదైనా నాటకం రాసి నటించి వేయమన్నారు. అంటే నేనే రాసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం అన్నమాట. ఆణిముత్యాలు అని ఒక నాటకం రాసా. ఒక టీచర్ రిటైరైతే ఆమె దగ్గర చదువుకున్న నలుగురు స్టూడెంట్స్ వచ్చి తామెలా సక్సెస్ అయ్యామో చెప్తూ ఆమెకి పాద నమస్కారం చేసి వెళ్తారు. ఇది నేను రాసిన మొదటి నాటకం. తొమ్మిదో క్లాసులో. ఆ నాటకం చూడ్డానికి మా పెదనాన్న వచ్చారు. ఆ రాత్రి ఆయన చెప్పారు. ’ డకమా నువ్వు బాగా రాస్తావే. నువ్వు వదిలిపెట్టకు. ఏం రాయాలనిపిస్తే అది రాయి. పెద్దయ్యాక నువ్వు పెద్ద రచయిత్రివి అవ్వాలి. అదే నాక్కావల్సింది’ అని. నాకు ఆ విజువల్ బాగా గుర్తుంది. అంతే అప్పటించీ ఇప్పటిదాకా రాస్తూనే ఉన్నా. ఆయన నన్ను ఎంత ప్రోత్సహించారో మాటల్లో చెప్పలేను.

డకమా అంటే ఏమిటి?

* మేం మరాఠీ వాళ్ళం. మరాఠీలోనే మాట్లాడతాం. మరాఠీలో మాకడ్ అంటే కోతి. మా పెదనాన్న నన్ను ఒకసారి చిన్నప్పుడు మాకడ్ అని పిలిస్తే నేను దెబ్బలాడా. నన్ను అలా పిలవద్దు అని. సరే అని అప్పట్నించీ డకమా అని పిలిచేవారు. అది తిరగేసి పిలుస్తున్నారని నాకు చాలాకాలం తెలీలేదు సుమీ.

 ఆ తర్వాత? కనీసం ఒకటి రెండు జ్ఞాపకాల్ని అయినా చెప్తారా? మాకోసం?

* టెన్త్ క్లాస్ యిపోయాక మా పెదనాన్న ఒకరోజు చెప్పారు. ’నీకు తెల్సుకదా డకమా. నాకు డెబ్బై సంవత్సరాలొచ్చేస్తున్నాయి. ముసలివాడినైపోయాను. నిన్ను కాపాడుకోలేను. నాకు వస్తున్న పెన్షన్ కూడా తక్కువ. నిన్ను పై చదువులు చదివించలేను. అందుకని ఇంక నీ కన్నవాళ్ళ దగ్గరకెళ్ళి ఉండమ్మా .వాళ్ళైతే నిన్ను చదివిస్తారు. మంచి బట్టలు కొనిస్తారు. అని చెప్పారు. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. నిద్ర పోకుండా. అలా నేను ఇంటర్మీడియట్ నుంచీ మద్రాసులో ఉన్న మా అమ్మా,నాన్నల దగ్గర ఉండాల్సి వచ్చింది. నాకసలు ఇష్టంలేదు మా పెదనాన్ననీ, పెద్దమ్మనీ వదిలేసి వెళ్ళడానికి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పలేదు. ఆ తర్వాత కూడా ఆయన నన్ను రచనా వ్యాసంగంలో ఎంత ప్రోత్సహించారంటే కాలేజీలో నేను డ్రామా రాసి వేస్తున్నానని ఉత్తరం రాసాను. ఆ డ్రామా చూడ్డానికి ఆయన అప్పట్లో నాలుగు వందలు ఖర్చుపెట్టుకుని మద్రాసు వచ్చారు. వచ్చి, ఆ డ్రామా చూసి వెళ్ళారు. ఆ తర్వాత మా నాన్న నుంచీ కూడా ఇలాంటి ప్రోత్సాహం ఉండేది. అయితే ఆయన నా ముందు ఎప్పుడూ బయట పడేవారు కాదు. నా మొదటి సినిమా ’ ఏ మాయ చేశావే’ సినిమా ని చెన్నై లో చూడ్డానికి థియేటర్ కి వెళ్ళి నాకు ఫోన్ చేశారు. ’ అనూ నీ సినిమా చూడ్డానికి వచ్చానే’ అని. నేనసలు ఆనందంతో పొంగిపోయాను. ఎందుకంటే మా నాన్న నా సినిమా చూడ్డం కోసం ఇంట్లోంచి రెండు గంటలపాటు బస్సులో ప్రయాణించి థియేటర్ కి వెళ్తారని అనుకోలేదు. వెంటనే నేను ఇక్కడ నుంచీ ఒక మేనేజర్ తో కో ఆర్డినేట్ చేసి మా నాన్నని సినిమా అయిపోయాక కారులో ఇంట్లో దింపడానికి ఏర్పాటు చేశాను. కానీ నాన్న కారెక్కలేదట. అక్కర్లేదు బస్సులోనే వెళ్తానని మళ్ళీ ఇంకో రెండు గంటలు బస్సులో ప్రయాణంచేసి ఇంటికి వెళ్ళారట.

మరి సినిమా రచనలోకి స్త్రీలు రావచ్చా? ఎలాంటి వాతావరణం వుంటుంది ? దీనికన్నా పుస్తకాల్లో కధలు,నవలలు రాసుకోడమే మంచిదా?

*  ఇంట్లో కూర్చుని సుబ్బరంగా కధలు నవలలు రాసుకోడం ఎప్పుడూ మంచిదే. కానీ అందులో మీరు నిజంగా తృప్తిగా వుండాలి. ఆడబ్బు, ఆ పేరు తో తృప్తిపడాలి. అప్పుడు ఓకే. అదికాదు సినిమాలకి మనం రాయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ప్రయత్నించాలి.సినిమాల్లోకి స్త్రీలు భేషుగ్గా రావొచ్చు. వాతావరణం అంటారా? అది మనల్ని బట్టే వుంటుంది. ఒక్క సినిమాలే కాదు ఏ ఫీల్డ్‌ అయినా మంచీ చెడు రెండూ వుంటాయి. ఏడ్పించేవాళ్లు, నసగాళ్లు, ప్రోత్సాహించేవాళ్లు,వెన్నుదన్నుగా నిలబడేవాళ్లు అందరూ కల్సిపోయి వుంటారు ఎక్కడైనా.మనం ప్రవర్తించే విధానం బట్టే మన దగ్గరికి ఎవరు రావాలో వాళ్లు వస్తారు. మనం మంచిగా ఉంటే సత్సాంగత్యం లభిస్తుంది. లేదనుకోండి మోసపోతాం. ఇది ఒక్కసినిమాల్లోనే కాదు. ఎక్కడైనా ఇంతే. అలాగే ఒక్కఆడవాళ్లకే కాదు.మగాళ్లకైనా ఇంతే. హంస పాలునీ నీళ్లనీ వేరు చేసినట్టు, మన నడవడికే మంచినీ చెడునీ వేరు చేయగలదు. ఇది నా అభిప్రాయం.

స్త్రీలు సినిమా రచన అంటే కొన్ని లిమిట్స్‌ వుంటాయి కదా? అన్నీ ఆడవాళ్లు రాయలేరు అని అంటుంటారు కదా?

* రాసేదీ, రాయలేనిదీ అంటే ముందు ఏంటి అని నిర్వచించుకోవాలి.మీ ఉద్దేశంలో నిర్వచనం ఏంటి?

కమర్షియల్‌ సినిమాలు స్త్రీలు రాయలేరు. లేదా, పురుషుడి భాష స్త్రీలు రాయలేరు.అనే అభిప్రాయం ప్రాచుర్యంలో వుంది. దీన్నే నేను నిర్వచనంగా భావిస్తున్నా.

* సరే. కమర్షియల్‌ అంటే అందరి ఉద్దేశం ఏంటంటే హీరో డామినేషన్‌ వుండే ఫార్ములా సక్సెస్‌ సినిమాలు. వీటిలో ఉండే పురుషుల భాష లో ద్వంద్వార్దాలు దొర్లుతుంటాయి. వీటినే చాలామంది మాస్‌ అని కూడా అంటుంటారు. ఒక హీరో, డబుల్‌మీనింగ్స్‌, ఒక హీరోయిన్‌, ఆమె షోపీస్‌, ఒక విలన్‌ , వాడి హింస, అక్కడక్కడా యాక్షను కలిసి మాస్‌ కమర్షియల్‌ సినిమా. ఈ సినిమాలో స్త్రీలు రాయలేనిది ఏదైనా వుందంటే, ద్వంద్వార్ధం. ద్వంద్వార్ధంలో చాలావరకూ స్త్రీని కించపరిచేవే వుంటాయి. నన్నడిగితే అలాంటి డైలాగులు స్త్రీలు రాయగలిగినా రాయరు. రాయకూడదు. అలాగే పురుషులు రాయగలిగినా రాయకూడదు అంటాను. అలాగే నా దృష్టిలో కమర్షియల్‌ మాస్‌ సినిమాలు అంటే అందరినీ అలరించేవి అందరూ చూసేవి. శంకరాభరణం ఒక కమర్షియల్‌ సినిమా. మాస్‌ సినిమా కూడా. ఎందుకంటే ఆ కాలంలో రిక్షావాడూ చూసాడు. బెంజ్‌ కార్‌ వున్న వాడూ చూసాడు. అసలు ఒక విషయం ఈ మగవాళ్లకి తెలీదు. ఇప్పుడొస్తున్న సినిమాల్లోలా భర్తకానీ, ప్రేమికుడు కానీ డబుల్‌ మీనింగ్స్‌ లో, తిట్లలో మాట్లాడుతూ, బాటిల్సు బాటిల్సు మందుకొట్టేస్తూ, చెయిన్‌ స్మోకింగ్‌ చేస్తూ మాస్‌ హీరోలా కనక నిజ జీవితంలో వుంటే ఏ సెన్సిబుల్‌ అమ్మాయీ ప్రేమించదు. మాస్‌ హీరోలంతా ఒక చట్రంలో బ్రతుకుతున్నారు అలాంటివే కధలు అనుకుంటూ. అంతే!

లాస్టియర్‌ మీ సినిమా ఒక్కటి కూడా రాలేదు ఎందుకని?

* అవును. మానవత్వపు విలువలతో వున్న కధేదో చెయ్యాలని తపన పడి, రాంగ్‌ ప్రొడ్యూసర్స్‌ చేతిలో పడ్డాం. సమయం, శక్తి అంతా వృధా అయింది. కమ్యూనికేషన్‌ గ్యాప్స్‌అనేవి చాలా అగాధాలు సృష్టిస్తాయి అని అనుభవపూర్వకంగా అర్ధమైంది. చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో నా అసోసియేషన్‌ నాకు అండగా నిలబడిరది. అందుకు నేనెప్పుడూ నా సంఘానికి నేను రుణపడివుంటా.

 మీరు చేస్తున్న ఇంటింట అన్నమయ్య సినిమా గురించి చెప్పండి.

* ఇది చాలా ప్రిస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ నాకు. దీనికి సంబంధించిన అంశాలన్నీ ఎక్సైటింగ్‌ గా వున్నాయ్‌. మొదటిగా చెప్పాలంటే నా చిన్నప్పుడు విజయవాడఅలంకార్‌ టాకీస్‌ లో దేవత సినిమా మా పెదనాన్నతో కల్సి చూసాను. ఆ సినిమా చూసాకఎంత నచ్చేసిందంటే…సినిమా మొత్తం కీ డైలాగ్స్‌ తో సహా నాకు మనసులో వుండిపోయింది. పొద్దున 11 గంటల ఆట చూసేసి, ఇంటికెళ్లి అన్నం తిని, వెంటనేనా ఫ్రెండ్‌ కాళీమాత ఇంటికెళ్లా. సత్యనారాయణపురం రాజన్‌ కిళ్లీ షాప్‌ దగ్గరవాళ్ల ఇల్లుండేది. వెళ్లి దానికి దేవత సినిమా రెండుగంటలపాటు చెప్పా. జస్ట్‌ ఇమాజిన్‌,ఆ సినిమా డైరెక్టర్‌ అయిన రాఘవేంద్రరావు సర్‌ తో పన్చేసే అవకాశం నాకువచ్చిందని తెల్సి ఆ రోజు నేనెంత సంతోషించి వుంటానో?!! అంటే ఎంత దూరం ట్రావెల్‌ చేసానో ఇంత దాకా చేరుకోడానికి?!!! సెకండ్‌ థింగ్ ఏంటంటే… సాయిబాబు గారు. ఆయన్ని ఒక ప్రొడ్యూసర్‌ అని చెప్పడం కన్నా, బాబాయ్‌ అని అనాలి. లేదా పెద్దన్నయ్య అనాలి. అలా వుంటుందిఆయన మాట్లాడే తీరు కానీ, ఆయనిచ్చే ట్రీట్‌మెంట్‌ కానీ. నాకు సినిమావాతావరణంఅంటే కొంచెం భయం. కానీ సాయిసర్‌ ఆఫీస్‌ లో ఎక్కడా సినిమావాతావరణంకన్పించదు. మనిల్లు లాగా వుంటుంది. ఆయనకన్నా ఆయన శ్రీమతి నాకు చాలాఇష్టం. మొదటిసారి నేను ఎప్పుడు చూసానంటే, డైరెక్టర్‌ గారు ఆమెకి కధ చెప్పమనిసాయిసర్‌ ఇంటికి పంపారు. ఆమె ఎంత సింపుల్‌గా, ఎంత కళగా వున్నారో చెప్పలేను.చాలా అందంగా వుంటారు. బహుశా ఆ అందమంతా రేవంత్‌ కి వచ్చిందనుకుంటా.నాకు మా అమ్మనో అక్కనో చూస్తున్నట్టుగా అన్పించింది. మీకు చెప్పలేదు కదా. మా అమ్మ చాలా అందంగా వుంటుంది. ఆమె చిన్నప్పటి ఫోటో చూస్తే జమునలాగావుంటుంది. ఆమె అందం మాక్వెరికీ రాలేదనుకోండి. సో నేను ఆమెకి కధ చెప్తుంటేహీరో క్యారెక్టర్‌ గురించి చెప్తున్నప్పుడల్లా ఎంత మురిసిపోతూ విన్నారంటే నాకుబలే ముచ్చటేసింది. అంత ప్రేమ కొడుకు మీద. ఆమెలో అపారమైన మాతృత్వం.కధంతా అవుతుంటే సాయి సర్‌ వచ్చి ఆమెని అడిగారు, ‘ ఆ విన్నావా నీ కొడుకు కధ?’అని. ఆమె ఎంత మురిసిపోతూ నవ్వారో చెప్పలేను. కెమేరా లో బందిస్తే అదొకఅద్భుతమైన దృశ్యం. ఇంక మూడో విషయం. రేవంత్‌. రేవంత్‌ కి ఇంటర్నేషనల్‌ ఫిలింమేకింగ్‌ మీద మంచి అవగాహన వుంది. కధ ఇలా వుండాలి అని తనకంటూ ఒక నిర్ధిష్టమైన అభిప్రాయంవుంది. ఒక హీరో లాంఛింగ్‌ ప్రాజెక్ట్‌ లో వర్క్‌ చేయడం అనేది నా అదృష్టం అని చెప్పాలి. అతని ఎదుగుదల లో నాకూ కించిత్తు భాగం వుంది అన్న తృప్తి లైఫ్‌లాంగ్‌ వుంటుంది.కొన్ని దశాబ్దాల తర్వాత రేవంత్‌ తన ఆటోబయోగ్రఫీ రాసుకుంటే, మొదటిసినిమా రచయిత్రి అని నా పేరు రాసితీరాల్సిందే కదా! అది నాకు దక్కే సంతోషం.ఇందుకు నేను నా డైరెక్టర్‌ కి ధన్యవాదాలు తెల్పుకోవాలి. రేవంత్‌ చాలా సార్లు నా కొడుకు నాహుషీలా కన్పిస్తుంటాడు.

 ఇంటింట అన్నమయ్య కధేంటి?

* బానేవుంది. కధెవరైనా చెప్పేస్తారా? అబ్బా ఆశ దోశ అప్పడం.

 సరే. మరి ‘ఉదయం’ ఏంటి?

* ఇది రాసి చాలా రోజులైంది. ఉదయం గురించి ఏమైనా చెప్పేముందు ఒక మాటకచ్చితంగా చెప్పాలి. ఈ ఫీల్డ్‌ లో రాణించాలంటే కేవలం ప్రతిభ వుంటే సరిపోదు.ఓర్పు కూడా వుండాలి అని ఈ సినిమా డైరెక్టర్‌ నవీన్‌ నిరూపించుకున్నాడు.అతనికి చాలా ఓర్పుంది. చాలా మంచివాడు. తప్పకుండా ఒక స్టార్‌ డైరెక్టర్‌ అవుతాడు.ఈ కధ లో నిజాయితీ వుంది. అది నాకు చాలా నచ్చింది.

 ఈ సినిమాకి మీతో పాటు డైలాగ్స్‌ రాసారు కదా గౌతమ్‌ కశ్యప్‌ అని??

* మావారు. ఆయన అసలు పేరు శ్రీధర్‌ కుమార్‌. అయితే ఇది పెన్‌ నేమ్‌.ఫిలిమ్‌మేకింగ్‌ లో డాక్టరేట్‌ చేసారు. ఆయన కూడా రచయిత, కవి, నటుడు.ఉదయం సినిమాకి ఆయన సహాయం తీసుకున్నాను.ఇందులో కొన్ని సన్నివేశాలకి ఆయన న్యాయం చేస్తారని అన్పించింది. అందుకే ఆయన కూడా ఒక చెయ్యేసారు. అన్ని సినిమాల్లో ఆయన దగ్గరసర్వీస్‌ తీసుకుంటూ నే వుంటాను. కానీ పేరివ్వను. దౌర్జన్యం అన్నమాట. కాకపోతే ఈ సినిమాలో కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నా. అందుకేపోన్లే కదాని పేరిచ్చాం అన్నమాట!

మనం ఆడవాళ్లం కదా. మగవాళ్ల ని మనతో కలుపుకుంటే మనం ఫెమినిజానికి ద్రోహం చేసినవాళ్లం అవుతాం ఏమో? 🙂 

* అవునవును. కొన్ని సందర్భాల్లో వాళ్లని మనతో కలుపుకోడం వల్ల వాళ్లచేత బాగా సర్వీస్‌ కూడా చేయించుకోవచ్చు. తప్పులేదు.

 మీ ఇంట్లో సహకారం ఎలా వుంది?

* ఇది మరీ బావుంది. అసలీ ప్రశ్న ఎలా అడుగుతారు చెప్పండి? ఇంట్లో సహకారంప్రోత్సాహం లేకపోతే ఇవ్వాళ నా పేరు అందరికీ తెలిసేదా? నేను పెళ్లయ్యాకే కదాసినిమా రచయిత్రి అయ్యింది! సహకారం లేకపోతే అసలు ఈ ఫీల్డ్‌ లోకి ఎలావచ్చేదాన్నండి? నా భర్త నాకు ఇచ్చిన ప్రోత్సాహం, స్వేచ్ఛ అంతా ఇంతా కాదు.నాకు అమేజింగ్‌ ఫామిలీ సపోర్ట్‌ వుంది. నా భర్త, నా కొడుకు, నా మేనకోడలు. ఈ ముగ్గురూ లేకపోతే నేను నతింగ్‌ అని చెప్పాలి. నేను ఒక్కోసారిరాసుకోడం లో వుండిపోతాననుకోండి నా మేనకోడలు నన్నసలు డిస్టర్బ్‌ చేయకుండావంటపనంతా తనే చేసేస్తుంది. తను యాక్చువల్లీ నాకు కూతుర్లాంటిది. నా కొడుక్కి అక్క అన్నమాట. అలా అంత ప్రేమగా వుంటుంది.

మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్లు?

* ఎందుకమ్మా ఇప్పుడు ఫ్యూచర్‌ గురించి. నేనేదో చెప్తాను. అది ఒకవేళ కాలేదనుకో. నువ్వూరుకుంటావా? నెక్ట్స్‌ టైం అడుగుతావు అప్పుడలా అన్నారు కదా ఏమైంది అని. ఎందుకొచ్చిన గొడవ చెప్పు?

 పోనీ మీ తరువాతి ప్రాజెక్టులు?

* అది చేసినప్పుడు తెలుస్తుంది.

 మీ అబ్బాయి నాహుషీ గురించి?

* అయాం సో ప్రౌడాఫ్‌ హిమ్‌. చాలా అర్ధంచేసుకుంటాడు. నేను వాడితో ఏమైనా మాట్లాడొచ్చు.

 మీ సిస్టర్స్‌?

* అమ్ములక్క గురించి ఇందాకే చెప్పా కదా. ఆమె నాకు మానసికంగా చాలా దగ్గర. అక్కంటే ముందొచ్చే పేరు ఆమెదే. ఆ తర్వాత నాకు ఇద్దరు సొంత అక్కలు. మాలిని. మంజుల. టీనేజ్‌ లో మంజు అక్కకి క్లోజ్‌ గా వుండేదాన్ని. ఇప్పుడు మాలి అక్కకి క్లోజ్‌.

అదేంటి ? పార్టీ మార్చేసారు?

* హ్హహ్హహ్హ. అదేం కాదు. మాలి అక్క చిన్నప్పట్నించీ చాలా స్పిరిట్యువల్‌ పర్సన్‌.మనకి లైఫ్‌ లో ఏదో ఒక స్టేజ్‌ లో ఆధ్యాత్మికత అవసరం అవుతుంది. నాకు కూడా ఆధ్యాత్మికత అవసరమైనప్పుడు మాలి అక్కకి కనెక్ట్‌ అయ్యాను. ఆమెలో ఒక పాజిటివ్‌ ఎనర్జీ వుంది. అది నన్నెప్పుడూ తాకుతుంటుంది.

మీ భావాలు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.

– చెరువు దుర్గా ప్రసూన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

2 Responses to సినిమాలో స్త్రీలు రాయలేనిది ఏదైనా వుందంటే,ద్వంద్వార్ధం – సినీ రచయిత్రి ఉమర్జీ అనూరాధతో ముఖాముఖి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో