సమకాలీనం-ప్రతిరోజూ నీదే!

 

కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం.
కొన్ని క్రొత్త అంకురార్పణలు చేయాల్సిన సమయం
కొన్ని ప్రతిధ్వనులను ఇకనైనా బయటపెట్టాల్సిన సమయం
కొన్ని సంఘర్షణలను సమాజపరం చేయాల్సిన సమయం
కొన్ని పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన సమయం
సమానత్వం అడిగితే రాదు
తీసుకో…అది నీ హక్కు
కాదన్న చోటల్లా ఆ బలాన్ని ధిక్కరించు
అహంకారం అణచనిదే ఆగదు
పొగరనుకోనీ…కానీ నిన్ను నువ్వు ప్రతిధ్వనించు
దురాగతాలను మొగ్గలోనే తుంచు
దేశమంటే అందరిదీ!
సమాజపు ప్రతి విషయంలో నువ్వుండు!
బావిలో కప్పలా ఉండిపోవద్దు!
ప్రపంచం నీదే!
నీక్కావలసినంతా తీసుకో….
మహిళా దినోత్సవం ఒక్కరోజే కాదు…
ప్రతి రోజూ నీదే!

అనడానికీ, చదవడానికీ ఇలాంటి రాతలు బావుంటాయి. కదా! ఆచరణలోకి వచ్చేటప్పటికి అన్నీ తారుమారౌతాయి! దేశ జనాభాలో సుమారు సగమైన మహిళల పురోభివృద్ధి ఎంత? కొన్ని ప్రశ్నలకు జవాబులు రాబట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రశ్నలు నియంత్రణ రేఖలకివతల ఉంటాయి. బాలికలకు విద్య గగన కుసుమం అనుకునేవారు. కానీ కొన్నాళ్ళకు విద్య బాలికలకు దగ్గరగా వచ్చింది. కానీ ఉన్నత విద్య ఇంకా చాలా మందికి గగన కుసుమమే! ఈ విషయంతో చాలా విషయాలు ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి. కాస్తో కూస్తో కుటుంబాలు తమ ఆడపిల్లలను చదివించాలనుకుంటున్నా సమయానికి ఏసిడ్ దాడులు/ ప్రేమ గొడవలు/ రేప్ లు/ లైంగిక వేధింపులూ సమాజం నిండా పరుచుకుపోతే, తల్లిదండ్రులు ఎలా మారుతారు? వ్యక్తి మారాలన్న ఆలోచన ఇక్కడ పనికిరాదు. కుటుంబం మారాలన్న మాట అనగలమే కానీ నేటి సామాజిక పరిస్థితుల గురించి, ఆడపిల్లల భద్రత విషయమై వారు వేసే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలమా? ఇక్కడ ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. సామాజిక వ్యత్యాసాల త్రాసును సమానం చేయడంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత వారిదే! విద్యాపరమైన లోపాలు కూడా సవరించాలి. ముఖ్యంగా భద్రత/ రక్షణ కల్పించే దిశగా అడుగులు వెయ్యాలి. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం గురించి ఈ సంవత్సరమైనా నిర్ణయం జరగాలి. సింహాసనాన్ని అధిరోహించాలని స్త్రీ ఎందుకు అనుకోదు? అది ఒక ఆంబీషన్ కావచ్చు కూడా! కుర్చీ ప్రక్కన కుర్చీలో స్థానం మాత్రమే కావాలని అనుకోవాలని లేదు! స్త్రీ అబలా?! సబలా?! అని ఎవరికి తోచిన నిర్వచనం వారు ఇచ్చే పరిస్థితులను, పరిధులను దాటి సమాజాన్ని మార్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది…..నిరంతరంగా….

.కనపడని గాలిలా….పోయిన సంవత్సరం మహిళా దినోత్సవం నుండి ఈ సంవత్సరం మహిళా దినోత్సవం వరకూ దేశంలోని మహిళల స్థితిగతుల్ని అంచనా వేసే కమిటీ ఏదైనా వేయబడిందా? మహిళా సంక్షేమ శాఖ చేపడ్తున్న కార్యక్రమాలు ఎన్ని సమస్యలను ఈ కాలంలో పరిష్కరించాయి? దేశమంతా అట్టుడికిపోతున్న అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ దిశగా చర్యలు ఎలా తీసుకుంటున్నారు? జస్టిస్ వర్మ కమిటీ ఒక్కటే సరిపోతుందా? సమాజ ప్రక్షాళనకు మనందరం ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుకున్నాం? అన్నీ ప్రశ్నలే! వీటికి జవాబులు కావాలి. వచ్చే మహిళా దినోత్సవానికి మారిన సమాజం కావాలి! పరివర్తన అత్యవసరం….అత్యాశ అనొద్దు! ప్రయత్నిద్దాం! సాధిద్దాం!!ఆమె కూడా నీ లాంటి మనిషే అన్న పదాన్ని వదిలేద్దాం. ఆమె ఒక మనిషి అందాం! పరిధి లేని ప్రపంచం వైపు అడుగులేద్దాం!

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.