ముస్లిం మహిళలు

 బానిస బ్రతుకు కంటే గౌరవ ప్రదమైన మరణం మేలని చాటిన
బేగం ముహమ్మద్‌ ఆలం

       భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న భర్తల అడుగుజాడల్లో నడుస్తూ, తమదైన ప్రత్యేక పాత్రను నిర్వహించిన ముస్లిం మహిళలు ఎందరో ఉన్నారు.  ఆ మహిళలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రస్తావనలు చాలా అరుదుగా కన్పిస్తాయి.  జీవిత భాగస్వాములు బ్రిటీష్‌ ప్రభుత్వ దాష్టీకాలకు గురవుతూ, తరచుగా జైలు పాలవుతున్నందున ఎదురవుతున్న ఆర్థిక సామాజిక ఇక్కట్లతోపాటుగా మనోవ్యధను జీవితమంతా భరిస్తూ ఉద్యమాలకు ఊపిరి పోసిన మహిళామణుల త్యాగం అనిర్వచనీయం.  అటువంటి మహిళలు చూపిన తెగువ, చాటిన దేశభక్తి, త్యాగనిరతి, చరిత్రలో తమదైన స్థానం ఏర్పర్చుకున్నాయి. ఆ విధమైన చరిత్రను సృష్టించిని కోవకు చెందిన మహిళలలో బేగం ముహమ్మద్‌ ఆలం ఒకరు.

          ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ ముహమ్మద్‌ ఆలం భార్య.   లాహోర్‌కు చెందిన ఖాన్‌ షేక్‌ మియా ఫిరోజుద్దీన్‌ కుమార్తె. అసలు పేరు కంటే బేగం ముహమ్మద్‌ ఆలం పేరుతో ఆమె ఎంతో ప్రఖ్యాతి చెందారు. డాక్టర్‌ ఆలం లండన్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని లాహోర్‌ వచ్చి న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1921లో కనకవర్షం కురిపిస్తున్న న్యాయవాద వృత్తిని త్యజించి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా జాతీయోద్యమంలో ప్రవేశించారు.  ఆనాటినుండి బేగం ఆలం భర్త కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతునిస్తూ జాతీయోద్యమంలో భాగం పంచుకున్నారు.  డాక్టర్‌ ఆలం తరచుగా జైలు కెడుతుండటంతో భర్త బాధ్యతలను తన పరిమితుల మేరకు ఆమె నిర్వహిస్తూ వచ్చారు. ఆమె కృషి, స్వాతంత్య్రోద్యమం పట్ల  వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఆమెలోని ఉద్యమ నిబద్ధత, లక్ష్యసాధన పట్ల ఉన్న దృఢసంకల్పం 1932లో ప్రపంచానికి వెల్లడయ్యాయి.

               1932లో డాక్టర్‌ ఆలంను బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది.  ఆ సమయానికి డాక్టర్‌ ఆలం తీవ్ర శారీరక రుగ్మతతో బాధపడుతున్నారు.  బ్రిటీష్‌ ప్రభుత్వం పట్ల, అధికారుల వ్యవహార సరళి పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న డాక్టర్‌ ఆలం అంటే మండిపడుతున్న అధికారులు ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించారు.  అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన చికిత్స పట్ల అధికారులు శ్రద్ధచూపలేదు. ఆ కారణంగా ఆయన ఆరోగ్యం రోజురోజుకు దిగజారి పోసాగింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకున్నా, స్వదేశీ పత్రికలు డాక్టర్‌ ఆలం అనారోగ్య పరిస్థితులను తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ విషయాలను తెలుసుకున్న ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు.  బ్రిటీష్‌ ప్రభుత్వం మీద, జైలు అధికారుల మీద విమర్శలు గుప్పించారు. డాక్టర్‌ ఆలం మీద కక్షపూనిన అధికారగణం ఆ విమర్శలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు.  డాక్టర్‌ ఆలం గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని స్వయంగా విజ్ఞప్తి చేస్తే తప్ప ఆయనకు వైద్యసౌకర్యం కల్పించేది లేదని అధికారులు మొండికేశారు. స్వయంగా కోరితే చికిత్సకు అనుమతిస్తామని సంసిద్ధతను వ్యక్తం చేశారు.

               ఈ విషయమై ప్రజలలో తర్జన భర్జనలు ప్రారంభమైనాయి. ప్రభుత్వం స్వయంగా వైద్యసేవలను అందించాల్సి ఉండగా, అందుకోసం అభ్యర్థించటం చిన్నతనంగా కొందరు భావించగా, మరికొందరు డాక్టర్‌ ఆలం అనారోగ్య తీవ్రత దృష్ట్యా వినతి పత్రం పంపటం మంచిదని  అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ ఆలం మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రభుత్వానికి వినతిపత్రం పంపుకునేది లేదని స్పష్టంగా ప్రకటించారు. ప్రాణం పోయినా నేను ఆ పని చేయను అంటూ ఆయన మిన్నకుండి పోయారు. బేగం ఆలం భర్త ఆరోగ్యం పట్ల ఆవేదన చెందుతునప్పుటికి, భర్త అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థనలు పంపలేదు. ఈ పట్టుదల మూలంగా డాక్టర్‌ ఆలంకు ఎటువంటి చికిత్స జరగకపోవడంతో సమయం గడిచే కొద్ది ఆయన ఆరోగ్యం ప్రమాదకర స్థితికి చేరుకుని  చివరకు  రక్తం కక్కుకుంటూ ఆయన మృత్యువుకు సవిూపం కాసాగారు.

              ఆ పరిస్థితులలో డాక్టర్‌ ఆలం హితైషులు బేగం ఆలం వద్దకు వచ్చి ఆమెకు నచ్చచెప్ప ప్రయత్నించారు. పరిస్థితులు చేయిదాటి పోతున్నందున ఉద్యమకారుడు డాక్టర్‌ ఆలంను కాపాడుకునేందుకు ప్రభుత్వానికి వినతి పత్రం పంపాల్సిందిగా హితవు పలికారు. ఆలస్యం చేస్తే ఆయన విలువైన ప్రాణాలను రక్షించటం ఎవ్వరికీ సాధ్యం కాదని, అందువలన త్వరపడాల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్‌ ఆలం ఆరోగ్యంపట్ల  ఆందోళన వ్యక్తంచేశారు.  ఈ మేరకు పత్రికలలో ప్రజల విజ్ఞప్తుల పరంపర సాగింది. ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తలు డాక్టర్‌ ఆలం అనుచరులు, మిత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితులను తలచుకుంటూ తీవ్రంగా వ్యధ చెందారు.

                   ఆ సమయంలో బేగం ఆలం నిరుపమాన దేశభక్తి, ఉద్యమకారుడైన భర్త దృఢనిర్ణయం పట్ల గల గౌరవం, ఆమెలోని అసమాన ధైర్యసాహసాలు బహిర్గతమయ్యాయి. డాక్టర్‌ ఆలం అనారోగ్య పరిస్థితి పట్ల దేశవ్యాపితంగా వ్యక్తమవుతున్న ఆందోళన, సన్నిహితుల నుండి వ్యక్తమవుతున్న హితవచనాల నేపధ్యంలో ఆమె ప్రజల నుద్దేశించి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఆ ప్రకటన  జాతీయోద్యమకారులకు  ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలచింది.  పర్ధానషీ  మహిళలు కూడా మాతృదేశ విముక్తికోసం సాగుతున్న పోరాటం పట్ల కలిగియున్న స్పష్టమైన అవగాహనకు బేగం ఆలం చేసిన ప్రకటన స్పష్టంగా అద్దం పట్టింది.  ఆనాడు బేగం ఆలం చేసిన ప్రకటనను బిజనోర్‌కు చెందిన  మదీనా  అను ఉర్దూ పత్రిక 1932 అక్టోబర్‌ 25నాటి సంచికలో ప్రచురించింది. ఆ ప్రకటన ఈ విధంగా సాగింది.

                  మాతృభూమి, స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు, ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా. అందువలన నా భర్త జీవితాన్నిఎలాఉపయోగించుకోవాలన్నది జాతి జనులు నిర్ణయించాలి…ప్రభుత్వాన్ని అర్థించి, నా భర్త నామీద ఉంచిన విశ్వాసాన్ని నేను భంగపరుస్తూ, ఆయన త్యాగపూరిత దృఢ నిశ్ఛయానికి వ్యతిరేకంగా నేను వ్యవహరించలేను…జరిగేదేదో జరగనివ్వండి.
ఆ ఘోర విపత్తుకు బ్రిటీష్‌ ప్రభుత్వమే కారణం కానివ్వండి.. నా భర్తను సింహంలా మృత్యువును స్వీకరించనివ్వండి…జాతి ప్రయోజనాలు, ఆత్మ గౌరవాభిమానాల పరిరక్షణ విషయంలో వ్యక్తిగత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు… మాతృదేశ విముక్తి పోరాటంలో ధనమాన ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది…అందుకు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి.

                ..నా భర్త కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన బ్రిటీష్‌ వాళ్ళతో పోరాడినట్టే, మృత్యువుతో కూడా పోరాడి విజయం సాధించగలరు.  ఒకవేళ మృత్యువుదే పైచేయి అయినట్టయితే, గౌరవప్రదమైన జీవితం సాగించే ఉద్యమకారునికి లభించే మరణం,  పదికాలాల పాటు నికృష్టంగా గడిపే భయంకర బానిస జీవితం కంటే ఎంతో ఉన్నతమైంది…అందువలన నన్ను అర్థం చేసుకోండి. ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకపోనివ్వండి. (భారత్‌కి స్వాతంత్ర సంగ్రాం మేఁ ముస్లిం మహిళావోంకా యోగ్‌దాన్‌, డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1997, పేజి. 316-317)

              ఈ ప్రకటన అటు ప్రభుత్వ వర్గాలలోనూ ఇటు ప్రజలలోనూ సంచలనం సృష్టించింది. ఆ ప్రకటనలోని ప్రతి వాక్యం దేశభక్తిపూరితమై యావత్తు దేశాన్ని ఉత్తేజపర్చింది.  బేగం ఆలం ధైర్యానికి, ఆమెలో దాగిఉన్న  ఉద్యమ నిబద్దతకు, భర్త నిర్ణయాల పట్ల ఉన్న గౌరవానికి ఉద్యమకారులు జేజేలు పలికారు. ఆ విధంగా జాతీయోద్యమకారులకు స్ఫూర్తిదాయక మార్గదర్శకం చేసిన బేగం ఆలం జీవితాంతం డాక్టర్‌ ముహమ్మద్‌ ఆలంతోపాటుగా విముక్తి పోరాటంలో పాల్గొని చరితార్థులయ్యారు.


                            బ్రిటిష్‌ దాష్టికాలకు భయపడని ధీశాలి
                                                                    బేగం నిశాతున్నీసా బేగం


భారత స్వాతంత్య్రోద్యమంలో  భర్త రాజకీయాభిప్రాయాలను గౌరవిస్తూ, ఆయన అడుగుజాడల్లో ఉద్యమ దిశగా సాగిన భార్యలు కొందరైతే, స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉండి ఉద్యమంలో స్వేచ్ఛగా పాల్గొంటూ, భర్తను కూడా తన నిర్దుష్ట,నిక్కచ్చి అభిప్రాయాలతో ఉద్యమ దిశగా ప్రోత్సహించినవారు కొందరున్నారు. అటువంటి అరుదైన ధీరవనితలలో బేగం నిశాతున్నిసా అగ్రగణ్యులు.ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మోహాన్‌ జిల్లాకు చెందిన అవధ్‌లో నిశాతున్నిసా బేగం 1884లో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సయ్యద్‌ శబీబ్‌ హసన్‌ మోహానీ రాయచూర్‌లో హైకోర్టు న్యాయవాది. చిన్నతనంలో  బేగం నిశాతున్నిసా  ధార్మిక విద్యతోపాటుగా అరబ్బీ, ఉర్దూ, పర్షియన్‌ భాషలను అభ్యసించారు. ఆ ప్రాంతంలో విద్యావకాశాలు లేని బడుగువర్గాల ఆడపిల్లలకు చదవటం, రాయటం నేర్పటం ప్రారంభించి చిన్న వయస్సులోనే ఆమె తనలోని సేవాభావాన్ని వెల్లడి చేశారు. ఈ మేరకు ఆమె మోహాన్‌ (ఖళినీబిబిదీ) జిల్లా చెందిన ఉన్నవ్‌ గ్రామంలోని బాలికలలో విద్యాభ్యాసం పట్ల ఆసక్తిని కలిగించారు.

                జాతీయోద్యమంలో చిచ్చరపిడుగు గా ఖ్యాతిగాంచిన మౌలానా హసరత్‌ మోహానిని (1884-1937)ఆమె 1901లో వివాహం చేసుకున్నారు.  మౌలానా పూర్తి పేరు ఫజలుల్‌ హాసన్‌ హసరత్‌ మోహాని. వివాహానంతరం భర్తతోపాటుగా అలీఘర్‌ చేరుకున్న బేగం నిశాతున్నీసా చిన్నతనంలోనే  ప్రదర్శించిన సేవాభావాలకు, స్వేచ్ఛా, స్వతంత్ర భావాలు గల హసరత్‌ మోహాని తోడ్పాటు లభించింది. మంచి చదువరి అయినటువంటి ఆమెకు  పండితుడు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాభిలాషి అయినటువంటి భర్త లభించటంతో ఆమె అధ్యయనం మరింత చురుకుగా సాగింది.

                     వివాహం తరువాత  అలీఘర్‌లో విద్యాభ్యాసం చేస్తున్న మౌలానా మోహాని  1903లో  ఉర్దూ-ఏ-మౌల్లా  అను ఉర్దూ పత్రికను ప్రారంభించారు. మౌలానా మెహాని, బేగం నిశాతున్నిసా 1904లో  భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుండి ఆ దంపతులిరువురు జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలన్నిటిలో పాల్గొనసాగారు. 1907లో సూరత్‌లో జరిగిన జాతీయ కాంగెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అతివాదులు- మితవాదులుగా చీలిపోగా  అతివాదుల నేత బాలగంగాధర తిలక్‌ వెంట మౌలానా నడిచారు.ఆ తరుణంలో బేగం నిశాతున్నిసా భర్త అభిప్రాయాలను సమర్థించటమే కాకుండా ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతివాద రాజకీయాలను ప్రోత్సహించారు.

                    1908లో ఉర్దూ-ఏ-మౌల్లా  బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ప్రచురించిన ఓ వ్యాసం పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం ఇండియన్‌ డిఫెన్స్‌ రూల్స్‌ క్రింద మౌలానాను 1908  జూన్‌ 22న అరెస్టు చేసింది. మౌలానా అరెస్టు కావటం అది మొదటిసారి. ఆ సమయంలో ఆమె తొలి సంతానం ఏడాది వయస్కురాలైన పసికందు నైమా బేగం తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఆ కుటుంబంలో అరెస్టులు, జైళ్ళ అనుభవం లేదు. అయినా గ్రావిూణ ప్రాంతం నుండి వచ్చిన బేగం నిశాతున్నిసా భర్త అరెస్టు పట్ల ఏమాత్రం భయపడకుండా ఉద్యమకారిణిగా అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించారు.

               ప్రభుత్వం, పోలీసుల చర్యలకు తాను భయపడకుండటం అటుంచి  భర్తకు ఎంతో ధైర్యం చెప్పారు. మౌలానా మోహానిని అరెస్టు చేసిన మరుసటి రోజున ఓ లేఖ రాసి దానిని పోలీసు అధికారి ద్వారా ఆయనకు పంపారు. ఆ లేఖలో  విూ విూద విరుచుక పడిన ప్రమాదాన్ని ఎదుర్కోండి. నా గురించి ఆలోచించ వద్దు. విూ నుండి ఎటువంటి బలహీనత ప్రదర్శితం కారాదు. జాగ్రత్త సుమా! అని హెచ్చరించారు. ఈ లేఖను చూసి మౌలానా ఆశ్చర్యపోయారు.

                  మౌలానా పక్షాన వాదించేందుకు ఆ సమయంలో న్యాయవాదులు ముందుకు రాలేదు. అలీఘర్‌ కళాశాల కార్యదర్శి నవాబు వకారుల్‌ ముల్క్‌ లాంటి ప్రముఖులు మౌలానాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు.  ఆ విపత్కర పరిస్థితులలో అధైర్యపడకుండా  న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నంత కాలం ఆయా కార్యక్రమాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు.1908 ఆగస్టు 4న కోర్టు తీర్పు చెబుతూ మౌలానాకు రెండేళ్ళ జైలు, ఐదు వందల రూపాయల జరిమానా విధించింది. ఆ తీర్పు ఆమెను ఏమాత్రం కదిలించలేకపోయింది. దయనీయంగా ఉన్న కుటుంబం ఆర్థిక పరిస్థితుల కారణంగా జరిమానా కట్టలేదు. ఆ కారణంగా అత్యంత విలువైన పుస్తకాలు గల మౌలానా స్వంత గ్రంథాలయాన్ని కేవలం 60 రూపాయలకు పోలీసులు వేలం వేశారు. ఈ సందర్భంగా   పోలీసులు నానా హంగామా సృష్టించారు. ఆ దుష్టచర్యలకు  బేగం నిశాతున్నీసా కించిత్తు కూడా చలించలేదు.

                  చివరకు 1909 జూన్‌లో మౌలానా విడుదలయ్యారు. జైలు నుండి విడుదల కాగానే మళ్ళీ ఆయన తన బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించారు. ఆయనకు నచ్చచెప్పి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నుండి విరమింపచేయాల్సిందిగా బంధువులు, సన్నిహితులు ఆమెకు సలహాలనిచ్చారు. ఆ సలహాలు ఆమెకు రుచించలేదు. ఆప్తులు, సన్నిహిత బంధువులు దూరమయ్యే పరిస్థితులు వచ్చినా ధార్మిక,ఆర్థిక,రాజకీయ నిబద్ధ్దత నుండి ఏమాత్రం దారి మళ్ళేది లేదని బేగం నిశాతున్నీసా స్పష్టంచేశారు.
మౌలానా ఉర్దూ-ఏ-మౌల్లా ను పునరుద్దరించారు. ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని ప్రచురిస్తున్నందున ఉర్దూ-ఏ-మౌల్లా  ముద్రణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ అవాంతరాన్ని అధిగమించేందుకు మౌలానా దంపతులు తమ చిన్న అద్దె గృహంలో ఉర్దూ ప్రెస్‌ ఏర్పాటు చేసుకున్నారు.ఈ ప్రెస్‌లో బేగం నిశాతున్నీసా అహర్నిశలు పనిచేస్తూ, అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఉర్దూ-ఏ -మౌల్లా పత్రిక నిరాటంకంగా బయటకు రావటంలో ఆమె అన్ని విధాల మౌలానాకు తోడ్పాటునిచ్చారు. బ్రిటీషు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జాతీయ భావాలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న లక్ష్యంతో ఆరంభించిన ఉర్దూ-ఏ-మౌల్లా ను మరింత అర్థ్దవంతంగా రూపొందిచడంలో సంకల్పబద్ధులైన  నిశాతున్నీసా బేగం  బృహత్తర పాత్ర నిర్వహించారు.  

                మౌలానా దంపతుల ప్రభుత్వ వ్యతిరేక చర్యల పట్ల కినుక వహించిన అలీఘర్‌ ప్రముఖులు ఉర్దూ-ఏ-మౌల్లా  పత్రికను ఎవ్వరూ కొనవద్దని, ఆ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించవద్దని ప్రత్యేకంగా హుకుం జారీచేశారు. ఆ కారణంగా మౌలానా దంపతులు ఆర్థికంగా పలు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ సమయంలో వారిల్లు, ఉర్దూ ప్రెస్‌, ఆ దంపతుల ఆత్మగౌరవం, మౌలానా ఇంటి పరిస్థితులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ మాటల్లో ఇలా ఉన్నాయి.

అటువంటి దుర్భర పరిస్థితులలో కూడా భర్తకు ధైర్యం చెబుతూ, కుటుంబ బరువు బాధ్యతలను స్వయంగా భరిస్తూ  బేగం నిశాతున్నీసా మౌలానా మోహానిని ప్రోత్సహించారు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్షరాగ్నులు కురిపిస్తున్న ఉర్దూ-ఏ-మౌల్లా  విూద పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఈసారి పత్రికను పూర్తిగా తుదముట్టించాలని అనుకున్నారు. 1913 మే 13న ఉర్ద్దూ-ఏ-మౌల్లా పత్రిక నుండి మూడు వేల రూపాయలను డిపాజిట్టు చేయాల్సిందిగా ప్రెస్‌ యాక్ట్‌ క్రింద డిమాండ్‌ చేశారు. ఆ మొత్తం కట్టనందున ఉర్దూ ప్రెస్‌ను ప్రభుత్వం జప్తు చేసింది. ఆ చర్యతో మౌలానా దంపతులు ప్రాణపదంగా చూసుకుంటున్న ఉర్దూ-ఏ-మౌల్లా మూతపడింది.

                అంతర్జాతీయ పరిణామాల మూలంగా బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేకుల మీద  పోలీసులు దృష్టిసారించారు. జాతీయోద్యమ నేతల విూద ఆంక్షలు విధించారు.  అందులో భాగంగా మౌలానాను గృహనిర్భంధంలోకి తీసుకుని, ఆయన కదలికల విూద ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను ఖాతరు చేయనందున 1916 ఏప్రిల్‌ 13న మౌలానాను ప్రభుత్వం మరోసారి నిర్భంధంలోకి తీసుకుంది. ఆంక్షలతో కూడిన స్వేచ్ఛను ప్రభుత్వం ప్రసాదిస్తాననగా అందుకు మౌలానా వ్యతిరేకించారు. మౌలానా హసరత్‌  తీసుకున్న ఆ నిర్ణయం పట్ల మౌలానా ఆజాద్‌, అలీ సోదరులు ఆందోళన వ్యక్తంచేయగా బేగం నిశాతున్నీసా మాత్రం ఎటువంటి జంకు లేకుండా భర్త నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆంక్షలతో కూడిన స్వేచ్ఛ కంటే జైలు జీవితం ఎంతో మేలు అని  ప్రకటించారు.

పల్లెటూరు నుండి విచ్చేసిన పడతిలో ఇంతటి ధైర్యం, సాహసం, హేతుబద్ద ఆలోచనల వ్యక్తీకరణలను గమనించిన ప్రముఖ నాయకులు అమితాశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసాలో దాగిఉన్న శక్తియుక్తులన్నీ బహిర్గత మయ్యాయి. మౌలానా విడుదల కోసం అధికారులతో పోరాడుతూ, న్యాయ వాదులను కలసి ఒకవైపున తీవ్రంగా కృషిచేస్తూ, మరోవైపున మౌలానా పక్షాన ప్రజలకు, పత్రికలకు సమాచారం అందిస్తూ, ప్రముఖ జాతీయోద్యమ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, అభిప్రాయాలను పంచుకుంటూ, జాతీయోద్యమ కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
మౌలానాను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఒక్కచోట ఉంచకుండా రహాస్యంగా పలుచోట్లకు మార్చుతున్నప్పటికి ఎంతో చాకచక్యంతో ఆ విషయాలను తెలుసుకుంటూ భర్త పరిస్థితిని, ఆయన అభిప్రాయాలను ప్రజలకు, జాతీయోద్యమ నేతలకు తెలుపుతూ మౌలానాకు ప్రజలకు ఆమె సంధానకర్తలా వ్యవహరించారు. ఆ సమయంలో కూడా మౌలానా పక్షాన వాదించేందుకు న్యాయవాదులు ముందుకు రాలేదు. ఆ సంక్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకుంటూ భర్త పక్షాన  క్రియాశీలకంగా వ్వవహరించారు.

                    మౌలానా జైలులో ఉన్నప్పుడు ఆయన సంకల్పబలాన్ని, ప్రభుత్వానికి తలవంచని దృఢదీక్షను తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన వ్యవహారాల విూద వ్యాఖ్యానిస్తూ పలువురు ప్రముఖులకు ఆమె ఉత్తరాలు రాశారు. 1916 ఏప్రిల్‌ 11న మౌలానా అబ్దుల్‌ బారికి లేఖ రాస్తూ, మౌలానాకు భగవంతుడు మరింత సంకల్పబలం ఇవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఒక వేళ జైలు శిక్ష పడినా ధైర్యంగా ఉండాలి…నేను కూడా జైలుశిక్షకు గాని ఉరిశిక్షకు గాని బలవ్వడానికి సిద్ధ్దంగా ఉండాలి, అని ప్రకటించారు. మౌలానా మోహాని లలిత్‌పూరు జైలులో ఉండగా, ఆయనకు 1916 ఏప్రిల్‌ 28న రాసిన లేఖలో ఎవడైతే జులుం చేస్తాడో వాడు కత్తికి బలవుతాడు. మనం జులుం చేయం. మన విూద జులుం సాగుతున్నందుకు సంతోషిద్దాం అని ఆమె రాశారు.
మౌలానా మోహాని నిర్బంధంలో ఉండగా ఆమె చూపిన చొరవ, కార్యదక్షత, సమయస్ఫూర్తి, దేశభక్తిని కొనియాడుతూ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, మౌలానా  అబ్దుల్‌ బారి ఫిరంగి మహాల్‌, మౌలానా షౌకత్‌ అలీ, మౌలానా ముహమ్మద్‌ అలీ, ఆబాది బానో బేగం తదితర ప్రముఖులు ఆమెకు లేఖలు రాయగా మహాత్మా గాంధీ ఆమె ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ తన పత్రికలలో ప్రత్యేక కధనాలు ప్రచురించారు.

                జాతీయ స్థాయిలో బేగం నిశాతున్నీసాకు లభించిన గుర్తింపు గౌరవం ఎలా ఉన్నా ఇంట్ల్లో మాత్రం భయంకర దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సివచ్చింది. ఆనారోగ్యం, పోలీసుల వేధింపులు, పేదరికం ఆ కుటుంబాన్ని పట్టి పీడించసాగాయి. ఆ సమయంలో ఆమె ఇంట దొంగతనం కూడా జరిగింది. ఆ దొంగతనంతో ఆ కుటుంబం ఆర్థికంగా మరింత కునారిల్లిపోయింది. కుటుంబం ఎంతటి ఆర్థిక అవసరాలతో అల్లాడుతున్నా ఆమె మాత్రం ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలుగనివ్వలేదు.

                        ఆ కుటుంబం పరిస్థితులు తెలుసుకున్న మౌలానా సన్నిహిత మిత్రులు, హిందూస్థాన్‌ పత్రిక సంపాదకులు, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు పండిత కిషన్‌ ప్రసాద్‌ కౌల్‌ 1916 -17లో అలీఘర్‌ వచ్చారు. ఆ సమయంలో మౌలానా ఇంటి పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన ఆమెకు ఆర్థిక సహకారం అందించదలిచారు. ఈ విషయాన్ని సంశయిస్తూ ఆమెవద్ద ప్రస్తావించారు. ప్రజల నుండి చందా వసూలు చేసి ఆమెకు పంపగలనన్నారు. ఆ మాట విన్నంతనే మేము ఎలా ఉన్నామో అలాగే ఉండడానికి సంతోషిస్తున్నాం…మా బరువును ఇతరుల విూద వేయటం సరికాదు. మా విషయం గురించి ఆలోచించ వద్దు.. మౌలానా ప్రచురించిన సాహిత్యం చాలా పడిఉంది. విూకు వీలైనట్టయితే ఆ గ్రంథాలను విక్రయించి సహకరించండి. ప్రజల నుండి చందాల వసూలు మాత్రం వద్దు  అని ఆమె సున్నితంగా పండిత్‌ కౌల్‌ అభ్యర్థనను నిరాకరించారు.

                ఈ విధంగా ఆత్మాభిమానానికి ఏమాత్రం విఘాతం కలుగనివ్వకుండా కష్టనష్టాలను చిరునవ్వుతో స్వాగతిస్తూ ముందుకు సాగే ఉత్తమగుణసంపదతో బేగం నిశాతున్నీసా ఆచరణాత్మక ఉద్యమకారిణిగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. ప్రజలలో గౌరవాభిమానాలను సంతరించుకున్న ఆమె ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుల సరసన నిలిచారు. ఆనాడు  సరోజిని నాయుడు, అనిబీసెంట్‌, ఆబాది బానో బేగం తదితరులు గల భారతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధిమండలిలో స్థానం పొందారు.

                ప్రముఖ మహిళల ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె 1917లో మాంటేగ్‌ను కలిశారు. ఆ సందర్భంగా బ్రిటీషు ఉన్నతాధికారి సమక్షంలో ఆమె చూపిన తెగువ ఆమెలోని పోరాటయోధురాలిని మరోమారు బహిర్గతం చేసింది.  విచారణ లేకుండా పోలీసుల నిర్భంధంలో మగ్గుతున్న, ఆంక్షల వలయంలో చిక్కుకుని బాధలు పడుతున్న ఉద్యమకారుల పక్షాన భారతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధిమండలి సభ్యురాలిగాఆమె మాట్లాడారు. ఐర్లండులోని విప్లవకారులను విడుదల చేస్తున్న మీరు నిర్బంధంలో ఉన్న భారతీయ యోధులకు ఎందుకు స్వేచ్ఛనివ్వరని బ్రిటీష్‌ ప్రభుత్వ కార్యదర్శి మాంటేగ్‌ను ప్రశ్నిస్తూ జాతీయోద్యమకారుల విడులను డిమాండ్‌ చేసిన తీరు ఆమెలోని నిర్భీతికి నిదర్శనంగా నిలచింది.
1918 మేలో హసరత్‌ మోహాని జైలు నుండి విడుదలయ్యారు. గృహనిర్భంధ ఉత్తర్వులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.ఆ ఆంక్షలను ఆయన నిరాకరిస్తూ వాటిని ఉల్లంఘించారు. ఆ కారణంగా  విూరట్‌, మోహాన్‌ తదితర ప్రాంతాలలో ఆంక్షలతో కూడిన నిర్భంధాన్ని మౌలానా చవిచూడాల్సి వచ్చింది. ఈ విషయమై నిశాతున్నీసా బేగం భర్త పక్షాన న్యాయపోరాటం సాగించారు. ఆ పోరాటం ఫలితంగా చివరకు డిసెంబరు మాసంలో మౌలానాకు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగగానే నిశాతున్నీసాతో కలసి మౌలానా ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుగ్గా భాగస్వాములయ్యారు.

 

 – సయ్యద్ నశీర్ అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.