స్త్రీ యాత్రికులు

ఎడారిలో తీర్ధయాత్రికులు
యాగ్నెస్‌ లెవిస్‌, మార్గరెట్‌

  ఆఫ్రికా ఎడారిలో ప్రయాణం చెయ్యటానికి ఎంతో ధైర్యం కావాలి. ఎంతమంది సహాయకులు వెంటఉన్నా, దేవుడు సహాయం చేయందే ఆ ఎడారిలో ప్రయాణాలు చేయలేరని యాత్రా పండితులు, ప్రియులు ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నారు. అలాంటి కఠినమైన ప్రయాణాలకి పూనుకున్న ఇద్దరు స్త్రీలు చరిత్రలో ప్రఖ్యాతి గాంచారు. ఇరవయ్యో శతాబ్దంలో భారతదేశంలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఏ విధంగా సాహస యాత్రలు చేసి, బౌద్ధమత గ్రంథాలకోసం టిబెట్‌ చేరుకున్నాడో, దాదాపు అలాంటి కఠినమైన ఎడారి యాత్రచేసిన యాగ్నెస్‌ లెవిస్‌, ఆమె సోదరి మార్గరెట్‌ సినాయ్‌లోని రాత ప్రతులను తేగలిగారు.    

            ఈ అక్కాచెల్లెళ్ళది బ్రిటీషు దేశం. చిన్నతనం నుండీ బైబిల్‌ చింతన ఎక్కువ. వీళ్ళ భర్తలు మిడిల్‌ ఈస్టు దేశాల్లో ఉద్యోగాలు చేసినందు వల్ల, వారికి క్రైస్తవుల పుణ్యక్షేత్రాలైన జెరూసలెం, బెత్లెహాం నగరాలతో పరిచయం ఏర్పడింది.  క్రైస్తవ దేవుళ్ళపట్ల భక్తి విశ్వాసాలు బాగా ఉండటంతో ఆయా ప్రదేశాలలో తాముకూడా కాలుమోపాలని, ఆ పురాతన అనుభవాల్ని మరొకసారి నెమరు వేసుకోవాలనే కోరిక ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి ఉండేది. ఆ విధంగా వారు చాలా చోట్లకి తీర్ధయాత్రలు చేశారు. గ్రీకు, పాలస్తీనా, ఈజిప్టు, సిరియా దేశాల్లో బైబిల్‌కి సంబంధించిన పవిత్ర ప్రదేశాలు తిరిగి అక్కడి చారిత్రాత్మక, సామాజిక, పురాతత్వ విజ్ఞానాన్ని సేకరించి ఆనం దించారు. వీళ్ళు ఇలా తిరగటానికి ఒక్క మతమే కాకుండా వారి ప్రతిభ కూడా పనికివచ్చింది. యాగ్నెస్‌కి గ్రీకు, అరబిక్‌, హిబ్రూ భాషల్లో అపారమైన పాండిత్యం ఉంది. అందువలన ఆయా ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడి శిలాశాసనాలూ, పురాతన గ్రంథాలూ, తాళపత్ర గ్రంథాలు కూడా చదివి వాటిని అర్ధం చేసుకోగలిగేవారు.    

    యాగ్నెస్‌ సోదరీమణులు వారి భర్తలతోపాటే ఇలాంటి యాత్రలు చేస్తున్న సమయంలో, ఒక ప్రమాదం కారణంగా వారి ఇద్దరి భర్తలూ ఒకేసారి మరణించటం జరుగుతుంది. ఈ హఠాత్‌పరిణామంతో ఆ స్త్రీలు మానసికంగా ఎంతో కుంగిపోతారు. జరిగిన దానికి ఎవరు ఏం చేయ గలరు? వయస్సు పైబడిన ఈ అక్కా చెల్లెళ్ళు వితంతువులు అయ్యారని బాధపడుతూ ఒక మూల కూర్చోకుండా, ధైర్యంగా ప్రపంచాన్ని ఎదుర్కోవాలి అని నిశ్చయించుకొని పవిత్ర బైబిలు గ్రంథంలో ప్రస్తావించిన అన్ని ప్రదేశాలకీ యాత్రలు చేసి, వారి భర్తల ఆత్మలకి శాంతి చేకూర్చాలని అనుకొన్నారు. ఆ విధంగా తీర్థయాత్రలు చేయటం వలన వారికి మనశ్శాంతి కూడా దొరుకుతుంది అని భావిస్తారు. అందరి బ్రిటీషు యాత్రికుల మాదిరే వారికీ ఎడారులంటే ఎంతో ఇష్టం. ఇది బహుశా వారి దేశం చుట్టూతా ఉన్న సముద్రం వలన కలిగిన భావమేమో అనిపిస్తుంది. నీటి మీద ప్రయాణా లతో విసిగిపోయి ఇసుక, ఎండల పట్ల ప్రేమ పెరిగి ఉండవచ్చు.    

           యాగ్నెస్‌, మార్గరెట్‌లు చేసిన ప్రయాణాలు చరిత్ర పరిశోధనకి ఎంతో ఉపయోగపడ్డాయి. 1891 వ సం|| లో వారు చేసిన ఒక ఆఫ్రికా ప్రయాణంలో స్థానిక మత గురువులు చెప్పిన కథనం ప్రకారం ‘మౌంట్‌ సినాయ్‌’ వద్ద ఉన్న కాథలిక్‌ చర్చిలో ఇంతవరకూ ముద్రించబడని ‘సిరియాక్‌ రాత ప్రతులు’ ఉన్నాయని తెలుసుకొంటారు. ఆ వార్త విన్నప్పటి నుండీ వారికి ఆ పాత గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావాలనే తపన బయలుదేరింది. ఆ రాత ప్రతుల్ని గ్రీకు భాషలో ‘కోడెక్స్‌ సినైటిటస్‌’ అని పిలుస్తున్నట్లుగా తెలుసుకొంటారు.
   

                 సినాయ్‌ పర్వత పవిత్రతను గురించి క్రిష్టియన్లకి వేరేగా చెప్ప నక్కరలేదు. ఇల్లూ వాకిలీ లేక ఎడారుల్లో తిరుగుతున్న ఇస్రాయిల్‌ ప్రజలకి దేవుడు కనిపించి, వారి నాయకుడు మోజస్‌కి పది ఆజ్ఞలు జారీ చేసింది ఈ కొండమీదనే. ఆ చారిత్రక ఘట్టాలన్నీ ఊహించుకొంటూ తమ ప్రయా ణానికి సిద్ధం అయ్యారు. క్రితంలో వారు ఎన్నో తీర్ధయాత్రలు చేసినా అవన్నీ అందరూ చేసేవే. కానీ, ఎడారుల్లో ఉన్న ఈ మౌంట్‌సినాయ్‌ వద్దకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎంతో ఖర్చు, సాహసంతో కూడిన పని. యాగ్నెస్‌ లెవిస్‌ ప్రపంచానికి తెలిసింది ఈ యాత్రవల్లనే.
   

          వారు సినాయ్‌లో తెలుసుకోవాల్సింది సిరియాక్‌ రాతప్రతుల్ని గురించి కాబట్టి వీళ్ళు ముందుగానే లండన్‌లోని క్వీన్‌ కాలేజ్‌లో సిరియాక్‌ వ్యాకరణాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. పురాతన ఎస్ట్రాంజిలో భాషని ఏవిధంగా కాపీ చేసుకోవాలో కూడా తెలుసుకొంటారు.  యాత్రకి కావాల్సిన డబ్బు, ఇతర సామగ్రి అంతా సిద్ధంచేసుకుని, ఈజిప్టు రాజధాని కైరోకి చేరుకొని అక్కడ పిరమిడ్స్‌ వద్ద ఉన్న చిత్రలిపిని కూడా చదువుకొంటారు. యాగ్నెస్‌ సోదరీమణులకు గైడ్‌గా ఉండేందుకు ఈజిప్టు నుండి ‘హన్నా’ అనే అతన్ని వెంట తెచ్చుకొంటారు. దాంతోపాటు కైరోలో తమకు తెలిసిన ఆఫీసర్ల ద్వారా సినాయ్‌లోని కాథలిక్‌ మఠాధి పతులకి కావాల్సిన పరిచయ పత్రాలు అన్నీ రాయించుకొంటారు.     

            యాగ్నస్‌ లెవిస్‌, మార్గరెట్‌ వాళ్ళ యాత్ర 1892 వ సం|| జనవరిలో మొదలవుతుంది. వాళ్ళు కైరోలో బయలుదేరి, సూయజ్‌ కాలువ దాటుకొని అక్కడనుండి ఒంటెల మీద వారి సామానులతో సహా బయలు దేరతారు. ఆదారి సినాయ్‌ పశ్చిమతీరం వెంబడే సాగిపోతూ ఉంటే, ఆనాటి ఇజ్రాయి లీలు కూడా అదే బాటలో ప్రయాణించటం గుర్తుకువచ్చి, వారి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.    

           మొదటి రోజు రాత్రి ఒక ఒయాసిస్‌ వద్దకి చేరుకొంటారు దానిపేరు అయిన్‌-మౌసా. స్థానికుల ఇళ్ళ పక్కనున్న తాటిచెట్ల మధ్యన గుడారాలు వేసుకొంటారు. వీళ్ళ గురించి తెలుసుకొన్న వారందరూ వారిపై ఎంతో జాలి, ప్రేమ చూపుతూ ఉంటారు. క్రైస్తవం పట్ల వారికి ఉన్న నమ్మకానికి కొందరు ఆశ్చర్యపోతూ ఉంటే, మరికొందరేమో ఈ అక్కాచెల్లెళ్ళ పట్టుదలకి నివ్వెరపోతుంటారు.    

               పరిసరాల్లో గాలిదుమారాలు ఎక్కువ. అయినా వాళ్ళగుడారం మాత్రం కొట్టుకుపోకుండా నిలబడటానికి దైవమేకారణం అనుకొంటారు. ఒయాసిస్సు దాటాక కొంచెం కఠినమైన మార్గంలో వెళ్ళాల్సివస్తుంది. కాబట్టి సహాయానికి కొందరు బిడోయిన్‌ సేవకుల్ని తీసుకుంటారు. వారు ప్రతి ఉదయం సర్దుకుని లేచి, ప్రయాణం సాగించేసరికి ఆలస్యం అయ్యేది కాబట్టి యాగ్నెస్‌, మార్గరెట్‌ ఉదయాన్నే లేచి, ‘హన్నా’తో పాటుగా ముందుకి సాగిపోయేవారు. పనివాళ్ళు అందరూ వారిని దారిలో కలుసుకొనేవారు.   

                బిడోయిన్‌ సేవకులు ఆదివారం నాడు శెలవు తీసుకొంటామంటే ఒప్పుకొనేదికాదు యాగ్నెస్‌. ‘ఎందుకమ్మా, అందరికీ ఆ రోజు శెలవుకదా?’ అని అడిగితే  ‘మెసయ్యా ఆదివారం రోజున మరణాన్ని జయించి పైకి లేచాడు కాబట్టి, ఆ రోజు మనం కూడా ప్రయాణం చేస్తే ప్రభువుతో పాటుగా మనకూ స్వర్గప్రాప్తి కలుగుతుంది’ అని వివరిస్తుంది. అది మొదలు బిడోయిన్‌లు మరెప్పుడూ ఆదివారాన్ని గుర్తుకి తెచ్చుకోలేదు.కొన్ని రోజులు పోయాక ఇసుక దిబ్బల్ని దాటుకొని, సున్నపు దిబ్బలు ఉన్న పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. అలాంటి గట్టి భూమిలో ఒంటెలు ప్రయాణం చేయలేవు. కానీ ఆ దారిలో అందమైన దృశ్యాలు ఎన్నో వస్తాయి. మరికొంత దూరం వెళ్ళాక గులాబీ రంగు ఇసుక, రాళ్ళు మార్గంలో అడ్డుగా వస్తాయి.    

             అలా కొనసాగిన వారి మార్గం ‘వాడి-షెలాల్‌’ అనే చోట మలుపు తిరిగి ఆ మరుసటిరోజుకి ఎగుడుదిగుడుగా ఉండే సినాయ్‌ పర్వత ప్రాంతా ల్లోకి సాగిపోతుంది. ఆ కొండల్లో చాలా ఎత్తుగా కనిపించేదే ‘జాబెల్‌ – సెర్బల్‌’ శిఖరం. అలా ఆ కొండల వరుసల్ని దాటుకొంటూ సాగిపోతే ‘హేసీ-ఎల్‌-ఖట్టేయిన్‌’ అనే పెద్దబండ వద్దకు చేరుకుంటారు. ఆ రాతిని మోజెస్‌ పగులగొట్టి నీరు తెప్పించాడని అరబ్బుల నమ్మకం.    

                సినాయ్‌ పరిసర ప్రాంతాల్లోకి చేరుకోగానే యాగ్నెస్‌కి చాలా సంతోషం వేస్తుంది. దారిలో పడిన శ్రమంతా చాలా సులభంగా మరిచి పోతారు. పరిసరాలన్నీ వ్యవసాయ భూములు. పచ్చని పైరులతో కళకళ లాడుతూ ఉంటాయి. పండ్ల తోటలు, ఖర్జూరపు చెట్లు, వాటి మధ్యలో చిన్న ఒయాసిస్సులు ఏర్పడి అందంగా ‘ఎడారికి దిగివచ్చిన స్వర్గం’ అనిపించే లాగా ఉంటుంది. అలాంటి పరిసరాల్లో అందరూ కాసేపు ఆగి, విశ్రాంతి తీసుకొంటారు. దాంతో వారిలో కొత్త శక్తి ప్రవేశించినట్లయి మరింత వేగంగా ముందుకు సాగిపోతారు.    

               నల్లని బురఖాలు వేసుకున్న స్థానిక స్త్రీలు వీరి వద్దకి వచ్చి ‘మీరు స్త్రీలేనా?’ అని అడుగుతారు. అలాంటి అనుమానం ఎందుకంటే, ‘బురఖా లేకుండా స్త్రీల ముఖాలు ఊహించుకోవటం మాకు ఎంతో కష్టం’ అంటారు వాళ్ళు. ఆ స్త్రీలకి యాగ్నెస్‌తో పరిచయం అయ్యాక తాము కేంబ్రిడ్జిలో చదువుకున్నప్పటి ఫొటోలు వారికి చూపిస్తుంది. అక్కడ ఇసుక దిబ్బలు లేనందుకు బురఖా స్త్రీలు ఆశ్చర్యపోతారు.    

                  యాగ్నెస్‌ బృందం ఇలాంటి గ్రామసీమలగుండా సాగిపోయే కొద్దీ వారికి అన్నీ అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తుంటాయి. వాళ్ళ కళ్ళముందు  విప్పారిన మరొక దృశ్యం ఫైరాన్‌ ఒయాసిస్సు. పచ్చని ఖర్జూరపు చెట్ల నీడల మధ్య, ఎండలో తళుక్కున మెరిసిపోతూ, మత్తుగా ఊగిపోతున్నట్లుగా ఉంది ఆ ఒయాసిస్సు. ఇంతకు ముందు వారికి దూరాన్నుంచి కనిపించిన జాబెల్‌-సెర్బల్‌ శిఖరం ఇప్పుడు దగ్గిరై వారిని ఆహ్వానిస్తుంది. అదే దారిలో మరో నాలుగు మైళ్ళు ప్రయాణించాక మరో ఒయాసిస్సు ఎదురౌతుంది. అక్కడ మరిన్ని చెట్లు, వాటి మధ్య పెద్ద పువ్వులు పూసినట్లుగా ఉన్న  గుడారాలు కనిపిస్తాయి.    

                 ఇక్కడ నుండి సినాయ్‌ పర్వతాలు దగ్గిరే. మరో రెండు రోజుల ప్రయాణం తరువాత ఒక సాయంత్రానికి ‘నూబ్‌హవా’ అనే ప్రదేశంలో గుడారాలు వేసుకొంటారు. అదే సమయంలో అక్కడ ఒక జర్మన్‌ మిషనరీతో యాగ్నెస్‌కి పరిచయం ఏర్పడుతుంది. అతని పేరు డాక్టర్‌ గ్రోటో. ఆయనకు ప్రాచీన గ్రీకు సాహిత్యమంటే చాలా ఇష్టం. పైగా ఆయనకూడా కాథరీన్‌ లైబ్రరీలోని లిఖిత గ్రంథాలన్నీ చదువుతూ ఉంటాడు.  తాము వెళ్తున్న పనిగురించి చెప్పగానే అతనికి ఎంతో సంతోషం వేస్తుంది.    

               ఆ మరుసటిరోజే యాగ్నెస్‌ ఒంటెల బిడారు నూబ్‌హవా కనుమ దాటింది. దూరంగా సినాయ్‌ కొండలు ఎండలో మెరుస్తూ పిలుస్తున్నట్లుగా ఉంటాయి. ఆ కొండల పాదాల వద్దకి చేరుకోగానే అందరూ ఒంటెలు దిగి, గౌరవ సూచకంగా నిలబడి అభివాదం తెలియచేస్తారు. ఏ ప్రదేశంలో అయితే దేవుడు ఇస్రాయిలీలకు తన స్వరం వినిపిస్తాడో, అదే ప్రదేశానికి వారు చేరుకోగలిగినందుకు ఎంతో తన్మయత్వం చెందుతారు. ఆధ్యాత్మిక భావాల ఉప్పెన వారి హృదయం మీదకి రాగా, దైవాన్ని సందర్శించినట్లే అవుతుంది వాళ్ళందరికీ.    

                 ఆ మరుసటిదినం సెయింట్‌ కాథరీన్‌ చర్చి వద్దకి చేరుకోగానే వారికి మంచి ఆదరణ, ఆహ్వానం లభిస్తాయి. చుట్టూ కొండ శిఖరాలు. వాటి మధ్యలో గరుత్మంతుడు కట్టిన పెద్ద గూడులాగా ఉంద్ష్మి రాతితో నిర్మించిన ఆ మఠం. ఈ కాథరీన్‌ మఠాన్ని బైజాంటైన్‌ చక్రవర్తి జస్టీనియన్‌ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో నిర్మించాడు. అద్భుతమైన వాస్తుకళ. నిర్మాణంలో అంతకుముందున్న ఎర్లీ క్రిస్టియన్ల పద్ధతిని అనుసరించినా గ్రీకు, రోమను దేశాల వాస్తుకళ ఆ స్తంభాల్లో కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రాకారం చాలా పాతది. అయినా లోపల ఎంతో ఆధునికంగా కట్టిన విశాలమైన గదులు ఉంటాయి. ఆ కాన్వెంట్‌ లైబ్రేరియన్‌ ఎంతో సంతోషంతో యాగ్నెస్‌ సోదరీ మణులకి ఒక నెలపాటు అక్కడ ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు.

– ప్రొ .ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.