ఆదర్శ మాతృమూర్తులు

    పరమ పవిత్రమైన మన భారతదేశంలో తల్లిదండ్రులు నిరంతరం తమపిల్లల పెంపకం గురించీ తగు జాగరూకత వహిస్తూనే ఉన్నారు.,తపన పడుతుంటారు. పిలల్లపెంపకంలో తండ్రిబాధ్యతకంటే తల్లులబాధ్యత ఎప్పుడూ హెచ్చుగానే ఉంటుంది.’ తల్లివడి ప్రధమ బడి ‘   అనేమాట పరమసత్యం. మెదటి దైవం తల్లే ! ‘మాతృదేవోభవ ,పితృదేవోభవ ‘–అనే మన భారతీయసంస్కృతీసౌరభాలను మహాత్ములంతా  అడుగడుగునా చెప్తూ తల్లి బాధ్యతను గుర్తుచేస్తూ –‘మొదటి దైవమే’ గాకతల్లిమొదటిగురువుకూడాఅనిచెప్పనే

’తల్లివడిప్రధమబడి’అన్నారు.

         ముందుతల్లిచూపులతో  ,నవ్వులతో సౌఙ్ఞలతో బిడ్డను వడిలో ఉంచుకుని పాలు పడుతూ , స్నానంచేయిస్తూ, బట్టలు తొడుగుతూ వంటికి మసాజ్ చేస్తూ తన భావన లను మనస్సు ద్వారా, చూపుల ద్వారా–తాబేలు తనపిల్లలను నదికి ఆవలిగట్టున ఉంచి ,ఈవలి గట్టునుండీవాటినిచూస్తూ ,తన చూపులతో పెంచుతుందిట! .

     తల్లి తనతలంపులద్వారాతనపిల్లల పెరుగుదలకు కృషిచేస్తూ బిడ్డలమనోభావాలను తెల్సుకుని ఆలన పాలన అందిస్తూ  వారి ప్రతిస్పందనలకు అనుగుణంగా బిడ్డలకు అర్ధమయ్యేలాగా మౌనభాష నేర్పుతుంది . ఆపైన వారికిచిన్నచిన్నమాటలు చెప్తూ భాష నేర్పుతుంది. అత్త , తాత ,అమ్మ, నాన్న , బామ్మ మొదలైన మాటలతో ఇంటిసభ్యుల పరిచయం చేస్తూ సంఘంతో సాంగత్యం ఏర్పరుస్తుంది. బిడ్డ పెరిగేకొద్దీ తినడం, తాగడం , వంటి చిన్న చిన్న  పనులతోపాటు పెద్దలు ఇంటికి వస్తే నమస్కరించడం, కూర్చోమని చెప్పడం , మంచినీరు తెచ్చి ఇవ్వడం వంటి మర్యాదలు నేర్పుతూ మొదటిగురువుగా నిలుస్తుంది.

మన భారతీయ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం! మన పురాణాల్లో ఆదర్శమాతలు  చిరస్మరణీయులు! తల్లి తనకర్తవ్యాన్ని ఆదర్శవంతంగా ఎలా నిర్వహించాలో మనకు పురాణ గాధలద్వారా తెలుస్తుంది. అనేక సందర్భాలలో ‘ఆదర్శమాతలను ‘ గురించి విఙ్ఞులు ప్రస్తావిస్తూనే ఉన్నారు.

              కౌసల్య  తనకుమారుడైన శ్రీరామచంద్రునికి , కుంతి తనకుమారులైన పంచ పాండవులకు, చారిత్రకయుగంలో శివాజీకి జిజియాబాయి ,  ఆధునికయుగంలో రామ కృష్ణపరమహంసకు చంద్రమణీదేవి,ఈశ్వరచంద్ర విద్యాసాగరునికి భగవతీదేవి ,గాంధీజీకి పుతలీబాయి , తల్లులై భారతజాతి రత్నాలను  లోకానికి అందించి , ఆదర్శమూర్తులై నిలిచారు.

           వీరంతా తమబిడ్డలకు చిన్నతనం నుండీ  సుద్దులు బుధ్ధులూ చెప్తూఎవరెవరిని ఎలా గౌరవించాలో నేర్పారు ! . దైవభక్తి, దేశభక్తి , సంఘనీతి నూరిపోశారు..ఏతల్లైతే ధర్మ మార్గాన్నిచిన్నతనం నుండీ ఇలా బోధిస్తుందో ఆమె ప్రపంచంలో సత్య ధర్మ,శాంతి  ప్రేమాహింసల  స్థాపనకు జ్యోతి ప్రజ్వలనచేసినట్లే ! అలాంటితల్లులువిరివిగాఉన్నప్పుడు ప్రపంచ మంతా ధర్మంతప్పని జనాలతో నిండి , ప్రశాంతత నెలకొంటుంది.

భారతీయ సంస్కృతిలో  ‘జన్మ భూమికీ, కన్నతల్లికీ ‘ గొప్పస్థానం ఉంది.

                   పుడమికన్నతల్లి పూజనీయులుకదా

                    వారిమించువారు వసుధలేరు

                    కన్నతల్లికన్న ఘనతఏది?

                    కన్నభూమికన్న స్వర్గమేది?

జన్మభూమితోను  , జన్మనిచ్చినతల్లి తోను  స్వర్గం సైతం సరితూగదని చెప్తారు.

ముందుగా రామాయణం లో ని తల్లులను చూద్దాం.—-

       రామునికి తల్లి కౌసల్య అందరినీ ప్రేమించడం, పెద్దలను గౌరవించడం పసితనం నుండే బాల రామునికి నేర్పిందిట  . కుమారునిగా , అన్నగా , శిష్యునిగా , భర్తగా, రాజుగా , వీరునిగా, ప్రతి శూరునిగా, స్నేహితునిగా, న్యాయ పాలకునిగా ,తండ్రిగా , తన బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వహిం చేందుకు కౌసల్య పెంపకమే కారణం అనిచెప్పవచ్చు..

కౌసల్య బాల శ్రీరామునికి నేర్పిన మాట శ్లోకరూపంలో —

                       యంపాలయతి ధర్మం  — తం వృత్తేన నియమేనచ

                        సవై రాఘవ శార్దూల  —   ధర్మత్వం అభిరక్షతు.

‘ఓ రఘువంశ శార్దూలమా ! రామా! నీవు ‘ధర్మాన్ని ‘ నియమంగా , నిరంతరం నీ వృత్తిగా భావించి పాలించు ‘, అంటూ ఉగ్గుపాలతో ధర్మాన్ని బోధించింది!.

   విశ్వామిత్రుడు యాగసంరక్షణార్ధం శ్రీరాముని  పంపమని దశరధునికోరను కోసలకు వచ్చినపుడు , శ్రీరాముడుతండ్రి కబురందుకుని సభలో ప్రవేసించిముందుగా తన  తల్లి కౌసల్యకు , తర్వాత తండ్రి దశరధునికి, ఆపైనగురువు వశిష్టునికి , చివరగాఅతిధి ఐన విశ్వామిత్రునికి పాదాభివందనం చేస్తాడు .

                  తల్లి తండ్రిని చూపితే , తండ్రి గురువును చూపుతాడు, గురువు దైవాన్ని చూపుతాడు. అంటే వరుసక్రమంలో ప్రాధాన్యతనుఅనుసరించిగుర్తించి గౌరవించి వర్తిస్తూ ఆయా వ్యక్తులద్వారా  మానవునికి ఆవస్యకమైన సులక్షణాలు నేర్చుకోవాలని అర్ధం.

‘రామో విగ్రహవాన్ ధర్మః ‘ -అనేమాటవినగానే తల్లికౌసల్యగుర్తురాకతప్పదుఎవరికైనా.   అందుకే ‘ కౌసల్యా సుప్రజారామ -పూర్వాసంధ్యా ప్రవర్తతే – ‘అంటూఆతల్లికుమారునిగా శ్రీరాముని మనం సుప్రభాతంలో ప్రతిరోజూ పాడుతున్నాం.

రావణసురుని మరణానంతరం లక్ష్మణుడు  రామునితో ” అన్నా! ఈ ‘బంగారులంక’ ను మీరు పాలిస్తే , అయోధ్య భరతునికి వదిలేయ వచ్చుకదా ! ఈ లంక సిరి సంపదలతో

స్వర్గానికి దీటుగా ఉంది!  ” అనగా , సత్యధర్మాలు మూర్తీభవించిన రామచంద్రుడు ..

” లక్ష్మణా ! తల్లి కురూపిఅని మరొక అందమైన స్ర్తీని తల్లిగా భావించగలమా! ‘ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపిగరీయసీ!’ అని తెల్సుకో !” అన్నాడు. తల్లి కౌసల్య పెంపకమే రాముని అంత ఆదర్శవంతునిగా చేసిందని చెప్పుకోవచ్చు . ఆయన అవతారపురుషు డైనా మానవజాతికి ఆదర్శం అందించే నిమిత్తం ఈవిధంగా తాను ఆమె మాటలు అనుసరించి ,తనతల్లిని  లోకంలోని తల్లులకు ఆదర్శమాతగా  నిలిపాడు.

       ఇహ లక్ష్మణుని  తల్లి ఐన సుమిత్రను తీసుకుంటే ఆమె సహనం , ఓర్పు , తన వివేకాన్నిఅడుగడుగునా  చూపిస్తుంది.  మితభాషి ,  అవసరం  మేరకే మాట్లాడుతుంది  .

కైక శ్రీరాముని వనవాసానికి పంపమని కోరిందికానీ లక్ష్మణుని కాదు.ఐతే రామునివెంట మౌనివేషంలో కదలిన లక్ష్మణుని ‘ఆగమని ‘ ఒక్కమాటైనా అనలేదు.ఇతర ఏతల్లి ఐనా అలా మౌనం వహించదు. అన్నవెంట వెళుతున్న లక్ష్మణుని ‘రాజును అనుసరిస్తున్న సేవకుని’గా  భావించింది.ఒక కుమారుడైన శతృఘ్నుడుభరతునివెంటతిరుగుతుండగా ,  మరొక కుమారుడైన లక్ష్మణుడు వన వసానికి వెళుతున్నా ,ఆమె  ఏ మాత్రం  జంకక గొంకక  ,బాధపడక తన బిడ్డలు ధర్మ మార్గాన్నిఅనుసరిస్తున్నందుకు ,భ్రాతృబంధానికి కట్టుబడుతున్నందుకు సంతోషించింది.

సుమిత్ర  ఆధ్యాత్మికఙ్ఞాన సపత్తుగల వనిత..శ్రీరాముని శీలమును చక్కగా గమనించి తన పుతృడైన లక్ష్మణుడు అతడిని అనుసరించినట్లైతే ధర్మo తప్పనివాడుగా పేరు గాంచు తాడని నమ్మింది .వనవాసానికి అన్నతో వెళుతున్న తనయునితో

          ” రామం దశరధం విధ్ధి  – మాం విధ్ధి జనకాత్మజాం

           అయోధ్యాo అటవీం విధ్ధి   –  గఛ్చతాత  యధాసుఖం “

” నాయనా లక్ష్మణా! నీవు  శ్రీరాముని సేవించుటకే జన్మించావు.అరణ్యంలో శ్రీరాముడే నీ తండ్రిగా, సీతమ్మే నీతల్లిగా , అడవే అయోధ్యగా వారిరువురికీ సేవచేస్తూ ఉండు అదే నీధర్మ.” అని  ఆమాతృమూర్తి తన పిల్లలకు అన్నలను అనుసరించడoవారి ధర్మం   అనీ , కష్ట మైనా సుఖమైనా అన్న మాటే అనుసరణీయమనీ చెప్పకే చెప్పింది .  భాతృమార్గాను సరణ సుమిత్ర తన పిల్లలద్వారా ఈ లోకానికి తెలియపరచింది.

             ఈహ సీతమ్మను తీసుకుంటే  తాను భర్తకు దూరమైనా తనపై నీలాపనిందలు వచ్చినా , కుమలక , మనస్తాపాన్ని పైకి కనపడ నీయక తనకుమారులైన లవ కుశు లను   రాజ భవనంలో సర్వసుఖాలూ పొందవలసిన వారైనా , ఆమె వారికే మాత్రం ఆ విషయాలు తెలియనీక  ముని వాటికలో మునిపుత్రుల వలె పెంచింది , విలువిద్యలూ ధైర్య సాహసాలూ నేర్పింది.  మహావీరులుగా తయారుచేసింది !.ఆశ్రమంలో కష్టాలూ అసౌకర్యాలూ అన్నీ భరిస్తూధైర్యంగాలవకుశులనుతీర్చిదిద్దింది.తల్లిసీతమ్మఆశీస్సులతో, ఆమెపెంపకంలో వారు లోకోత్తమవీరులైనారు .సీతమ్మతల్లి ఆదర్శమాతైంది.   ఓర్పుకు సీతమ్మను చెప్తాం ,ఆమె ఓర్పే నేర్పై తన బిడ్డలను తీర్చిదిద్దిన ఆదర్శమాత ,ఒకమహా  బలవంతునికి, ధర్మమూర్తికీ , సామ్రాఙ్ఞి ఐనా కష్టాలన్నీ భరించి ,స్త్రీలకు ఆదర్శమైంది . కొందరు ‘ సీత ‘ పేరు తమబిడ్డలకు పెట్టనే భయపడతారు.అన్నీకష్టాలు ఆతల్లిగనుక భరించింది మనవల్లకాదంటారు.

 భాగవతంలో ని తల్లులను చూద్దాం :-శ్రీకృష్ణుని పెంపుడుతల్లయిన యశోద కృష్ణుడు  తన బిడ్డే అని నమ్మి ,తాను కన్నయ్యను ఎంత ప్రేమించినా తనకుమారుని చూడ వచ్చిన వారికి ఎత్తుకోను ఇచ్చి వారి కోరిక తీర్చేది. ఎవరు వచ్చి చనుబాలు పడతా మన్నా అభ్యంతరం చెప్పేదికాదు , అందువల్లే రాక్షసస్త్రీ  ఐన  పూతన , సుందర మైన రూపంలో వచ్చి పాలు పడతానంటే కొత్త వనిత అనైనా భావించక, పసిబిడ్డలపట్ల ఆమె అనురాగాన్నీ కాదనక నమ్మి ఇస్తుంది. తమకు ప్రీతి కరమైన దానిని ఇతరులకు ఇవ్వ ను మనం సాధారణంగా ఇష్ట పడం, కానీయశోద’ అమ్మదనం ‘  ఎంతగొప్పదోచూడండి.  తనబిడ్డను ఇతరులు ముద్దుచేస్తున్నా ఏమాత్రం అసూయపడనిస్వఛ్ఛమైనవెన్నవంటి మనస్సు ఆమెది,  అందుకే కృష్ణయ్య వెన్నదొంగ అయ్యాడేమో!

                             ఓయమ్మనీకుమారుడు

                             మాఇళ్ళనుపాలు పెరుగు మననీడమ్మా!

                             పోయెదమెక్కడికైనను

                            మాయన్నల సురభులాన మంజులవాణీ!  …..అంటూ   కృష్ణుని కొంటె చేష్టలగురించీ చెప్పవచ్చిన గొల్లభామలతో యశోద ఇలా అంటుంది  .

                అన్య మెరుగడు తనయంత నాడుచుండు

                 మంచివాడితడెగ్గులుమానరమ్మ

                 రామలార! త్రిలోకాభిరామలార!

                 తల్లులార! గుణవతీమతల్లులార! –అంటూ తనబిడ్డ మంచివాడనీ అలాంటి చిలిపిపనులుచేయడనీ  అమాయకుడనీ వారితో  అంటుంది యశోద.  ఏతల్లైనా తన బిడ్డ చెడ్దవాడంటే  ఊరుకుంటుందా!

 మనబిడ్దపై ఇతరులు నేరారోపణ చేస్తే మనం వెంటనే వారితో జగడ మైనా ఆడుతాం, లేదా మనబిడ్డని ‘ పరువుతీస్తావా? ‘  అని కోపంతో  విచక్షణారహితంగా కొడతాం.కానీ యశోద నిదానంగా ఆలోచించి వారితో ..

 “ నాబిడ్డ అమాయకుడు , మీరు నిదానంగా యోచించండి , అలాచేసేవాడుకాదు. ఐనా నేను మనందలిస్తాను , వెళ్ళిరండి ” అని మర్యాదగా చెప్తుంది.ఇరుగుపొరుగులతో ఎలా మెలగాలో ఆతల్లి మనకు  నేర్పింది .

      చెరసాలలో ఉన్న దేవకీదేవి  తనకన్న బిడ్డడు  ఎక్కడైనాకానీ సుఖంగా ,క్షేమంగా ఉంటేచాలని భావించింది.బిడ్డ పెరుగుదలను ఊహల్లో నింపుకుని దూరంనుండేప్రేమను  పంచి , బిడ్డను మనస్సులోనే చూచుకుంటూ ఆలోచనల్లో ఆడుకుంటూ  జీవించింది. ‘అమ్మ మనస్సు’ బిడ్డక్షేమాన్ని  నిరంతరం  ఎలాకోరుకోవాలో , అమ్మ ఆశీర్వచనాలు బిడ్డ భవిష్యత్తుకెంత శక్రిని ప్రసాదిస్తాయోదేవకీదేవి మనకు నేర్పింది.

      ఆమె ఆదర్శమాత కాదామరి!

 గుట గుట చనుబాలు త్రాగుచుండగ  పట్టిచంపువింతను చూడజలనైతి —

ఎన్నితాళ్ళనుకట్టినా చాలని నీపొట్ట ముద్దాడ జాలనైతి

ప్రసవవేదనపడుటనాపాలివంతు ,

నీదుముచ్చటలుపడుట యశోదవంతు.—-

అని  పోతన ,దేవకీదేవి మనస్సులోని బాధను వర్ణిస్తాడు.ఐనా ఆమె అలా తన బాలుని హృదయంలోనే దర్శిస్తూ అతని ముచ్చటలు వినిసంతసించింది.

భారతంలోకి చూస్తే  కుంతీమాత భర్తలేని అసహాయ. ఐదుమంది పసిపిల్లలతో ఒక్కతే , తమపై ఏమాత్రం ప్రేమాభిమానాలులేనిదాయాదులఇంటఎంతోచాకచక్యంగామెలుగుతూ వారితోసఖ్యంగాఉంటూనేతనపిలల్లనుప్రఙ్ఞావంతులుగా ,విద్యావంతులుగా,గుణవంతులుగా  , భక్తిపరులుగా, వినయశీలురుగా  పెంచింది. ఐకమత్యాన్ని ఉగ్గుపాలతోనేర్పింది.  సోదరప్రేమను లోకానికి పాండవుల ద్వారాచాటింది. కుంతి ఆదర్శమాత . బిడ్డలను కృష్ణభక్తులుగా  చేసి వారికి కృష్ణుని కొండంత అండగా చేసింది. శతృవర్గoతోఎలాసఖ్యంగా మెలిగి తమకార్యం  చక్కబెట్టుకోవాలో,బిడ్డలకోసంఎన్ని కష్టాలనైనా ఎలా భరించాలో జగానికి చూపిందిబిడ్డలకు  అండగా దండగా ఉంటూ తండ్రిలేని తనయులను ఆదర్శ సోదరులుగా పెంచింది. అంతేకాదు తన బిడ్డలైన ధర్మరాజ , భీమ అర్జునుల కంటే తన సవతి మాద్రీ  సుతులైన నకుల సహదేవులను అధికంగా ప్రేమించింది. ఇతరులెవ్వరికీ వారు కుంతిసంతానంకాదని తెల్సుకొలేని  విధం గా సతీ ధర్మాన్ని పాటించిన ఉత్తమురాలు కుంతి.

   పురాణ గాధల్లోకివెళితే గంధర్వరాజు కుమార్తె మదాలస సైతం తన పుత్రులకు పసి తనం  నుండే ఙ్ఞానబోధ చేసి,ఆత్మతత్వం తెలిపింది .

              అఙ్ఞాన వశమున అరుదెంచినావు

              రాకపోకలునీకు నిజముగాలేవు //జోజో//

              పరమాత్ముడవునీవు బ్రహ్మవూనీవు

               నిత్యశుధ్ధాబుధ్ధ ముక్తుడవునీవు –అని జోలపాడుతూ ఆత్మతత్వాన్ని అందించింది.

పూర్వం తల్లులంతా తనపుత్రులు మంచిముత్యాలుగా , ఙ్ఞానరత్నాలుగా మారాలని కోరుకునేవారు.

  ఇహ చరిత్రలోకి తొంగిచూస్తే  శివాజీతల్లి జిజియాబాయ్ భర్త నిరాదరణకు గురైనా చింతించకతనపుత్రునివీరునిగాతీర్చిదిద్దింది.ప్రతిరోజూస్నానంచేయిస్తూ ,బువ్వతినిపిస్తూ వీరులగాధలు రంగరించి పోసింది. రామాయణ మహాభారత కధలు కళ్ళకుకట్టినట్లు వివరించింది.వీరలక్షణాలు పసితనంలోనే శివాజీ సొత్తయ్యాయి.మంచి గురువువద్దచేర్చి యుధ్ధవిద్యలతోపాటుగా ,యదార్ధ విద్యలైన ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని సైతంశివాజీకిఅందించ డంలో జిజియాబాయ్ఏమారలేదు.ఆతల్లికృషిఫలితమే‘స్వతంత్రమహారాష్ట్రరాజ్యస్థాపన’ . ఆమెనేర్పిన దైవభక్తి, దేశభక్తి శివాజీని చక్రవర్తిగా, ఛత్రపతిగా మార్చింది. పంచమాతలను,  సాధు సత్పురుషులను సేవించడoగౌరవించడం ,భారతీయసంస్కృతి,పరస్త్రీలపట్లమాతృ భావం వీరశివాజీని మరాఠారాజ్యానికి ఛత్రపతినిచేశాయి.అలాంటితల్లి జిజియాబాయి  పిల్లల పెంపకానికి కావలసిన పాఠాలను మనకు అందించిన చరితార్ధు రాలు.  ఆదర్శ మాతలలో జిజియాబాయిని చేర్చి మన హైందవ ధర్మాలను బిడ్డలకు ఎలా నేర్పాలో పెద్దలు మనకు సూచించారు.

సంఘసంస్కర్తలను తీర్చిదిద్ది సమాజసేవకై అంకితంచేసిన మాతృమూర్తులు -ఈశ్వర చంద్రవిద్యాసాగరునితల్లి‘భగవతీదేవి‘,వివేకానందునితల్లి‘భువనేశ్వరీదేవి’ ,రామకృష్ణ పరమహంసతల్లి ‘చంద్రమణీదేవి’ ,మోహనదాస్ కరంచంద్ గాంధీతల్లి ‘పుతలీబాయి ‘వీరంతా తమబిడ్డలకు పసితనం నుండీ భారతీయసంస్కృతిని, దైవ భక్తిని ,దేశభక్తిని , సమాజ సేవచేయడంలో మెళకువలను బోధించి తమబిడ్డలను లోక కళ్యాణంకోసం సమర్పించారు.

               ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి భగవతీదేవి  ఎంతో కష్టపడి తండ్రిలేని పిల్లడ్ని చదివిస్తుంది,  స్కూల్ఫైనల్ పరీక్షలకు ఫీజు కట్టను మూడురూపాయలు లేకపోడంతో ఆమె తన పెళ్ళినాటిపట్టుచీర అమ్మి ఫీజుకోసం ఇస్తుంది! బిడ్డకు చదువుకుకా వలసిన పుస్తకాలు నోట్ బుక్కులు అచ్చుపుస్తకాలకోసం, మడికట్టుకుని దూరంగాఉన్న మంచి నీటిబావినుండీ నీళ్ళ బిందెలూమోసి ఆడబ్బు ఈశ్వరచంద్రునికి ఇస్తుంది.అతడుస్కూల్  ఫైనల్ అయ్యాక టూషన్స్ చెప్తూ పైచదువులు చదువుతాడు , ఒక లాయర్ ఇం ట్లో భగవతీ దేవి వంట చేసేది, ఆయన ఈశ్వర చంద్రుని తెలివిని చూసి మద్రాస్ లో లా చదవను సహాయంచేస్తాడు. చదువుపూర్తయ్యాక సంపాదన మొదలయ్యాక అతడు ఒక వివాహానికి హాజరైనపుడు తల్లి కట్టుకున్న అతుకులేసిన చీరను చూసి, మిగిలినవారి వస్త్రధారణ చూసి బాధతో ” అమ్మా! నీకు చీరలు, నగలుకొంటాను ,ఏవికావాలో చెప్పు ” అనగా భగవతీ దేవి నాకు మూడు నగలుకావాలి ” అంటుంది, విద్యాసాగర్ సంతోషంతో ” అడుగమ్మా! ఏంకావాలో ” అనగా , ఆమె ” నాయనా ! నామొదటినగ ‘ ఈ ఊర్లో మంచి నీళ్ళ బావిలేక అంతా దూరంగా ఊరిబయట ఉన్నా బావికి వెళ్ళలేక ఇబ్బంది పడు తున్నారు. ఒక మంచినీటిబావి త్రవ్వించమని ” కోరుతుంది. ఈశ్వరచంద్రుడు అలాగే బావిత్రవ్విస్తాడు. ” అమ్మా !నీవుకోరినట్లుబావిత్రవ్వించాను,ఇప్పుడైనానీకుఏనగకావాలో  చెప్పమ్మా! ” అనగా , ఆమె ” నాయనా ఈఊరిపిల్లలకుఏదైనాఅనారోగ్యం కలిగితేదూరం గా ఉన్న పట్టణంలోని వైద్యశాలకు వెళ్ళను ఇబ్బందిపడుతున్నారు, ఒక వైద్యాలయం ఏర్పాటుచేయి ” అని కోరుతుంది. విద్యాసాగర్ అలాగే ఒకవైద్యశాలనుఏర్పాటుచేస్తాడు .  మూడో మారు కుమారుడు నగ గురించీ అడగ్గా ” నాయనా! నాకీ వయస్సులో నగలతో పనేమి? నీవు జీవితాంతం ఇలాగే సమాజ సేవ చేస్తూ ఉండు, అదేనామూడో నగ ” అనిచెప్తుంది. అందుకే భగవతీ దేవి ఆదర్శమాత ఐంది.

ఇహ మన జాతిపిత ను కన్నతల్లి ,మోహనదాస్ కరంచంద్ గాంధీతల్లి ‘పుతలీబాయి  కి భారతదే శం ఎంతైనా ఋణపడి ఉంటుంది .ఆమె కోకిల వ్రతం అనిచేసేది మూడునెలల కామ వసంత ఋతువులో కోయిలకూశాకే ఆమె భోజనం చేసేదిట! ఒక రో జుమధ్యాహ్నం మూడైనా కోయిలవచ్చి కూయక పోడంతో నిరంతరం తల్లి కొంగుపట్టుకు తిరిగే ఆరేళ్ళ మోహన చంద్ అమ్మ అన్నం తినలేదు, కోయిలకూయలేదు — అనే భావన మనస్సులో మెదలగా పెరట్లోని చెట్టుమాను చాటుకెళ్ళి ‘ కుహూ కుహూ ‘ అని కూసి, తల్లి వద్దకు వచ్చి ” అమ్మా! కోయిలకూసింది! నీవు భోజనం చేయి ” అనగానే పుతలీబాయ్,’తనపై వీడికెంత ప్రేమ ‘ అని  కుమారుడ్ని ముద్దుపెట్టుకోకపోగా తనయుడి చెంపపై ఒక్క చరుపు చరిచి  ” ఛీ ఛీ నాకడుపున ఒక అసత్య వాది పుట్టినందుకు నేను చింతిస్తున్నాను. ” అని కోప్పడగా మోహనచంద్ , ఆక్షణంలోనే ఆమెపాదాలపై చేతులుంచి ” అమ్మా! ఈక్షణం నుండీ నేను తమాషాకైనా అసత్యం చెప్పను ” అనీ ప్రమాణం చేస్తాట్ట ! ఆప్రమాణమే భారతదేశంపాలిట వరమై తన సత్య వాదనతో , అహింసేఆయుధంగా దేశస్వాతంత్య్రం కోసం శ్రమించేలా చేసింది.పుతలిబాయి ఆదర్శమాతకాదామరి!

            కౌసల్య సతి శుక్తి గర్భమౌటానుగదా!

                     రాముడు దేవుడై  రమణగాంచె

           సీతామహాసాధ్వి  చెపగిపెంచుటగదా!

                   కవల కుశలవులు ఘనులునగుట

             జిజియాలలామంబు చెలగిపెంచుటకదా!

                   వీరశివాజీ  యు  పేరుగాంచె

            పుతలిబాయి సుబుధ్ధి పెంచుటచేకదా!

                    గాంధి  మహాత్ముడై ఘనత గాంచె!

             ఈశ్వరాంబాసాధ్వి ఎత్తిపెంచుటగదా!

                    సత్యనారాయణ ఖ్యాతిచెందె!

            అహరహమ్మును బ్రోచెడి అమ్మకంటె

            ఆదరంబగు వ్యక్తులు అవనికలరె!

            అమ్మ ప్రధమాక్షరంబె ఆద్యక్షరంబు

            ప్రాణికోటికి అమ్మయె ప్రాణసమము .—- ఆదర్శమాతల ఘనత ఇదే!.

ఈ ఆధునిక యుగంలో తల్లులమంతా బిడ్డలుపుట్టగానే’ ఏంచదివించాలి? ఏఉద్యోగం వస్తుంది?ఎంతజీతం వస్తుంది?’ అనే విషయాలనుతప్ప , మనబిడ్డ దేశానికి ఏం చేస్తాడు, సమాజసేవ ఎలాచేయగలడు?ఎంత మందికి సాయపడగలడు? భారతీయసంస్కృతిని ఏమాత్రం అనుసరించగలడు?’ అనే విషయాలను ఎన్నడూ ఆలోచించడం లేదు. మాతృదేశానికి , మాతృమూర్తికీ కృతఙ్ఞత తెలిపేవారే తక్కువైపోతున్నారు.ఎంతో మంది తల్లులు ఉద్యోగాలకోసం వెళుతూ ,బిడ్డలను ఆయాలకు వదలిపోతున్నందున బిడ్డలకు ఆయాపైనే ప్రేమపెరుగుతున్నది, తల్లిని మమ్మీ అనిపిలుస్తూ న్నారు. ఆయాచనిపోతే ఏడుస్తారుకానీ అమ్మపోతే ఏడవరు ‘ . ఆయాతోనే ఏటాచ్ మెంట్ పెరుగుతుంది. ఆమె భాష నేర్చుకుంటున్నారు.ఆమెపైనే ప్రేమ అభిమానం  వారిమనస్సుల్లో ప్రోదు చేసు కుంటాయి, ఆయాపెడితేనే తిండితింటున్నారు.

 అందుకే ఒక మహాను భావుడు –

                        ఆలుమగలిద్దరు ఆఫీసునకుబోవ

                          గృహ కృత్యములుదీర్చు గృహిణులెవారు ?-

                        పరబాలురకు నేర్ప పాఠశాలకు బోవ –

                                తనబాలలను జూచు తరుణులెవరు?

అంటే ఉద్యోగాలు చేయడంతప్పనికాదు,తమబిడ్డలకు మంచి సుద్దులు బుధ్ధులు నేర్పి ఆదర్శమానవునిగా తీర్చి దిద్దేవారెరు ? అనిఅర్ధం  .

హాస్యంగా పెద్దలు ఇలా చెప్తారు .రైతు కూతురైన ఒక  తల్లి తనకుమారుని  ఉయ్యాల్లో ఊపుతూ ఇలా పాడిందిట!

 చేలోన నీమామ సెనగలెయ్యంగ

భాగమిమ్మని అడుగు బాలశంకరుడా!  //జో జో //

వేసినాడూలేవు–కోసినాడూలేవు

భాగమెట్లిత్తురా బాలశంకరుడా!//జో జో//

మా అమ్మ నీతోడబుట్టినదికాదా?

తగవునకు పోదాముధర్మ చావడికీ

ధర్మచావడిలో పెద్దలందరుచేరి

భాగమూ ఇమ్మనిరి పిల్లనిమ్మనిరి  ///జోజో//

అంటే సాధారణ తల్లు లందరికీపెళ్ళి ఆస్థిలో భాగం అనే ఆలోచనలే ఉంటాయని అర్ధం.

అంటే జోలపాటతోనే మామతో ఆస్థికోసం పోట్లాడటం, ఆస్తే ప్రాధాన్య మని చెప్పటం వల్ల వాడుపెద్దై ధనసంపాదన గురించే అలోచిస్తాడు.సాధారణ తల్లు లందరికీపెళ్ళి ఆస్థిలో భాగం అనే ఆలోచనలే ఉంటాయని అర్ధం.

  కనుకమనంమనబిడ్డలనుఎలాపెంచాలోఈఆదర్శమాతలద్వారా తెలుసుకుని ,మనబిడ్ద లనురావణునిలాగొప్పవారుగాకాకరామునిలామంచివరుగాదైవప్రీతి,పాపభీతి,సంఘనీతి సంపన్నులుగా భారతీయ సంస్కృతీ బధ్ధంగాజీవించేలామానవతావిలువలమూర్తులుగా తీర్చిదిద్దుకుందాం.ఈ ఆదర్శ మాతలను సదాస్మరిద్దాం.వారి బాటలోనడుద్దాం.భారతీయ తను బ్రతికిద్దాం .

       -ఆదూరి.హైమవతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో