ఎందుకు చదవాలి ?

ఎందుకు చదవాలి ?

ఇదే ప్రశ్నని ఒక టీచర్ని అడిగితే, ఇదేం ప్రశ్నండీ అంటూ మొదలు పెట్టి విద్య మరియు దాని ప్రయోజనములు అనే ప్రసంగ వ్యాసాన్ని చదవడం మొదలు పెడతాడు. అదే ఓ విద్యార్ధిని అడిగితే, ఎందుకేమిటి సార్ మార్కులకోసం చదవాలి ఆ మార్కుల వలన ర్యాంకులు వచ్చును ఆ ర్యాంకుల వలన ఉద్యోగము వచ్చును. అంటూ మొదలు పెట్టి కెరీర్ గైడెన్సు పాఠాలు అప్పజెప్పడం మొదలు పెడతాడు. ఈ దౌర్భాగ్యానికి కారణం మన విద్యా విధానం. దాన్ని బాగుచెయ్యడం బ్రహ్మ తరం కూడా కాదు.

మరి మనం ఎందుకు చదవాలంటారు ?

ఎందుకు చదవాలంటే, మన్ని మనం అర్ధం చేసుకోవడానికీ.., మన చుట్టూ ఉన్న సమాజాన్ని అవగతం చేసుకోవడానికీ.., మన తోటివారికీ మనకీ మధ్యగల సంబంధాలని మెరుగు పరుచుకోవడానికీ.., మానవ సంబంధాలని పటిష్ట పరచుకోవడానికీ.., అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక చలన సూత్రాలని తెలుసుకోవడానికీ.., ఆయా సూత్రాలని నిజ జీవితంలో పాటించే సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలని గుర్తించడానికీ.., వాటిని అధిగమించే ప్రయత్నంలో మనవే అయిన జీవన విలువలని తయారు చేసుకోవడానికీ చదవడం చాలా అవసరం.

అయితే అందుకోసం ఏం చదవాలి ?
శాస్త్రాలని చదివితే విజ్ఞానం పెరుగుతుంది. వార్తా పత్రికలు చదివితే ఎప్పుడెక్కడ ఏమి జరిగిందో తెలుస్తుంది కానీ ఎందుకు జరిగిందో తెలుస్తుందా ? మనిషి ఆలోచనా పరిధి విస్తరిస్తుందా ? అవగాహన పెరుగుతుందా ? ఈ విషయాల్లో ఎవరూ ఎలాంటి హామీలూ ఇవ్వలేరు. ఎందుకంటే,
విజ్ఞానం వేరు. వికాసం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా వుంది. కనీసం ఆ తేడాని గుర్తించడం కోసమైనా మనం చదవాలి.

ఏ చదువైతే మనిషికి విజ్ఞానంతో బాటు వికాసాన్ని కూడా కలిగిస్తుందో అదే సాహిత్యం.
ఎందుకంటే సాహిత్యం అనేది మన్ని మనం వెతుక్కునే ప్రక్రియ. మన మూలాల్ని తవ్విపోసే ప్రక్రియ. ఇందులో వినోదాన్ని మాత్రమే కోరుకునేవారికి వినోదం పంచే రచయితలున్నారు. వినోదంతో బాటు విజ్ఞానం కోరుకునేవారికి పరిశోధనాత్మక సాహిత్యాన్నందించే రచయితలున్నారు. ఈ రెండింటితోబాటు వికాసాన్ని కూడా రంగరించి అందించే రచయితలూ ఉన్నారు.

మరి ఈ రచయితలు వీటిని సాహిత్యంలోకి ఎలా తీసుకు రాగలిగారు ?
ఎలాగంటే,
సాహిత్యంలో పాత్రలుంటాయి. పాత్రలంటే ఎవరు ? మనకి ప్రతిరూపాలు. కాబట్టీ అవీ మనలాగే ప్రవర్తిస్తాయి. చాలాసార్లు మన ప్రవర్తనలోనూ ప్రతిస్పందనలోనూ మన్ని మనం ఆ పాత్రలతో పోల్చుకునే అవకాశాన్నిస్తాయి. అలా పోల్చుకోవడం ద్వారా మన స్పందనల్లోని ఉచితానుచితాల్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తాయి. వ్యక్తులుగా ఎవరికీ వారే ఎకవచనాలే అయినప్పటికీ ఏ ఒక్కరూ కేవలం ఒక్కరు మాత్రమే కాదు. ప్రతి వ్యక్తీ తన దైనందిన జీవితంలో ఎన్నో రకాలైన పాత్రలని పోషించక తప్పదు. అంతే కాదు, ఆయా పాత్రలని రక్తి కట్టించక తప్పదు. మనం ఆయా పాత్రలని పోషించడంలో వేసిన అడుగులూ.., తప్పటడుగులూ.., తప్పుటడుగులూ మొదలైన అన్నిటి గురించీ సాహిత్యంలో ఎదురయ్యే పాత్రలు వివరిస్తాయి. మనం పోషించే పాత్రలకి మనం న్యాయం చేయ్యగాలిగామా లేదా అనే విషయంలో మనం ఎప్పటికప్పుడు రాజీ పడిపోతూనే ఉంటాము. అలా రాజీ పడటం ద్వారా మనం ఏం పోగొట్టుకుంటున్నామో కూడా ఆయా పాత్రలు తెలియజేస్తాయి.
మన చుట్టూ ఎన్నో రకాల పాత్రలు జీవిస్తూనే వుంటాయి. వాటిని మనం పాత్రలని కాక వ్యక్తులని వ్యవహరిస్తాం. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలని అర్ధం చేసుకోవడంలో సాహిత్యంలోని పాత్రలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ విషయంలో మనలోని వివిధ పాత్రలని అవగతం చేసుకోవడానికి సాహిత్యం ఎంత దోహద పడుతుందో అంతకంటే ఎక్కువగా మనచుట్టూ తిరిగే పాత్రలని అర్ధం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇలా అనడానికి కారణం, మనుషుల్లో ఎదుటివారిని సంస్కరించడానికి ఉరకలేసే ఉత్సాహం స్వయంగా తమని తాము సంస్కరించుకోవడంలో ఉండకపోవడమే.

మన స్పందనలు సందర్భాన్ని అనుసరించి మారిపోతూ వుంటాయి. ఆ సందర్భంలో ఎదురైన వ్యక్తులనిబట్టికూడా మారిపోతూ వుంటాయి.
కాబట్టీ,
సాహిత్యంలో కూడా సందర్భాలకీ.., ఆయా సందర్భాలకి దారి తీసిన సంఘటనలకీ.., ఆయా సంఘటనలకి పర్యవసానమైన సన్నివేశాలకీ.., ఆయా సన్నివేశాల ద్వారా బహిర్గతమయ్యే భావోద్వేగాలకీ.., ఆయా భావోద్వేగాలకి దారి తీసే నాటకీయతకీ.., దాని వల్ల మనలో కలిగే ఉద్వేగాలకీ.., ఇలా మన జీవన గమనంలో మనకి ఎదురుపడే సమస్త సామాజిక అంశాలకీ సంబంధించిన సమస్యలూ పరిష్కారాలూ సాహిత్యంలోనూ వుంటాయి.

అందుకే మనం సాహితాన్ని చదవాలి.
సాహిత్యం మనుషుల్ని వ్యక్తీకరిస్తుంది. సంస్కరిస్తుంది. విశ్లేషిస్తుంది. వివేచిస్తుంది. విమర్శిస్తుంది. ఆత్మీయంగా పరామర్శిస్తుంది. గుండెల్ని ప్రేమగా స్పర్శిస్తుంది.
అందుకే మనం సాహిత్యాన్ని చదవాలి.

-రాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చర్చావేదిక, వ్యాసాలు, Permalink

26 Responses to ఎందుకు చదవాలి ?

 1. ved says:

  ఎందుకు చదవాలి అనే ప్రశ్న కంటే , ఏమి చదవాలన్నదే చాల ఇంపోర్టెంట్ . ఎందుకు చదవాలి అని అడిగే చిన్న పిల్లలు (బుజ్జి బుజ్జి పిల్లలు ) మన మధ్య లేరనే అనుకుంటున్నాను . చదువుకుంటూ పోవడమే ముఖ్యం . ఏం చదవాలో తెలిస్తే అదృష్టమే ,సంతోషమే . ఏమి చదవాలో తెలియకుండానే ఎన్నో పుస్తకాలు చదివాను . నేర్చుకోవాలి , తెలుసుకోవాలి అని తపన వుంటే ………..ప్రతి పుస్తకంలో ఏదో ఒకటి , కనీసం ఒక వాక్యం అయినా పనికోచేదే వుంటుంది , పైన కామెంట్స్ లో ఆ బోధి వృక్షం గొడవ అర్థం కాలేదు ……………బోథి వృక్షం కిందకు చేరగలిగితే ఇంకా పుస్తకాలతో పనుండదు. because యువర్ సోల్ ఇస్ enlightened ఆల్రెడీ . రాణి గార్కి అభినందనలు . తెలుగు సాహిత్యంలో చదవతగ్గ (విజ్ఞానం ,వికాసం కోసం ) పుస్తకాల లిస్టు తయారుచేసి ఇక్కడ post చేస్తే చాల బాగుంటుందని ……..చేస్తారని …..ఆశిస్తూ ……వేద్

 2. kavitha says:

  రాణిగారూ,
  మీ రైటింగ్ బాగుంది.మీరూ, క్రిష్ గారూ డిస్కస్ చేసుకోవడం కూడా బాగుంది.దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగుండేది.నేనూ టీచర్నే. మీ బోధి వృక్షం కథ చాలా ఇన్స్పైరింగ్ గా వుంది.

 3. కల్యాణి says:

  రాణి కాని రాణి గారూ,
  ఎందుకు చదవాలి ? తరవాత, ఏం చదవాలి ? అనే వ్యాసం రాస్తానన్నారు.
  దానికి విహంగ విహంగ నించి వివరణ కూడా వచ్చింది. ఇంకా ఎందుకు లేటు ?

 4. రాణి says:

  సౌమ్యగారూ,
  నాకు మీ ప్రశ్న బాగా నచ్చింది. అందుకే నేను రాయబోయే వ్యాసానికి అదే పేరు పెడుతున్నాను.
  “ఏం చదవాలి ?”
  మన విహంగ సంపాదకి అనుమతి ఇచ్చిన వెంటనే రాయగలను.
  ఇట్లు
  మీ
  రాణి కాని రాణి.

  • విహంగ says:

   విహంగ కి రచనలు పంపటానికి అనుమతి అక్కర్లేదు రాణి గారూ.మీరు పంపాక ఆమోద యోగ్యమైతే ప్రచురించ బడుతుంది.

 5. krishh says:

  ఆఆఆ…ప్రణవి గారు

  చదివాను మీ “భోదివృక్షం” కథ… … బాగుంది…
  మాస్టారు పాత్ర బాగా నచ్చింది.
  “గుణకారం అంటే ఆవృత సంకలనం” అని పిల్లలకు
  practical గ చూపించడం ద్వారా వాళ్లకు అవగాహన కల్గించడం … … నాకు చాలా నచ్చింది,ఎందుకంటే నేను కూడా
  చదువు చెప్పే విధానం అలానే వుండాలి అని కోరుకుంటాను…

  కాకపోతే.
  నేనూ ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళ పాప “B” దిద్దు తూ కష్టపడుతుంటే … … వాళ్ళ అమ్మతో
  అలా కాదమ్మ simple గ అలోచించి దిద్దించాలి అనిచెప్పి,నేను ఆ పాపకు ఇలా చెప్పాను
  “చూడు ప్రనీతా ! ఒక నిలువుగీత ఇలా గీచి తర్వాత దానికి రెండు సార్లు కుడివేపు ఇలా పైన ఒక రౌండ్, కింద ఒక రౌండ్ గీస్తే “B ” వచ్చేస్తుంది”
  అని దిద్ది చూపాను.అప్పుడు… …
  ఆపాప ఒక పెద్ద గీత గీసి top చివరలో ఒక చిన్ని రౌండ్ ,bottom చివర ఒక బుల్లి రౌండ్ గీసేసరికి… మాకు నవ్వు ఆగలేదు.

 6. krishh says:

  మంచి
  puzzle ఇచ్చారు…
  ఆంధ్రజ్యోతి చదివి
  మీరెవరో కనుక్కోవటానికి ట్రై చేస్తాను

 7. sasi says:

  క్రిష్ గారూ,

  ఇంతకీ నేనెవరిని ?

  “తర్క బద్ధం గానూ అర్ధవంతం గానూ ఆలోచింపజేసేవిగానూ అనిపించడం” వేరు.
  “తర్క బద్ధం గానూ అర్ధవంతం గానూ ఆలోచింపజేసేవిగానూ వుండటం” వేరు.
  ఈ రెండింటికీ చాలా తేడా వుంది.
  మొదటి దాంట్లో ఆకర్షణ వుంటుంది. రెందోదాంట్లో ఆలోచన వుంటుంది.

  ఇంక రాణి గురించి,
  నేను అంతర్జాలానికి పూర్తిగా కొత్త. ఇదే నా మొదటి వ్యాసం. మీరే నా మొదటి మిత్రులు.
  నిజానికి దీన్ని ఎలా పోస్ట్ చెయ్యాలో తెలీక కామెంట్ లాగా పోస్ట్ చేస్తే ఎడిటర్ గారు దాన్ని బాక్సులో పెట్టి వ్యాసంగా వేసారు.
  అందుకు వారికి నా కృతజ్ఞతలు.

  రాణి నాకు ఇష్టమైన అమ్మాయి. నా దగ్గర నాలుగు అయిదు తరగతులు చదివింది. ఇప్పుడు తనూ టీచర్ అయిపోయింది లెండి.
  తనని చూసి పదిహేను సంవత్సరాలు అయింది.
  నేను తనని “ఎందుకు చదవాలి” అనే వ్యాసం రాయమంటే” మీరు చదవమన్నారు కద్సార్ ? “అని ఒక్క ముక్కలో తేల్చి పారేసింది. నాకంత సూటిగానూ స్పష్టంగానూ చెప్పడం రాదు.
  అందుకే రాణి అంటే నాకు ఇష్టం.

  ఎందుకు చదవాలి అనే పేరు పెట్టగానే నాకు ఆనాటి చిన్నారి రాణి గుర్తు వచ్చింది.
  అందుకే తన పేరు పెట్టాను.
  మొన్నటి ఆదివారం ఆంధ్ర జ్యోతిలో నా కథ “బోధి వృక్షం ” చదివితే నేనెవరో తెలుస్తుంది.
  నేనేవరనేది కనిపెట్టండి చూద్దాం.

 8. krishh says:

  రాణి గారు నమస్తే…!

  మీరు వ్రాసిన అర్ధవంతమైన మొదటి వివరణలో…
  విజయానికి సూత్రాలు,దారులు,సోపానాలు, మెట్లు ,అంటూ వ్రాసే వ్యక్తిత్వ వికాసపు రచయితల మీద చెప్పిన అభిప్రాయాలు తో confuse అయ్యి
  అస్సలు … “ఎందుకు చదవాలి” సంగతి తర్వాత, ముందు “ఏమి చదవాలి?” అంటూ doubt వచ్చినట్టు ఉంది సౌమ్య గారికి …(just సరదాకు అంటున్నలెండి సౌమ్య గారూ …!) .

  రాణి గారు..!
  కాకపోతే మీరు మీ సమాధానం లో…,

  ఇన్ని రాగా లేనిది సాహిత్యం లోకి… … … … … … … …. … …” ,అంటూ ,
  “మనకి కావలసిందల్లా ఒక్కటే,చదివించేలా వుండటం..!చదివిన తరువాత ఆలోచించేలా చెయ్యడం..!”, అని మీరు చెప్పి,
  తర్వాత,
  “యండమూరి రాసే పుస్తకాల్లో ప్రతి వాక్యమూ తర్క బద్ధం గానూ అర్ధవంతం గానూ ఆలోచింపజేసేది గానూ అనిపిస్తాయి”…. …
  అని కితాబు ఇస్తూనే,
  “అలా అనిపించేలా చెయ్యడమనేది, మనచేత ఆ పుస్తకాన్ని కొనిపించే ఎత్తుగడ మాత్రమే.” అంటూ
  విమర్శించారు.

  book కి క్రేజ్ పెంచుకుని marketing చేసుకోవాలనే ఉద్దేశ్యం వుండటం కొందరికి కాస్త ఎక్కువ గ వుంటుంది కదా… అలాంటి techniques ,ఉద్దేశ్యాలు వున్నా…… రచన బాగుంటే ,వ్యక్తిత్వ వికాస రచనలు కూడా ok నే కదా… … ఎందుకంటే ,
  మీరన్న చదివిన్చేలాగ వుండటం…,చదువుతుండగానే, ప్రతివాక్యం ఒక తర్కంతో కూడి ఆలోచిన్చేలాగ వుండటం పాళ్ళు అలాంటి
  “మెట్లు,సోపానాలు,సూత్రాలు” category పుస్తకాలకు ఇంకా ఎక్కువ కదా… … …

 9. krishh says:

  రాణి గారు మీకూ
  … నా హృదయపూర్వక కృతజ్ఞతలు…!

  మీరు రచించిన రచనలు ఇంకా చదవాలంటే ఎక్కడ దొరుకుతాయి? అన్న సౌమ్య గారి ప్రశ్నకు స్పందిస్తారని ఆశిస్తున్నాను.

  సౌమ్య గారికి ఒక్క మాట చెప్పదలచుకున్నాను…
  ఏదో రాణి గారు వ్రాసినదానికి ఆనిపించిన response పోస్ట్ చేస్తున్నాను అంతే కాని, నాకు సాహిత్యం గురించి knowledge గాని,రచనాసామర్ధ్యం
  అనుభవం గాని అస్సలు లేవు.
  మిత్రుని ద్వారా తెలుసుకుని blog follow అవటమే తప్ప సాహితీ ప్రపంచం నాకు మరీ కొత్త.
  అందుకే ప్రతిసారి పద ప్రయోగం,వాక్య నిర్మాణం లో తప్పులు చేస్తున్ననేమోనని భయంతో ఒకటికి పది సార్లు చూసుకుంటూ వుంటాను.
  కాబట్టి,రాణి గారు కాని,మీరెవరైనా …ఏదైనా తప్పులు దొర్లితే అది కాస్త నా పరిజ్ఞాన లోపమని గమనించగలరు.

  .

 10. sowmya says:

  రాణి గారూ ,
  మీ వ్యాసం , మీ సమాధానాలు చమత్కారంగా ఆలోచింపచేసేలా వున్నాయి.
  మీరు రచించిన రచనలు ఇంకా చదవాలంటే ఎక్కడ దొరుకుతాయి?మీరు ఏమి చేస్తుంటారు?ఎక్కడుంటారు?
  పూర్వం ఇంకా ఏమేమి రాశారు?
  సాహిత్యపు లోతులు తెలిసిన మీరు ,క్రిష్ గారు ఇలా చర్చించటం వల్ల కొత్త కోణాలు తెలుస్తున్నాయి.
  ఇంతకీ ఈ రోజుల్లో యువత ఎలాంటి పుస్తకాలు చదవాలి అంటారు?

 11. రాణి says:

  క్రిష్ గారూ,
  యండమూరి మల్లాది సూర్యదేవర కొమ్మనాపల్లి లాంటి కొంతమంది పేరున్న రచయితల పేర్లను పేర్కొనే ముందే ఆలోచించుకోవాలి.
  తరవాత ఆలోచించడానికి ఏమీ వుండదు.
  పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిద్ధ పడటమే..!
  నిజానికి మీ అభిమానమే నాకింత ధైర్యాన్ని ఇచ్చింది. అందుకు మీకు నా కృతజ్ఞతలు.
  అది సరే, ఈ మూడు రోజులూ ఏమైపోయారు ?

 12. krishh says:

  రాణి గారు
  మీరు నేను ఝలక్ ఇచ్చానని ఎందుకన్నారో అనుకున్నా…
  but ఇప్పుడర్ధమైంది … …మీరు వ్యక్తిత్వ వికాసమంటూ వ్రాసే వాళ్ళు సంపాదనే ధ్యేయం
  గ వ్రాస్తారు అన్నప్పుడు…
  నేను యండమూరి పేరు, వారి పుస్తకము ను టాపిక్ లోకి తీసుకొచ్చినప్పుడు
  … సరికొత్త చర్చకు తెరలేస్తోందని ముందే ఊహించి అన్నారా?

 13. రాణి says:

  శ్రీదేవి గారికి,
  అభిమానం అంటేనే అంత..,
  ఒప్పించవలసిన చోట నొప్పిస్తుంది. నొప్పించవలసిన చోట ఒప్పిస్తుంది.
  అయినా ఆరోగ్యం కాపాడుకోవడానికి అప్పుడప్పుడూ సూదిమందులు తప్పవు కదా ?
  మహీధర వారికి,
  వికాసం అనేది వ్యక్తిత్వాన్ని అనుసరించీ, వ్యక్తిత్వాలనేవి ఆయా వ్యక్తుల సంస్కారాన్ని అనుసరించీ వుంటాయి. ఆ సంస్కారం అనేది పుట్టి పెరిగిన వాతావరణం తారసపడే మనుషులూ మొదలైన ఎన్నో విషయాలమీద ఆధారపడి వుంటాయి. అందుకే వాటిని ఎవరూ ఖచ్చితంగా బేరీజు వెయ్యలేరు.
  కొందరు మేధావులైన రాతగాళ్ళు , అలా ఖచ్చితంగా చెప్పలేని విషయాలని తాము కళ్ళారా చూసిన ఖచ్చితమైన సంగతులుగా భ్రమింపజేస్తారు.
  కాబట్టే వారిని వ్యాపార రచయితలు లేదా రచనా వ్యాపారులు అంటారు.
  మనం వీటికి సంబంధించిన మరిన్ని వివరాలని సందర్భానుసారం చర్చించుకుందాం.
  అభివందనాలు.

 14. శ్రీదేవి says:

  అవునా ? కాదా ?
  రాణి గారూ మంత్రసానికి మీరే బొడ్డుకోసి మంత్రసాని అనే పేరు పెట్టింది మీరే అన్నంత కన్విన్సింగా చెప్పారు.
  చదువనేది అక్షరాలతో మాత్రమే మొదలవుతుందని అనుకుంటారంతా.
  కానీ పుట్టడమే ఓ పెద్ద ఎడ్యుకేషన్ అని మీరు ప్రూవ్ చేసి చూపించారు.
  బట్,
  మీరు యండమూరి రచనల గురించి మీరు చెప్పిన మాటలు ఆయన అభిమానులని నొప్పించేవిగా ఉన్నాయి.

  • మహీధర says:

   రాణీ గారూ! వ్యక్తిత్వవికాసాలు రాసే ఎవరైనా (ఒక యండమూరి మాత్రమే కాదు) అన్నిటినీ ఖచ్చితంగా బేరీజు వేస్తారని , అదే అందరికీ చెప్తారనీ నేనుకోను.వారి జీవితాలు వేరు. రచనలు వేరు.ఏమంటారు?మంచి చర్చకి తెర తీసినందుకు ధన్యవాదాలు మేడం.

   శ్రీదేవి గారూ, అభిమానులు నొచ్చుకుంటారని వాస్తవాలు ఎలాంటివైనా మరుగున పడి పోతాయా ?

 15. Jonnavithula Yagna Narayana Sarma says:

  ఎందుకు చదవాలి…?
  మన ఆలోచనల్లో వివేచన పెంపొందించుకోవడంకోసం…
  మన ఆలోచనలు పరిపక్వత చెందడంకోసం…
  మన ఆలోచనా పరిధి ని విస్తృత పరచుకోవడంకోసం…

  మొత్తంగా మనం మరింత సంస్కారవంతులవడంకోసం

  వ్యాసం ఎంత బాగా రాశారో, స్పందనలకి అంతే చక్కటి జవాబులిచ్చి మరింత ఆలోచింపజేశారు….ధన్యవాదాలు

 16. రాణి says:

  క్రిష్ గారూ,
  నేను యండమూరి వారికి పంచ్ ఇచ్చానో లేదో తెలీదుగానీ మీరు మాత్రం నాకు చాలా పెద్ద ఝలక్ ఇచ్చారు.
  యండమూరి వారనే కాదు, కెరీర్ లేదా పెర్సనాలిటీ కాదా కమ్యూనికేషన్ డెవలప్ మెంట్ అంటూ పాఠాలు చెప్పే పెద్దలందరూ తమ పుస్తకాలకి అటువంటి అందమైన పేర్లే పెడతారు. ఆ పేరు చూడగానే పుస్తకం ఓసారి చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది.
  ఒకవేళ అది రాసినవారు యండమూరి వారే గనక అయితే,
  ఆ పుస్తకం అలా చేతిలోకి తీసుకున్న తరవాత పొరపాట్న ఒక్క వాక్యం చదివినా దానికి ఫిదా అయిపోయి వెంటనే ఆ పుస్తకాన్ని కొనేస్తాడు.
  ఎందుకంటే ఆయన రాసే పుస్తకాల్లో ప్రతి వాక్యమూ తర్క బద్ధం గానూ అర్ధవంతం గానూ ఆలోచింపజేసేది గానూ అనిపిస్తాయి. అలా అనిపించేలా చెయ్యడమనేది, మనచేత ఆ పుస్తకాన్ని కొనిపించే ఎత్తుగడ మాత్రమే.
  అది పుస్తకాలని అమ్మడంలో విజయవంతమైన విధానంగా నిరూపించబడింది కనుక,
  మిగిలినవాళ్ళంతా సన్నటి గొంతులతో ఆయనకి కాస్త అటూ ఇటూగా వంత పాడేస్తూ వుంటారు.
  ఎంత బాగా పాడినా ఘంటసాల ఎస్పీలలా అందరూ పాడలేరు. కాబట్టీ మనకి పాట అనగానే వాళ్లిద్దరే గుర్తొస్తారు.
  అలాగే పాపులర్ సాహిత్యం అనగానే యండమూరివారే గుర్తొస్తారు. కాబట్టీ అది మన తప్పు కాదు.
  మన చర్చ ఎందుకు చదవాలి అంటూ ప్రారంభం అయింది కనుక, ఈ సందర్భంగా ఒకమాట చెప్పాలనిపిస్తోంది.
  తెలుగులో చదువరులందరికీ చదవడాన్ని అలవాటు చేసింది మధుబాబు, యండమూరి, మల్లాది మొదలైన పాప్యులర్ రచయితలే.
  ఐతే, ఈ పాప్యులర్ రచనల ప్రయోజనం, చదవడాన్ని అలవాటు చెయ్యడానికి మాత్రమే పరిమితం.
  మనకి నిజంగా ఆలోచించడం అలవాటయ్యాక గానీ ఈ విషయం అర్ధం కాదు.
  అది అర్ధమయ్యాక గానీ సాహిత్య ప్రయోజనం అవగతం కాదు.

 17. krishh says:

  “కేరీరే జీవితానికి పరమ లక్ష్యంగా భ్రమింపజేసే విజయానికి అడ్డదారులు లేదా సక్సెస్సుకు సవాలక్ష దొడ్డిదారులు లాంటి పుస్తకాలు రాయడం ద్వారా తమ భవిష్యత్తుకు కావలసినంత సంపదని సమీకరించడం లాంటిదన్నమాట.”
  అన్నారు…
  అంటే నాకుతెలిసి
  యండమూరి వీరేంధ్రనాద్ గారి నోవెల్ ఒకటి వుంది,
  “విజయానికి 5 మెట్లు” అనుకుంటా.. …
  ఎందుకు అంత పెద్ద పంచ్ ఇచ్చారు…!?

 18. రాణి says:

  చదువు ఎలా మొదలవుతుంది ?
  మిత్రులందరికీ..,
  అభివందనాలు.
  మనందరం ఎందుకు చదవాలి అనే ప్రశ్న వేసుకోవడం ద్వారా మనం ఒక సామాజిక బాధ్యతని తలకి ఎత్తుకున్నామని నాకు అనిపించింది. అలా అనిపించడానికి కారణం మీ స్పందన. అదే ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా ముందుకి సాగుదాం.
  క్రిష్ గారు చెప్పినట్టు మార్పనేది కాలమిచ్చే తీర్పు కాబట్టీ మనకి చదువనేది మార్పుల సమాహారంగా మొదలవుతుంది.
  ఆ మార్పుల గురించి కాస్త కవితాత్మకంగా మాట్లాడుకుందాం.
  ఎన్ని మార్పులకి గురయినా మనిషి ఎలా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడో అలాగే చదువు కూడా మనిషి మనుగడ కొనసాగినంతకాలం తన ఉనికిని నిలబెట్టుకుంటుంది.
  మరి ఈ అస్తిత్వ నిరూపణలో చదువు ఉనికిని గుర్తించడం ఎలా ?
  దీనిని మనం మనిషి పుట్టుకతో ముడి పెట్టి గుర్తించే ప్రయత్నం చేద్దాం.
  అసలు మనిషికి బీజం కలయికతో పుడుతుంది.
  తొమ్మిది నెలల తరువాత గండం గడిచి పిండం బయట పడుతుంది.
  ఒక్కసారిగా వెలుతురు కంట్లో పడేసరికి పిడికిళ్ళు బిగించి మరీ తన ఉనికిని లోకానికి చాటుతుంది ఆ పసి గుడ్డు. అయినా మనం గుర్తించలేము.
  అలాగే,
  అంత కాలం మాంత్రిక జగత్తులో విహరించిన ఆ బిడ్డ తొలిసారిగా ఊపిరి తీసుకోవడానికి సహకరించే స్త్రీకి మంత్రసాని అనే పేరు పెట్టడానికి కారణం బహుశా ఆ మాంత్రికతే అయి వుంటుంది.
  అనంతరం,
  వెల్లకిలా పడుకుని కేవలం ఇంటి లోపలి కప్పునీ ఆటకలనీ అడపా దడపా కిటికీలనీ చూస్తూన్న ఆ పసి బిడ్డని ఎత్తుకోగానే అంతవరకూ కనిపించిన ప్రపంచమంతా ఒక్కసారిగా తిరగ పడినట్టు అనిపించి గందర గోళానికి లోనై నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వడమో ఏడవడమో చేస్తాడు. తమ పసితనం గురించి ఏమాత్రం తెలియని ఆ బిడ్డ తల్లిదండ్రులు వాడికి ఆకలి వేస్తోందవి భాష్యం చెప్పుకుని పాలు పట్టేస్తారు.
  పాపం, వాడా పాల చదువు మింగలేక కక్కేస్తాడు. దాంతో ఈ తల్లిదండ్రులు కంగారు పడిపోయి వైద్యుడి దగ్గరికి తీసుకుపోతారు.
  ఆ వైద్యులవారు, వచ్చిన గిరాకీని వదులుకోవడం ఇష్టం లేక ఏవో నాలుగు మందులిచ్చి పిల్లల గురించి తను చదివి తెలుసుకున్నదంతా వాళ్లకి చెప్పి పంపుతాడు.
  ఇందులో మూడు నాలుగు సార్లు చదువనే పదం ఉందిగానీ అసలు చదువు ప్రసక్తి ఎక్కడ వుంది ?
  ఇదేగా మీ అనుమానం..,
  ఆ పసి కూన, భవిష్యత్తులో ఏదో ఒకనాడు ఈ ప్రపంచం తనమీద తిరగబడక తప్పదనే విషయాన్ని చదువుకున్న విషయాన్ని చదవ వలసిన పెద్దలు ఎవరూ సరిగా చదవక పోవడం వల్ల ఆ పిల్లవాడే కొన్ని నెలలకి స్వయంగా తిరగబడి అంటే బోర్లా పడి, కిలకిలా నవ్వుతూ వెక్కిరిస్తాడు. పెద్ద పెద్ద చదువులు చదివిన పిచ్చి పెద్దమనుషుల్లారా నేనే ఈ ప్రపంచం తిరగ పడిన విషయం కనిపెట్టాను. ఇంకా ఏ చదువూ చదవకుండానే లోకంలోని చదువుల మర్మాలన్నీ చదివేసాను అంటూ నవ్వుతాడు. అయినా ఆ నవ్వులోని భావాన్ని చదవలేని పెద్దలు మా బాబు బోర్ల పడ్డాడనే ఆనందంతో బొబ్బట్లు చేసి ఊరందరికీ పంచి పెట్టేస్తారు. సంబరాలు చేసుకుంటారు..!
  పాపం..,
  ఆ పిల్లవాడు చదివిన చదువుని ఇన్ని చదువులు చదివిన మనం గుర్తించగలిగామా ?
  జీవన మార్మికతని అంత చిన్న వయసులోనే చదివిన విషయాన్ని మనం గ్రహించ గలిగామా ?
  జీవిత చరమాంకానికి చేరినా జీవన మౌల్యాలని నిర్ధారించుకోలేని పెద్దలు కూడా చదవలేని అద్భుతమైన చదువది.
  అవునా ? కాదా ?
  ఈ చదువు మొదలయ్యేది అసలు చదువంటే ఏమిటనేదాన్ని మనం స్పష్టంగా నిర్వచించుకుని దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలన్నదానిని నిర్ధారించుకుని ఆ తరవాత వెయ్యవలసిన తొలి అడుగు.
  అవునా ? కాదా ?
  చదువనేది…
  కేవలం అక్షరాలతోనో అయ్యవార్లతోనో ఆట పాటలతోనో అర్ధం కాని పాఠాలని బట్టీ పట్టటంతోనో శాస్త్రాలతోనో శాస్త్ర కారులతోనో సాహిత్యంతోనో సృజన కారులతోనో మొదలు కాదు… ఈ మొత్తం విషయాలన్నీ కూడా చదువులో అంతర్లీనంగా ప్రవహించే జీవ నదులు.
  అవునా ? కాదా ?
  చదువనేది నిరంతరం కొనసాగే సృజనాత్మక ప్రక్రియ.
  సృజన అనేది నిరంతరం కొనసాగే సాహిత్య ప్రక్రియ.
  సాహిత్యం అనేది నినంతరం కొనసాగే విమర్శాత్మక ప్రక్రియ.
  విమర్శ అనేది నిరంతరం మన్ని మనం శోధించుకునే ప్రక్రియ.
  ఈ శోధన అనేదే చదువుకి మూలం.
  అవునా ? కాదా ?

 19. krishh says:

  అవును కదా… …!
  మీరన్నది నిజమే…
  సామాజిక,వ్యవస్థీకృత మార్పుల వల్ల కొన్ని ప్రక్రియలు
  కాలం చెల్లే ప్రమాదం లో పడినప్పుడు ,
  అవి కరిగే కాలం లో కలిసిపోయేలోగా సరికొత్త రూపాన్నిసంతరించుకుని తమ భవిష్యత్తుని వెతుక్కోవటం మంచిదే.

  మీరన్నట్టు,
  చదివించేలా వుండటం..!చదివిన తరువాత ఆలోచించేలా చెయ్యడం! ప్రధానం,
  … … అది పుస్తకరూపమైనా ,ఒక్క కాగితపు కథ అయినా,కార్డు కథ అయినా,చివరికి సెల్ ఫోన్ సందేశాలైనా..

  డార్విన్ “struggle for existence”, “survival of fittest” సూత్రాల లో చెప్పినట్టు,
  ఆధునిక కాలం శరవేగo గ పరుగులెడుతున్నప్పుడు శరాఘాతాలకు బలవ్వకుండా తప్పించుకుంటూ
  , సకాలం లోరక్షణ ను కల్పించుకుని ,కాలాన్ని తిట్టుకుంటూ కూర్చోక కాలానుగుణంగా మార్పు చెందేవే కలకాలం నిలబడతాయి.

  for example
  RADIO ల కాలం మారి –T.V లు —COMPUTER లు వచ్చాక …F.M RADIO గా మళ్లీ ఉనికిని చాటుకోవడం,అలాగే,
  కళాత్మకమైనTEST cricket – One Day er లు గా — ఇప్పుడు “పొట్టి CRICKET” (T20) గా
  మారి తన ఉనికిని బలపరుచుకోవటం లాగానే
  కావ్యాలు కాకున్నా…కథలు, కవితలు, వ్యాసాలు… పుస్తక పఠనం ,పతనమయ్యి పోతుండగా ,
  BLOG ల లో Dot Com లలో పలకరించటం మంచి పరిణామమే… … అలాంటిదే CELL PHONE సాహిత్యం కూడా.

  కావ్యాలు, చందస్సు నిండిన సంక్లిష్ట పద్య ,గద్యాలు కాలం తోబాటు సరలికృతమై మాలాంటి వాళ్ళకు అందుబాటులోకి రావటం
  శుభపరిణామమే అని అంగీకరిస్తున్నాను .. .. …

 20. రాణి says:

  క్రిష్ గారూ,
  మీ మాట ముమ్మాటికీ నిజం.
  సెల్ ఫోన్ ద్వారా పంపే సందేశాలూ అంతర్జాలంలో జరిపే శోధనలూ ఇవి కూడా ఒక విధమైన సాహిత్య ప్రక్రియలే.
  ఎలాగంటే..,
  ఒకప్పుడు కావ్యాలు మాత్రమే సాహిత్యంగా చెలామణీ అయ్యేవి. అంతకు ముందున్న దంత కథలూ జానపదుల పదాలూ సాహిత్య గౌరవానికి నోచుకోలేదు. అందుకు కారణం సాహిత్యం అనేది రాజులనీ చక్రవర్తులనీ సంతోష పెట్టడానికీ వారి ప్రాపకాన్ని సంపాదించి పెట్టడానికీ ఒక అడ్డదారిగా రూపొందింది. కాబట్టీ రాయగల నైపుణ్యం కలిగినవారందరూ కావ్య రచనే సాహిత్యమనే భ్రమలు కల్పించి, రాయడం అనేది ఓ గొప్ప దైవ దత్తమైన వరంగా ప్రచారం సాగించారు.
  దీని గురించి చెప్పాలంటే ఇది కేరీరే జీవితానికి పరమ లక్ష్యంగా భ్రమింపజేసే విజయానికి అడ్డదారులు లేదా సక్సెస్సుకు సవాలక్ష దొడ్డిదారులు లాంటి పుస్తకాలు రాయడం ద్వారా తమ భవిష్యత్తుకు కావలసినంత సంపదని సమీకరించడం లాంటిదన్నమాట.
  ఆయా పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళు ఉద్యోగులుగానో వ్యాపారులుగానో పాలకులుగానో ఎందుకూ పనికి రాకపోతే కేవలం పదాలతోనూ ఛందస్సులతోనూ ఆటలాడుకునే పండితులుగానో తయారవుతారు తప్ప మంచి వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా మాత్రం తయారు కాలేరు.
  కాలం, ఏ కాలంలో చూసినా భవిష్యత్తులోకి ప్రవహిస్తూనే వుంటుంది.
  ఆ భవిష్యత్తు నిజంగానే సామాజికుల భవిష్యత్తుకి భవిష్యత్తుని ఇవ్వగాలుగుతుందా లేదా అన్నదానిమీద దాని భవిష్యత్తు ఆధారపడి వుంటుంది.అలాంటి భవిష్యత్తు కలిగిన ప్రక్రియలు ఏ నాటికీ మాసిపోవు. ఛందస్సులో ఉన్నంత మాత్రాన వేమన పద్యాలు గానీ భాగవత పద్యాలుగానీ తమ సార్వత్రికతనీ సార్వకాలికతనీ కోల్పోవు.
  రాను రానూ సాహిత్యానికి సంకెళ్ళు తెగి పోవడం మొదలయ్యింది. సామాజిక స్పృహ కలిగిన సాహిత్య ప్రక్రియలకి ఆదరణ లభించడం మొదలైంది.
  సాహిత్య ప్రక్రియల్లో కొత్త ధోరణులూ కొత్త ఆలోచనా విధానాలూ వెలుగుచూశాయి. కథ, నవల, గల్పిక, కవిత, గద్యం, ఛందస్సుని అధిగమించిన పద్యం, ఈ రెండూ కలగలసిన గపద్యం ఇలా ఎన్నెన్నో కొత్త కొత్త సాహిత్య ప్రక్రియలు మొదలయ్యాయి. అక్కడితో ఆగలేదు. మినీ కథలు,కార్డు కథలు,మినీ కవితలు, నాలుగు ముక్కల నానీలు మూడుముక్కల హైకూలు. ఇలా స్వదేశీ విదేశీ ప్రక్రియలెన్నో సాహిత్యం లోకి ప్రవహించాయి.
  ఇన్ని రాగా లేనిది సాహిత్యం లోకి ఎస్సెమ్మెస్సులూ బ్రౌజమ్మిస్సులూ సెర్చ్ అన్నలూ వచ్చి చేరతామంటే ఎవరు కాదంటారు ? ఎందుకు కాదంటారు ?
  మనకి కావలసిందల్లా ఒక్కటే..,
  చదివించేలా వుండటం..!చదివిన తరువాత ఆలోచించేలా చెయ్యడం..!
  అంతే తప్ప అది అంతర్జాలంలో ఉందా ? ఇంద్రజాలంలో ఉందా ? లేక మహా మాయాజాలంలో ఉందా ? అనేది ఎంత మాత్రం కాదు.
  నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
  అభివందనాలు.

 21. sofi says:

  బాగుంది

 22. uday says:

  బాగుంది

 23. perumalla.ravikumar says:

  సాహిత్యాన్ని యందుకు చదవాలో చక్కగా వివరించారు

 24. krishh says:

  సాహిత్యం ఎందుకు చదవాలో చాల చక్కగా చెప్పారు.
  మీరు అన్నట్లు మనోవికాసం,మంచి వ్యక్తిత్వం కోసం సాహిత్య పఠనం ఎంతో అవసరమైనా, ఈ హై స్పీడు కాలం లో
  అరచేతిలో ఉన్నదే (సెల్ ఫోన్) ప్రపంచమయ్యి బ్రౌసింగు,సెర్చింగు లే తప్ప “చదవటం” అనే ప్రక్రియ నే మరచిపోయారు నేటి తరం.
  పొట్టి మెసేజ్ ల లోకం లో విహరించే మన వాళ్ళ కు విలువలతో కూడిన వివరణాత్మక సాహిత్యానికి మెమరీ స్పేస్ చాలట్లేదు.
  మీ వ్యాసం లాగానే అందమైన పదాల అమరికతో ఆహ్లాదం కలిగించే రచనలు చెయ్యగల రచయితలు సాహిత్యానికి
  పూర్వ వైభవంతీసుకురావాలని అశిస్తూ…