– వనజ వనమాలి
”అమ్మాయి గారు ..ఆమ్మాయి గారు .. రండమ్మా.. నెత్తి మీద తట్ట బరువుగా ఉంది దించడానికి ఓ..చెయ్యి వేయాలి”
అంటూ.పిలుస్తుంది.ముసలి అవ్వ.
మంచి పుస్తకం చదువుకుంటూ ఉండగా . ఇంతలోనే ఈ ముసలమ్మ వచ్చి చదువుకోనీయకుండా చేసినందుకు వచ్చిన చిరాకును అణుచు కుంటూ బయటకి వచ్చింది..పద్మ
అబ్బా..మళ్ళీ వచ్చావా?.. ! వద్దు అంటే ఇప్పుడు ఊరుకోవు కదా! అంది పద్మ.
మంచి ఆహారం తల్లీ! రోగం,రొస్టు రాకుండా ఉండాలంటే ఇవే తినాలి..అంటూ..నిండు గంపలో నుండి నాలుగు మొక్క జొన్న పొత్తులు తీసి పద్మ చేతికి ఇస్తుంది.
నిజమే అనుకో.. నాకు అవి ఉడకబెట్టుకోడానికి బద్ధకం ఎక్కువ.మొన్న ఇచ్చి వెళ్ళిన కండెలే అలాగే ఉన్నాయి అంటూ .. ముసలి అవ్వ ఇచ్చిన మొక్కజొ న్నపొ త్తులు తీసుకుంది . వద్దంటే..ఊరుకోదు మీరు బోణీ చేస్తే మంచిదమ్మా ..పది నిమిషాల్లో తట్ట దులుపుకుని వెళ్ళిపోతాను అంటూ కాళ్ళకి బంధం వేస్తుంది. ఆ మాట అన్నాక తీసుకోక చస్తానా!? అనుకుని సర్లే ఇవ్వు..అని ప్రక్కన లక్ష్మి గారిని పిలువు అంది .
ప్రక్క వాటా ముందుకు వెళ్లి.రమేష్ గారు..ఓ..రమేష్ గారు.. రా తల్లీ లేత కంకులు తెచ్చాను అంటుంది. ఆయన చచ్చిపోయి నాలేగేల్లు అవుతుంటే ..రమేష్ గారు అని పిలుస్తావే..నీ పిలుపుకి పైకి వెళ్ళిన ఆయన తిరిగి వస్తాడా..అంటూ బయటకి వస్తారు లక్ష్మి గారు.
కోపం వద్దమ్మా !ఆయన మఖాను భావుడు..ఆ మంచితనం వల్లే నిన్ను పిలిచి ఇచ్చి వెళ్ళా లనిపిస్తూ ఉంటుంది. అని చెపుతుంది. ఎప్పుడో ఆయన చేసిన సాయంని తలచుకుంటూ.
ముసలమ్మా!.. చనిపోయిన ఆయన ఒక్కడే మంచి మనిషి కాదులే ఇక్కడ అందరూ మంచి వాళ్ళే లే ..అంటూ..గంపలో చేయి పెట్టి లేత పొత్తులని జాగ్రత్తగా ఏరుకుని.ఒక్కో పొత్తుని పైరేకులు లాగి గింజలు నిండా ఉన్నాయో లేవో చూసుకుంటారు. నేను అలాంటి దృశ్యాన్ని ఓ..అయిదేల్లకి పైగా చూస్తుంటాను కాబట్టి ఆశ్చర్యం లేదు. “ఇదిగో..ఇందులో సగం కూడా గింజలు లేవు..ఒట్టి బొండులే ! నాకు అంతా నష్టమే! ఇంకోకటి ఇవ్వు అంటూ.. గంపలో ఉన్న కండె లన్నిటిలో సగానికి పైగా తీసి చూసుకుంటూ ఉంటారు. అబ్బ.. ఈవిడో జిడ్డు మనిషి ఆమెకి ఏది నచ్చదు అనేకన్నా మనసుకి సంతృప్తి ఉండదు అనుకుంటారు అందరు. ఇళ్ళ దగ్గర తిరిగి అమ్ముకునే చిల్లర వ్యాపారులపట్ల చులక భావమే కాదు కొనే వస్తువు విలువ లో ప్రతిపైసాకి న్యాయం చేకూర్చుకోవాలనుకుంటుంది ఇలాంటి వాళ్ళే మాల్స్ లోకి వెళ్లి అక్కడ రంగుల ప్యాకింగ్ ల వలలో చిక్కుకుని పర్స్ లు ఖాళీ చేసుకు వచ్చి తర్వాత కూర్చుని లెక్క చూసుకుని గుక్క పట్టి ఏడుస్తుంటారు అనుకుంది పద్మ మనసులో
ప్రతి రోజూ ఇట్టా చేస్తే కష్టం తల్లీ. ఇలా గంపంతా తిరగేస్తే ఎట్టా అమ్ముకోవాలి? ఏదో రమేష్ గారు మంచాడు అని ఇచ్చిపోతా ఉంటాను అంటూ..చెపుతూనే నా వైపు తిరిగి పైన వాళ్ళందరిని కేకేయి తల్లీ.. నేను తొందరగా పోవాలి..పిచ్చిది ఒకటే ఉంది..అసలే కొత్త బొమ్మ జనాలు ఎక్కువ ఉండారు అంటుంది పద్మ గొంతెత్తి..గట్టిగా రమణా, లక్ష్మీ ,వాణి గారు, అమృత గారు,పాపక్క అంటూ పై భాలాలో వారిని,ప్రక్క భవనంలో నివాసముంటున్న అందరిని పిలుస్తుంది .
ఇష్టమైన వాళ్ళందరూ.. పద్మని మొక్కజొన్న పొత్తులు తీసుకుని ఉంచమని చెపుతారు. కావాలని చెప్పిన వాళ్ళందరికీ తీసుకుని డబ్బులు ఇచ్చేసి పంపుతుంది . తర్వాత వీలున్నప్పుడు ఒక్కొక్కరే వచ్చి వాళ్ళకి తీసి ఉంచిన కండెలు పట్టుకు వెళతారు. ఆ ముసలి అవ్వ అన్నటే ఆ ఇంటి వద్దనే తన గంప అంతా ఖాళీ అయిపోతుంది.
ఈ ముసలి అవ్వ..చాలా గట్టిది మనం ఇక్కడ తీసుకుంటే..పచ్చిపోత్తులు పది రూపాయలకి నాలుగు ఇస్తుంది.మనం ఆమె దగ్గరికి వెళితే నిప్పుల మీద కాల్చిన కండె ఒక్కోటి పది రూపాయలు అమ్ముతుంది అంది. . నిజానికి ప్రతి వ్యాపారస్తుడు చేసే పనే అది.తన దగ్గరికి వచ్చిన కొనుగోలు దారుడి పై అధిక బరువు వేసి లాభం గుంజుకోవాలని చూస్తుంటాడు. కొనుగోలు దారుడు ఎక్కడ తక్కువకి లభ్యమవుతుందో తెలిసి కూడా తనకి అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఎక్కువ పెట్టి కొనుక్కుకుని తీరతాడు..
మా ఇంటి ప్రక్కనే రెండు సినిమా హాళ్ళు.ఎప్పుడు కొత్త సినిమాల ప్రదర్శనలో హాళ్ళు కిట కిట లాడతాయి. హాలుకి ముందు భాగంలో మెయిన్ రోడ్ కి అవతలి ప్రక్క బస్సు స్టాప్ ప్రక్కనే ఉన్న చెట్టు క్రింద ఈ ముసలి అవ్వ నిప్పుల కుంపటి పెట్టుకుని మొక్క జొన్న పొత్తులని కాల్చి అమ్ముకుంటూ ఉంటుంది. ఆమెకి సాయంగా ఆమె కూతురు . ఆ కూతురు.కాస్త అమాయకంగా ఉంటుంది.సినిమాకి వచ్చే జనం తక్కువ అయినప్పుడూ తన బేరం బాగా సాగనప్పుడూ..ఉన్న సరుకు అంతటిని గబా గబా గంప కెత్తుకుని మా కాలనీలో తిరిగి అమ్ముకుని వెళుతూ ఉంటుంది. ఆ ముసలి అవ్వకి దగ్గర దగ్గర డెబ్బయ్యి ఏళ్ళు ఉంటాయేమో!కాస్త పొట్టిగా,ఓ..మాదిరి లావుగా..ఉన్నా చక చకా నడుస్తూ..అమ్ముకుంటూ ఉంటుంది. ఆమెకి మించిన జీవన స్ఫూర్తి నాకు ఎవరిలో కనబడలేదు.
కొన్నాళ్ళ క్రితం ఈ ముసలి అవ్వ చాలా కాలం రావడం మానేసింది.నాలుగైదు నెలలు తర్వాత ఇంటి గేటు ముందు నిలబడి..పద్మ ని పిలుస్తూ ఉంది. పద్మ బయటకి వచ్చి . చూస్తే కళ్ళకి నల్ల కళ్ళద్దాలు వేసుకుని కనబడింది. ఈ మధ్య అసలు కనబడటం లేదు ఎందుకని అవ్వా..అని అడిగింది..
ఎక్కడ రాను బిడ్డా !.. కంటికి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నాను. పొయ్యి దగ్గరకి వెళ్ళవద్దు,బరువు నెత్తికి ఎత్తవద్దు అన్నారు డాక్టర్ గారు. అందుకే రావడంలేదు.అంది.
మరి బేరం చేయడం లేదు కదా .. నువ్వు క్రూచునే చోట ఇంకొకరు బండి పెట్టేసారు.ఇక అక్కడ నీకు బేరం ఏం సాగుతుంది ఇల్లు ఎట్టా గడుస్తుంది? మీ అమ్మాయి ఉంది కదా.. ఆమ్మాయిని పెట్టుకుని కూర్చోక పోయావా? అడిగింది పద్మ .
“అయ్యో! ఆ పిల్ల మంచిది అయితే నాకు ఈ కష్టం ఎందుకు? చెప్పిన మాట వినదు. హోటల్ కాడ పని చేసేయడానికి కుదిరింది. ఆళ్ళు ఈళ్లు తిన్న ప్లేటులు,తాగిన గ్లాసులు కడుక్కునే ఖర్మ నీకెందుకే..నాలుగు కండెలు కాల్చుకుంటే రోజు వెళ్లి పోద్ది అంటే ఊరుకుంటుందా..దానికి ఏది తోస్తే అదే చేసిద్ది. ఇనదమ్మా..అందుకే నాకు ఈ బాధ” అంది.
ఏమన్నా డబ్బులు కావాల్నా..? ఓ..వంద రూపాయలు పట్టుకుని వెళ్ళు.లే!.తర్వాత బేరం చేసేటప్పుడు అప్పు తీర్చేద్దువు ..అని చెప్పి . అంత కన్నా ఎక్కువ ఇచ్చినా తిరిగి ఇస్తుందో..ఇవ్వందో.. అన్న అనుమానం కల్గింది ఏమో ఇంకా ఎక్కువ తీసుకో అని అనలేక పోయింది..
ఓ..వంద రూపాయలు డబ్బులు, కాస్త పచ్చడి,ఓ,,రెండు అరటి పండ్లు ఇచ్చి రేపు మీ అమ్మాయిని రమ్మను. పాత చీరలు అన్ని ప్రక్కన పెట్టి ఉంచాను అని చెప్పింది.. అట్టాగే తల్లీ..ఇలా నాలుగు ఇళ్ళకి వెళ్లి నా పరిస్తితి చెప్పి నాలుగు డబ్బులు తెచ్చుకుని ఓ..రెండు నెలలు గడుపుకోవాలి..అంది
ఇంకా ఈ అమ్మాయి తప్ప నీకు పిల్లలు ఎవరు లేరా ? పద్మ ప్రశ్న .
“ఇంకా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పిల్లలు చిన్నప్పుడే మా ఆయన చచ్చి పోయాడు.తాళి తీసి పడేసి గంప నెత్తికి ఎత్తుకున్నాను. కూరగాయలు అమ్మాను, ఉప్పు చింతపండు అమ్మాను. ఆఖరికి ముప్పయి ఏళ్ల నుండి ఇలా మొక్క జొన్న కండెలు అమ్ముకుంటూ ఉండాను అంది.
ఏంటి? ముప్పై ఏళ్ల నుండా అంది పద్మ ఆశ్చర్యంగా . మరి ఏమనుకున్నావ్ బిడ్డా .భూమి పుట్టినప్పటి నుండి ఇక్కడి క్కడే తిరుగుతున్నాను అంది.
అప్పుడు దాక వింటూ ఊరుకున్న పద్మ అత్త గారు..అవును..నా చిన్నప్పుడు నుండి చూస్తూనే ఉన్నా, ఇలా తిరిగి అమ్ముకుంటూ ఉంటుంది అంది. పద్మ అత్తా గారికే తెలుసు అంటే ఈ ముసలి అవ్వ కి ఎనబై ఏళ్ల పైమాటే అనుకుని “మొత్తానికి మహా గట్టిదానివే “అంది. ఆ మాటలకి సంతోషంగా నవ్వుకుంటూ .
“ఏం చేయను తల్లి ..బతికే దారి ఎదుక్కున్నాను. ముగ్గురు ఆడపిల్లలు. ఈడు వచ్చిన ఆడపిల్లలని ఇంటో పెట్టుకుని ఏం కాపాడుకుంటాం. చదువులు చదివిచ్చే ఓపిక లేక చిన్నతనం లోనే పెళ్ళిళ్ళు చేసేసాను.చిన్నతనంలో కాపరాలు చేసుకోవడం చేతకాక ఇద్దరూ బిడ్డలని ఏసుకుని నా కాడికే వచ్చి పడ్డారు.ఇద్దరికీ చెరో మగ పిల్లాడు ఉన్నారు. వాళ్ళని నేనే పెంచుకుంటూ.. మళ్ళీ ఆ కూతుళ్ళకి పెళ్లి చేసాను.మనుమలిద్దరిని ఎంతో కష్టపడి పెంచాను. చదువు లు అబ్బలేదు కాని..ఇద్దరూ టాపీ మేస్త్రీలు అయ్యారు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాను బందరు కాలువ కట్ట మీదే గట్టి ఇళ్ళే కట్టుకున్నారు. వాళ్ళకి బిడ్డలు. ఇప్పుడు పెద్ద మనుమడి కూతురు..నూజివీడులో ఇంజినీరు చదువు చదు వు తా ఉంది. ఆ అమ్మి కి బస్ పీజు కట్టాలి.అసలు ఆళ్ళ నాయన అంత డబ్బులు కట్టి నేను చదివిన్చాలేను అన్నాడు. చదువు మూడో నేత్రం రా.. వెర్రి ముండా కొడుకా..చదువు సంధ్యలు లేకపోబట్టీ కదా మనమందరం ఇట్టా ఉండాం . మీ పిల్లకాయలని అయినా చదివీయకపోతే ఎట్టారా .అని ఆడిని నాలుగు కూకలేసి..నువ్వు చదివీయకపోతే పోనే..నేను చదివిచ్చుకుంటాను బిడ్డని అని చెప్పాను. ఆ అమ్మికి పీజులు,పుస్తకాలు,ఈడ నుండి ఆడకి తీసుకు వెళ్ళే బస్ పీజులు అన్నీ నేనే కడతాను అని చెప్పింది.
ఇంకా నువ్వెందుకు కష్టపడటం మేము అందరం నీకొక ముద్దా పెట్టలేమా..? ఇంట్లో పడి ఉండు అంటారు మనవళ్ళు. మరి ఈ పిచ్చిదాన్ని ఎవరు చూస్తారు.. తల్లీ! ఈ పిల్ల నా భాద్యత కాదా! కాలు చేయి బాగా ఉన్నన్నాళ్ళు కష్టపడాలి.కాసిని డబ్బులు పోగేసి.. ఏ అనాధ శరణాలయం కి ఇస్తేనో..కదా . నేను చచ్చినాక ఈ పిల్ల దాన్ని చూస్తారు అని చెప్పింది.
ఏ చదువులు నేర్పని గొప్ప జీవిత ఆర్ధిక సూత్రం, మనిషి తత్త్వం
వింటున్న పద్మకి తల తిరిగి పోయింది. కన్న బిడ్డలని పెంచడానికే నానా తంటాలు పడుతూ.. జీవితమంతా వీళ్ళ కోసమే అరగదీసుకుంటున్నాను అనుకునే తల్లి దండ్రులని చూసే కాలమిది.ఒక్క బిడ్డని పెంచడానికే నా నా అవస్థలు పడుతున్న నీరస,భీరువ తరం ఇది. ఒంటి చేత్తో..తన పిల్లని,మనుమలని, ముది మనుమరాళ్ళ గురించి కూడా శ్రమిస్తూ.. ఉన్న ఆ ముసలి అవ్వ అంటే పద్మకి గౌరవం ఏర్పడింది. పద్మ తన గురించి తానూ ఆలోచించుకోవడం మొదలెట్టింది..
చేసే పని తక్కువ..అలసట ఎక్కువ
జస్ట్ 45 కే జీవితం అంటే ఇంత నిర్లిప్తత ఎందుకు? రోజు ఒకేలా జీవితం వండటం,పెట్టడం,ఏదో తిన్నాను అనిపించేలా తినడం .అంతే!
తన ఫ్రెండ్ ఒకరు అంటూ ఉంటారు. మనం చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయలేకపోయినా కనీసం తినేట ప్పుడైనా ఇష్టంగా, ప్రియంగా తినడం నేర్చుకోవాలి. అప్పుడే తిన్న ఆహారం కి విలువ వస్తుంది మనిషికి ఆరోగ్యం వస్తుంది అని. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. అనేకన్నా అనారోగ్యంగా ఉన్నానని భావించడం తనలో ఉన్న నీరసం కి కారణం అదేనేమో!
అమ్మయ్య ! ఎలాగోలా నా భాద్యత తీరింది. పిల్లలని పెంచాను. వాళ్ళు మంచి విద్యావంతులై వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబదగల్గి ఉన్నారు. ఉన్నవి చేజార్చుకున్నందుకు ఉక్రోషం మినహా . మళ్ళీ క్రొత్తగా సంపాదించుకోవాలన్న తాపత్రయం లేదు. “చస్తూ ఏమన్నా కట్టుకు పోతామా!? ఒకరిని మోసం చేయకుండా, ధర్మంగా సంపాదించుకుని అవి చాలక పొతే ఉన్నవి అమ్ముకుని ఎలాగోలా బిడ్డలని పెంచుకున్నాం. ఈ కాలంలో ఎంత కష్టపడ్డా నిత్యావసరాలే తీరడం లేదు. ఇక ఆస్తులు కూడా బెట్టాలి అంటే అవినీతి మార్గంలో వెళ్ళాలి. అది నాకు అసలు చేతకాదు.అనుకుంటూ ఉంటాను.
అలాగే .ఏదో ఉన్నదానితో కాలక్షేపం చేస్తూ కృష్ణ రామా అనుకుంటూ కాలం గడిపేయడమే అనుకుందామా అంటే అందుకు మనసు ఒప్పుకోదు . ఏదో చేయాలని ఆరాటం. కాలు బయటకి కదిపి ఏమి చేయలేని అసక్తత. ఏ పని చేయాలన్నా అనుమతి కావాలి. మనసులో ఉన్న మాటలు చెపితే.. ఒకోసారి మృదువుగా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను సంపాదిస్తున్నాను.పిల్లలు సంపాదిస్తున్నారు.ఇక ఇప్పుడు నువ్వు చేయాలా హాయిగా రెస్ట్ తీసుకోక అని ఒకోసారి, మళ్ళీ ఇంకోసారి అడిగితే ఆ చేసావులే ! పెట్టావులే! అవన్నీ చేసేముందు.. ఇంట్లో వంట పనులు, ఇంటి పనులు చేసి అప్పుడు ఖాళీ ఉంటె బయట ఉద్యోగం చేద్దువు గాని అనే చెళ్ళు మనే మాటలు శూలాల్లా గుచ్చుకునేయి.
తన కోసం తను బ్రతికిన క్షణాలు ఏవి తనకి మిగిలేలా ఉంచని కుటుంబం పట్ల జీవితం పట్ల .వైరాగ్యం కల్గింది.
ఎక్కడ పని అక్కడే ! వంట ఇంట్లో శుభ్రం చేయని గిన్నెలు, బార్దేడు పొద్దెక్కినా శుభ్రం చేయని ఇల్లు, కుర్చీలో లుంగలు చుట్టి విసిరివేయబడ్డ ఉతికిన బట్టలు తనలో పెరిగిపోతున్న బద్ధకం కి గుర్తులు మాత్రమే కాదు..జీవితాన్ని జీవించడం పట్ల ఉన్న అనాసక్త కి కారణం కూడానేమో! ఎంతసేపని పుస్తకాలు చదువుతూ,టీ .వీ చూస్తూ, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకు బలవంతంగా ఈడుస్తూ గడపడం?
తనకి శరీరానికి కాదు అనారోగ్యం మనసుకి. మనసుకి ఉన్న అనారోగ్యం వదిలితే తప్ప తనలో ఉత్సాహం రాదు అనుకుంది.
విధి వంచించి భర్త ని దూరం చేసినా జీవిత కాలమంతా ఒంటి చేత్తో కష్టపడుతూ.. ఎనబై ఏళ్ళ ముదుసలి కూడా అంత ఆత్మ విశ్వాసంగా బ్రతకడం గురించి చెప్పినప్పుడు చదువుకుని తెలివితేటలూ కల్గిన తను ఖాళీగా కూర్చోవడం అంత సిగ్గు చేటు ఇంకోటి లేదు. అందరూ డబ్బు కోసం,అవసరాల కోసం పని చేయాలన్న రూల్ ఏమి లేదు.. అభిరుచి మేరకు పనులు చేయాలి. చేసే పని మనసుకు సంతృప్తి కల్గించాలి. అదే మనిషికి,మనసుకు ఆరోగ్యం కూడా అనుకుని.. వేసుకున్న ముసుగు లో నుండి బయటకి వచ్చి శ్రమించడానికి సిద్దపడింది
నెమ్మదిగా తనలో నిదురించిన శక్తిని మేలుకొలిపింది.కుట్టు మిషన్ ని దుమ్ము దులిపింది. వరండాలోకి మిషన్ జేర్చింది. కుట్టు పని చేయడం మొదలెట్టింది. నెమ్మదిగా ఆమె చుట్టూ నలుగురు చేరడం మొదలెట్టారు కుట్టుపనికి ఉన్న డిమాండ్ దృష్ట్య ఆ ఇంటి గుమ్మం లో నుండి రాక పోకలు ఎక్కువైనాయి. తనలా ఉబుసు పోక కూర్చున్న ఇంకో ఇద్దరినీ చేచుకుంది. అక్కడొక టైలరింగ్ కం ఎంబ్రాయిడరీ షాప్ వెలిసింది. తన లో ఉన్న సృజనాత్మకత కలగలిపి అక్కడ రంగుల హరివిల్లు ప్రత్యక్షమైంది తన స్వయంసంపాదన మొదలయ్యాక తనలో జీవ కళ నిండుకుంది. ఒకరిపై ఆధార పడి బ్రతికే బ్రతుకులో స్వేచ్చ ఉంది. స్వాతంత్ర్యం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితేచ్చ ఉంది. ఆ జీవితేచ్చ లేకుండా కాకిలా కలకాలం బ్రతికి ఏం ప్రయోజనం అని కూడా అనుకుంది బ్రతికిన అన్ని నాళ్ళు కాలేకపోయినా కొన్నాళ్ళైనా జీవితం ని జీవించడం ముఖ్యం అనుకుంది.పద్మ.
ఇంటిల్ల పాది తమకి తగని పని పరువు తక్కువ పని చేస్తున్నావని మానేయమని ఒత్తిడి పెట్టారు. అయినా వెనుకడుగు వేయలేదు.
ఈ పద్మ కి ఏమొచ్చింది? పిల్లలు బాగా సంపాదించడం మొదలెట్టాక ఈమెకి ఆశ మొదలయినట్టు ఉంది. వెళ్ళిన వాళ్ళతో అయిదు నిమిషాలు కూడా మాట్లాదలేనంత తీరిక లేకుండా సంపాదన యావలో పడింది అనే మాటలు వినబడుతున్నా విననట్లు నటించింది.
తన కుటుంబం కోసం ఇన్నాళ్ళు శ్రమించింది. ఇకమీదట ఇతరుల కోసం కొంచెమైనా సాయం చేయడం కోసం కష్టపడాలి. అని ఆమె తీసుకున్న దృఢ సంకల్పం ముందు..ఇంట్లో వారి వ్యతిరేకత, పదుగురి మాటలు గాలిలో కలసిపోయాయి.
శ్రమించడంలో ఎంత అర్ధం ఉంది. శ్రమ సంపదని సృష్టిస్తుంది.ఆ సంపదని తన కోసం,తనవారికోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం కూడా ఉపయోగించడం అనే ఆలోచనలో ఉత్సాహం వస్తుంది.
“పరోపకార్థం ఇదం శరీరం అంటారు.” మనిషిగా తోటి మనుషులకి చిన్న మెత్తు సాయం అయినా చేయగలగడం సంతృప్తిని ఇస్తుంది. ఆత్మ సంతృప్తి అనేది మత్తు మందు లాంటిది దానికోసం కొన్ని కొన్నిటిని పట్టించుకోవాల్సిన పనిలేదు అనుకుంది.
పద్మ తనలో నూతన ఉత్సాహం మేల్కొలిపిన ముసలి అవ్వకి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటుంది.*
-వనజ వనమాలీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to జీవితేచ్ఛ …