”అమ్మా నన్నెందుకు ఇన్ని కష్టాలలోకి తోసారు పెళ్లి పేరుతో… ఈ పల్లెటూర్లో నాకు మతి పోతోంది…
మనుషుల్లో అస్సలు నాగరికత లేదు..
మా అత్తగారు ఎప్పుడూ గొడ్డు గోదా, పాలేళ్ళూ , పచ్చళ్ళూ ఏమిటో?
ఈ గొడవ నాకర్థం కాదు కావాలంటే నేను డైరెక్ట్ గా రాజేష్ దగ్గరకు అమెరికా వెళ్తాను..
కానీ ఆ పల్లెటూరుకు మాత్రం చస్తే వెళ్ళను”.ఆశాలత ఏకబిగిన తన అత్తింటి కష్టాలన్నీ తల్లికేకరువు పెట్టింది.
‘సరే.. ! నీవు మాకు బరువా? నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉండు’ అంది విమల .
ఆశాలత ముఖమంతా వెలిగిపోయింది. అంత క్రితం తల్లితో మాట్లాడినప్పుడు ఉన్న దు:ఖమంతా ఎగిరిపోయింది.
తన గదిలోకి వెళ్ళి టి.వి ఆన్ చేసుకుంది.
*** *** *** ***
“చూశారా..!! మీ కూతురికి ఆ పల్లెటూరి వాతావరణం పడటం లేదట. ఇంతకు ముందే వచ్చింది. తన గదిలో
ఉంది. “ భర్తతో అంది విమల.
“నిజమే ఇన్నాళ్ళూ సిటీ లో పెరిగిన పిల్ల.. ఎట్లా సరిపడుతుంది అక్కడ మనకున్నది ఒక్కగానొక్క కూతురు…
అదక్కడంత ఇబ్బంది పడనవసరం లేదు.
ఏదో కుర్రాడు అమెరికాలో ఉంటున్నాడని, బాగా ఉన్నవాళ్ళని ఇచ్చాం కానీ, ఆ పల్లెటూళ్ళో పడుంటానిక్కాదు.
ఆ అబ్బాయితో నేను ఫోన్లో చెప్పేస్తాను.
అమ్మాయిని నీ దగ్గరికి పంపుతాం కానీ మీ ఊరికి కాదు అని… “ అంటూ…
అమ్మడూ, అమ్మా… ఆశలూ, ఎక్కడ్రా తల్లీ అని పిలుస్తూ వెళ్లాడు కూతురి దగ్గరికి…
విమలకు కొంచెం భయమనిపించింది. ఇదేమిటి కూతుర్ని మందలిస్తాడనుకుంటే వెనకేసుకొస్తున్నాడు.
ముందు ముందు అత్తింటి వాళ్ళతో గొడవలేమీ రావు కదా.. ! అనుకుంటూ పనిలో పడింది.
*** *** *** ***
అశ పుట్టింటికొచ్చి నెలైపోయింది. ఏ రోజుకారోజు తల్లి వండి పెడ్తుంటే కూర్చుని తినడం, టి.వి చూడటం, బాగా నిద్ర పోవడం,
లేదంటే ఫ్రెండ్స్ తో గంటలు గంటలు సెల్ ఫోన్ లో సంభాషణలు, మధ్య మధ్యలో సినిమాలకెళ్ళడం…
అత్తగారు ఫోన్ చేసి ఆరోగ్యం గూర్చి అడిగితే.. ఇంకా బాగులేదంటం…
భర్త ఫోన్ చేసినప్పుడు లేని నీరసం తెచ్చుకుని మెల్లిగా మాట్లాడటం…
*** *** *** ***
“అమ్మా ! ఈ రోజేనా అమ్మమ్మ వచ్చేది??” ఉదయమే నిద్ర లేస్తూనే అడిగింది ఆశ..
“అవును ఈ రోజే.. అయినా ఓ పక్క కూర్చోక ఎందుకే ఈ ముసలావిడకు ఈ ప్రయాణాలు…??
విసుక్కొంది కమల…
“ అమ్మమ్మకు చాలా ఓపికమ్మా.. ! చిన్నప్పుడు ఎన్ని కథలు చేప్పేదో… !
ఎన్ని రకాల స్వీట్లు చేసేదో ఇప్పుడా ఓపిక ఉందా?”
“ ఆ ఎందుకు లేదూ ఈవిడకు చచ్చేవరకూ ఉంటుందిలే… “ హేళనగ అంది విమల…
మరో గంటలో ఆశ ఎదురుచూస్తున్న అమ్మమ్మ రానే వచ్చింది… ఆటో లో నుండి సూట్ కేసు, పెద్ద సంచి దించుతూ…
“ అమ్మమ్మ వచ్చావా” అంటూ ఎదురెళ్ళి చేతిలో సూట్ కేసుతీసుకొంది.
కూతురితో, మనవరాలితో… కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడింది రాజేశ్వరమ్మ…
తన ప్రయాణం వగైరా ముచ్చట్లన్నీ చెప్పింది.
“అయితే అమ్మమ్మా!.. నువ్వు హైద్రాబాద్ వెళ్ళి అట్నుంచి నెల్లూరు అట్నుంచి విశాఖ…
మొత్తం ఆంథ్ర దేశమంతా తిరుగుతున్నావా? నీకు ఈ ప్రయాణాలంటే విసుగులేదా?
నాకా రైళ్ళు బస్సులు తల్చుకుంటేనే చిరాకేస్తోంది..” అంది ఆశ.
“ఏదో పాతకాలం మనుషులమమ్మా…! ప్రయాణంలో ఉన్న కష్టం కంటే అయిన వాళ్ళని చూశామన్న ఆనందం
బాగుంటుంది…! “
“ఏమో నీ పిచ్చి” అంటూ ఆశాలత తన గదిలోకి వెళ్ళింది..
రాజేశ్వరమ్మ వంటగదిలో కూతురికి సాయం చేస్తోంది.. మనవరాలి సంగతి అడిగింది మథ్యలో…!
ఒక్క నిమిషం కూర్చోకుండ ఏదో ఒకటి చేస్తూనే ఉంది .. ఒకటికి నాలుగు రకాల కూరలు పచ్చళ్ళూ చేసింది…
భోజనం టైమ్ కి వచ్చి బల్ల దగ్గర కూర్చున్న మనవరాలికి ఎంతో ఆప్యాయంగా అన్నీ వడ్డించింది.
“ఓహ్… ఇన్నెప్పుడూ చేశావ్ అమ్మమ్మా…! “ అంటూ బాగా ఎంజాయ్ చేస్తూ, మెచ్చుకుంటూ తింటుంది మనవరాలు..
కూతురు విమల కేసి చూస్తూ అడిగింది రాజేశ్వరమ్మ…
“రోజంతా నీ కూతురు ఆ గది లోనే ఆ టి.వి దగ్గరే కూర్చుంటుందా ఏం?”
మరేం తోస్తుందమ్మా.. ఏదో చిన్న పిల్ల సరదాగా సినిమాలు అవి ఇవీ చూస్తుంటుంది..”
“చిన్నపిల్లా..? అసలు నీకు పనిలో ఏ విధమైన సాయమూ చెయ్యదా? పోనీ నీవేమైనా పని చెబుతున్నావా?
ఒళ్ళు అలవకుండ కూర్చోవడం మంచిదేనా? చెప్పు..! నువ్వు ఆ వయసులో ఎంత పనిచేసావ్..?”
“మేమంటే అంతమందిమి ఉండే వాళ్ళం… ఇప్పుడు దానికేం అవసరం.. చెప్పమ్మా..
మొన్న నాకు జ్వరం వచ్చినా దాన్ని ఇబ్బంది పెట్టలేదు..
క్యారేజీ తెచ్చుకుని తిన్నారు… తండ్రీ కూతుళ్ళు…
ఏదో గడిచిపోతోంది కదా.. ఇప్పుడు కష్టపడి అది వండి వార్చాలా ఏమిటి? “
“ అమ్మమ్మా నీకున్నంత ఓపిక నాకు లేదు.. హైద్రాబాద్ వెళ్లావు.. అట్నుంచి నెల్లూరు… మళ్ళీ ఇటు వైజాగ్…
ఎందుకలా తిరుగుతావు?
నాకు మీలాగా కష్టపడి పని చెయ్యాల్సిన అవసరం లేదు..
ఇవ్వాళ రకరకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి.. రేడీమేడ్ ఇడ్లీ, వడ, దోశ, ఖీర్… ఏది కావాలంటే అది చేసుకోవచ్చు..క్షణాల్లో…
అయినా నేను ఉండబోయేది అమెరికాలో.. కావాలిసినన్ని రకాలు హాయిగ తినొచ్చు… కారులో తిరగచ్చు…
ఎందుకివన్నీ నేర్చుకోటం..?
దండగ… అది సరే… మళ్ళీ ఇక్కడనుండి ఏ ఊరికీ ప్రయాణం..?” వ్యంగ్యంగా అడిగింది ఆశాలత..
“నీకంత హేళనగానే ఉంటుందమ్మా…!
భగవంతుడు నాకు ఐదుగురు బిడ్డలనిచ్చాడు… నా శరీరంలో ఓపికున్నంతవరకూ.. నా బొందిలో ప్రాణమున్నంతవరకూ..
నా బిడ్డల కష్ట సుఖాల్లో నేను పాలుపంచుకోవలసిందే… తప్పదు..
ఇది నా బాథ్యత… మీ పెద్ద మామయ్యకు బైపాస్ సర్జరీ అయ్యింది..
అక్కడ పెద్ద తలకాయ నేనుండటం తో వాళ్ళు ఎంత సంతోషించారో…
ఇంతలో పెద్దమ్మ వాళ్ళ ఆయనకు స్కూటర్ యాక్సిడెంట్ అయ్యింది..
అటు పరిగెట్టాను.. నేనుండటం వల్ల పెద్దమ్మ ఎంత సాయంగ ఉందో అని సంతోషించింది..
మిమ్మల్ని చూసి ఇట్నుంచి మీ చిన్న మామయ్యని చూడటానికి రాజమండ్రి వెళ్లాలి…
అక్కడ కొన్నాళ్ళుండి మీ పిన్నికి ఆ మథ్య జ్వరం పడి నీరసంగా ఉందట…
భీమవరం వెళ్ళి దాని దగ్గర ఓ నాల్రోజులు ఉంటాను.. ” రాజేశ్వరమ్మ చెప్పింది.
“అమ్మా… ఇంతమందికి ఇన్నిన్ని సమస్యలున్నాయ్… ! అన్నీ నీవే అనుకుంటూ ఇన్ని చోట్లకి ఎట్లా తిరుగుతున్నావ్?
అందరికీ ఏదో సాయం చేస్తున్నావు! నాకీ ఆశ వచ్చిందగ్గర్నించీ దిగులు.. దాని సంసారం ఏమౌతుందో అని.. ”
విమల కన్నీళ్ళు పెట్టుకుంది..
“ విమలా నీకున్నది ఒక్క బిడ్డ..! ఒక్క సమస్యకే తల్లడిల్లి పోతున్నావ్… నాకు అయిదిగురు బిడ్డలు..
అందరికీ ఏదో విథమైన ఆరోగ్య సమస్యో.. ఆర్థిక సమస్యో ఉంది..
అందుకని దిగులు పడుతూ కూర్చుంటామా..? మీ నాన్నగారు మీ చిన్నతనంలోనే కాలం చేశారు..
అయినా అందరికీ చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు.. పురుళ్ళు.. పుణ్యాలు అన్నీ చేసుకుని రాలేదా..?
ఈ రోజుకి ఆ భగవంతుడి దయ వల్ల పిల్లలందరికీ “ అమ్మ ఉందనే” ధైర్యాన్ని చెక్కుచెదరకుండా చేసుక వస్తున్నాను..
ఒక వేళ.. నేను లేకున్నా ఏదీ ఆగదు..
కానీ నేనున్నంతకాలం.. నా బాథ్యత నేను నెరవేర్చాననే తృప్తి నాకుంది..
అంతే కాదు మన వారిని మనం ప్రేమించే గుణముండాలి… మన థర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామనే..
థ్యాస ఉంటే శక్తి దానంతట అదే వస్తుంది..
నీ కూతురు అత్తగారిల్లు పనికి రాదంటే భార్యా భర్తలిద్దరూ వంత పాడ్తున్నారు..
ఈనాటి పిల్లలకి కుటుంబమంటే ఏమిటో తెలీదు.. భార్యాభర్తలు మాత్రమే అనుకుంటారు కుటుంబమంటే..!
భర్త ఒక్కడుంటే చాలు తక్కిన వారవసరం లేదనుకుంటారు..
అందరినీ కలుపుకు పోయే ఓర్పు, శక్తి, సామర్థ్యం ఉండాలి.. ఒక వేళ దానికి తెలీకపోతే నీవు చెప్పాలి..
రేపు అమెరికా వెళ్తే ఇది డాలర్లు చూడగలదేమో కానీ నా వారనే వారిని అక్కడ చూడగలదా.. ?
ఆ అబ్బాయి దీని చేతి వంట తినాలని ఎదురుచూస్తున్నాడేమో.. ??
నీవేమైనా నీ కూతురితో ఇట్టాంటి విషయాలు మాట్లాడావా?
ఎంతకీ గారాబంగా చూడటం.. అడిగినది కొనివ్వడం… ఇంతేనా నీ బాధ్యత… ఇది మంచిది కాదు.. “
అమ్మమ్మ అలా చెప్పుకు పోతుంటే ఆశకి తన ప్రవర్తనలో ఏదో తప్పున్నట్లు అనిపించింది.
విమల కూడా ఆలోచనలో పడింది..
పక్క గదిలో నుంచి అంతా వింటున్న అల్లుడికి అత్తగారి మాటల్లో నిజమేదో ఉందనిపించింది..
అమ్మమ్మ … అత్తింటితో తెగిపోతున్న తన అనుబంథాన్ని తిరిగి ముడివేసే ప్రతినిధి లా కనిపించిది ఆశకి.*
- డా.విజయ బక్ష్


















కధ చాల బాగుందండి. ఇంట్లో పెద్దవారు ఉండాల్సిన అవసరాన్ని కళ్ళకు కడుతుంది. మీ శైలి కూడా చాల బాగుంది. పిల్లల్ని అతి గారాబం చేసి పెంచుతున్న వారందరూ తప్పకుండ చదవాల్సిన కధ. మనం నాగరకిత అనుకుంటున్నాం ఏమో పిల్లలకు కనీసం వారి సొంత పనులు కూడా సరిగ్గా చేసుకోవటానికి ఇబ్బంది పడే స్థితిలో వాళ్ళను పెంచుతున్నాము. ఇవన్నీ మంచి పరిణామాలు కావు మరి.
చాలా బాగుందండీ 1
చాలా బాగుంది, ఇంతేనా ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది…..
కధ చాలా బావుంది.నిజంగా ఈ నాటి సమాజంలో అందరితో కలిసి మెలిసి సయోధ్యతో బ్రతకటం లోని ఆనందం తెలియటం లేదు.ఇలా వుండటం వల్ల వారికి పుట్టిన పిల్లలకు కూడా అత్తా,బాబాయ్,నానమ్మ,తాత,పెదనాన్న అంటూ వుండే అనుబంధాలు ఆప్యాయతలు తెలియకుండా పోతున్నాయి.నేను నాది అనే స్వార్ధం తప్ప మనము అనే భావనే అడుగంటుతోంది. మళ్ళి మనకు ఆనాటి మమతలు,ఆప్యాయతలు కావాలంటే ప్రతి ఇంటిలోనూ ఇలా మంచి చెడులు వివరించి చెప్పే పెద్దల అవసరం ఎంతైనా వుంది.
కధ చాలా చాలా బావుంది.
మానవ సంబంధాలని అర్ధం చేసుకోవడానికి ఎంతో అనుభవం పరిణతీ అవసరం. ఆ రెండూ దండిగా ఉన్న పెద్దాలని మనం వృద్ధాశ్రమాలకి పంపేస్తున్నాం. అలా పంపడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామో మీ కథ చదివితే అర్ధం అవుతుంది. మంచి కథ.
చాలా బావుంది. ఈ కాలపు అమ్మాయిల , వాళ్ళ తల్లుల మనస్తత్వాన్ని చక్కగా చూపించారు.
చాలా బాగా వుంది