ఎంతెంతదూరం …

“పుట్టినరోజు శుభాకాంక్షలు …..  నువ్వు వంద పుట్టినరోజులు ఇలాగే ఆనందంగా జరుపుకోవాలి”

 అవతలనుంచీ అనురాగం నిండిన స్వరంతో , ఒక్కో అక్షరం వెతుక్కుంటూ అత్తగారు  తనకి శుభాకాంక్షలు అందజేస్తుంటే ,   ఫోన్ ని ఒద్దికగా చెవికి మరింత దగ్గరగా పెట్టుకుని  సంతోషంగా థాంక్స్ అని మాత్రం అనగలిగింది . కళ్ళెందుకు తడయ్యాయో …గొంతెందుకు పూడుకుపోయిందో అర్ధం చేసుకోలెకపోవడానికి తానేం చిన్నపిల్లకాదుగా ……రమకి ఈ రోజుతో  ముప్పై ఆరు  నిండుతున్నాయ్ .

“మీరెలా వున్నారు ….కాళ్ళనెప్పులూ అవీ….”తన మాటని మధ్యలోనే తుంచేస్తూ , “కొత్తచీర కట్టుకున్నావా ? దేవుడికి నైవేద్యం పెట్టి ……”.

“ఇంకా స్నానమే చేయలేదండీ  ఇదిగో పిల్లల్ని పంపించీ… “దానికి సమాధానంగా అత్తగారు ఏమంటుదో తెలిసే సందేహిస్తూ ఆగిపోయింది

  “ఊ…గొప్పపనే చేసావ్ లే.  ….రోజూ వుండే పనులేగా…వాడు లేచాడా . తలస్నానం చేసి, ఇంట్లో దీపం పెట్టుకున్నాకా …ఇద్దరూ కల్సి గుడికెళ్ళండి …..సినిమాలూ షికార్లూ అంటూ తిరగడానికయితే ఎవరూ చెప్పక్కరలేదు” . అభిమానంతో కూడిన మందలింపు. “మరి ఉంటాను …పొద్దున్నే తీరిగ్గా కబుర్లు చెప్పడానికి  కుదురుతుందా…అవతల మీ మావగారు కేకలేస్తున్నారు . కళ్ళు తెరిచేసరికి టీ గొంతులో పడిపోవాలి ….”….. “మావయ్య ఎలా …”తను మాట్లాడేది పూర్తవ్వకుండానే ఫోన్ కట్ అయింది. మావయ్యకి తెలీకుండా  ఫోన్ చేసారా ! ఎందుకంత కంగారుగా పెట్టేసారో అనుకుంది .

రమకి అత్తగారితో మరి కాసేపు మాట్లాడితే బావుండనిపించింది.

సరిగా ఒండుకు తింటున్నారా ? చేసే ఓపికలేక ఒక కూరతో రెండు పూటలూ సరిపెట్టేస్తున్నరా!  నే లేకుండా మీకు రోజంతా ఎలా పొద్దుపోతుందీ?ఒంట్లో బాగోనప్పుడు  కాస్త సాయానికి ఎవరైనా పలుకుతున్నారా ! పండుగలు, పూజలు వస్తే లంకంత కొంపకి బోల్డంత చాకిరీ చెయ్యాలి .వాళ్ళ కోరికలు తీర్చలేవే అంటూ ….బండెడు చాకిరీ మీదేసుకోకపోతే కాస్త చాదస్తం తగ్గించుకుని , ఎవరో ఒకర్ని  పనిలో పెట్టుకోకూడదూ. వాళ్ళేవన్నా మన ఆస్తులు రాయించేసుకుంటారా…మహా అయితే నాలుగు పాతచీరలు, పాత పచ్చళ్ళూ …. అంతేగా .  మిమ్మల్ని కూర్చోపెట్టి చేయాల్సినదాన్ని నా బాధ్యత వదిలేసి నాకేం పట్టనట్టు ఇలా దూరంగా పోవాల్సివచ్చింది.   . మీరు నమ్మరుగానీ, మిమ్మల్ని కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు ఏం చేస్తాం రోజులిలా వచ్చాయ్…  అని మనసు విప్పి తన ఆలోచన…అవేదన అంతా అత్తగారితో చెప్పుకోవాలనిపించింది

అత్తగారి సమక్షంలో జరిగిన తన పుట్టినరోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి. నిరుడేగా ….. అత్తగారి కాళ్ళకి నమస్కరిస్తూంటే ఆవిడ అక్షింతలు తలమీద ఉంచి   ధనధాన్యాలకి లోటులేకుండా  నూరు పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలి,” అని దీవించింది  . “అబ్బో …అత్తా కోడళ్ళ అన్యోన్యత  చూడ్డానికి రెండు కళ్ళూ చాలట్లేదు…. ఏం సెంటిమెంటు పండించేస్తున్నారు…ఏం నటించేస్తున్నారు” అని  అబ్బాయి  వేళకోళం ఆడుతుంటే , “ఏడ్చావులే అత్తకోడలు అన్యోన్యంగా  వుండకూడదా…..అదేదో ప్రకృతి విరుద్ధమైనట్టూ మాట్లాడకు అని, ” అయినా  మనసులో లేనిది ప్రదర్శించాల్సిన కర్మ మాకేం లేదు …..ఆ బుద్దులన్నీ మీ  మొగాళ్ళే  చూపిస్తారు” అని   కొడుక్కి, ఆ పక్కనే  కూర్చుని ఓరకంట ఇదంతా గమనిస్తూ మౌనంగా ఉన్న భర్తకి కలిపి అంటించిందావిడ.    “ఇద్దరికీ మళ్ళీ చెడినట్టుంది …”పైకి  కనిపించకుండా నవ్వుకుంది తను .

తన కట్టూ బొట్టూ ఎగాదిగా చూసి , “ఇంత కన్నా మంచి చీరల్లేవా….ఏం పిల్లవే….అన్నీ చెప్పాలి నీకు , పుట్టినరోజు పూటా కూడా అందంగా అలంకరిచుకోలేవా….లేనివాళ్ళు లేక బాధపడుతుంటే ..”.అంటూ బీరువాలో నగలు తీసుకొచ్చి మెడలో వేసి , తాను చిరాగ్గా మొహం పెట్టడం చూసి సాయంత్రం దాకా తీయడానికి వీల్లేదు అని   గదమాయించి వెళితే,   ఆరోజంతా పిల్లా.. ..పిల్లా……అంటూ భర్త వెంటపడిమరీ ఆటపట్టించడం , ఆ అల్లరి ఎక్కడ ఇంట్లో పెద్దల కంట పడుతుందోనని తాను కంగారుపడటం గుర్తొచ్చి, చిన్నగా నవ్వుకుంది

పెళ్ళయిన సంవత్సరం  “వచ్చేయేటికి పండండి బిడ్డకు తల్లివి కావాలి” అని మొదలైన ఆవిడ దీవెనలో మాటలు  సందర్భానికి తగ్గట్టూ సంవత్సరానికొకలా మారుతూ వచ్చాయి కానీ మమకారం మాత్రం అదే తీరుగా వుండేది .అటువంటి సదర్భంలో  వాళ్ళిద్దర్నీ అలా చూసినవారికెవరికైనా వాళ్ళు అత్తకోడళ్ళు అంటే నమ్మటం  కష్టం కావచ్చు .

అలా అని అత్తా కోడళ్ళు  ఏపొరపొచ్చాలూ లేకుండా , తల్లీ కూతుళ్ళులా , పాలూ నీళ్ళులా కల్సిపోయరని కాదు . అభిప్రాయబేధాలూ, ఆలోచనల్లో తేడాలూ…..లేకుండా పోలేదు .

ఇరవైనాలుగ్గంటలూ కలిసి మసలేచోట , ఒకరి కనుసన్నల్లో ఒకరు ఉండితీరాల్సినచోట ఇద్దరిమధ్య  ఎన్నెన్నో చిన్న పెద్దా  సంఘఠనలు, సంఘర్షణలూ జరగకుండా వుంటాయా.

దొడ్లో గులాబీ మొక్క ఏ పక్కన వేయాలో  ఇద్దరికీ తేలక నీకు నచ్చిన చోట పాతుకో ఫో…అని పనివాడిమీద విసిరేసి పోయారా .  హాల్లో బియ్యం మూటలేంటీ చిరాగ్గా అని కోడలు వాటిని కొట్టుగదిలో వేయిస్తే … “ఇవాళ మూటలు అడ్డయ్యాయి రేపు మనమూ అంతే చూసారా దీని పెత్తనాలు  ” అని భర్తముందు  బాధపడి ,  ఆ మర్నాడే ….మంచిపనే చేసావ్ దుమ్మూ దూగరీ లేకుండా  ఇల్లు  శుబ్రంగా  వుందిలే ఈ పని ఎప్పుడో చేద్దమనుకున్నాను . కానీ నా మాటెవరు వింటారని ఊరుకున్నాను అని సర్దేసుకున్నరా .

ఆనపకాయ పులుసు చేస్తుందనుకుంటే కూరొండి పడేసింది అంతా దీనిష్టమే అయిపోయింది అని అత్తగారు పళ్ళెం ముందు కూర్చుని సణిగినపుడు  , నీ కోడలు వంటెప్పుడు నేర్చుకుంటుందే అమ్మా…పుట్టింటికి రావాలంటేనే భయమేస్తుంది అని ఆడపడుచులు ఆమెకి వత్తాసుపలికినపుడు , నిన్నుకాదు తల్లీ…మీ అమ్మని అనాలి ఏం ట్రయినింగు అంతా నా కర్మ అని భర్త ఉత్తిపుణ్యానికే తనని కన్నవాళ్ళని అవమానించినపుడు ….ఆ బాధంతా ఆ క్షణానికి , లేదా ఆ రోజుకి పరిమితం చేసుకుని , మర్నాడు తెల్లవారుతూనే వంటింట్లో దూరి  వంటేం చేయమంటారూ అని అత్తగారివెంట పడేదా.

    పిల్లాడు గుక్క పెట్టి ఏడ్చిన ప్రతిసారి ,కారణం తెలుసుకోకుండా ” ఇదంతా దిష్టే” అని తీర్మానించేసి ఉప్పూ మిరపకాయలు పట్టుకు తయారవుతున్న అత్తగార్ని , చాల్ల్లెండి చాదస్తం…మీరూ మీ మూఢనమ్మకాలూ అని గసిరి పారేయాలనుకున్నా ….ఎందుకు లెద్దూ ఏదోటి అని ఆవిడని బాధపెట్టడం …..ఆవిడ నమ్మకాన్ని కాదనడం రెండు నిముషాలు కళ్ళుమూసుకుంటే సరి , తన  అభిప్రాయానికి భిన్నంగా నడుచుకోవాల్సి వచ్చిన ప్రతిసారీ ‘ ఈ సారికేలే ‘ అనుకుంటూ ఎన్నోసార్లు సర్దిచెప్పుకుంది కోడలు .

మీ కోడలు పుట్టింటినుంచీ ఏవేం తెచ్చుకుందీ అని పనీపాటాలేని వాళ్ళు ఆరాతీస్తుంటే  “అది తెచ్చుకునేదేంటీ…మాకేం గతిలేదా ” ఇంకోసారి ఈలాంటి పనికిమాటలు మాట్లాడకండి అని  గసిరేసి ,  అసలు విషయం దాటేసింది అత్తగారు .

 ఇంటికి చుట్టాలొస్తే ….నువ్వు  మిగతాపని చూడు  నే వంటచేస్తాలే అని గరిటలాక్కున్న అత్తగారిని మొదట్లో అపార్ధం చేసుకుంది …..రోజూ ఈవిడ వండుతుంటే నే కూర్చుని తింటున్నట్టు అనుకోవాలా అందరూ అని …..కానీ ఏ కాస్త చెయి జారినా  దాన్నే పట్టుకుని మిగతా మంచంతా వదిలేస్తారు ఈ మనుషుల తీరే అంత .  ఒక పక్క పిల్లలు పీకుతూవుంటే  శ్రద్దగా రుచిగా వండటం ఎంత కష్టమో  ఆవిడకి అనుభవంతో తెలుసుకాబట్టే ఆ భారాన్ని తనమీదనుండీ తప్పిస్తున్నారని  పోను పోనూ తెలుసుకుంది .

అత్తగారిమీద మావగారు కేకలేస్తుంటే …తనముందు ఆవిడ చిన్నబోవడం చూళ్ళేక పక్కకి తప్పుకునేది కోడలు . కోడలిమీద కొడుకు చెయ్యెత్తబోతే చటుక్కున అడ్డుపడి చీవాట్లేసింది అత్తగారు .

ఎవరిదో  పెళ్ళికి వెళుతూ ఈ చీరకి ఈ జాకెట్టు నప్పిందమావా  అంటూ అత్తగారొస్తే   ముసలాళ్ళకి మేచింగులేంటండీ ఏదో ఒకటి వేసుకోక అని తాను విసుక్కుంది , ” ఏం పొగరే…..చూస్తాలే నువ్వూ ముసల్దానివవ్వకపోతావా నీ కోడలు నిన్ను విసుక్కోకుండా వుంటుందా ……అప్పుడు నేను భుజాలెగరేస్తాలే.  అంటూ  ఉడుక్కుంటున్న అత్తగారిని చూసి కోడలు  నవ్వుకున్న సందర్భం వుంది

అత్తాకోడళ్ళిద్దరూ కలిసి నవ్వుకున్న నవ్వులూ, కలిసి  పంచుకున్న కబుర్లేకాదు

మూతి ముడిచిన సందర్భాలూ, మొహం తిప్పుకున్న రోజులూ వచ్చాయి వెళ్ళాయి ,  నా మాటకి విలువలేదా అని ఆవిడ, నాకీమాత్రం స్వేచ్చలేదా అని ఈవిడా వారి వారి  మొగుళ్ళముందు కళ్ళొత్తుకున్నారు , తీరింది బడాయి ఇక  రెండుపొయ్యిలు ఖాయం అని ఇరుగూ పొరుగూ చెవులు కొరుక్కునేదాకా  వచ్చినా   ఇరుగు పొరుగుల కళ్ళలో కారం పడేలా  …ఎవరు ఎవరికి లొంగారో తెలీకుండా సయోధ్య కుదిరిపోయేది .

అలా రోజులూ సంవత్సరాలయ్యాయి .  ఒకరికొకరు అడ్డు అనుకునే రోజులనుంచీ, ఒకరికొకరు అండ అనుకునే రోజులొచ్చాయి . ప్రతి చిన్నా పెద్దా విషయాలకి కోడల్ని సలహా అడగడడానికి అత్తగారికి నామోషీ అనిపించడం లేదు .అడక్కుండానే  అత్తగారు చెప్పే సూచనలు కోడలికి చాదస్తంగా తోచడంలేదు .

పరిస్థితులని అర్ధం చేసుకుని కొంతా , తప్పదనుకుంటూ  కొంతా ……  ఆ ఇంటినుంచి  ఆ మనుషులనుంచీ తనని తాను వేరుచేసి చూసుకోలేనంతగా రమ  ఉమ్మడి కాపురంలో ఇమిడిపోయింది .

పైకి  ఒప్పుకోకపోయినా… లోకం తీరు తెలుసుకోవడం , లౌక్యంగా మసలుకోవటం ……అతిధుల్ని ఆదరించడం, అందరి మన్ననలు పొందడం ఇవన్నీ ఆ ఇంటికొచ్చాకే  నేర్చుకుంది రమ .

అన్నం వార్చడం కూడా  తేలీకుండా  ఆ ఇంట అడుగుపెట్టి   ఈరోజు  అన్నింటా తానే అన్నట్టూ వ్యవహరిస్తున్న కోడల్ని చూస్తే  లోపల ఒకింత గర్వంగా వుంటుంది అత్తగారికి అందరితోనూ చెప్పుకోకపోయినా .

మా అత్తగారి ఇల్లు అనే మాట ఎప్పుడు మా ఇల్లుగా మారిపోయిందో రమకి గుర్తేలేదు .  ఒక్కో బాధ్యతా కోడలికి నేర్పుగా అప్పగిస్తూ  తానిక మాటిమాటికీ అడ్డు పడకూడదు అన్నట్టు కొంచెం కొంచెంగా తన ఉనికిని తగ్గించుకుంటూ వస్తుంది అత్తగారు . వృద్దాప్యంలో  రోజులు ఎలా గడుస్తాయో అన్న బెంగ ఆవిడకి గానీ, అత్త మామల బాధ్యత  తమ మీదే పడుతుందన్న బాధ  రమకి కానీ కలగటం లేదు . అంతా నిశ్చింతగా వున్న  ఇలాంటి రోజున ఆ ఇంటిమీదికి ఒక ఉపద్రవం వచ్చిపడింది .

 ఇది ఎవరూ ఊహించనిది.

 ఆ కుటుంబం రెండుగా చీలిపోయింది. ……ఎవరివల్లా?

చూశారా మీరు కూడా మర్చిపోతున్నారు ఆ కుటుంబంలో  అత్తాకోడళ్ళేకాదు  మరో ఇద్దరు వ్యక్తులు  ఉన్నారు  వాళ్ళే తండ్రీ కొడుకులు .  ఎందుకంత ఆశ్చర్యం… కుటుంబం చీలిపోవడానికీ, కొంపలు కూలిపోవడానికీ కారణం ఎప్పుడూ ఆడవాళ్ళు అందులోనూ అత్తాకోడళ్ళే  కావాలా ?

సంవత్సరాల తరబడి ఎంతో ఓర్పుతో నేర్పుతో అత్తాకోడళ్ళు ఇద్దరూ అల్లుకొచ్చిన ఈ అనురాగబంధాన్ని   ఒక్కవేటుతో  తునాతునకలు చేసి తమ  పౌరుషాన్ని చాటుకున్నారు  ఆ ఇంటి మగ మహారాజులు .

 వ్యవసాయం కల్సి రావటం లేదు వ్యాపారం చేస్తానని భర్త …, తాను బ్రతికుండగా పొలం లో ఒక్క సెంటు కూడా అమ్మడానికి ఒప్పుకోనని మామగారు , పిల్లల్ని మంచి చదువులు చదివించాలంటే పొలం మీద ఆదాయం ఏం సరిపోతుంది  అని అతను, సరిపడైనంతే చదివించుకో …..నేను కష్టపడి సంపాదించింది నీ తాతసొమ్మేం  కాదు  అమ్ముకోటానికి అని ఆయనా ……, మనవలు గొప్పవాళ్ళు అయితే మీకు సంతోషం కాదా అని అతను ,… ఏరుదాటాకా తెప్ప తగలేసే రకాల్ని చాలా మందిని చూసాం అని ఆయనా, నేనలాంటివాడినా , కన్న కొడుకు మీద నమ్మకం లేదా ? ….. అని అతనూ…….

“రోజూ ఎన్ని కథలు వినడం లేదు అయినకాడికి దోచుకుని అమ్మా బాబుల్ని రోడ్డుమీద వదిలేస్తున్నారు . నువ్వూ ఈ కాలం వాడివేకదా , కాలాన్ని బట్టే మన నమ్మకాలు మార్చుకోవాలి తప్పదు. ఏం జరిగినా నేను బ్రతికుండగా  నా పొలం వదులుకోను. నీకంతగా కావాలంటే ఒక వాటా పడేస్తాను అమ్ముకుంటావో ఆర్పుకుంటావో నీ ఇష్టం “

” అక్కరలేదు ….మీ ఆస్తి మీ దగ్గరే వుంచుకోండి . మీ దయా దాక్షిణ్ణ్యాలమీద బ్రతకాల్సినంత  చాతకానివాణ్ణి కాదు. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను”

ఇలా సాగిన వాదనలు

” నామీద  నమ్మకం లేనిచోట నేను వుండను ” అని అతను , …..

“నువ్వు ముద్ద పెడితేగానీ తెల్లారని బ్రతుకులు కావు మావి  నిన్ను బ్రతిమాలాసిన అవసరం నాకు లేదు తండ్రిమాట ఖాతరు చేయని  కొడుకు  దగ్గరున్నా దూరం ఉన్నా ఒకటే  నేను పోయానని తెలిసినా నువ్వు రావక్కరలేదు ” అని ఆయనా ప్రతిజ్ఞలు చేసుకున్నారు .

ఇదంతా ఇంట్లో జరుగుంటే ఇంతలా రాజుకునేది కాదు . వీధిలో నలుగురి మధ్యా మాటా మాటా మొదలై  ఎగేసేవారు ఎగేస్తుంటే …. ఆవేశం, ఉక్రోషం  కలగలిసి  ఆలోచన బూడిదైపోగా ఇద్దరూ ఎవరికి వారే తమ తమ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఇల్లు చేరారు .

పైకి మాట పట్టింపులా వున్నా ఈ ఘటన వెనక మనసులోతుల్లో పేరుకుపోయిన అసహనం, ఆవేదనా వున్నాయి.  యాద్రుచ్చికంగా  ఏదీ జరగదేమో….సునామీ వచ్చి ఇళ్ళూ ఊళ్ళూ తుడిచిపెట్టుకు పోవడం మాత్రమే చూస్తాం. అంతకుముందు మహాసముద్రం అట్టడుగు పొరల్లో జరిగుతున్న  మార్పును మనం ఊహించనైనా ఊహించలేం.

వెనక  తన పిల్లలు ఎదిగొస్తున్నా ఇంకా తండ్రి తనకి ఇవ్వాల్సినంత స్వతంత్రం ఇవ్వట్లేదనీ , మారే కాలాన్ని బట్టి ఆయన అలోచనలు మారడంలేదనీ ,  పదెకరాల పొలం  పాడి అవూ  వుంటే చాలు ఇంకేం లోటూ…అని పండని పొలాన్ని పట్టుకు వేళ్ళాడటం  రమ భర్తకి అసంతృప్తిని కలిగిస్తే……

రెక్కలొచ్చాయికదా …ఇక తనని లెక్క  చేయడంలేదు. చిన్నా పెద్దా విషయాల్లో తన సలహా సంప్రదింపులు కోరడంలేదు . అంతా నాకు తెలుసు అన్నట్టూ ….నలుగురిలో ఉన్నప్పుడు కూడా తండ్రి మాటని కొట్టిపారేయడం నేర్చుకున్నాడు ఇక ముందు ముందు “పోయి ఒక మూలన పడుండండి ” అనేసినా అనేస్తాడు అన్న అభద్రత ఆయన్ని వెంటాడుతూ  ఉన్నాయి చాన్నాళ్ళుగా.

ఆడవారి మనసుల్ని చదవటం అసంభవం  అని నిర్వచించేస్తారు అక్కడికి  మగవాళ్ళ మనసులు తెల్లకాగితాలైనట్టు

జరిగిందంతా తెలిసి అత్తాకోడలూ స్థాణువులైపోయారు .

“మావగారికి పొలం మీద మమకారం ఎక్కువ . ఆయనకి దానిమీద వచ్చే ఆదాయం తో లెక్కలేదు. రోజూ వెళ్ళి ఆ మట్టినీ, ఆ చెట్లనీ పలకరించకపోతే ఆయనకి అన్నం సహించదు.  ఇదంతా చెప్పినా మీకు అర్ధం కాదనో, లేక ఆయనకి చెప్పటం చాతకాకో ….ఇలాంటి మాటలొచ్చాయి. అంతా సర్దుకుంటుంది. రెండ్రోజులాగితే మీ మాటే నెగ్గిస్తారు చూడండి ” భర్తకి నచ్చచెప్పాలని చూసింది.

“వయసుతోపటూ చాదస్తం పెరిగిపోతుందా మీకు……ఏం చేసుకుంటారు ,కూడా తీసుకుపోతామా ! ఒక్కగానొక్క కొడుకు వాడు  కళ్ళముందు లేకుండా పోయాకా  ఇంకేం బ్రతుకు …… కొడుకూ, కోడలూ, మనవలూ అంటూ  ఇంట్లో  కళకల్లాడుతూ తిరుగుతుంటే రోజులు గడుస్తాయికానీ, ఈ వయసులో ఒంటరిగా పడుండి చావుకోసం ఎదురుచూడాలా ? నలుగురూ ఏవనుకుంటారూ ……”మాటలు రాక ఏడుస్తూ కూర్చుంది అత్తగారు .

“అంతా ఇచ్చేసాకా అయినా జరగాల్సింది ఇదేనే పిచ్చిమొఖమా !  నీకేం తెలీదు నువ్వు నోర్మూసుకో…” గద్దించి పొలం వైపు వెళ్ళిపోయాడు.

” నీకు పిచ్చిపట్టింది మనుషుల్ని నమ్మవు కానీ మట్టంటే పడిచస్తావ్ ” అవేశంలో భర్తని అనకూడని మాటలే అనేసింది ఆవిడ.

 రెండ్రోజులు పోతే ఆవేశం  తగ్గితే  అంతా మామూలయిపోతుంది అనుకున్నారు. ఆవేశం పాలపొంగులా అంతలో తగ్గొచ్చేమో కానీ, అహం చింత నిప్పులా రాజుకుంటూనేవుంటుంది. ఇది జరిగిన మూడోనాడు ప్రయాణం …..

“ఏదో జరిగిపోయింది  …ఇక ఒదిలేయ్… ఎవరూఎక్కడికీ  వెళ్ళక్కరలేదు ” అని మావగారు అడ్డుపడతారేమో అని చూసింది. ” నువ్వు ఇల్లొదిలితే  నా మీదఒట్టే ” అని అత్తగారు కొడుకుని కట్టేస్తారేమో అని ఆశపడింది .అవేవీ జరక్కపోగా , ఎవరికి వారే తమ తప్పేమీ లేదని ఎదుటువారే స్వార్ధంతో ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నట్టూ వుంది . ఎవరికీ నచ్చచెప్పలేక అటు భర్తకీ, ఇటు కొడుక్కీ మధ్య నలుగుతున్న అత్తగారి బాధ రమకి అర్ధమయినా …..ఆవిడ ఏదో ఒకటి చేసి తమని ఆపివుండాల్సింది అని రమకి  అనిపించింది

తాను కాపురానికొచ్చిన కొత్తల్లో ఏ అడ్డూ అదుపూ లేని ఏకాంత జీవితాన్ని కోరుకుంటూ , భర్తతో వేరు కాపురం పెట్టాలని ఉవ్విళ్ళూరిన సంగతే రమకి జ్ఞాపకం లేకపోయింది. ఆ ఇల్లు తనదే అయినట్టూ, తనకి అక్కడగల సర్వహక్కులూ తీసేసుకుని తమని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేస్తున్నట్టూ అనిపించింది. అందుకే అత్తగారు చెపుతున్న ఓదార్పుమాటలు రమని మరింత బాధపెడుతున్నాయ్ .

“నువ్వేం బాధపడకు , ఒక్కోసారి ఎంతటివాళ్ళకయినా కష్టాలు తప్పవు . ఆవేశం చల్లారితే అన్నీ సర్దుకుంటాయి. కొన్నాళ్ళు ఓర్చుకోటం తప్ప ఏం చేయలేం.పిల్లలికి ఈ సంగతులేం తెలీనీకు “. అని కోడలికి ధైర్యం చెపుతూ …. ” నీకు కావల్సిన గిన్నెలు అవీ తీసుకో ఈ గ్లాసులు పళ్ళాలూ…చెంచాలూ,  అన్నానికి చిన్న కుక్కర్ పట్టుకెళ్ళు అందాకా  నాలుగు దుప్పట్లూ టిక్కాలూ…..  “కూతురుని కొత్తకాపురానికి పంపిస్తున్నట్టూ ఒక్కొక్కటీ తెచ్చి పడేస్తుంటే ….”వద్దత్తయ్యా ఆయన ఒప్పుకోరు . అక్కడికెళ్ళాకా మా అమ్మని పంపించమంటాను.” అంటూ వారించింది.   తమ వస్తువులు, బట్టలూ సర్దుకుంటూ ఒక్కొక్క అలమార ఖాళీ చేస్తుంటే రమకి దుఖం కట్టలు తెంచుకొచ్చింది . చక్కగా కుదురుకున్న మొక్కని బలవంతంగా పెకిలించేస్తున్నట్టూ బాధపడింది . ఎక్కడికో శెలవులకి వెళుతున్నామని, మళ్ళీ తనింటికి తాను త్వరగా తిరిగొచ్చేస్తామనీ మనసుకి నచ్చచెప్పుకుంది.

కొత్త జీవితానికి రమ అలవాటుపడిపోయింది. జరిగినవన్నీ ఇప్పుడంత బాధపడాల్సినవిగా అనిపించడంలేదు . ఇప్పుడు ఎవరికోసమూ సర్దుకుపోవాల్సినంత ఇరుగ్గా లేదు జీవితం . నచ్చినవి వండుకోవచ్చు…నచ్చినట్టూ వుండొచ్చు . అదిలించేవారూ అధికారం చలాయించేవారూ ఎవరూ లేరు … మరెందుకో ఈ దిగులు ……  ఉన్నదానిమీద విరక్తి , లేనిదానిమీద అనురక్తి మనిషి బలహీనత . రమకి ఎన్నోసార్లు అనిపించింది ” ఇది ఇలాగేనా…” అంటూ  తనని అదిలించడానికయినా అత్తగారు అప్పుడప్పుడు వచ్చివెళితే బావుండును అని  …..

కొంచెం కొంచెం గా పట్టు సడలుతుంది కానీ  మనసువిప్పి మాట్లాడుకునే ధైర్యం ఎవరికీ లేదు …. అందుకే ఎవరికి వారే అన్నట్టూ , మనసులు ముడుచుకుని ముభావంగా వుండిపోయారు .

ఏదీ శాస్వతం కాదు ….భయం , బాధ…అన్నిటిని కాలం మార్చేస్తుంది…….తీర్చేస్తుంది. అని రమకి గట్టినమ్మకం . ఆ రోజుకోసం ఎదురుచూస్తుంది.

  ” అత్తాకోడళ్ళిద్దరికీ పడలేదంటగా….అందుకే వేరే వచ్చేరని చెప్పుకుంటున్నారే ఊళ్ళో …” స్నేహితురాలి మాటలకి మనసులో నొచ్చుంకుంది రమ .

అంతేలే ……తమ ఘనకార్యాలకి ముందో వెనకో ఆడవాళ్ళని నిలబెట్టి ,  కీర్తిన తాము  తగిలించుకుని అపకీర్తిని ఆడవాళ్ళ నెత్తిన రుద్దటం అనాదిగా మనం చూస్తున్నదేగా !

ఎన్నో సమస్యలు సుడిగుండాలూ దాటి  ఏళ్ళతరబడి  సంసారాన్ని  ఈదుకొస్తే  తమ అస్తిత్వాన్ని కూడా ఒదులుకుని ,అత్తాకోడళ్ళు  ఇంటిగుట్టును కాపాడుకుంటూ వస్తే….చివరికి  ఒరిగింది ….జరిగిందీ ఏవుందీ.  సర్దుకుపోవడం,  సమయానుకూలంగా ప్రవర్తించడం  మగవాళ్ళకీ తెలుసుంటే ……..ఈరోజొచ్చేదేకాదు మనసులో అనుకుంది.

 కుటంబాలు కూలిపోకుండా ఉండాలంటే ఓర్పూ నేర్పూ చూపించాల్సింది ఆ ఇంటి ఆడవారేనా ! మగవారికీ బాధ్యతవుంటుందిగా …..సమ్యమనం పాటించడం, సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకోడం ఇవన్నీ వారికీ తెలిసుండాలిగా……

రమకి చెప్పలేని ఆవేదనగావుంది ….ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొండ చివరికంటా ఎక్కాకా , ఇక రావక్కరలేదు ఫో…అని తోసేస్తే ఎలావుంటుంది !

నా బాధ్యత నేను  సక్రమంగా నిర్వర్తించగలిగాను అని  సంతృప్తి పడుతున్న క్షణంలో ఇదంతా జరగడం  రమకి ఆవేదనని కలిగిస్తుంది

అక్కడ అత్తవారింట్లో …..

“అడ్డాలనాడు బిడ్డలుకానీ గడ్డాలనాడా అని….అంతేలే బావా , పెళ్ళాం పిల్లలూ వచ్చాకా తల్లీ తండ్రీ బరువైపోతారు . కొడుకు మనవాడయినా కోడలు పడనివ్వాలికదా ! మీ కోడలు మహా తెలివందిలే…. పోనీ అబ్బాయితో నన్నోసారి మాట్లాడమంటావా!  “ ఇంకా ఏంటేంటో చెప్పేస్తున్నాడు రమ మావగారితో ,చుట్టం చూపుకొచ్చిన పెద్దమనిషి .  విషయం అది కాదని చెప్పుతాడేమో అని చూసింది అత్తగారు….బాగా చెప్పావ్ అనాట్టూ  కాఫీ అందిచడం చూసి …” హు….” అని నిట్టూర్చి తప్పుకుంది .

కాఫీలూ, కబుర్లూ పూర్తయి  వచ్చిన చుట్టం గుమ్మం దాటాకా ,  వీధిలోకొచ్చిందావిడ …….. “ఆయనేమన్నాడో విన్నారుగా ఇప్పటికయినా పంతాలు చాలించండి , ఏ కాస్త పగులు కనపడ్డా ..దాన్ని రెండుగా చీల్చేయడానికే చూస్తారు జనం . మనలో మనం  సర్దుకోకపోతే పదిమందికీ లోకువైపోతాం . ప్రతివాడూ తగుదునమ్మా అంటూ తగువు తీర్చేవాడే ……. ”  అంతా విని ఆయన విసురుగా లోపలికెళ్ళిపోయాడు .

కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుందని ఇన్నాళ్ళూ ఊరుకుంది ,  కానీ, ఇంకా కాలాన్ని నమ్ముకు కూర్చుంటే ఈ దూరం ఇంకా ఇంకా పెరిగి  ఎందాకా పోతుందో ! వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి …ఆలోచిస్తూ భర్త వెనకే వెళ్ళి చెప్పింది  ” మీరు కోప్పడ్డా సరే …. సంక్రాంతి పండుగ మనమదరం కలిసి జరుపుకుంటున్నాం అంతే”  …దానికేం చేయాలో నాకు తెలుసు అంటూ ..భర్త సమాధానం కోసం చూడకుండా  ఫోను దగ్గర చేరింది రమ అత్తగారు.

– స్పందన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

6 Responses to ఎంతెంతదూరం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో