మా ఇంటికి దక్షిణం వైపు పెద్దగేటు వుండేది. ఆ గేటు పక్క ఇల్లు గొడుగువారిది. ఆ ఇంటిపక్కన బీరక వాళ్ళిల్లు.వాళ్ళది చుట్టల వ్యాపారం, బేళ్ళ లెక్కన పొగాకు కొని మనుషుల్ని పెట్టి చుట్టలు చుట్టించి,కట్టలుగా అమ్ముతుండేవారు .వాళ్ళు దేవాంగులు. ఆ అత్త భలే అమాయకంగా వుండేది. ఏదైనా అందరూ అవునంటే అవుననీ, కాదంటే కాదనీ అనేది.ఎప్పుడూ నీళ్ళు మోస్తూ, నీళ్ళల్లో నానుతూ వుండేది. పొద్దున్నే పచ్చిపసుపు రాసుకొని స్నానంచేసి పెరట్లో రుబ్బురోలికీ, సన్నికల్లుకీ, పూలు పెట్టి దణ్ణాలు పెట్టేది. అప్పటికే నడివయసుకి వచ్చినా వాళ్ళకి పిల్లలు లేరప్పటికి. రాఘవ అనే ఒక అమ్మాయిని పెంచుతుండేవారు, తను మా పెద్ద చెల్లితోటిది. ఆ పిల్ల చిన్నప్పటినుంచే వండి వడ్డించడం, చుట్టలు చుట్టడం అన్నీ చేస్తుండేది. ఆ తర్వాత చాలా కాలానికి వాళ్లకి ఒక అబ్బాయి పుట్టేడు,వాడు ఎదిగి ఆ ఇల్లు మరొకరికి అమ్మేసాడు.
ఆ ఇంటికి ఎదురుగా దేశెట్టి నాగరత్నం అనే ఆమె ఇల్లు వుండేది. ఆమెకీ పిల్లలు లేరు, భర్త ఆమెని వదిలేసి పక్కనే ఉన్న రామవరంలో అన్నగారింట్లో ఉండేవాడు. నల్లగా ఎత్తైన కోరమీసాల ఎర్రకళ్ళ మనిషి, అతను పశువుల మారుబేరగాడట, నాగత్త నోరు పెద్దది. గయ్యాళి అని చెప్పుకొనేవారు. ఆమెకు దొడ్డినిండా కోళ్ళు ఉండేవి ,ఇల్లంతా కోడి రెట్టల్తో కంపు కొడుతూ వుండేది. ఏమైందో తెలీదు, ఆవిడ భర్త మంచినీళ్ళ చెరువుగట్టున శూద్రుల నూతిలో పడి చచ్చిపోయాడని కొందరూ, అన్నగారింట్లో సరిగా తట్టుకోలేకపోయాడని కొందరూ రకరకాల కధలు చెప్పుకొన్నారు.అందరితో కలిసి నేను చెరువుగట్టుకి వెళ్లి శవాన్ని పైకి తీయడంతో అంతా చూసాను.అప్పటికి రెండో తరగతి చదువుతున్నాను.అక్కడనుంచి ఇంటికొచ్చేసరికి నాకు పొంగుతూ జ్వరం వచ్చేసింది .కన్నుమూస్తే అదే దృశ్యం కళ్ళల్లోకొచ్చేది. రక్షపోగులు కట్టించే డాక్టర్ కి చూపించి నానా పాట్లు పడ్డారు మానాన్న,అదే నేను చూసిన మొట్ట మొదటి నిర్జీవ శరీరం,ఆ సంఘటన తర్వాత నేను నూతు లంటే తొంగి చూసేదాన్నికాదు .ఆ తర్వాత కొన్నాళ్ళకి నాగత్త ఆ ఇంటిని ముత్తావారికి అమ్మేసి ఎక్కడికో వెళ్లి పోయింది.
ఆ ఇంటికి ఆనుకొని తూర్పున మాగేటుకి ఎదురుగా బుల్లచ్చియ్య మామ్మ పూరిల్లు ఉండేది.అప్పటికే చాలా వృద్దురాలావిడ. ఒక్కత్తే చిన్న కర్రల పొయ్యిమీద వండుకొని తింటూ వుండేది. ఆవిడ ఒక్కగా నొక్కకొడుకూ పేడివాడట. దేశాలుపట్టిపోయాడని చెప్పుకొనేవారు. రెండు మూడు సార్లు చెంచునాటకాల వాళ్ళు వచ్చినపుడు స్టేజిమీద తెయ్యి మని ఆడుతున్న చెంచులక్ష్మిని చూపిస్తూ “అడుగో ఆ వేషం కట్టినతనే బుల్లచ్చియ్యకొడుకు”అని చెప్పుకొనేవారు. ఆ మర్నాడు ఆ మామ్మ మా నాన్నమ్మ దగ్గరకొచ్చి ఏమిటో చెప్పుకొని దుఃఖపడేది. మానాన్నమ్మ ఆవిడ వీపు నిమురుతూ ఓదార్చేది. ఆ మామ్మ పోగానే అప్పుడప్పుడూ పదీపరకా ఇచ్చిన ఆ పక్కింటివాళ్లెవరో ఆ స్థలాన్ని కలిపేసుకున్నారు.
నాగత్త ఇంటికి ఆనుకొని పశ్చిమంగా వీరముష్టుల పెద్దిల్లు. ఇక్కడ స్థానికంగా ఉండే కుటుంబాలు కాక ఎక్కడెక్కడినించో సంచారజీవులుగా వచ్చే బంధువులు,చుట్టాలతో వాళ్ళ వాకిళ్ళూ దొడ్లూ, అరుగులూ నిండుగా వుండేది. వీరభద్రుడి సంబరానికి ‘అశ్శరభ శరభ’ అని చిందులేస్తూ ప్రభలు నడపడం,కత్తులు పట్టుకుని వీరనృత్యం చెయ్యడం, సంబరాన్ని గద్దెకు చేర్చడం వాళ్లవృత్తి. సంబరం చేయించుకున్నవాళ్ళు వాళ్లకి కోరుకున్న పైకంతోబాటు స్వయం పాకాల్ని, బట్టల్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఆడవాళ్ళు పూసలు, అద్దాలు వీధుల్లోతిరిగీ, సంతల్లోనూ అమ్మడం, సవరాలు కట్టడం చేసేవారు. పాతవాళ్లు గతించారు కానీ, ఇప్పటికీ అదే వృత్తి వాళ్ళది. కాకపోతే అప్పటి ఆదరణ, నమ్మకాలు చాలావరకు తగ్గడం వలన వాళ్ళ కుర్రాళ్ళిప్పుడు వేరే పనుల్లో కుదురుకుని బతుకుతెరువు వెతుక్కుంటున్నారు. అప్పట్లో రాత్రైతే చాలు ఆ ఇంటిముందంతా వీరనృత్యంలాగే ఉండేది. ఆడా మగా అందరూ తిని, తాగేసి తందనాలాడ్డం, బుర్రలు బద్దలుకోట్టుకోవడం ఒక రివాజులా ఉండేది.
వాళ్ళింటికి పశ్చిమంగా సీకులోళ్ళ ఇల్లుండేది. వాళ్ళింట్లో సారాయి వ్యాపారం రహస్యంగా జరుగుతుండేది. బహుశా అప్పటికి ప్రొహిబిషన్ ఉన్నట్టుంది. ఆ ఇంటిగల పెద్దావిడ కనకమ్మ వాళ్ళ వాకిట్లో పోయ్యిపెట్టుకొని చీకులు కాల్చి అమ్ముతుండేది. ఆవిడ దబ్బపండు చాయ మనిషి, ఎప్పుడూ పసుపురాసుకొని, రుపాయికాసంత కుంకుమబొట్టు పెట్టుకుని, కుడిచెవి మీదికి కొప్పుతో కళకళలాడుతుండేది. మా అమ్మని “చెల్లీ” అనీ, మానాన్నని ”మరిదిగారూ’ అనీ పిలిచేది. పెద్దకుటుంబం, కొడుకులంతా తాగుబోతులై ఎప్పుడూ కొట్టుకుంటూ వుండేవారు కుమ్ముకుంటూ వుండేవారు. ఒకోసారి కనకమ్మనీ ఆవిడ మొగుడ్నికుడా కొడుకులు కొట్టేసేవారు. ఆవిడ తెల్లారేక వాళ్ళని వెంటబెట్టుకొచ్చి మానాన్నకి ఫిర్యాదుచేసి వాళ్లకి భయం చెప్పమనేది. వాళ్ళు చాలా భయస్థుల్లాగా మానాన్న ఎదుట చేతులు కట్టుకొని, తలలు వాల్చుకొని వినేవారు. రాత్రైతే మళ్ళీ మామూలే.
గొడవలవుతుంటే భయంకొద్దీ పారిపోయి వచేసేదాన్నికాని అందరిళ్లోకీ వెయ్యిళ్ళ పుజారిలా తిరుగుతుండేదాన్ని. మావీధిలో అందరూ నన్ను ‘లక్షింతల్లీ’ అనే పిలిచేవారు. అవసరానికి ఆదుకునే మానాన్న మంచితనంకొద్దీ మమ్మల్నికుడా ఆప్యాయంగా చూసేవారు. సీకులోళ్ళ ఇంటికి ఉత్తరంగా నిమ్మలోళ్ళ ఇల్లు, ఆ ఇంటిగలాయన వీధిలో మంచంలో పడుకుని చుట్టలు కాలుస్తూ ఉండేవాడు. ఆ ఇంటావిడ కోసం వేరేవ్యక్తి వచ్చిపోతుండేవాడు అతని ఎదురుగానే. వాళ్ళ ఇంటివెనకున్న జామచెట్టు కాయలు భలేరుచిగా ఉండేవి. నిమ్మలోళ్ళ ఇంటికి ఉత్తరాన యాళ్ళ వాళ్ళ ఇల్లు. యాళ్ల వీర్రాజు అనే ఆవిడిదీ పెద్దకుటుంబమే. ఆవిడ బియ్యం వ్యాపారం చేస్తూ ఉండేది. ప్రత్యేకంగా,ఆవిడ వేడినీళ్ళలో కొత్తధాన్యాన్ని వేసి వార్చి ఉప్పుడుబియ్యం తయారుచెయ్యడం చూడ్డానికి వాళ్ళింటికి వెళ్లేదాన్ని. కేవలం దంపుడుబియ్యమే అమ్మేదావిడ. ఊరంతటికీ కలిపి మూడు ధాన్యం మిల్లులు-ఆయిల్తో నడిచేవి ఉండేవి. వాళ్ళమ్మాయి చంద్ర నాతో ఆడుకోడానికి వచ్చేది.
ఇక మాగేటుకి తూర్పున నాలుగు వాటాల గూన పెంకుల ఇల్లు వుండేది .అది వీధిలో మోతుబరి రైతు పెదిరెడ్డి బుచ్చి రాజు గారిది .దాంట్లో ఎవరెవరో అద్దెలకొచ్చి ఉంటూoడేవారు .ముఖ్యంగా ముస్లీమ్స్ ,మా హెడ్ మాస్టారుగారు వాళ్ళు ఆ ఇంట్లోనే ఒక వాటాలో ఉండేవారు .ఇక వీధిలో పిల్లలంతా మధ్యాహ్నం వేళ ఆ ఇంటి అరుగుల మీదే ఆటలకి చేరేవాళ్ళు.అరుగుల మీద ఎత్తి పెట్టిన మంచాల మధ్య బువ్వలాటలు ,బొమ్మల పెళ్ళిళ్ళు ,దొంగాటలు అన్ని సాగేవి.
ఇప్పుడు నేను చెప్పిన ఇళ్ళే వి అప్పటి రూపంలో లేవు.డాబాలుగా,మేడలుగా మారిపోయాయి క్రితం వారమే చూసాను ,ఆ నాలుగు వాటాల ఇల్లును కూడా పడగొట్టేసి కొత్తగా కడుతున్నారు.
ఇక్కడొక విషయం తప్పక ప్రస్తావించాలి .అటు సముద్రానికి ఇటు గోదావరికీ సమాన దూరంలో మెట్ట ప్రాంతంగా పిలవబడే ఈప్రాంత వాతావరణానికి సరిపడేలా పూర్వం ఇళ్ళు పచ్చి ఇటుక మట్టితో ,మందమైన గోడలు -సరంబీలతో ,తాటాకుల్తోనో పెంకుల్తోను నేసిన పైకప్పుల్తో కట్టే వారు ,మేడలైతే గానుగ సున్నంతో కట్టేవారట.ఆ ఇల్లు వేసవిలో చల్లదనాన్ని ,చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేవి .ఊరికి కరెంటులేని ఆరోజుల్లో ఫేన్ల (పంకాలు)ప్రసక్తి ఎక్కడిది ?అందరూ హాయిగా వాకిళ్ళలో మంచాలు వేసుకుని నిద్రపోయేవారు .ఇప్పుడెక్కడ చూసిన దొంగల భయాలు .కాంక్రీటు ఇళ్ళల్లో నిరంతరం పంకాలు ,ఇంకా సాగితే ఎయిర్ కూలర్స్ వేసి ఉంచాల్సిన పరిస్థితి .
అప్పట్లో మావీధిలో ఎవరికీ నూతులులేవు మాపెరట్లో తప్ప యెంత మండుటెండల్లో నైనా మానూతిలో నీళ్ళు ఉండేవి.మంచినీళ్ళు చెరువు నుంచి తెచ్చుకున్నా వాడుకనీరు నూతుల్లోదే .అందుకే వీధిలో ఆడాల్లందరూ బిందెలు పుచ్చుకుని ,మా యింటికి నీళ్ళకోసం వచ్చేవారు .అందుకోసమని మాగేటు ఎప్పుడూ తెరిచే ఉండేది . నూతిపక్కనే వంటింట్లో మా అమ్మ పనిచేసుకుంటుంటే వాళ్ళు నీళ్ళు తోడుకుంటూ కబుర్లు చెప్పి వెళ్ళేవాళ్ళు ,వాళ్ళ కబుర్లు కూడా నాకు కథల్లాగే అన్పించేవి .
– కె.వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to మా వీధిలో ఇంకా ఇతరులు