పౌష్య లక్ష్మి

పౌష్య లక్ష్మి !స్వాగతిం బిదె !
తరలిరమ్మా ! శుభములీయగ!
ముంగిట తీర్చిదిద్దిరి 
ముగ్గులెన్నో ముదితలందరు 
ముగ్గులందున గొబ్బిదేవత 
ముదముతో వేంచేసి యున్నది 
గొబ్బితట్టుచు కన్నెలందరు
మొగలి బోలిన మగని కోరిరి 
గంగిరెద్దుల కొమ్ములందున 
పైడి గంటలు వల్లెయనినవి 
దాసరయ్యల చేతి చిరుతలు 
దరువు వేయుచు దీవెనిచ్చెను
కొమ్మదాసరి విదూషకుడై
కొమ్మలకు మోదంబు గూర్చెను 
జంగమయ్యల డమరుకధ్వని 
జగములకు మేల్కొలుపు పాడెను
ఇంట చేరిన ధాన్య రాశులు 
ఇబ్బడిగ  బలమిచ్చె రైతుకు 
భోగి మంటల వెలుగులన్నియు 
భోగమాయెను పౌష్యలక్ష్మికి 
ఇంత  కలిగెను నీదు దయచే 
సుంతయును సందియము లేదిక 
ఆంద్ర సంస్కృతి ప్రజ్వలింపగ
అవతరించె  నీ సంక్రాంతి పండుగ !

                                            -సుబ్బలక్ష్మి మర్ల 

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.