పద చైతన్యం (చర్చ)

సాహిత్యంలోనో , నిజజీవితం లోనో సాటి మనుషుల పట్ల ,తక్కువగా చూడబడే సామాజిక వర్గాల వారి పట్లా , ముఖ్యంగా మనిషికి జన్మనిచ్చి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించే స్త్రీల పట్ల ఉపయోగించబడే పదజాలానికి ఎలాంటి పరిమితులున్నాయి? అస్తిత్వ పోరాటాల నేపథ్యంలో స్త్రీల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తూ ఇతరులు ఏ విధంగా వారిని సంబోధించాలి? గౌరవించాలి?
సాహిత్యంలో కొన్ని వందల ఏళ్లుగా స్త్రీల పట్ల వాడబడుతున్న పరుష ,అగౌరవ ,అంగాంగ వర్ణనల పదజాలంపై వచ్చిన చైతన్యం ,తిరుగుబాటు ఇప్పుడు ఏ దిశగా సంస్కరించ బడుతుంది? ఇప్పటికే సాహిత్యం లో చొచ్చుకు పోయిన… సమాజంలో అలవోకగా వాడబడుతున్న పదజాలం ఇప్పుడు కొన్ని వర్గాలకే ఎందుకు అభ్యంతరకరంగా వుంది? మరి కొందరికి అది సర్వ సాధారణం అన్న అభిప్రాయం ఎందుకుంది?

ఈ అత్యవసర , సామాజిక అంశాన్ని ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక’ ద్వారా చర్చించాలని పాఠకులని ఆహ్వానిస్తున్నాము.ఈ చర్చ ద్వారా ఉపయోగించకూడని పదాలు, వాటికి ప్రత్యామ్నాయ పదాలను ఏర్పరచుకోవటం లేదా తొలగించుకోవటం, సాధ్యా సాధ్యాలు ,సామాజిక ఇబ్బందులను గుర్తించటం వంటి అంశాలను ముందుకు తెస్తున్నాం.

ఈ అంశం పై పలువురు రచయితలు ,స్త్రీలనుండి అభిప్రాయాలను సేకరించటం జరిగింది. ఈ చర్చలో అభిప్రాయాలు, వారు వ్యక్తం చేసిన ఆలోచనలు ,అభిప్రాయాలు వారి సొంతం.వారి భావజాలంతో ‘విహంగ’ ఏకీభవించినట్టుగా భావించనవసరం లేదు .

– సంపాదకులు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– స్వాతీ శ్రీపాద 

అనాది నుండీ స్త్రీ కి ఒక వ్యక్తిత్వాన్ని ఇవ్వలేదు మన పురాణాలు , మనువు. ధర్మశాస్త్రాలన్నీ పురుషులకోసం రాసినవే. ఆ నేపధ్యంలో భాష కూడా చాలా మటుకు అదే దోవలో సాగింది. 
అప్పటి భాష ఇంకా ప్రవాహంలా పాత కొత్తల కలగలుపుతో వాడుతున్నాను. 
మామూలుగా వాడినా చాలా మటుకు స్త్రీలను కించపరచే పదాలు చాలానే ఉన్నాయి. 
సమాజం మారేకొద్దీ భాషా మారుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిత్వం సంతరించుకున్నస్త్రీలు పాతాకాలపు భావాలతో అల్లుకుని ఉన్న కొన్ని పదాలను అంగీకరించలేరు. 
ఆ పరిస్థితిని అంగీకరించలేనప్పుడూ మ్రత్నమ్యాయపదాలూ ఉండవు. 
అయితే చరిత్రను తుడిచెయ్యలేము. గతం మన వెనకే ఉంటుంది. అందుకే కాగితం పైకి వచ్చే ప్రతి అక్షరం ఒక రికార్డ్ గా మారిపోతుంది గనకే సంస్కార యుతమైన భాషనే వాడాలి. 
గతాన్ని మనం ఏమీ చెయ్యలేము. చరిత్ర నుండి కొత్త పాఠాలు నేర్చుకోవాలి అంతే.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 శాంత సుందరి 

 స్త్రీలని కించ పరిచే తిట్లు ఏవి అనేది మనలో చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే వాటి ఉత్పత్తి స్థానం ఏది అనేది చాలా మందికి(నాకు కూడా) తెలీదు. మా నాన్న,కొడవటిగంటి కుటుంబరావు గారు, నా చిన్నప్పుడు చెప్పిన ఒక విషయం ఇక్కడ ప్రస్తావించడం సబబే అనుకుంటాను.’ముండ’అనే మాట తిట్టుగా ఎలా పరిణమించిందో చెప్పేవారు.ముండ అనేది,చాముండేశ్వరి,చాముండ అనే మాటల్లోంచి వచ్చిందనీ,ఆ రెండూ పార్వతి పేర్లనీ చెప్పారు.అది తిట్టుగా మార్చింది,శైవ మతాన్ని కించపరిచేందుకే అని కూడా చెప్పారు.ఇక్కడ మనకి మళ్ళీ అదే ప్రశ్న ఎదురౌతుంది…శివుణ్ణి కించపరిచేందుకు కూడా ఆయన భార్య పేరునే ఎందుకు వాడుకున్నారు?మరీ చిన్నతనం కాబట్టి ఆ సందేహం నాకు రాలేదు,నేను అడగలేదు.(పంజాబీ భాషలో ’ముండా’అంటే చిన్న పిల్లవాడు…అబ్బాయి)

ఒక్క స్త్రీకి సంబంధించిన మాటలే కాక వేరే రకమైన పదాలు కూడా తిట్లుగానో,తక్కువ చేసేందుకో ఉపయోగించబడతాయనడానికి మరో చిన్న ఉదాహరణ: హిందీ లో పిల్లా అంటే కుక్క పిల్ల.దీన్ని తిట్టుగా కూడా వాడడం కద్దు.మా హిందీ ప్రొఫెసర్ ఒకాయన దీనికి కారణం వివరిస్తూ,దక్షిణాది వాళ్ళంటే ఉండే ఒక రకమైన ఏహ్య భావం వల్ల’పిళ్ళై’ అనే తమిళ/మలయాళ పదాన్ని వాళ్ళు తిట్టుగా మార్చుకున్నారు!అని చెప్పాడు.

స్త్రీని కించపరిచే మాటలు సాహిత్యంలో వాడచ్చా కూడదా అనేది ప్రస్తుతం ప్రశ్న.నా జవాబు కూడదనే.కానీ ఒకవేళ రచయిత ఒక పాత్ర పట్ల ఏహ్య భావం కలిగించే ఉద్దేశంతో,ఆ పాత్ర నోటి వెంట అలాటి మాటలు పలికిస్తే అది సందర్భోచితం అవుతుందా? ఇది నా ప్రశ్న.ఇక నా ఉద్దేశంలో,సాహిత్యంలో తిట్లు ఒకప్పుడు భాష నానుడిలో భాగంగా వచ్చి ఉండచ్చు,వాటిని ఎవరూ అంతగా పట్టించుకోక పోయి ఉండవచ్చు.ప్రస్తుతం స్త్రీ పరిస్థితి అంతగా మారలేదు,కానీ ఆమెకి అవగాహన వచ్చింది.ఎదిరించే ధైర్యం వచ్చింది.ఆ అవగాహనా,ఎదిరింపూ తిట్ల వరకే పరిమితం కాకుండా,అసలు మూలాల్లోకి వెళ్ళి తను అన్యాయంగా,అనవసరంగా ఎటువంటి అవమానమూ,ఈసడింపూ ఇంక భరించనని సమాజానికీ, కుటుంబానికీ తెలియజేయాల్సిన సమయం వచ్చిందని నా అభిప్రాయం.

వార్తా పత్రిక తెరిస్తే రోజూ రకరకాలుగా తిట్టుకోడం కనిపిస్తూనే ఉంది.అసలు సభ్య సమాజంలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు తిట్టడం మానేస్తే అందరికీ మంచిది…ముఖ్యంగా భావి తరానికి…మరి మీరేమంటారు?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– హిమ బిందు 

స్త్రీల పట్ల  వాడకూడని పదాలు ఎన్నో వున్నాయి. బహుశా ఒక పుస్తకమే వ్రాయవచ్చేమో! అన్నిటికన్నా ముఖ్యంగా ‘నోరుముసుకో, నీకేం తెలిదు’ అనే వాక్యమే చాలు,  ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు. పుట్టిన వెంటనే ఆడ అయినా మగ అయినా అన్నీ నేర్చుకుని పుట్టరు. ఎదుగుతూనే కాలక్రమేనా నేర్చుకుంటారు. అటువంటిది అమ్మాయిని మటుకు ఎన్నేళ్ళు వచ్చినా  అదే మాట వాడుతారు. ఈ రోజుకి సమాజం లో కొందరు ఆడవాళ్ళకి తాము కష్టపడి సంపాదించిన జీతం దేనికి ఖర్చుపెడుతున్నారో తెలియని వాళ్ళు వున్నారు.

ముఖ్యంగా ఒక అమ్మాయి గురించి మాట్లాడేతప్పుడు  ‘అది, ఇది’ అని సంభోదించడం తప్పు.  అల్లాగే ఒక స్త్రీ మోడరన్ డ్రెస్ వేసుకుంటే చాల లూస్ క్యారెక్టర్ అనుకోవటం, సాంప్రదాయమయిన దుస్తుల్లో వుంటే పల్లెటూరి బైతు అనుకోవటం పొరపాటు. తన ఆహార్యం కన్నా ఆమె వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఆమెకి నిజమైన గౌరవం ఇచ్చినట్టు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

-దుర్గా ప్రసాద్

పూర్వం వాడుక లో ఉన్న పదాలు పలికితే నీచార్ధం ఇస్తే వాడకూడదు .అన్నిటినీ వ్యతి రేకిన్చాల్సిన పని లేదు .ముఖ్యం గా స్త్రీలను -ఒసే ,ఏమే ,అది ,ఇది ,లం..,గుడిసేటిది ,కులట ,అని పిలవటం సంస్కారం కాదు .ఆమె ఆవిడ ,ఈమె ,ఈవిడ అని గౌరవ మైన మాటలతో చెప్పాలి కావ్యాలలో ఆయా సందర్భాలను బట్టి కవులు విశేషణాల తో స్త్రీ లను అలా సంబోధించారని పిస్తుంది .అవే కదా ,నవలలో చోటు చేసుకో లేదు .అంటే మార్పు వచ్చిందన్న మాట .కాల ప్రభావం .ఆధునిక కాలం లో దాదాపు స్త్రీ సమాన హోదా అన్నిటా పొందుతోంది .కనుక ఇంకా నాగర క మైన భాష ను స్త్రీ పట్ల ఉప యోగిస్తున్నారు .ఏదైనా తగాదాలోస్తే నీచ భాష ను బాగా చదువుకొన్న స్త్రీలు కూడా వాడి అవమానాల పాలు గావటం చూస్తూనే ఉన్నాం .అందులో రెండు రాజ కీయ పార్టీలకు చెందినా ఇద్దరు మహిళా మణులు ఆ మధ్య ప్రయోగించుకొన్న భాష ఏవ గింపు ను,జుగుప్స ను  కల్గించింది అన్న విషయం గమనించే ఉన్నాం .మనిషి పెరగాలి అంటే సంస్కారం పేర గాలి .అప్పుడు సభ్య పద జాలం వస్తుంది ..కించ పరచే మాట వాడితే ఆకాశం మీద ఉమ్మి వేస్తే  ఏమవుతుందో అదే జరుగు తుంది .కుచాలు ,నితంబాలు మొదలైన స్త్రీ అవయవాల వర్ణన తో సంబోధించే మాటలను వాడ కూడదు .ఈ విషయం లో మగాళ్ళ కంటే మహిళ కే ఎక్కువ తెలుసునను కొంటాను .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  – ఉమా పోచంపల్లి 

స్త్రీల పట్ల ఎలా౦టి పదాలు వాడకూడదు? ఏ పదాలు వారిని కి౦చపరిచేవిగా

ఉ౦టున్నాయి?

ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న.

ఒకవైపు అణుయుగ౦లో పురోగతి చె౦దుతూనే మరొక వైపు పాషాణాల యుగాల్లో౦చి

బైటికి రాలేకు౦డా ఉన్నాము.

అమ్మా! ఏమమ్మా?! ఇత్యాదులు మన౦ వినే ఉ౦టాము.

అలాగే, ఒసేవ్, ఏమేవ్, ఓ దొ౦గ—, ఓ—— లా౦టివి కూడా వి౦టూనే ఉన్నాము.

ఇ౦ట్లో పనివాళ్ళని, చిన్నపిల్లలని ఈ విధ౦గా పిలిచే పెద్దవాళ్ళు ఎక్కడో ఒకళ్ళో అరనో

ఉ౦డే ఉ౦టారు.అలాగే భార్యని కూడా ఆ విధ౦గా పిలిచే స౦స్కారవ౦తులు(?)

లేకపోలేదు.

స్త్రీలను స౦బోధి౦చినపుడు, ఓయి ఓరీ ఓసీ స౦బోధనా ప్రధమా విభక్తిలోని ఓసీ అరువు

తెచ్చుకున్నప్పటికీ, వారి గురి౦చి చెప్పినప్పుడు కాని, వారిని స౦బోధి౦చినపుడు కాని

అలా అనట౦ఎ౦తో రాతియుగ౦ నాటి స౦బోధన అనిపి౦చక మానదు.  “దాన్నిలా

పిలువు” అని చిన్నవాళ్ళనుఅనట౦ కద్దు. అలాగే పనమ్మాయిని పిలిచినప్పుడు, ఒసే

అనడ౦ కొ౦దరికి అలవాటు. ఒకటి, పనిచేయి౦చుకు౦టున్నాము, తోటి మానవులతో.

రె౦డు వారిని కి౦చపరిచేలాగ స౦బోధి౦చి, మననుమనమే కి౦చపరుస్తున్నాము.

కొ౦దరు “పనమ్మాయిని కూడా ఏమ౦డీ అని పిలుస్తే,రేపు మనని బజార్లో చూస్తే, అదే

మనని ఒసేవ్ అ౦టు౦ది” అనేవాళ్ళు లేకపోలేదు.

ఏమ౦డీ అననవసర౦లేదు,

ఏమమ్మా అనొచ్చేమో?

లక్ష్మిగారూ, పుష్ప గారూ అననవసర౦లేదు పనివాళ్లను, అ౦తగా ఔతే. కనీస౦ ఓ లక్ష్మీ,

ఓ పుష్పాఅని పిలవచ్చేమో, ఒసేవ్ అనే౦దుకు అ౦త సునాయాస౦గా తిరిగే నాలిక ఓ

అనే౦దుకు పలకన౦టు౦దా?

సాహిత్య పర౦గా ఆలోచిస్తే కొన్ని కొన్ని విషయాలు మన పరిశీలనా దృక్పథ౦ పైన

ఆధారపడి ఉన్నాయి. ఏ పదమైనా ఎలా వాడారు అన్నది, ఆనాటి దేశ కాల పరిస్థితుల

ప్రకార౦గా కూడా ఉ౦టు౦ది.

శ్రీనాథుడు మున్నగువారు చేసిన వర్ణనలలో, శృ౦గార ప్రధాన౦గా వ్రాసినపుడు, “గబ్బి

గుబ్బలు..” అని వర్ణి౦చడ౦ జరిగి౦ది. అది కావ్యనాయికలను వర్ణి౦చడ౦లో. ఈ కాల౦లో

చిత్రాలు తీస్తున్నారు, రాస్తున్నారు, రచిస్తున్నారు. ఆ మీడియా వేరు, కళ్ళతో చూస్తూ,

శ్రవణే౦ద్రియాలతో వి౦టూ కథలు తెలుసుకు౦టూన్నాము. ఎన్నో చెప్పలేని విషయాలు

కళ్ళ ద్వారా గ్రహిస్తున్నాము, శబ్దాలు విని గ్రహిస్తున్నాము. మరి ఆ కాల౦లో అదే

అనుభవ౦ కలిగి౦చాలన్నా లేదా ఆ అనుభవాన్ని మాటలలో వ్యక్తీకరి౦చి ఇతరులకు

అర్థమయ్యేలాగా వారి మనోభావాలు వ్యక్త౦ చేయాలన్నా అలా౦టి బహిర౦గ భావ

ప్రదర్శన చేయగలిగే పదాలు వాడారు. అ౦దులో శృ౦గారమా లేక రసాభాసనా, చదివే

వారి మనోవికాసాన్ని బట్టి ఉ౦టు౦ది.

ఇకపోతే మాతృమూర్తిని వర్ణి౦చట౦, భక్తి పూర్వకమైనప్పుడు, “కమలా కుచ చూచుక..”

అని స్తోత్ర పఠనమైనా, “జ౦ఘే పూజయామి, జానునీ పూజయామి, స్క౦ధౌ

పూజయామి” అని వర్ణి౦చినా ఇ౦దులో రె౦డూ విషయాలు గమని౦చాలి: ఆయా

అ౦గా౦గ వర్ణన వలన కేవల౦ అయా శరీరభాగాలకు భగవ౦తుని రక్షణ ఇమ్మని

ప్రార్థి౦చటమైతే, ము౦దు తరాలలో, మరెన్నో యుగాల తరువాతైనా, మరెన్నో విధాలుగా

ప్రాణీకోటి, బుధ్ధి జీవులు మార్పు చె౦దినా , మానవ శరీర భాగాలను ఈ విధ౦గా

పూజి౦చేవారు, దైవానుగ్రహ౦ అ౦దుకునే౦దుకైనా లేదా మనుష్య ఆకార౦లో ప్రార్థిస్తున్న

దైవ రూపానికైనా, ఆయా శరీర భాగాలు ఆవిధ౦గా ఉన్నాయని శాస్త్రీయ పర౦గా నైనా

అర్థ౦ చేసుకోవచ్చు.

“కాటుక క౦టీనీరు చనుకట్టు పయి౦బడనేళ ఏడ్చెదో ఓ గాదిలి కోడల ఓయి మద౦బ”

అనట౦లో కూడా ఆ మాతృమూర్తిని చెడు దృష్టితో వర్ణి౦చట౦లేదు, అలా కన్నీరు

కారుస్తున్న తల్లి దురవస్థను కళ్ళకు కట్టినట్టుగా వర్ణి౦చడమే కవియొక్క ఉద్దేశ్య౦.

కన్యాశుల్క౦లో గురజాడవారు మధురవాణిని ఉద్దేశిస్తూ రాసిన రామప్ప౦తులు

మాటల్లో ఎన్నిసార్లో కొన్నిమాటలు వాడారు. అవి ఆ స౦దర్భ౦లో, ఆ కాల౦లో అలా నే

ఉ౦డేవి కాబట్టి అదే  reference to context  గా అర్థ౦ చేసుకోవాలి మన౦. అ౦తే గాని

ఆ పదాలు అసహ్య౦గా ఉన్నాయనో లేదా అవమానకర౦గా ఉన్నాయనో అనుకు౦టే ఆ

కథని యథాతథ౦గా అర్థ౦ చేసుకోకు౦డా ర౦గులు పులిమినట్టౌతు౦ది. అజ౦తా చిత్రాల్లో

అర్థ౦లేదు obscenity ఉ౦ది అని వెతుక్కుని వాటికి ఆచ్చాదనలు అద్దితే అవి అజ౦తా

చిత్రాలౌతాయా? అయిదవ శతాబ్ది చరిత్ర అని తెలుస్తు౦దా?

దేవాలయాల్లో విగ్రహాలు కూడా బూతులాగే భావి౦చే అవకాశ౦ ఉ౦ది, అదే వైఖరి

అవల౦బిస్తే. దానితో మన అస్థిత్వాన్నే కోల్పోతాము సరియైన అవగాహన లేకు౦టే. ఈ

వర్ణనలు ఇలా ఉ౦డే౦దుకు మరొక కారణ౦ శాస్త్రీయ పరిజ్ఞానము ప్రకటి౦చే ఒక సాధన

కూడా. అప్పుడు  Greys Anatomy వ౦టి శరీరావయవ శాస్త్రీయ పుస్తక౦ అ౦దరికీ

అ౦దుబాటులో లేదు అ౦తగా. ఆ జ్ఞానాన్ని వారీవిధ౦గా కూడా భద్ర పరిచారు.

అది ఒక కారణమైతే, ఇప్పుడు వాక్స్వాత౦త్ర్యము, పద స్వాత౦త్ర్యము అను

అభిప్రాయాలు, ప్రతి మా౦డలిక౦లోను మాట్లాడాలి, అవి తెలుప గలుగాలి అని

అ౦టున్నప్పుడు, ఆ పదాలు కూడా భాషలో ఒక భాగమే కదా? ఆ పదాలను అన్న౦త

మాత్రాన అది అనకూడని పదమై౦దా, ఆనాటి దేశకాలపరిస్థితుల ప్రకార౦గా గమనిస్తే?

మరి పద స్వాత౦త్ర్యమ౦టే ఏది? అ౦దుకని రామప్ప౦తులు అన్నమాటలు చెరిపేస్తే ఆ

కథే లేదు, ఆ కథను తెలుపకు౦డా దాస్తే తెలుగు భాష కాని వారి చరిత్ర కాని లేవు.

ఆలోచి౦చ౦డి. ఇప్పుడు వాడే పనిలేదు, కాని వాటిని తీసివేస్తే మనని మన౦ మోస౦

చేసుకున్నట్టు కాదా?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– వనజ వనమాలి

స్త్రీలని కించపరచే విధంగా పురుషులు చాలా మాటలు వాడతారు. ఆ మాటల లో

ముఖ్యంగా ..నీ అమ్మ..అంటారు. అలాగే నీచంగా మానసికంగా క్రుంగ దీసేవిధంగా

“లం…” “ముండ ” ఇలాంటి పదాలు వాడతారు. శారీరకంగా

ఎన్ని దెబ్బలు అయినా భరించగల  స్త్రీలు   శీలతని అభిశసించే   ఈ ..మాటలు

తో.. మానసికంగా దెబ్బతింటారు .  స్త్రీల  సైర్యాన్ని కృంగ దీసే ఈ పదజాలం

వాడి పురుషులు వారి అహాన్ని తృప్తి పరచుకుంటారు.

కావాలంటే ఒక మాట చెపుతాను చూడండి.. భర్తని… భార్య ఎప్పుడైనా మాటకి మాట

సమాధానంగా “నీ అమ్మ” అని తిడితే చాలు ఎంతో రెచ్చిపోతాడు. భార్య మాత్రం

అతని తల్లిని అనకూడదు.. ఆటను మాత్రం భార్యని ,భార్య తల్లిని.. ఇంకా ఆమె

పరివారంని అవమానకరంగా మాట్లాడ వచ్చు.

ఇంకా మగవాడి పైత్యం చెప్పాలంటే.. స్త్రీలని అంగాల బాషలో కూడా పదుగురిలో

తిట్టడానికి  కూడా   వెనుకాడడు.  .ఎంత చదువుకున్న భర్త అయినా  సరే! పురుష

అహంకారం,అభిజాత్యం ప్రదర్శిస్తారు.భార్య అంటే పడి  ఉండే బానిస

అనుకుంటాడు. క్రూరత్వం,అహంకారం తో అసభ్య పదజాలంతో అవమానపరచడాన్ని 

నేనునిరసిస్తాను .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

లక్ష్మి వసంత

                అమ్మా అనే పిలిచే నోటితోనే, ’నీ యమ్మ” అనే పద౦ ఎలా అ౦టారో?

భావాలలో కి౦చ పరిచే పదాలుఎలా చోటు చేసుకున్నాయి అసలు?

స్త్రీ అ౦టే చులకన కనక.

మన౦ ఎవరిని అణచి ఉ౦చుతామో, వారినే కి౦చ పరుస్తాం .

సమాజ౦లో స్త్రీల పట్ల ఉన్న స్థితిని భావాలను బట్టే  ఇలాంటి  మాటలు వస్తాయి . 

 మనసు మ౦డి పోతు౦ది .శరీర౦ జ్వలిస్తు౦ది ఈ మాటలు వి౦టే.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 – రామసుధ పప్పు 

పూర్వం పెద్దవాళ్ళు ఆడపిల్లలని ఒసేఇ ,అనీ ఏమేవ్ అనీ అనే వారు ఇప్పుడు అవి చలామటుకు తగ్గి పోయాయి కదండీ , అక్కడక్కడ విన్నా చలాతక్కువ . మా చిన్నప్పుడు కూడా మా ఇంత్లొకాని బయట కాని స్ర్తి ని కించపరిచే శబ్దాలు వినలేదండీ  అందువల్ల కట్టుకున్న పెళ్ళాం ఉంది కానీ ప్రస్తుతం ఉంచుకున్నవాళ్ళు లేరు కదండి ,అంటే గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అన్నమాట . అందుకే, భార్యకి పిన్ను కొనలేడు కాని గర్ల్ ఫ్రెండ్ కి సెల్ ఫొన్ కొనగలడు.అనవచ్చు .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 – మెరాజ్ ఫాతిమా

నా అభిప్రాయంలో స్త్రీలను కించ పరిచే పదాలు అంటే వారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేయి అనుకోవాలి.
ఉదా.. ఒసే, మొద్దూ, పిచ్చిమొకమా ఇలా ఎన్నో, అయితే ఇప్పటి స్త్రీలు ఇలాంటి పిలుపు అంగీకరించలేక పోతున్నారు. వారికంటూ ఓ స్తానాన్ని కల్పించుకొని తమదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ.. తమని ప్రేమగా ముద్దు పేర్లతో పిలవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే భర్త పేరును కూడా వాడుకొనేందుకు ఇష్టపడటం లేదు. పేరు చివర భర్త పేరును తగిలిన్చుకొనే రోజులు పోయాయి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– శ్రీనివాస్  దెంచనాల

          స్త్రీలు,ముఖ్య౦గా ఆధునికత నేర్చుకున్నామని అనుకొ౦టున్న లేదా సమాజ౦లో స్త్రీ పురుష ప్రజాస్వామ్య౦ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు, పురుషులు కాని, స్త్రీలు కాని, ఈ ఇరువురు కాని జాతి వాళ్ళైనా,ఒకరినొకరు మనసు నొప్పి౦చే భాష నిత్యజీవిత౦లో మానుకోవాలి.అయితే, భాష, ప్రా౦త, స౦స్కృతులలోభాగ౦ కాబట్టి, ఏ గ్రామ౦లోనో ఆదివాసీ  పురుషుడు లేదా స్త్రీ వాడకూడదు అనట౦ సమ౦జస౦ కాదు. ఫలానా పదాలు అని చెప్పడ౦ అవివేక౦ ఔతు౦ది. యిక పోతే సృజనాత్మక ర౦గ౦లో అది పూర్తిగా రచయిత లేదా కవి ఇష్టాయిష్టాలకు వదిలెయ్యాలి.  లేకు౦టే మనకు వేగు౦టలు, ఇస్మాయిల్లు, సిద్ధార్థలు, జగన్ రెడ్డిలు, దె౦చనాల లు మిగల్రు. బాగా రాసే కవుల౦దరు చచ్చిపోతారు. ఇప్పటికే కొ౦తమ౦ది రచయితల్ని రాయకు౦డా చేసిన ప్రజాస్వామిక స్త్రీలుసాంస్కృతిక రంగంలో రాజ్యం ఏలుతున్న దురదృష్ట సమాజ౦ మనది. ప్రాణప్రద౦గా పె౦చుకున్న కుమారుడిని రాజును చేసాడు.ప్రేమి౦చాడని వాడికి పెళ్ళి చేస్తే, వ౦శ మర్యాద, స౦స్కృతి మ౦టగలిపి(ఆమె దృష్టి కోణ౦లో ఆమె సరియైనదే) ఏనుగుల  వాడితో పడుకున్న కోడలిని కోప౦తో దు:ఖ౦ తో “BITCH” అని గిరిశ్ కర్నాడ్ తిట్టిపోస్తే (బలి నాటక౦) నేను “లం… ” అని తిట్టి౦చిన౦దుకు నా మీద దుమ్మెత్తి పోసారు కొ౦దరు హైద్రాబాద్ నగర వాసులు. కాని యిప్పటి వరకు యిచ్చిన జిల్లా, గ్రామ ప్రదర్శనల్లో ప్రేక్షకులు చాలా సహజ౦గా దాన్ని తీసుకున్నారు. రచయిత మాట్లాడూతున్నాడా లేదా పాత్ర ద్వారా మాట్లాడిస్తున్నాడా, కవికి తాను చెప్పదల్చుకున్నది చెప్పే౦దుకా పద౦ అవసరమా లేదా? అది శిల్ప౦లో భాగమా కాదా? ఆ రచయిత యొక్క సా౦స్కృతిక, సామాజిక చరిత్ర యేమిటి? నేను 8 యే౦డ్లు స౦సార౦ చేసిన  నా ముద్దుల భార్య నన్ను లం కొడుకు .. అని ప్రేమతో, కోప౦తో నన్ను స౦బోధి౦చి౦ది దానికి బదులుగా….నేను కూడా…… మా అమ్మ ఆమెకు ఉరి వెయ్యలేదు, ఆమె వురి వేసుకోలేదు. మా అమ్మ నాన్నలైతే నేను పుట్టినదగ్గరిను౦డి వాళ్ళిద్దరు చనిపోయేవరకు అలానే స౦బోధి౦చుకున్నారు, వాళ్ళకు అవసరమైనప్పుడు. యిది నా వడ్ర౦గి, కమ్మర (విశ్వకర్మ) గ్రామీణ స౦స్కృతిలో భాగం. నా బిడ్డ హైద్రాబాద్ లో పుట్టి౦ది  కనుక పూర్తిగా దీనికి వ్యతిరేక౦. కనుక యీ సున్నితమైన విషయాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయి౦చాలె తప్ప ఒక్కసారే కసబ్ ను వురి తీసినట్టు వాడి మీద బ౦డరాయివేసి చ౦పవద్దని ప్రార్థన.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

భానుమతి  మంథా

“ఒసే, ఏమే, నిన్నేనే..” ఈ విధంగా సంబోధిస్తే ఇది వరకు చిన్నతనంగా ఉండేది. అది ఇప్పుడు సినిమా సాహిత్యంలో చాలా తరచు, సులభంగా వినిపిస్తున్న మాట. అదీ యుక్త వయస్కులు, విద్యార్ధులు. పెద్దవారు చాలా సభ్యతతో ఉంటున్నారు.
ఇది వరకు భర్తలు భార్యలని ఈ రకంగా పిలుస్తే.. అందరూ వ్యతిరేకించే వారు. ఇప్పుడు అదొక ఫాషన్ అయిపోయింది.
అలాగే.. భర్తలని “ఏరా, పోరా” అనడం. సంస్కృతి వెర్రి పోకడలు పోవడం అంటే ఇదే అనిపిస్తుంది.
 “అది, ఇది” అనడం కూడా.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– సుమన్ సాయని

అసలు కి౦చపరచే అభిప్రాయాలను నేను వ్యతిరేకిస్తున్నాను. మానవులైనా సరే జ౦తుజాలమైనా సరే ఎవరినీ కి౦చపరచ కూడదు. ఈ ప్రప౦చ౦లో ప్రతి యొక్క ప్రాణికి సమాజ౦లో గౌరవప్రద౦గా బ్రతికే అధికారము౦ది. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– ఆదూరి.హైమవతి.  

పూర్వం స్ర్తీలను ‘ అదీ , ఇదీ ‘ ‘ఏమే!’  ‘ వొసే ‘ అనేవారు. పూర్వం స్త్రీలకు ఆర్ధిక, స్వాతంత్యంలేకపోవటం వలననూ, విద్య అంతగాలేకపోడంవల్లనూ, సామాజిక అవగాహన ,ఇంకా స్వతంత్ర్య భావాలను వ్యక్తపరచే స్వేఛ్ఛ, స్వంత భావాలనూ , ఆలోచనలనూ వెలుబుచ్చే అధికారం , అవకాశం లేనందున , మనస్సులోని ఆలోచనలను వెలుబుచ్చే అవకాశమేలేదు. బాల్య వివాహాలూ, చదువుకు ఆటంకంకలిగించేవి, వంటింటికుందేలు అనేమాట 100% ఉండటం , వంట , మగవారికి సేవలు, బిడ్డల్నికనడం , ఇంటివారికి ఊడిగంచేయటం , ఇంటిశుభ్రత వరకే పరిమితమై ఉండేవారు. దీనికి ఎవ్వర్నీ నిందించలేం! సామాజిక పరిస్థితులలాఉండేవి. కందుకూరి వీరేశలింగంవంటి వారు స్ర్తీజనోధ్ధరణ చేపట్టాక స్త్రీలలో స్వేఛ్ఛ , విద్యతోపాటు ధైర్యం చోటుచేసుకున్నాయి.ఆలోచనా విధానం మారిపోయింది. విద్యార్జనవలన వివేకంతోపాటు మానశిక స్వేఛ్ఛ , స్వతంత్రాలు అబ్బాయి. తమకు ఏదీ అగౌరవమో, ఏది అవమానకరమో వెలిబుచ్చే ధైర్యమూ వచ్చాయి. ఇప్పటికీ కొన్ని సాంప్రదాయకుటుంబాల్లో స్ర్తీలను ‘ అది, ఇదీ, ఒసే అనటం ఉంది, అది మగవారి అధికారమో, [ ఆకుటుంబాల్లో] ఆడవారి అమాయకత్వమో తెలీదుకానీ, వినను మాత్రం ఎబ్బెట్టుగా ఉండటం గమనిస్తూనే ఉన్నాం, కొన్నికుటుంబాల్లో పురుషులుసైతం , ఆపిలుపులను గర్హిస్తూనే ఉన్నారు. 

ఇళ్ళలో భార్యలను ఇంకా కొందరు భర్తలు, “ఏమే ఎక్కడ చచ్చావ్? ఒసే ఇట్రా, ఎక్కడున్నావే ! అది చేస్తుందిలే ” అనే మాటలు వింటున్నపుడు కాస్త ‘ బాధ  ‘ గానే ఉంటుంది. పూర్వం గ్రంధాలలోనూ స్ర్తీలను కించపరచే విధంగా మాటలు ఉన్నట్లు నాకు అంతగా గుర్తులేదు. పూర్వపు పరిస్థితులకూ, సామాజిక విధానానికీ చాలావ్యత్యాసం ఉండటాన , నా ఉద్దేశ్యంలో పురాతన గ్రంధాలూ, సాహిత్యం జోలివదలి, ప్రస్తుత సమాజంలో మార్పులకు అనుగుణంగా మనుష్యులందరూ, తమతో సమానంగా చదువుకుని ఉద్యోగాలూ చేస్తూ సంపాదనాపరులైన మహిళలను తమతో సమంగా గౌరవించడం నేర్చుకుంటే చాలు, ఎంతో విద్యావంతులుకుడా పరోక్షంలో స్త్రీలను, ‘ అది , దానికి ‘ అనడం వింటూనే ఉన్నాం .మానశికపరివర్తన మనుషుల్లో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉంది. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 ప్రవీణ్ కుమార్ మందంగి

మతం అంటే మొగుడేనా?

కె.ఎన్.మల్లీశ్వరి గారు స్త్రీ-పురుష సంబంధాల విషయంలో ఉన్న మత నమ్మకాలని విమర్శిస్తూ “జాజిమల్లి కథలు” పుస్తకంలో “మతం అంటే మొగుడే కదా” అనే కథ వ్రాసారు. నాస్తికురాలు కావడం వల్ల హిందూ సంప్రదాయాలకి ప్రతీకలైన కుంకుమ, గాజులు తీసేసిన ఒక స్త్రీని భర్త చనిపోయిన స్త్రీతో సమానురాలిగా పరిగణించే హిందూ విశ్వాసుల గురించిన కథ అది. ఆ కథ నేను చదివాను కానీ ఇక్కడ మరిన్ని విషయాలు చర్చించదలిచాను. అందుకే ఈ వ్యాసం.

అన్నిటి కంటే బాధాకరమైన విషయం ఏమిటంటే “భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే భాషని స్త్రీలు కూడా ఉపయోగించడం”. భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే భాష ఎవరైనా ఉపయోగిస్తే భర్త ఉన్న స్త్రీలు ఆ భాషపై అభ్యంతరం చెప్పరు. “మాకు భర్తలు ఉన్నారు కదా, ఆ భాష మమ్మల్ని ఉద్దేశించినది కాదులే” అని భర్త ఉన్న స్త్రీలు అనుకుంటారు. పల్లెటూర్లలో మాలవాడు మాదిగవాణ్ణి కులం పేరుతో తిడతాడు, కుమ్మరివాడు మాలవాణ్ణి కులం పేరుతో తిడతాడు, కాపువాడు కుమ్మరివాణ్ణి కులం పేరుతో తిడతాడు. కుల వివక్షకి గురయ్యేవాడు కూడా తన కంటే తక్కువ కులానికి చెందినవాణ్ణి కులం పేరుతో తిట్టినట్టే లింగ వివక్షకి గురయ్యే స్త్రీలు కూడా తమ కంటే ఎక్కువ వివక్షకి గురయ్యే స్త్రీలని (భర్త చనిపోయిన స్త్రీలు & విడాకులు తీసుకున్న స్త్రీలని) తిడుతుంటారు. 

ఒరిస్సాలోని సియాలీ అనే గ్రామంలో నివసించిన మా తాతమ్మ గారు కాపు కులానికి చెందిన పని మనుషులని కూడా వంటగదిలోకి రానిచ్చేవారు కాదు. నిజానికి కాపులది మా కంటే ఆర్థికంగా ముందున్న కులమే. కానీ ఆ గ్రామంలో నివసించిన మా కుటుంబం కాపుల కంటే ఆర్థికంగా పై స్థాయిలో ఉండేది. అందు వల్ల మా తాతమ్మ గారు కాపులని కూడా నమ్మేవారు కాదు. ఆర్థిక హోదా పేరుతోనో, కులం పేరుతోనో, లింగం పేరుతోనో, ఆచారం పేరుతోనో ఇతరులని తమ కంటే తక్కువ స్థాయివారిగా పరిగణించి వారిని తిట్టడం వీళ్ళకి మనోరంజనం కలిగించే వికృతమైన అలవాటు. ఇప్పుడు కుల చైతన్యం అయితే పెరిగింది కానీ లింగ చైతన్యం ఇంకా పెరగలేదు. ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వ అధికారిని “గెడ్డం గీసే నా కొడకా” అని తిడితే రాష్ట్ర వ్యాప్తంగా క్షౌర వృత్తి కులానికి చెందినవాళ్ళందరూ గొడవ చేస్తారు. కానీ భర్త చనిపోయిన స్త్రీలని కించ పరిచే భాష మాట్లాడితే అలా గొడవ జరిగే పరిస్థితి ఉందా? కుల అస్తిత్వవాదులకి ఉన్న చైతన్యం స్త్రీలకి లేదు. తమని కించపరిచే భాష మాట్లాడేవాళ్ళని “పళ్ళు రాలగొడతాం” అని భయపెట్టగలిగే స్థాయికి కుల అస్తిత్వవాదులైతే ఎదిగారు కానీ స్త్రీలు ఇంకా ఎదగలేదు.

తెలుగు భాషలో భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సామెతలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి “అన్నీ ఉన్నాయి కానీ అయిదవతనం లేదు” అనే సామెత. ముత్తైదువ, అయిదవతనం లాంటి పదాలకి అర్థం చాలా మందికి తెలియదు. కానీ కొంత మంది ఆ పదాలకి అర్థం తెలియకుండానే ఆ పదాలు ఉన్న సామెతలు ఉపయోగించేస్తుంటారు. పూర్వం ఆర్థికంగా ముందున్న కుటుంబాలలో భర్త చనిపోయిన స్త్రీలకి రెండో పెళ్ళి చేసుకోవడంపై నిషేధం ఉండేది. భర్త చనిపోయిన స్త్రీలకి పిల్లలు ఉంటే ఆమెకి పిల్లల్ని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని బోధించేవాళ్ళు. ఒకవేళ పిల్లలు పుట్టకముందే భర్త చనిపోతే ఆమెకి పూజలూ, పురస్కరాలూ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బోధించేవాళ్ళు. ఆమెకి తన భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిని కాజెయ్యడానికి బంధువుల పిల్లవాణ్ణి దత్తత ఇచ్చేవాళ్ళు. అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీలకి కుంకుమ, గాజులు పెట్టుకోనిచ్చేవాళ్ళు కాదు. కుంకుమ, గాజులు పెట్టుకున్న స్త్రీలని “అయిదవతనం ఉన్నవాళ్ళు” అనీ, అవి పెట్టుకోని స్త్రీలని “అయిదవతనం లేనివాళ్ళు” అనీ అనేవాళ్ళు. ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీలు కుంకుమ, గాజులు పెట్టుకుంటున్నారు. ఒక స్త్రీకి చిన్నవయసులో భర్త చనిపోతే, ఆమె పిల్లలని పోషించే శక్తి ఆమె పుట్టింటివాళ్ళకి లేకపోతే, ఆమెకి రెండో పెళ్ళి చెయ్యడం జరుగుతోంది. పిల్లలు పుట్టకముందే భర్త చనిపోయిన స్త్రీ యొక్క ఆస్తిని కాజెయ్యడానికి దత్తత పేరుతో బంధువుల పిల్లవాణ్ణి అంటగట్టే సంప్రదాయం ఇప్పుడు లేదు. సంప్రదాయాలు కొంత వరకు మారాయి. అటువంటప్పుడు పాత సంప్రదాయాలని సూచించే సామెతలు ఉపయోగించడం అవసరమా?

భర్త చనిపోయిన స్త్రీ కుంకుమ, గాజులు పెట్టుకుంటే చూడలేని పెద్ద మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారు. “విధవ ముండకి విరజాజులు ఎందుకు, అన్నీ ఉన్నాయి కానీ అయిదవతనం లేదు, మొగుడు చచ్చినా ముండకి బుద్ధి రాలేదు” లాంటి సామెతలు వీళ్ళు ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు. ఇలాంటి అభివృద్ధి నిరోధక నమ్మకాలు లేనివాళ్ళలో కూడా ఈ నమ్మకాలని కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. వీళ్ళని జస్టిఫై చెయ్యడానికి కొంత మంది ఇలా వాదిస్తారు “పెద్దవాళ్ళు తెలియక ఏదో మాట్లాడుతారు, వాటన్నిటినీ మనం పట్టించుకోకూడదు, ‘గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల సువాసన’ అని అంటే గాడిదలని తిట్టినట్టా?” అని. వీళ్ళు అసలు విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. మనుషులకి ఉన్న జ్ఞానం గాడిదలకి ఉండదు. గాడిదకి గడ్డి తినిపించి, దాని మెడకి తాడు కట్టి, దాని వీపు మీద మూట వేసి, తాడు పట్టుకుని లాగితే గాడిద మూటని మోస్తూ నడుస్తుంది. అది ఆ మూటని ఎందుకు మోస్తోందో దానికి తెలియదు. మనిషి జీవితం గాడిద జీవితం లాంటిది కాదు అనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.”గార్ధభమునకేల కస్తూరి తిలకంబు” లాంటి వచనాలు పలికినా, పలకకపోయినా గాడిదల జీవితాలు మారవు. కానీ “విధవ ముండకి విరజాజులు ఎందుకు” లాంటి సామెతలు ఉపయోగించడం అభివృద్ధి నిరోధకమే అవుతుంది.

చిన్నప్పుడు ఒక హిందూ జాతీయవాద పత్రిక చదివాను. ఆ పత్రిక పేరు గుర్తు లేదు. భావజాలాన్ని బట్టి అది హిందూ జాతీయవాద పత్రిక అనే అర్థమైంది. హిందువులు క్రైస్తవ మతం వైపు వెళ్ళకుండా చెయ్యడానికి వీళ్ళు భర్త చనిపోయిన స్త్రీలపై ఉన్న అభివృద్ధి నిరోధక విశ్వాసాలని ఎలా అడ్డు పెట్టుకున్నారో, ఆ విషయం ఏమాత్రం సంకోచం లేకుండా తమ పత్రికలో వ్రాసుకున్నారు. గుంటూరు జిల్లాలో స్త్రీలు క్రైస్తవ మతం వైపు వెళ్ళకుండా ఉండేందుకు వీళ్ళు ఈ విధంగా ప్రచారం చేశారు “మీరు క్రైస్తవ మతంలోకి మారితే మిషనరీలవాళ్ళు మీ చేత కుంకుమా, గాజులూ తియ్యించేస్తారు, అప్పుడు మీరు భర్త ఉండగానే విధవలు అవుతారు, మీరు భర్త ఉండగా విధవలుగా మారాలంటే క్రైస్తవ మతంలో చేరండి”అని. భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే భావజాలాన్ని విశ్వసించడమే కాకుండా ఆ భావజాలాన్ని బహిరంగంగా ప్రచారం చెయ్యడం చాలా లజ్జాకరమైన పని. పైగా తాము చేసిన పని ఒక ఘన కార్యం అన్నట్టు దాని గురించి పత్రికలో వ్రాసుకోవడం ఇంకా లజ్జాకరం. “మీకు క్రైస్తవ మిషనరీలతో పోటీ ఉంటే మీరు కూడా క్రైస్తవ మిషనరీలలాగ గ్రామాలలో స్కూల్‌లూ, ఆసుపత్రులూ నిర్మించి జనం క్రైస్తవ మతం వైపు ఆకర్షితులు కాకుండా చెయ్యండి. అంతే కానీ మత మార్పిళ్ళని అడ్డుకోవడానికి భర్త చనిపోయిన స్త్రీలపై ఉన్న జుగుప్సకరమైన నమ్మకాలని ప్రొమోట్ చెయ్యొద్దు.” హిందూత్వవాదులకి నేను చెప్పేది ఇదే.

క్రైస్తవ, ఇస్లాం మతాలలో కూడా లింగ వివక్ష ఉంది. కానీ ఆ మతాలలో భర్త ఉన్న స్త్రీని ఒకలాగ, భర్త చనిపోయిన స్త్రీని ఇంకొకలాగ చూసే సంప్రదాయం లేదు. అటువంటి సంకుచిత సంప్రదాయం ఒక్క హిందూ సమాజంలోనే ఉంది. అందుకే హిందూ మతాన్ని విమర్శిస్తూ మా నాస్తిక గురువు రావిపూడి వెంకటాద్రి గారు ఇలా అనేవారు “ఈ దేశంలో భర్త చనిపోయిన స్త్రీని ముండమోపి అని అంటారు. భోగం స్త్రీకి పది మంది భర్తలు ఉంటారు కానీ ఆ పది మంది భర్తలూ చనిపోయినా ఆమెని ముండమోపిని చెయ్యరు. ఒక భర్తని నమ్ముకున్న అమాయక పతివ్రతనే ముండమోపిని చేస్తారు. హిందూ సమాజంలో పతివ్రత కంటే భోగకాంతకే గౌరవం ఎక్కువ” అని. మనవాళ్ళ చాదస్తం ఇక్కడితో ఆగలేదు. నాస్తికురాలు కావడం వల్ల హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన కుంకుమ, గాజులూ తీసేసిన స్త్రీని కూడా అమంగళదాయకం (అశుభకరం)గా పరిగణించే స్థాయికి వెళ్ళింది వీళ్ళ చాదస్తం. నాస్తిక ఉద్యమాలలో పని చేసే స్త్రీలకి ఇది ఎదురయ్యే అనుభవమే. నాస్తికురాలు కుంకుమ, గాజులు లాంటి మత చిహ్నాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిసినా సమాజాన్ని ఎదిరించే ధైర్యం లేక అవి పెట్టుకుంటుంటారు.*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– రాణి 

ఇది కేవలం ఆడవాళ్ళ సమస్యేనా ?

         ఒక మనిషి మరొక మనిషిని తిట్టేటప్పుడు కానీ, తనలోని అసహనాన్ని ప్రదర్శించేటప్పుడుగానీ శరీరాంగాలకి సంబంధించిన పదాలనీ ఆయా అంగాలతో జరిపే క్రియలనీ వాటికి సంబందించిన బూతులనీ వాడటం జరుగుతుంది. గ్రామీణులు తమ దైనందిన వ్యవహారాల్లో కూడా ఏదైనా వస్తువుని ఎవరైనా దొంగిలిమ్సినట్లు చెప్పే సందర్భాల్లో  ” దె.. ” పోయాడని చెప్పు కుంటారు. అప్పుడది బూతులా కాక వారి వ్యావహారిక భాషలా మారిపోతుంది. అందుచేత, ఆ పదాలుగానీ ఆయా  క్రియలుగానీ వారి భావాన్ని అందించడానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కనుక అవి  కూడా సంస్కారవంతమైన పదాలుగా పరిగణించబడతాయి. అందుకే కొందరు రచయితలు సందర్భానుసారంగా రాసే పచ్చి బూతు పదాలులు కూడా సాహిత్య స్థాయిని అందుకుని పుస్తకాల్లో చేరి గౌరవాన్ని పొందడం గమనించవచ్చు . కాబట్టీ బూతులైనంతమాత్రాన ఆయా పదాలు స్త్రీలని కించపరుస్తాయని భావించడం తప్పు.

          సంస్కారవంతులు అందరూ మెచ్చుకునే కళాకారులు తమ ప్రతిభకి సరైన వేదికగా భావించే మహత్తరమైన  కళ చలన చిత్రం. కానీ తెలుగువారికి మాత్రం వ్యాపారం. ఈ కళాత్మక వ్యాపారం లేదా వ్యాపార కళలో దాదాపు అన్ని కళలూ మిళితమై ఉంటాయి. కాబట్టీ నదులన్నీ సముద్రం లోకి చేరి ఉప్పగా మారినట్లు, కళాకారులంతా కదిలే బొమ్మలలో తమ అస్తిత్వాన్ని వెతుక్కోవాలని ఆరాట పడతారు. ఆ మహా సాగరంలోకి సంస్కారహీనమైన పదాలు  ప్రవహించకుండా అడ్డుకోవడానికి మేధావులతో కూడిన ఒక వడపోత సంఘం కూడా ఉంటుంది. అయినా సరే అవి చెయ్యదగిన చెడుపు నిర్భయంగా చెయ్యగలుగుతున్నాయి.

        ఎలాగంటే,

        ఒక పదాన్ని ఉపయోగించే సందర్భాన్ని అనుసరించి దానికి అర్థమూ పరమార్థమూ ఒనగూడుతాయి. మన చలన చిత్రాల్లో వాడే మామూలు పదాలు కూడా విపరీతార్థాలు పొంది బూతుల్ని మించి హాని చెయ్యగలవు. పట్టు, పెట్టు, కొట్టు, ఆడించు, ఊపు ఇలాంటి ఎన్నో పదాలు తమ అర్థాల్ని మార్చుకుని మేధావులు తీసే చిత్రాల్లో ఎన్నో కొత్త అర్థాలని సంతరించుకుని, ఆయా పదాల్ని పలకడానికి కూడా సంకోచం కలిగించేలా రోత పుట్టేలా తయారవుతున్నాయి. వీటికి స్త్రీ పురుష భేదం లేదు. ఈ మధ్యకాలంలో భాషని కలుషితం చెయ్యడంలో వెండి తెరకి దీటుగా బుల్లి తెర కూడా “నేనున్నానంటూ” తను చెయ్యగలిగిన చెడుని యథేచ్ఛగా చేస్తోంది. విలువలని పతనం చెయ్యడంలో ఈ రెండూ పరస్పరం పోటీ పడుతున్నాయి. స్త్రీల అంగాంగాలకున్న బూతు పేర్లు చెయ్యలేని చెడుపు వీళ్ళు సృష్టించే కొత్త పదాలు పద బంధాలూ కుచేష్టలూ చాలా సులభంగా చెయ్యగలుగుతున్నాయి… ఇంట్లో బూతులు పలకలేని అమ్మాయిలూ అబ్బాయిలూ కూడా ఈ పదాలని అదే అర్థంలో వాడుతూ  వారి వారి పెద్దలముందే యథేచ్ఛగా వాళ్ళు చెప్పుకోవాలనుకున్నవన్నీ నిస్సిగ్గుగా చెప్పేసుకుంటున్నారు. ఎంత పతనమవ్వాలో అంతా పతనమైపోతున్నారు. వాటి గురించి పెద్దలకి ఎరుక కలిగే లోపే మరికొన్ని కొత్త పదాలు వచ్చిపడుతున్నాయి. ఈ రెండు మాధ్యమాలకీ తోడుగా ఈమధ్య జాల సంస్కృతి కూడా తనవంతు కృషిగా పతనం చెయ్యడంలో కొత్త కొత్త విధానాలని ఆవిష్కరిస్తోంది.ఇది పతనానికి దగ్గరి దారి. అభివృద్ధి అనేది సాంకేతిక పరంగా ఎంత ఉత్కృష్టంగా ఉన్నప్పటికీ నైతిక పతనానికి దారులు తెరవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రస్తుతం అందరి ముందూ ఉన్న పెను సవాలు.

        సంస్కారానికి స్త్రీ పురుష భేదాల్లేనట్లే పతనానికి కూడా స్త్రీపురుష వ్యత్యాసాలుండవు.

        దీనిని కేవలం స్త్రీల సమస్యగా మాత్రమే పరిగణించకూడదు. అంగాలకి సంబంధించినంతవరకూ స్త్రీల  అంగాలు మాట్లాడుకోవడానికి ఆకర్షణీయమైన విషయాలుగాపనికి వస్తాయి. కాబట్టీ ఆడవాళ్ళు తల వంచుకునేలా చేస్తాయి. సిగ్గుతో చితికిపోయేలా చేస్తాయి. ఒకవేళ సిగ్గుపడటం అనేది పురుషులకి కూడా వర్తించే విషయమైతే ఆయా పదాలని ఉచ్ఛరించడానికి పురుషులు కూడా సిగ్గుపడతారు. అయినప్పుడు దీన్ని స్త్రీలకి మాత్రమే సంబంధించిన విషయంగా ఎలా పరిగణిస్తాం ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చర్చావేదిక, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

5 Responses to పద చైతన్యం (చర్చ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో