ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటిసారిగా నాట్యంలో యు.జి.సి అందించే జూనియర్
రిసెర్చ్ ఫెలోషిప్ కి అర్హత సాధించి కూచిపూడి లో పి .హెచ్.డి పట్టా పొందిన
అనుపమ కైలాష్ గారితో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి………
*నమస్కారం అమ్మా.*మీ పూర్తి పేరు ?
నమస్కారం,అనుపమ కైలాస్ ,
అమ్మ పేరు గాయిత్రి , నాన్న పేరు రవి ప్రకాష్
*మీ స్వస్థలం ?
హైదరాబాద్
*మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?.
మా అమ్మ కథక్ నృత్య కళాకారిణి , వేదాంతం జగన్నాధశర్మ గారి వద్ద కూచిపూడి నేర్చుకుంది. మా తాతయ్య గారు అంటే అమ్మ వాళ్ళ నాన్న హిందుస్తానీ సంగీత కళాకారుడు. ఆ విధంగా చిన్నప్పటి నుండి ఆసక్తి స్వతహాగానే వచ్చింది .
*మీరు నాట్యం ఏ వయస్సులో ఉండగా నేర్చుకోవడం ప్రారంభించారు ?
ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టాను .
*మీ తొలి గురువు ఎవరు ? వారి గురించి?
నా తొలి గురువు జయశ్రీ మహదేవన్ గారు, ఆయన వద్ద భరత నాట్యంలో అయిదు సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆ తరవాత జయ లక్ష్మి నారాయణ్ గారి వద్ద నాలుగుసంవత్సరాలు శిక్షణ పొందాను.
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు జరిగింది ?
నాకు తొమ్మిది సంవత్సరాలు అనుకుంటా తొలి ప్రదర్శన ఇచ్చాను.
*మరి కూచిపూడి వైపు ఏవిధమగా ఆకర్షితులయ్యారు?
కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నాట్యం కూచిపూడి అనగానే తెలుగుదనం తెలుగు సంస్కృతి కన్పిస్తుంది. కూచిపూడి యక్షగాన ప్రక్రియ నాటకీయత ఉంటుంది. అందుకే కూచిపూడి అభ్యసించాల కున్నాను.
*మీ కూచిపూడి గురువు ?
డా. ఉమారామారావు గారు వద్ద కూచిపూడి అభ్యసించాను.
*మరి కూచిపూడి అరంగ్రేటం ఎప్పుడు? ఎక్కడ జరిగింది ?
డా.ఉమారామారావు గారి అధ్వర్యంలో రవీంద్రభారతిలో కూచిపూడి అరంగేట్రం చేసాను
*కూచిపూడి అరంగేట్రం రోజు మీరు ఇచ్చిన ప్రదర్శన వివరాలు మాకు తెలియ జేస్తారా ?
రవీంద్ర భారతిలో లలితా సహస్రం నుంచి నామాలు అన్నమయ్య కీర్తనలు, రామ చరిత మానస్ తులసి దాస్ హిందీ భజనలు, భామా కలాపం దర్వు ప్రదర్శించాను.
*మీరు ఎంత వరుకు చదువుకొన్నారు ?
నేను ఇంటర్ వరుకు సెయింట్ ఫాల్స్ కాలేజి లో చదివాను. తరవాత పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం లో కూచిపూడి నాట్యం లో డిగ్రీ ప్రారంభించడంతో మా గురువుగారు డా.ఉమరామారావు గారు అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్టమెంట్ గా ఉన్నారు. అప్పుడు కూచిపూడి నాట్యంలో డిగ్రీ చేసాను.
*మీరు యు.జి.సి నిర్వహించే పరీక్షలో అర్హత సాధించి పి .హెచ్.డి చేసారు కదా వాటిగురించి చెప్పండి ?
అవునండి 1999 లో యు.జి.సి వారి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ తరవాత సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కూడా వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పి .హెచ్.డి. చేసాను.
మీరు పి .హెచ్.డి చేసిన అంశం ? ఎవరి పర్యవేక్షణలో పి .హెచ్.డి చేసారు ?
నేనుపి.హెచ్.డి చేసిన అంశం ” The Shringara Sankeertanas of Annamayya and suitability to dance – with special reference to nayika bhavas” డా,అనురాధా జొన్నగడ్డల గారి పర్యవేక్షణలో 2006 లో మార్చిలో పి .హెచ్.డి సిద్దాంత గ్రంధాన్ని సమర్పించాను.
*మీకు ఆలయ నృత్యం లో కూడా ప్రవేశం ఉంది కదా? అసలు ఆలయ నృత్యం నేర్చుకోవాలని ఎందుకు అనిపించిది ?
ఆలయ నృత్యం అంటే నేను అభ్యసించింది “విలాసిని నాట్యం” ఇది ఆలయ నృత్యానికి సంబంధించినది. తమిళనాడు వారి భరత నాట్యం ఆలయ సాంప్రదాయ పద్దతికి చెందినది. అలాగే మనకు ఒక ప్రతేకమైన ఆలయ సాంప్రదాయం ఉంది. నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది.
*మిమ్మల్ని ఆలయ నృత్యం నేర్చుకోవాలని అంతగా ప్రభావితం చేసిన సంఘటన ఏమిటి ?
పన్నెండు సంవత్సరాల క్రితం రంగాబాద్ లో ‘పద్మ భూషణ్’ స్వప్న సుందరి గారి విలాసిని నాట్య ప్రదర్శన చూసాను.
*”విలాసిని నాట్యం” ఎవరి వద్ద అభ్యసించారు?
పద్మభూషణ్ స్వప్నసుందరి గారి వద్ద అభ్యసించాను.
*మీరు ఎన్ని ఇచ్చిన ప్రదర్శనలు యిచ్చారు ?
నేను సుమారు గా 600 వందల ప్రదర్శనలు ఇచ్చాను .
*మీకు బాగా గుర్తున్న ప్రదర్శనలు మా విహంగ చదువరుల కోసం కొన్ని చెప్పండి ?
వాటిలో నాకు బాగా నచ్చినవి కూచిపూడి మహోత్సవ్ బొంబాయిలో ,నాట్యాంజలి చిదంబర స్వామీ ఆలయంలో చేసాను అది ,పల్లవాన్ ఫెస్తువల్ బెంగుళూర్ ,కాళిదాస్ సమరోత్సవ్ ఉజ్జయిని ,భాగవత మేళ నాటక మహోత్సావ్ , కేరళలో మొదలైన ప్రదర్శనలు.
*మీరు గురువుగా ఎప్పటి నుండి నృత్య శిక్షణ ఇస్తున్నారు?
సుమారుగా పదిహేను సంవత్సరాల నుండి గురువుగా శిక్షణ ఇస్తున్నాను.
*మీ నృత్య శిక్షణాలయం పేరు, ఎపుడు ప్రారంభించారు ?
” అనుభవ్ సెంటర్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ “ని 2002 లో ప్రారంభించాను.
*ఇప్పటి వరుకు మీరు రూపొందించిన వాటిలో మీకు నచ్చిన నృత్య రూపకాలు ?
అన్ని నచ్చుతాయి , ఎందు కంటే ప్రతిది ఎంతో శ్రద్దగా , ఇష్టం తో చేస్తాము కదా. బాగా నచ్చినవి అంటే కృష్ణం వందే జగద్గురం , రాసలీలా ఇది కథక్, కూచిపూడి కలిపి చేసాము.వసంతోత్సవ, శరత్ పూర్ణిమలతో సాగుతుంది.
*మీకు నృత్యం లో కాకుండా ఇంకా వేటిలో ప్రవేశం ఉంది?
హిందుస్తానీ సంగీతంలో అఖిల భారత గంధర్వ మహా విద్యలాయ్ నుండి సంగీత విశారద డిగ్రీ పూర్తి చేసాను . ఇంకా నాట్యానికి సంబందించి వ్యాసాలు రాస్తుంటాను ,
*మీరు రాసిన వ్యాసాలూ, ఉపన్యాసాలు గురించి చెప్పండి?
నేను మొదటి సారి రాసిన వ్యాసం బొంబాయి నుండి వెలువడే సాంస్కృతిక పత్రికలో వచ్చింది ఆ వ్యాసం ‘India and World Arts and Crafts’.భారతీయ విద్య భవన్ లండన్ లో 1995 లో Classical dances of India, with special reference to Kuchipudi’, హిందూ దేవాలయ సొసైటి టొరంటో, లో “Rasa theory and Nava Rasas”, తమిళ్ సొసైటి లండన్ లో, కెనడాలో నృత్తం.నృత్యం ,నాట్యం అంశాల పై ఉపన్యాసాలు ఇచ్చాను . ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో ccrt వారి అధ్వర్యంలో నిర్వహించిన దానిలో నాలుగు ఉపన్యాసాలు ఇచ్చాను.2007 చెన్నై లో “సంగీతం ఇన్ విలాసిని నాట్యం” అనే అంశం పై నాట్య కళ సమావేశంలో ఉపన్యసించాను.
*మీ వద్ద ఎంత మంది విద్యార్ధులు నాట్యం నేర్చుకుంటున్నారు , మీరిచ్చే శిక్షణ ఏవిదంగా ఉంటుంది?
మన వద్ద ఎంత మంది విద్యను అభ్యసిస్తున్నారు అనే దాని కంటే, మనం ఎంత మందికి శిక్షణ ఇవ్వగలం. అనేది ముఖ్యం. ఒక రెండు, మూడు పాటలకి నేర్పించడం కాదు , వాళ్లకి దానిలో సొంతంగా ఆలోచించి చేయాలనే తపనని కలిగించాలి. ఆ విధంగా ఎవరి ఆసక్తికి తగిన విధంగా వారికి శిక్షణ ను ఇవ్వడం జరుగుతుంది.
*మీ నాట్య జీవితంలో మీకు ఆనందాన్ని కలిగించిన సంఘటన కాని , మరచిపోలేని అనుభూతిని ఇచ్చిన సందర్భం ఏమిటి ?
నేను విలాసిని నాట్యం నేర్చుకున్న తరవాత తొలి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ ప్రదర్శనను స్వప్న సుందరి గారు ముందు వరసలో కుర్చుని చూసారు . ప్రదర్శన ముగిసిన తరవాత ఆమె నన్ను ఎంతగానే అభినందించారు. ఒక గురువు శిష్యులను మెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ మాటలు నాకు ఇప్పటికి గుర్తే , అదే నా జీవితంలో మరిచిపోలేని సంఘటన .
*ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే వారికి మీరిచ్చే సందేశం ?
నేర్చుకుంటున్నప్పుడు క్రమశిక్షణ శ్రద్ధ ఉండాలి. అభ్యసించే విషయం పై ప్రదర్శన అవగాహనతో పాటు థియరికల్ అవగాహన ఉండాలి.
*మీ నృత్య కళాకేతన్ నుండి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉంది?
వాగ్గేయకారుల కీర్తనలతో నృత్య రూపకం చేయాలనే ఆలోచన ఉంది, అలాగే తాళ్ళపాక కవులకు సంబంధించి కూడా చేయాలనే ఆలోచన ఉంది .
మీ మనో భావాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.!
– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అరసి గారు మీరు విహంగ కోసం తీసుకుంటున్న ఇంటర్వూస్ చాల బాగుంతునాయ్ కళలకు కళాకారులకు సంబందించిన అనేక విషయాలు మాకు తెలుస్తునే వున్నాయి చాల సంతోషం అండి మాకు మీ ద్వార తెలుసుకోవటం చాల ఆనందంగా వున్నది.
విహంగ నర్తన కేళింపులు ఇంపుగా వున్నాయి. ప్రశ్నోత్తరావళి ఉపయుక్తంగా వుంది. మీకు నా నెనరులు. విజయోస్తు..
ఓహ్ నైస్ madam
అరసి గారు, మీ ప్రశ్నలు వాటి జవాబులు అలసి సొలసిన మనసులకు ఉషా పంఖా కన్నా మిన్న గా ఉన్నట్లున్నాయి!
దన్యవాదములు ఉమా గారు.