తను నాపై తల వాల్చి
నాలో నుంచి బయటకు చూస్తుంది
నన్ను తడుముతున్న తన కళ్ళు
నన్ను ఆటపట్టించే తన శ్వాస నిశ్వాసలంటే
నాకెంతో ప్రేమ
రెండేళ్ళ పరిచయం తనతో నాకు
తన చుట్టూ కూర్చున్న వాళ్ళతో సరదా మాటలు
హాయిగా నవ్వుతూ అందరిని ఆటపట్టిస్తూ
కలుపుకు పోయే చిలిపి పిల్ల
ప్రతి వారి సమస్య తనదే అనుకునే స్వభావం
నాకే కాదు ఎవరికైనా తనపై ప్రేమ కలిగిస్తాయి
కాని ఆ రోజు తను మాములుగా లేదు
వాచీ పోయిన కళ్ళు ,జీవం లేని చూపులు
అలా వచ్చి కూర్చుని
ఎప్పటిలాగే నాపై తల వాల్చింది
ఈ రోజు తన చూపులు నా నుంచి
బయటకు పోలేదు
ప్రకృతి నాస్వాదించలేదు
ఏ కవితా రాసుకోలేదు
మూసినా కళ్ళతోనే తను నాపై తల వాల్చింది
తన ముక్కుపుటాలు అదురుతున్నాయి
కళ్లలోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి
తన శ్వాస నిస్వాసాలు ఏవో బాధను
వెళ్ళ గక్కుతున్నాయి
అర్ధం అయ్యి అర్ధమవనట్టు
కంటి కొనల నుండి తన కన్నీళ్లు కొన్ని నన్ను తాకాయి
ఏంటో హృదయం ఎంతో రగిలిపోతున్నట్టు
ఆమె హృదయం తనపై ఆధీనం కోల్పోతునట్టు
మరుసటి ఉదయం తనెలా ఉందో
చూడాలనే తపన
తన స్స్టేజి రాగానే చుట్టూ వెతికా
మూడు రోజులుగా తను కనిపించడమే లేదు
ఎవరో అదే స్థానంలో కూర్చొని పేపరు తిరిగేస్తున్నారు
నా హృదయంలో తట్టుకోలేని బాధ
ఏడ్పును ఆపుకోలేక వెళ్ళగక్కుతుంటే
ఆ భాద తట్టుకోలేక నా దేహంపై పగుళ్ళు
ఆ”వేదన” నా దేహాన్ని కోసేస్తుంది
చదువుతున్న అతని చేతిలోని
ఆ వార్తా పత్రికలో తన ఫోటో
ప్రేమించబడి ప్రేమలో మోసపోయిందని
-“యువతీ ఆత్మహత్య “
ఇక తను మళ్ళీ కనిపించదే అనే బాధ
ఈ కాలేజి బస్సు తన సరదా మాటల్ని కోల్పోయింది
నేను ఇన్ని రోజులు నాతో స్నేహం చేస్తు
అనుభవించిన తన ప్రతి కదలిక కోల్పోయా
-“గాజు కిటికీని “- గదా !..
అందుకే ఏడుపొస్తుంటే ముక్కలయ్యేలా
పగుళ్ళు పై నుండి కిందికి…
– మెర్సీ మార్గరేట్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
7 Responses to నాకూ మనసుంది