నేను అమ్మాయినే … అయితే ఏంటి…?

నేను అమ్మాయినే అయితే ఏంటి…???
నేను నాలా వుండకూడదా…
నన్ను నాలా చూపకుడదా….
నా నీడని నా దారిన నడిపించకూడదా…
నిజాన్ని నిజం అని చెప్పకూడదా….
అబద్ధం లోని అవకతవకలని నోరెత్తి ధిక్కరించకూడదా…
తప్పుని తప్పు అని చెప్పకూడదా…
ఒప్పుని నిప్పులా మోయకూడదా…
అనునిత్యం బ్రతుకు బాటలో
రగిలే రావణ కాష్టాన్ని రచ్చకీడ్చకూడదా….
నన్ను దహించే ప్రశ్నలు సూటిగా సంధించకూడదా….
బలి పశువులా నేను బ్రతకనని మొరాయించకూడదా….
తల ఎత్తి నా త తప్పేంటని సవాలు విసరకూడదా….
ఇష్టం లేని కష్టాన్ని
నేనెందుకు మోయాలని విసిరి కొట్ట కూడదా…
అవును అమ్మాయి ని అయితే ఏంటి…
భరించలేని భడబాగ్నిని భయపెట్టేలా
నా లావా ప్రసరించకూడదా…
మొరాయించి మొత్తుకుంటూ
మొహమాటానికి నేను నన్ను వేధించుకోనని
నన్ను నేను నవ్వించుకోకూడదా…
ఏంటి ఈ సమాజం ?
ఆడజన్మ అంటే అంత అలుసా…
ఎందుకు ఈ దాహం ఒకరి ఆనందాన్ని తీర్ధం గా తాగుతూ పోతుందా…?
ఏమిటో ఈ ఆకలి మంటల మహా బూటకం
ఆడపిల్ల మనసుని నంజుకు తిని
తన కడుపు నింపుకుని తృ ప్తి పడుతుందా…
ఎంత నికృష్టం ఈ లోకం పోకడ,
అర్ధం లేని వెర్రి ఆలోచనలకి స్త్రీనే బలి పెడుతుందా…
ఎంత నీచం ఈ ఆచార గ్రహచారం!
ఆడదాన్ని అణిచి మగ అహంకారాన్ని రెచ్చగొడుతుందా …?
ఎంత అవివేకం?
కొన్ని సంప్రదాయాల పోకడ
నిజం అనేది మచ్చుకైనా కనపడుతుందా…
ఏంటో ఈ పక్షపాత వికారి వైపరీత్యం
నా కోపం కట్టలు తెంచుకోక మానుతుందా…
పొగరు పంతం మగవాడి సొత్తా?
ఏం నా పొగరు నాకు వుంటుందిగా…
నా పంతం నా సొంతమేగా…
నేను తల వంచను ఈ వెర్రితనానికి,
ఏ నా తల నరికేస్తుందా…?
నేను నోరు మూసుకుని చూస్తూ కూర్చోను
నా ప్రశ్నని సమాధాన పరచగలదా…
నా మనసుకి నేను ముసుగేసుకోలేను
నా మంటని ఓర్చగలదా….
నన్ను నేను హింసించుకుంటూ బ్రతకలేను
నా దారికి అడ్డు వస్తుందా, రాగలదా…
ఎవడేం అనుకుంటే ఏంటి…
ఎవడైతే నాకేంటి…
ఎవడబ్బ దిగొస్తే ఏంటి…
ఏ తాత గాడు మొత్తుకుంటే ఏంటి…
ఏ ముసలి చాదస్తాలు మూలుగుతుంటే ఏంటి…
ఏ కాకి కూతలు సణుగుతుంటే ఏంటి, అసలేంటి…
నాకు నచ్చనిది ఎప్పటికైనా,
ఎలా ఐనా నచ్చకుండానే పోతుందిగా…
నేను చేయాల్సింది చేయనీయకుండా నన్నాపుతుందా…
నేనే నాకు నియంత…
నేనే నాకు అంతా….
నేను ఆడపిల్లని,
నాది ఆడ జన్మ అని గర్వంగా తలెత్తి బ్రతుకుతా…

– అభిలాష

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , Permalink

2 Responses to నేను అమ్మాయినే … అయితే ఏంటి…?

 1. havanib says:

  అభిలాశాగారి కవిత బాగుంది. కవిత్వం పాళ్ళు తక్కువ. ఆగ్రహం ఉంది. ఇదే కవిత ఇంకా సంక్షిప్తం గ మరికొంత శిల్ప శ్రద్ధ తో రాస్తే ఇంకా బాగుంటుందేమో.. విహంగ చాల బాగుంది..భవాని

 2. D.Venkateswara Rao says:

  అభిలాష గారూ
  మీ సూటి ప్రశ్నలు కుండ బద్దలు గొట్టినతున్నాయి.
  ఈసమాజం ఆడపిల్ల ఎలా ఉండాలో చెప్పినంతగా మగపిల్లాడు ఎలాఉన్దాలొ చెప్పలేదు
  అనాదిగా పాతుకుపోయినా ఎన్నో ఆచార వ్యవహారాలూ మనల్ని ఇంకా పట్టి పీడిస్తున్నాయి
  అయినా సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. వచ్చాయి కూడా
  నీను నీనులా ఉంటాను నాలానే ఉంటాను అనుకునేవారు సమాజానికి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. తమవారంతా వేరేలా కనబడతారు
  తాము మారుతూ తమ చుట్టూ ఉన్న వారందరినీ తమలా ఆలోచింప చేయగలిగితే సమాజంలో తాము కావాలనుకున్న మార్పు వస్తుంది
  తమకుతామే సుఖపడాలనుకున్న వారు సమాజానికి దూరమౌతారు . సమాజంలోని మార్పును చూస్తారు.