స్త్రీమూర్తిలోని మాతృ హృదయం ఇగిరిపోయిన వేళ
డబ్బు కోసం తమ పాపలని అమ్ముకునే తల్లులు మనిషిలోని
మానవత్వం మంటగలసి
దానవ రూపంలో అభం-శుభం తెలియని
పసిపిల్లలపై అరాచకాలు
పైసల బేరంలో లాభాలార్జించే
అంగడి బొమ్మలుగా మారిపోతున్న అబలలు
వరకట్నపు వేధింపులతో.
అతివకి అత్తింట్లో మృత్యు వేదనాభరిత లోక
సాక్షాత్కారాలు
విషపు స్రావాలు పుక్కిలి పట్టి
ప్రేమ పేరిట వంచించే పురుషుల పాలిటబడి
సమిధలవుతున్న పడతులు
పతనమైన మానవత్వపు చివరి అంచున నిలబడి
కన్నీరు మున్నేరు అవుతున్న మగువా?
నీ పయనం ఎటు వైపు!?
అఖిలవిశ్వంలో
అర్ధభాగపు ప్రగతి మాదేనంటూ..
ఎలుగెత్తి చాటుతూ..
ఆర్ధిక స్వాతంత్ర్యపు స్వావలంబనలో
హక్కులపోరాటంలో
విశ్రాంతి ఎరుగని యోధురాలివా?
నాగరికత వెల్లవేసుకుని
వలువలూడి నేలజీరాడినట్లు
మాన మర్యాదలు లుప్తమై ..
కనకపు సింహాసనంపై అందాల రాణివై
వెలుగొందాలని ఆకాంక్షతో
అజ్ఞాన అంధకారంలో..మునిగి తేలుతున్నావా?
నీ జాతి మనుగడ మృగ్యమై పోతుంటే..
అది గుర్తించ జాలక
సమానత్వపు బావుటా ఎగరవేయాలని
నీ మహత్తు గొప్పదని ఎంచి
పైకెగురలేక చతికలబడ్డావా .?
కబళించిన కరాళ దంష్ట్రలను తుదముట్టించి
బంధించిన శృంఖలాల్ని చేదించి
జ్వలితవై, ప్రజ్వలివై,దేదీప్యవై వెలుగొందు*.
– వనజ వనమాలి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చాలా బాగుంది ప్రస్తుత స్థితిని ఉద్దేశిస్తూ సాగిన కవిత్వం ఉత్తేజంగా ఉంది. దడాల వెంకటేశ్వరరావు గారి స్పందనే ..నా స్పందన కూడా.
అతి సాధారణంగా అనిపించే అసాధారణ కవిత్వం మీది. అభినందనలు.
కుసుమ గారు.. కవిత మీకు నచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదములు.
అచ్చు తప్పులు తప్పడంలేదు. ఈ సారి అచ్చుతప్పులు లేకుండా చూసుకుంటాను.
దడల వెంకటేశ్వరరావు గారు.. ముందుగా ఈ కవితని మెచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
చైతన్యవంతంగా ..మీరు మహిళా జాతిని మేల్కొలిపే టట్లు ఎలుగెత్తి పిలిచారు. వినమ్రంగా నమస్సులు తప్ప నేను ఏమి చెప్పగలను.
మరొకమారు ధన్యవాదములు.
వనజ వనమాలి గారూ
మీ కవితలో లీనమై స్త్రీ జాతిని కదలి రా అని పిలవాలనిపించిది
అందుకే అదే కవితతో పిలుస్తున్నాను
అనుమతిస్తారనుకుంటాను
మగువ కదలిరా
మహిళా కదలిరా
జ్వలితవై రా ప్రజ్వలివై రా
దేదీప్యమానమైన వెలుగును చిమ్ముకుంటూ రా
భందించిన శృంఖలాల్ని చేదించుకుని రా
కబళించిన కరాళ మరాళులను తుదముట్టించేందుకు రా
అఖిలవిశ్వంలో అర్ధభాగపు ప్రగతి మాదేనంటూ ఎలుగెత్తి చాటడానికి రా
ఆర్ధిక స్వాతంత్ర్యపు స్వావలంబనలో హక్కులపోరాటంలో విశ్రాంతి ఎరుగని యోదురాలిగా రా
పైసల బేర లాభార్జనలో అతివలు అంగడి బొమ్మలుగా మారిపోకుండా కాపాడడానికి రా
అభం-శుభం తెలియని పసిపిల్లలపై జరిగే అరాచకాలను అరికట్టడానికి కంకణం కట్టుకుని రా
ప్రేమ పేరిట వంచించే పురుషుల పాలిట సమిధగా మిగలక కళ్ళు మూసినా తెరిచినా మరచిపోలేని సింహస్వప్నమై రా
వరకట్నపు వేధింపులతో అత్తింట్లో మృత్యు వేదనాభరిత లోక సాక్షాత్కారాలను తుదముట్టించడానికి నీలోనీవే బాస చేసుకుని రా
అజ్ఞానాన్ధకారంలో స్త్రీ జాతి మనుగడను మృగ్యమై పోనీయక సమానత్వ భావుటా ఎగురవేయడానికి రా
స్త్రీమూర్తిలోని మాతృ హృదయం ఇగిరిపోక ముందే డబ్బుకి మానవత్వానికి ఉండే భేదాన్నిమరొక్కసారి తెలియజేయడానికి రా
పతనమైన మానవత్వపు చివరి అంచున నిలబడి తిరగబడి తడబడక తలపడి
గమ్యం చేరేవరకు గమనాన్ని కొనసాగిస్తూ ఇంకా మానవత్వం మిగిలుందని నిరూపింఛి గర్వంగా తిరిగి రా
మహిళా తిరిగి రా
మగువా తిరిగి రా
అఖిలవిశ్వంలో నూరు శాతం ప్రగతి మాదేనని వెలుగెత్తి చాటడానికి రా
గెలుపుకి చిహ్నం ‘మగువే’ నని మానవాళి అణువణువునా నింపివేయడానికి రా
-దడాల వెంకటేశ్వర రావు
స్త్రీ గమనం ఏమిటో..సున్నితంగా విమర్శించారు.
గమ్యం ఏమిటో చెప్పారు.నానాటికి దిజారిపోతున్న స్త్రీ విలువని పెంచుకోవడానికి కంకణం కట్టుకోవాలి.
చక్కని సందేశం తో నిండి ఉండి వాత పెట్టినట్లు ఉంది. చిన్న చిన్న అచ్చుతప్పులు ఉన్నాయి.
ఇక్కడే కాదు చాలా చోట్ల అచ్చుతప్పులు కనిపిస్తున్నాయి. సరిచేస్తే బాగుంటుంది.