సంపాదకీయం

                     

                           బడి లో గడవాల్సిన బాల్యాలు చెత్తకుప్పలలో కాగితాలు ఏరుకుంటూనో,రైల్వే స్టేషన్లలో చిల్లర పైసలు అడుక్కుంటూనో ,ఎంగిలి విస్తర్లలో నాలుగు మెతుకుల కోసం ఆవురవురుమనే ఆకలి చూపులుగానో మారి మనసుల్ని కలతపెడుతూనే ఉంటాయి. మరోవైపు కార్పోరేట్ పాఠశాలల్లో,వార్తా పత్రికల్లో, ఆధికారిక కార్యక్రమాల్లో బాలల దినోత్సవాలు రంగుల స్వప్నాలుగా ,బంగారు భవిష్యద్దర్శనాలుగా ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తుంటాయి .
ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు సంవత్సరాల లోపున్న బాల కార్మికులు 158 మిలియన్ల మంది ఉన్నట్టుగా UNICEF అంచనా వేసింది.ఈ లెక్కలు వ్యాపార రంగాల్లో, గనుల్లో,పనిచేసే పిల్లలవే.ఇళ్ళల్లో వెట్టి చాకిరీ చేసే బాల బాలికలు ఈ లెక్కల్లోకి చేరలేదు.
                     

                            వాస్తవానికి మన దేశంలో బాల కార్మికులు కనిపించని వ్యాపార రంగమే లేదు.ఆ మధ్యలో బాల కార్మిక నిరోధక చట్టాన్ని అమలు చేయడానికి లేదా చేసినట్టు కనిపించడానికి ప్రభుత్వము , మీడియా కూడా తెగ హంగామా చేసింది .వెట్టి చాకిరీ చేసే బాలికల్ని విముక్తి చేయడానికి ఎంతో కృషి చేసినట్టు కనబడ్డ మీడియా ఇప్పుడు కనీసం నెలకి ఒక సారయినా ఆ సంగతే మాట్లాడటం లేదు. అంటే ఇప్పుడు వెట్టి చాకిరీ చేసే పిల్లలే లేరని అర్ధమా ! అదే నిజమయితే సంతోషించాల్సిన విషయమే! .

                    అయితే ఇప్పటికీ వెట్టి చాకిరీ చేస్తూ , రహదారుల వెంట చెత్త సేకరిస్తూ , రైలు కంపార్ట్మెంట్ల లో ఖాళీ సీసాలు ఏరుకుంటూ బతికేసే బాలల్ని పట్టించుకునే తీరిక ప్రభుత్వానికీ ,సంస్థలకీ లేదు.ఒక్కోసారి అలాంటి బాలల్ని పట్టుకొచ్చి వసతిగృహాల్లో చేర్చినా రెండో రోజుకే వాళ్ళు పారిపోతున్నరనే వాదనలూ వినిపిస్తూనే వున్నాయి.ముందుగా కార్మిక బాలలకీ,వారి తల్లిదండ్రులకీ ,అనాధ బాలలకీ దఫాల వారీగా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించడం వల్లకొంత ఉపయోగం వుంటుంది తప్ప ఏదో చట్టాన్ని అమలు చేసామా లేదా అన్నట్టు అధికారులు వ్యవహరిస్తే బాల్యం వీధుల పాలవటం నిరంతర ప్రక్రియలా కొనసాగుతూనే వుంటుంది.
                   

                     ఆర్ధిక దోపిడీ నుంచీ , బాలల స్వేచ్ఛనీ ,హక్కుల్నీ , విద్యనీ హరించే పరిస్థితులనుంచి వారి భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వమూ,స్వచ్చంద సంస్థలతో పాటుగా వ్యక్తిగతంగా ప్రతిమనిషీ కృషి చేసినప్పుడే బాల్యం పరిమళిస్తుంది.మనం నిర్వహిచుకునే ‘బాలల దినోత్సవాలూ’ అర్ధవంతం అవుతాయి.

– పుట్ల హేమలత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

4 Responses to సంపాదకీయం

 1. సంపాదకీయం చురకలు వేసినట్లు ఉంది. చాలా అంశాలు సృశించారు చాలా బాగా చెప్పారు.

  బాలల భవిత అంతా బంగారుమయం చేస్తాం అని చెప్పుకునే ప్రభుత్వాలు వారికి సంపూర్ణ ప్రయోజనాలు చేకూరేలా చర్యలు చేపట్టలేదు. స్వచ్చంద సంస్థల ముసుగులో బాలలని కార్మికులుగా మార్చిన వైనం ని చూస్తున్నాము. ఈ దేశంలో బాల్యం ఒక చేదు జ్ఞాపకం గా మిగిలే విద్యా బోధన, లేకపోతె కొన్ని నిర్లక్ష్యాలకి బలయ్యే బాల్యాల మధ్య వికాసానికి తావెక్కడ?

  వీటన్నింటి మధ్య బాలల దినోత్సవం జరుపుకోడం దిష్టి బొమ్మని పెట్టినట్లు ఉంటుంది.

 2. సంపాదకీయం చాలాబావుంది, పిల్లల గురించిన ఆలోచనే నేడు ప్రభ్భుత్వానికిపట్టడం లేదు ఎవరిపదవుల భద్రతవారిది.కొన్ని స్వచ్చందసంస్థలు కొంతచేస్తున్నాయికానీ, అదిచాలటం లేదు, దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ దీక్షవహించి ఒక్కో గడ్డిపోచకలిసి పెద్ద మోకై మదగజాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చేస్తే తప్పించి ,ఈఅమాయకబాలల బాల్యాన్ని బాగుచేసే ప్రక్రియ విజయవంతంకాదు.మనబిడ్డతో పాటుగా మరోబిడ్డ బాల్యానికీ బాధ్యతవహిద్దామని ప్రతి పౌరుడూ భావించాలి. ఈఅంశం సంపాదకీయానికి ఎంచుకోడం ముదావహం.
  ఆదూరి.హైమవతి.

 3. vanaja says:

  నేటి బాలకార్మికుల పరిస్థితి గురించి చక్కగా వివరించారు