బివివి ప్రసాద్ ‘ఆకాశం’ కు సాహిత్య పురస్కారం

తణుకు పట్టణానికి చెందిన ప్రముఖకవి బివివి ప్రసాద్ రచించిన ‘ఆకాశం’ కవితాసంపుటి కాకినాడలోని ‘ఇస్మాయిల్ మిత్రమండలి ‘ ఇచ్చే ‘ఇస్మాయిల్ కవితాపురస్కారం ‘ 2011 కి  ఎంపికయ్యిందని, ఆ సంస్థ ప్రతినిధి, ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలియచేసారు.

కవి బివివి ప్రసాద్ కు ఈ పురస్కారం పేరిట పదివేల రూపాయల నగదు, అభినందన పత్రం, జ్ఞాపక చిహ్నం 4 నవంబరు 2012 , ఆదివారం కాకినాడలో జరిగే ఇస్మాయిల్ స్మారకసభ లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అనుభూతివాద కవిగా ప్రసిద్ధులైన శ్రీ ఇస్మాయిల్ పాటించే కవిత్వప్రమాణాలను అనుసరించి, స్వచ్ఛమైన కవిత్వం రాసే కవుల సంపుటాలకు ప్రతి ఏటా ప్రకటించే పురస్కారాలలో భాగంగా బివివి ప్రసాద్ ‘ఆకాశం ‘ కు ఈ అవార్డు లభిస్తోంది.

సున్నితమైన స్వభావం, తాత్విక చింతన, ఆర్ద్రత కలిగిన బివివి ప్రసాద్, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉత్తమ హైకూ కవిగా ప్రసిద్ధులు. రెండుదశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న బివివి ప్రసాద్ ఇప్పటివరకూ మూడు హైకూ సంపుటాలూ, మూడు వచనకవితా సంపుటాలూ ప్రకటించారు. వీరి హైకూపై వ్యాసాలూ, విజయవాడ AIR లో ఇచ్చిన ఇంటర్వ్యూ సాహిత్య విమర్శకుల ప్రశంసలు పొందాయి. వీరి హైకూ సాహిత్యం  పలువురు హైకూ పరిశోధకులకు ఉపయుక్తమయింది. తన ఉదాత్తమైన కవితాభివ్యక్తితో, భావాలతో రాష్త్రవ్యాప్తంగా ప్రసిద్ధ కవులతో సహా, ఎందరో సాహిత్యవేత్తల అభిమానం పొందిన ప్రసాద్ కు ఈ అవార్డు రావటం పట్ల అనేకప్రాంతాలనుండి పలువురు సాహిత్యాభిమానులు హర్షం ప్రకటించారు.

కాగా,  ఇప్పటికే ‘ఆకాశం ‘ సంపుటికి విశ్వకళా పీఠం, హైదరాబాద్ వారి ‘స్నేహనిధి పురస్కారం ‘, గుంటూరుజిల్లా రచయితల సంఘం వారి ‘సాహిత్య పురస్కారం ‘ లభించాయి *

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

సాహిత్య సమావేశాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.