స్వీయ భాధ్యత కవిత – ఉదయకుమార్ అలజంగి


తనకు తాను ఉపయోగపడని వ్యక్తి
ఏ సంస్థకి ఏ వ్యవస్థకి ఉపయోగపడలేడు
స్వీయ భాధ్యత స్వీకరించలేనివాడికి
సామాజిక భాధ్యతలెందుకు ?
ఎప్పుడు ఎవడు వస్తాడో

ఏం పట్టుకు వస్తాడో
ఎవడి దగ్గర ఏం కొట్టెయొచ్చో
ఎవడి మీద ఏ అవసరానికి ఎలా వాలి పోవచ్చో
తాను చేయవలసిన విధులు 
ఎవడి మీద ఎలా తోసేయవచ్చో 
నిత్యం వినూత్న పథకాలు రాసేవానికి
ఈ పూటో ఈ రోజో గడిచిపోవచ్చు
రేపు ఏదో ఒకరోజున ఈ నటన సాగనప్పుడు
ఈ నాటకం తెరపడినప్పుడు
లబో దిబో మన్నా ఎవడు సానుభూతి చూపుతాడు
నిండైన వ్యక్తిత్వం అంటే నీ జీవితాన్ని నీవే నడుపుకోవడం
ఎవరి దయా దాక్షిణ్యాలకో ప్రాధేయపడకుందా
నిరంతర శ్రమైక జీవనాన్ని ఆసరాగా చేసుకోవడం
ఆత్మ వంచనకి తావివ్వకుండా
అత్మాభిమానాన్ని అమ్ముకోకుండా
జీవన గమనాన్ని గమ్యం వైపు నడిపించుకోవడం
తనకు తాను సహాయపడేవానికి దైవం సహాయపడతాడని
గీతాకారుడు చెప్పినట్టు చేస్తున్న కర్మను
నూటికి నూరుపాళ్ళు నమ్ముకోవడం
నీ భాధ్యత నీవు తీసుకున్నావా నిన్ను మించిన స్నేహితుడు లేడు
నీ భాధ్యత నీవే విస్మరించావా నిన్ను ముంచే శతృవు నీవే

– ఉదయకుమార్ అలజంగి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, , , , , , , , Permalink

9 Responses to స్వీయ భాధ్యత కవిత – ఉదయకుమార్ అలజంగి

 1. prabhakar says:

  బాగా చెప్పారు ఉదయకుమార్ గారూ ! మనం మన మిత్రులుగా మిగులుదాం !

 2. దుర్గ says:

  చాలా బాగా రాసారు సర్.. 🙂

 3. vanaja says:

  నిజానికి ఇందులో మంచి సందేశం వుంది. చదువరులకు అర్ధం అయ్యే రీతిలో ఉంటేనే కవిత్వ ప్రయోజనం నెరవేరుతుంది. అలా అని prose లాగా రాసినా అందం వుండదు. Dadala వెంకటేశ్వర రావు గారు చేసిన సూచన కవిత్వం రాసే అందరికీ ఉపయోగపడేదే.

 4. uma says:

  బావు౦ది! నడినెత్తిన సూర్యుడిలా వెలుగ౦దిస్తాయి మీ కవితలు!

 5. Dadala Venkateswara Rao says:

  ఏమిటండి
  అలజంగి ఉదయకుమార్ గారూ
  కవితను కవితలా వ్రాయండి ఎదో ఇలా వ్యాసంలా కాదు.
  వ్యాసాన్నో కధనో నాలుగు మంచి మాటలు వ్రాసి దాన్ని ఎక్కడికక్కడ కత్తిరించి దయచేసి కవిత అని పేరు పెట్టకండి – పీజ్

  తనకు తాను ఉపయోగపడని వ్యక్తి ఏ సంస్థకి ఏ వ్యవస్థకి ఉపయోగపడలేడు. స్వీయ భాధ్యత స్వీకరించలేనివాడికి సామాజిక భాధ్యతలెందుకు ?
  ఎప్పుడు ఎవడు వస్తాడో ఏం పట్టుకు వస్తాడో ఎవడి దగ్గర ఏం కొట్టెయొచ్చో ఎవడి మీద ఏ అవసరానికి ఎలా వాలి పోవచ్చో తాను చేయవలసిన విధులు ఎవడి మీద ఎలా తోసేయవచ్చో నిత్యం వినూత్న పథకాలు రాసేవానికి ఈ పూటో ఈ రోజో గడిచిపోవచ్చు.రేపు ఏదో ఒకరోజున ఈ నటన సాగనప్పుడు ఈ నాటకం తెరపడినప్పుడు లబో దిబో మన్నా ఎవడు సానుభూతి చూపుతాడు.నిండైన వ్యక్తిత్వం అంటే నీ జీవితాన్ని నీవే నడు పుకోవడం. ఎవరి దయా దాక్షిణ్యాలకో ప్రాధేయపడకుందా నిరంతర శ్రమైక జీవనాన్ని ఆసరాగా చేసుకోవడం. ఆత్మ వంచనకి తావివ్వకుండా అత్మాభిమానాన్ని అమ్ముకోకుండా జీవన గమనాన్ని గమ్యం వైపు నడిపించుకోవడం. తనకు తాను సహాయపడేవానికి దైవం సహాయపడతాడని గీతాకారుడు చెప్పినట్టు చేస్తున్న కర్మను నూటికి నూరుపాళ్ళు నమ్ముకోవడం. నీ భాధ్యత నీవు తీసుకున్నావా నిన్ను మించిన స్నేహితుడు లేడు. నీ భాధ్యత నీవే విస్మరించావా నిన్ను ముంచే శతృవు నీవే

  • uday kiumar says:

   సోదరుడు వెంకటేశ్వరరావు గారికి , ఎంతో ఉత్సాహంతో స్పందించి మీ అభిప్రాయాన్ని మరియు కవితారచన పట్ల మీ కున్న సదభిప్రాయాన్ని తెలియచేసినందుకు మరియు నానుండి మరిన్ని కవితలు ఏ పంథాలో రాయాలని సూచించినందుకు వినయ పూర్వకమైన అభినందనలు. తాను నమ్మిన విధానంలో తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తపరచే స్వేచ్చ ప్రతి కవికి ఉండాలని శ్రీ శ్రీ గారి అభిప్రాయాన్ని చందోబద్ధ నియమాలతో కవికి సంకెళ్ళు వేయవద్దని ” అరవ్వాడి దోశై, మీద తోచింది రాసై, ఏవో ఫీట్లు చేశై అంటూ ప్రాస బద్ధ కవితలని ఆయన విమర్శిస్తూ..కుక్క పిల్ల, అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ కవితలో రసావేశం భావేశం కవికి ఉండాలని చెప్పాడు. ఏ నిబందనలకు లోను కాకుండా భావ వ్యక్తీకరణ జరిపే వారిలో నేను ఒకడ్ని. ఎందరో మేథావులచేత ప్రశింసించబడుతున్న నా కవితా సంకలనం ” ఉదయించు- ఉద్యమించు” చదివితే మీకు అర్థం అవుతుంది. ఇంతకీ వ్యాసం అనే దాని నిబందనలు వేరు…వ్యాసానికి ఉన్న నిబంధనలు వేరు. వాటితో చూస్తే దీనిని వ్యాసం అని ఎలా అనుకున్నారో ? నాకు అర్థం కాలేదు. ఫ్రాన్సిస్ బేకన్ మహాశయుని వ్యాసాలు కవితల్లా ఉంటాయని ఆయని విమర్సిస్తే ఆయన చెప్పిన సమాధానం ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. వచన కవితకి భావప్రధానమే కాని నిబంధనల చట్రం లో ఇమడ్చాలనే నియమాలేవి లేదు. ఈ కవిత ( మీరు కాదనకపోయినా) ఎంతో అనుభవం కలిగిన సంపాదక వర్గం కవితగా భావించి ఇందులో ముద్రించారు. …. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి బాణీని, వాణిని నమ్మిన అనుంగు శిష్యుణ్ణీ.. ఎవ్వడు సృష్టించకుండా మాటలు ఎలా పుట్టాయని మాయాబజార్ సినిమాలో ఎస్వీఆర్ అన్నట్టు.. ఇది నా మార్కు కవిత. వ్యక్తిగత భాధ్యత ఉన్నవాడే సమజానికి ఉపయోగపడతాడని నా భావం. అభిప్రాయం. మీ సూచనలకు ధన్యవాదాలు……. ఇతర విషయాలక్సి సంపాదకులను సంప్రదించండి.. సమయం ఉంటే నా బ్లాగ్ లు చదవండి. యో ట్యూబ్ లో వీడియో నావి చూడండి…

   • Dadala Venkateswara Rao says:

    ఉదయించి ఉద్యమించే ఉదయ కుమార్ గారూ ! మీరేమిటో తెలియక అలా వ్రాసాను. క్షమించండి…………

    • uday kumar says:

     Dadala Venkateswara Rao గారు.. మీ సమాధానం లో చాలా వ్యంగ్యం కనబడుతుంది. ఉదయించి ఉద్యమించే ఉదయ్ కుమార్ కాదు నా పేరు. అది నా కవితా సంకలనం పేరు. సోషల్ సైట్స్ నందు మనకు పరిచయం స్నేహం లేని వ్యక్తులతో గౌరవప్రదం గా సంభాషించడం మరియు వ్యాఖ్యానించడం అనేది సంస్కారం మరియు సభ్యత తెలియచేస్తుంది…. నేను భీష్ముణి యొక్క యుద్ధనీతిని నమ్ముతాను. ఆచరిస్తాను……

     • dadala vekateswara rao says:

      శ్రీ ఉదయ కుమార్ గారూ ! పరిచయం స్నేహం లేని మీతో మీకు ఇష్టం లేని విదంగా సంభాషించడం తప్పే అయినా మీ పేరు ముందు మీ కవితా సంకలనం పేరు చేర్చితే సంతోష పడతారని, ప్రాస భాగుందని అలా వ్రాసాను. క్షమించాలి.
      ఈ మాత్రందానికే మీరు భీష్మానీతి దాకా వెళ్లిపోతారని అనుకోలేదు. క్షమించాలి

      ఇక్కడ నాగురించి కూడా కొంచం మీకు తెలియాలి
      నీను కవిని కాను
      నీను ఏమి కవితలు వ్రాయలేదు
      కవితలంటే చాలా ఇష్టం
      కవితలు వ్రాయాలని ఉంటుంది
      వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను
      మీరేమిటో తెలియక అలా వ్రాసాను
      ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు అలా వ్రాశానా అని
      మరొక్కసారి మీకు నా క్షమాపణలు ఈ పత్రిక సమక్షంలో తెలియజేసుకుంటున్నాను