నా జీవన యానంలో … గాజుల తాతలు

నేను బడిలో చేరక ముందు మాట .మా ఇంటిని ఆనుకొని పడమటవైపు ఎత్తైన అరుగుల్తో రెండు పోర్షన్ల పెద్ద తాటాకిల్లు ఉండేది .పోర్షన్లంటే రెండువైపులా రెండుగదులు ,దక్షణం వైపున గుమ్మంలో మోకాలి ఎత్తుగోడ పక్కన వంట ,ఉత్తరం వైపు అంటే పుంత వైపు పెద్ద అరుగులు ,పెద్ద వాకిలి .ఆ ఇంట్లో   గాది సూరన్న తాత ,ఆయన తమ్ముడు అమ్మి రాజు తాత కుటుంబాల్తో ఉండేవారు .మా అమ్మ వాళ్ళని పెద్దనాన్న ,చిన్నాన్న అని పిలిచేది .సూరన్న తాత భార్య చాలా వృద్దురాలు అప్పటికే ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు పెళ్లై అత్తవారింటికెళ్ళింది .చిన్న కూతురు మంచి కళగా ఆనాటి సినిమాల్లో అంజలిదేవిలా ఉండేది .నేను ఆ అమ్మాయిని” పిన్ని “అని పిలిచే దాన్ని ఎప్పుడు తీరిక దొరకగానే నన్ను ఎత్తుకొని తిప్పుతుండేది .మా అమ్మని “అక్కా “పిలిచేది ,నాకు అన్నం తినిపించడం,తలదువ్వడం ,ఒకోసారి స్నానం చేయించడం చేసేది .

       వాళ్ళ బాబాయి అమ్మిరాజు తాత కూడా నన్ను బాగా గారాబం చేసేవాడు .ఆయన ,భార్య అమ్మన్న ఉండేవారు కూతురు పెళ్లై వెళ్ళిపోయింది .అన్నదమ్ములిద్దరికి కొడుకులు లేరు .ఇద్దరికీ చెరో గుర్రం ఉండేది రోజూ ఉదయాన్నే చద్దన్నాలు తినేసి ,మధ్యాహ్నానికి అన్నం మూటలు కట్టుకొని ,గుర్రాల మీద గాజుల మల్లారాలు రెండు వైపులా వేళ్ళాడేసుకొని చుట్టుపక్కల ఊళ్ళకి అమ్మకాలకి వెళ్ళేవారు ,వాళ్ళు అలా బయలుదేరేటప్పుడు నన్ను పిలిచి ఎదురు రప్పించుకునేవాళ్ళు ,సాయంకాలాలు నేను రోడ్డు వరకూ వెళ్లి నంది దగ్గర  కాపు కాసేదాన్ని ,వాళ్ళు తిరిగి వచ్చేవేళ అది.నన్ను గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకొచ్చేవాళ్ళు .ఒక తాత గుర్రం మీద వచ్చి ,మళ్లీ  పరుగెత్తి ఇంకో తాత కోసం ఎదురు చూస్తూ నంది బొమ్మ దగ్గర కూర్చునేదాన్ని .

       ఇంటికి రాగానే ఖద్దరు పంచెలు ,కంటి మెడ చొక్కాలు విప్పేసి గోచీలు పెట్టుకొనేవారు ,గుగ్గిళ్ళు ,పచ్చిగడ్డి లాంటి ఆహారాన్ని గుర్రాలకి తినిపించి ,గడ్డిపరకల్తో గుర్రాల్ని మెత్తగా మాలిష్ చేసేవారు .తర్వాత  స్నానాలు .ఇంటి ముందున్న నూతి నీళ్ళు బకెట్లు బకెట్లు ఒంపుకొని స్నానం చేసినా ఒకటే చెమట కంపు వచ్చేది తాతల దగ్గర .అప్పుడే వార్చిన వేడి వేడి గంజితాగి ,దుప్పట్లు పరచిన నులకమంచాల మీద వాలిపోయేవాళ్లు .నేను కాస్సేపు ఈ  మంచం మీద , కాస్సేపు ఆ మంచం మీద చేరిపోయి కధలు చెప్పమని వేధించేదాన్ని ,వాళ్ళ ప్రయాణాల్లో జరిగినట్టు అద్భుతమైన సంఘటల్ని సృష్టించి కధలుగా చెప్పేవాళ్ళు .ఒకోసారి ఆ కదలు వింటూ అక్కడే అన్నం తినేసి ,నిద్రపోయేదాన్ని ,తెల్లవారే సరికి మా ఇంట్లో మంచం మీద ఉండేదాన్ని .

కధ వింటూ మద్యలో “తాతా !చెమట కంపొస్తుంది నీ దగ్గర “అనేదాన్ని .    “ఏం చెయ్యనమ్మా ,ఎండన పడి తిరిగొచ్చాం కదా! పోనీ ఒక పని చేత్తవా… మీ నాన్నని రెండు సెంటు బుడ్లు కొని ఇమ్మను ” అనేవాళ్ళు . ఆ రోజుల్లో  సబ్బులు కొనుక్కొనే స్తోమతు లేక సాధారణ కుటుంబాల్లో అందరూ ఉత్తనీళ్ళ స్నానాలే చేసేవారు .రోజంతా కష్టపడిన చెమటవాసన నా నాసికాపుటాలని తాకింది మొదటిసారిగా అక్కడే .పెద్ద తాతకి జుట్టుముడి ఉండేది .చిన్నతాతకి క్రాఫు ఉండేది .

       దారా వారి సందు పక్కన గాజుబుడ్లు తయారు చేసే పాక ఉండేది వాళ్లకి ,రోజంతా కణ కణ మండే పొయ్యి ముందు చేసే పని అది .ఎర్రగా మండుతున్న ద్రవంలో పొడవైన గొట్టాన్ని ముంచి క్షణాల్లో ఊపిరి ఊది ఊది పల్చని గాజు కుప్పెలు గొప్ప స్కిల్ తో తయారు చేసేవారు .నాకు అది చూడటం చాలా ఇష్టంగా ఉండేది .ఆ పని ఉన్న రోజు నన్ను ఎత్తుకొని అక్కడకి తీసుకెళ్ళి పోయేవారు ,సన్నని మూతి గల రంగు రంగుల గాజు బుడ్లు ,పాదరసం బుడ్లు అనేవారు .వాటిని పాకలో మెరిసిపోతూ ఉంటే  చూడ్డానికి చాలా బావుండేది .తాత వాళ్ళు ఖళ్లు ఖళ్లుమని ఎందుకు దగ్గుతారో తెలీని వయసది .ఆ పని ఉన్నరోజు గుర్రాలకు విశ్రాంతి .అవి పాక బైట ఖాళీ  స్థలంలో పచ్చి గడ్డి కొరుకుతూ ఉంటే వాటి కాళ్ళ సందుల్లో నేను తిరుగుతూ ఉండేదాన్ని .తర్వాత సూర్యాకాంతం పిన్నిని కూడా వాళ్ళ అక్కని చేసిన లింగంపర్తి లోనే ఇచ్చి పెళ్ళిచేశారు ,పెళ్లి కోసమో  , మరే ఆర్థిక ఇబ్బందులో తెలీదు, వాళ్ళు ఆ ఇంటిని సిద్ది అబ్బాయి అనే రైతు ,పశువుల మారుబేరగాడికి అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయేరు. రోజూ సాయంకాలమయ్యేసరికి నాకు ఆ తాతలు, వాళ్ళు చెప్పే కథలూ గుర్తుకుకొచ్చి ఏడుపొచ్చేసేది. తాతలిద్దరూ బక్కగా వంగిన నడుముల్తో, కృంగిన భుజాల్తో ఉండడం  నాకు బాగా గుర్తు, అప్పట్లో పాదరసం ఎగుమతి వ్యాపారం ఈ వూరినుంచి బాగా జరిగేదిట. దానికోసం ఆ గాజుబుడ్లు తయారుచేసి వ్యాపారులకి ఇచ్చేవారు వాళ్ళు.

         మాపెద్దతమ్ముడు చంటిపిల్లాడుగా ఉన్నప్పుడు ఒకసారి వాడికాళ్ళకి నీటిపొక్కుల్తో నిండిన చిడుములాంటిదేదో వచ్చింది. అప్పుడు మానాన్నమ్మ పాదరసం, పసుపు, రక్కిస ఆకులు కలిపి సన్నికల్లు మీద నూరి రాసింది .అప్పుడు మొదటిసారిగా మొదటిసారిగా మెరుస్తూ జారిపోయే పాదరసాన్ని చూసేను నేనుఆ రోజుల్లోనే మా నాన్న ఒక సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ ఎర్ర రంగుది కొనుక్కోచ్చారు .గాజుల తాతల్ని మరిపించడానికి నన్ను తరచూ ఆ బండి మీద తిప్పుతూ ఉండేవారు .నేను త్వరలోనే మా నాన్న  బండి మీద వెళ్లి నంది దగ్గర దిగడం, నాన్నొచ్చేవేళకి నంది దగ్గర ఎదురుచూడ్డానికి అలవాటుపడ్డాను.
                                                                                     

– కె.వరలక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , Permalink

2 Responses to నా జీవన యానంలో … గాజుల తాతలు

 1. K.Vara lakshmi says:

  భాస్కర్ గారు, నా జీవన యానంలో మీరు చదువుతున్నందుకు, మీకు నచ్చుతున్నందుకు కృతజ్ఞతలు-

 2. bhasker.koorapati says:

  వరలక్ష్మి గారూ!
  మీరు రాస్తున్న ఈ జీవనయానాలు ఒక గుక్కలో చదివేస్తున్నాను. చాలా బావున్నాయి. కళ్ళ ముందు మీ బాల్యాన్ని సజీవంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మా బాల్యాన్ని కూడా తలపిస్తున్నారు. కాని మేం మీలా రాయలేం కదా, రచయితలం కాం కదా అని బాధగా ఉంది.
  హాట్స్ ఆఫ్ టు యు!
  భాస్కర్ కూరపాటి.