”నేర్చుకున్న విద్యను మనం మాత్రమే ప్రదర్శిస్తే కొంతకాలమే ఉంటుంది .ఆ కళను నలుగురి
కి పంచితే కలకాలం నిలిచిపోతుంది. అదే నా స్ఫూర్తి…”
ఈ మాటలని నిజం చేసి చూపిస్తున్న ‘నర్తకి పవని శ్రీలత తో ముఖాముఖి ‘ ఈ మాసం మీ
కోసం…
*శ్రీలత గారూ! నమస్తే. మీ పూర్తి పేరు చెప్పండి.
నా పూర్తి పేరు పవని శ్రీలత , మా నాన్న పేరు మూర్తి, అమ్మ పేరు సులోచనదేవి
*మీ స్వస్థలం ఎక్కడ?
కర్నూలు జిల్లా లోని ఆదోని , నా బాల్యం అంతా అక్కడే గడిచింది .నేను పదవ తరగతి కి వచ్చే వరకు మేము అక్కడ ఉన్నాము
*మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?.
మా అమ్మకి సంగీతం, నాట్యం అంటే ఆసక్తి ఎక్కువ. మా చిన్నతనం లో ఆమె సంగీతం నేర్చుకునే వారు, ఆ సమయంలో మా ఊరిలో డాన్స్ స్కూల్ ఫ్రారంభించడంతో నన్ను మా అమ్మ నృత్య శిక్షణలో చేర్పించింది.
*మీ అమ్మ ప్రోత్సాహంతో నాట్యం అభ్యసిస్తున్నాను అన్నారు , మీ నాన్న గారి సహకారం ఎలా ఉండేది ?
మా నాన్న గారు ఇంగ్లీష్ లెక్చరర్. మా ఇష్టాలను ఎప్పుడు కాదన లేదు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని పూర్తి చేయడం, ఆ పని పై అంకిత భావం కలిగి ఉండటం , సామాజిక సేవ అనేవి ఆయన ద్వారా మాకు అలవడ్డాయి.
*మీరు నాట్యం ఏ వయస్సులో ఉండగా నేర్చుకోవడం ప్రారంభించారు ?
నాకు అయిదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండి నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను.
*మీ తొలి గురువు ఎవరు ? వారి గురించి?
తొలి గురువు పద్మాంజలి గారు. ఆమె దగ్గర సుమారుగా పదిహేను సంవత్సరాలు నాట్యం అభ్యసించాను.
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు జరిగింది ?
నాకు పది సంవత్సరాలు ఉంటాయి అప్పుడు మా ఊరిలో తొలి ప్రదర్శన యిచ్చాను. ఆ ప్రదర్శనకు ముఖ్య అతిథి డా.నటరాజ రామకృష్ణ గారు వచ్చారు. ఆయన నా ప్రదర్శన చూసి మా నాన్న గారితో ఈ ‘ మొగ్గ వికసిస్తుంది . ఆపవద్దు’ అని అన్నారంట. ఈ మాట మా నాన్న గారు ఎప్పుడు చెబుతూ ఉండే వారు.
*మీరు ఎంత వరకు చదువుకొన్నారు ?
నేను ఇంటర్ వరకు కర్నూల్ ఆదోని లో చదివాను.
ఏడవ తరగతి పదవ తరగతి టౌన్ ఫస్ట్ వచ్చాను,ఇంటర్ ఎమ్.పి.సి చదివాను. నేను డిగ్రీ కి వచ్చేటప్పటికి మేము హైదరాబాదు వచ్చేసాం. దుర్గా బాయి దేశ్ ముఖ్ గారు స్థాపించిన ఆంద్ర మహిళా కాలేజిలో డిగ్రి బి.కాం లో చేరాను, డిగ్రి రెండోవ సంవత్సరం చదువుతుండగా ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది. తరవాత ఎం .ఏ ఇంగ్లీష్ కూడా పూర్తి చేసాను.
*మీరు ఇచ్చిన ప్రదర్శనల వివరాలు మా చదువరుల కోసం చెప్తారా ?
ఇప్పటి వరకు చాలా ప్రదర్శనలు ఇచ్చాను. నా తొలి ప్రదర్శన నుండి నేను పదవ తరగతి చదువుతున్నంత వరకు వరసగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను తరవాత చదువుపై దృష్తి పెట్టడంతో ప్రదర్శనలు తగ్గాయి. డిగ్రికి వచ్చిన తరవాత మళ్లీ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాను , ఇంతలో వివాహం కావడం మరి కొంత కాలం నాట్యానికి దూరమయ్యాను.
*మీరు చాలా ప్రదర్శనలు ఇచ్చాను అన్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రదర్శనలో మీకు గుర్తుండి పోయిన ప్రదర్శనల వివరాలు మా ‘విహంగ’ పాఠకుల కోసం చెప్పండి ?
తిరుపతిలో వరసగా నాలుగు సంవత్సరాలు బ్రహ్మొ త్సవాల సమయంలో ఇచ్చిన ప్రదర్శనలు గణపతి సచ్చిదా నంద గారు రచించిన భగవద్గీత నాట్యం గా ప్రదర్శించడం నా అదృష్టంగా భావిస్తాను.కోయం బత్తూర్ లో ప్రపంచ తెలుగు మహా సభలలో గిరిజా కళ్యాణం నృత్య రూపకంలో చెలికత్తెగా చేసాను.ఆ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి.
*మీ వైవాహిక జీవితం గురించి?
మా వివాహం 1998 లో జరిగింది. మా వారి పేరు A .V .S .C ప్రసాద్ . ఆయన ఒక కంపెనిలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు.మాకు ఒక బాబు . వాడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.
*మీరు కొంత కాలం నాట్యానికి దూరంగా ఉన్నాను అన్నారు ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు ?
ఉద్యోగం తరవాత వివాహం కారణంగా సుమారుగా ఆరేడు సంవత్సరాలు నాట్యానికి దూరంగా ఉన్నాను .
*మళ్లీ తిరిగి నాట్యం ఎప్పటి నుండి అభ్యసించడం ప్రారంభించారు?
నాకు బాబు పుట్టిన తరవాత. వాడికి ఏడు నెలలు అనుకుంటా . అప్పటి నుండి తిరిగి ప్రారంభించాను.
*అప్పుడు ఎవరి దగ్గర నాట్యాన్ని అభ్యసించారు?
మా వివాహం అయిన తరవాత మా వారి ఉద్యోగం వల్ల మేము తిరుపతిలో ఉన్నాము . అప్పుడు కొండా రవి కుమార్ గారి వద్ద చేరి , నేను ముందుగా పద్మాంజలి గారి వద్ద నేర్చుకున్న విద్యనే సాధన చేసాను.
*మీ అత్త వారింటి వైపు ప్రోత్సాహం ఎలా వుండేది ?
మేము తిరుపతిలో ఉండే వాళ్ళం అన్నాను కదా! అక్కడ కూచిపూడి నాట్యాన్ని నేర్పించేవారు లేకపోవడం వలన మా వారు కేవలం నాకు నాట్యం పై గల ఆసక్తిని గ్రహించి తను తిరుపతిలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాదులో ఉద్యోగంలో చేరారు . ఇక మా అత్తయ్య మావయ్యలు ఏనాడు వద్దు అని అనలేదు
*హైదరాబాదు వచ్చిన తరవాత మీ నాట్య అభ్యసనం ఏ విధంగా సాగింది?
ఇక్కడికి వచ్చిన తరవాత భాగవతుల సేతురాం గారి నేతృత్వంలో పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి 2007 లో కూచిపూడి సర్టిఫికెట్ కోర్స్ చేసాను. మే నెలలో ఉత్తీర్ణు రాలయ్యాను . అదే సంవత్సరం జూలై నుండి 2009 వరకు రెండు సంవత్సరాలు కూచిపూడి లో ఏం .ఏ చేసాను.
*కూచిపూడిలో ఏం.ఏ పూర్తి చేసాను అన్నారు కదా , మరి పరిశోధన వైపుగా ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా ?
ఉందండి ,కూచిపూడి లో పిహెచ్.డి చేయాలనుకుంటున్నాను, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. తప్పకుండా పిహెచ్.డి చేస్తాను.
*పిహెచ్.డి చేయాలని ఉంది అన్నారు, ఏ అంశం పై పరిశోధన చేయాలని అనుకుంటున్నారు ?
“క్లాసికల్ డాన్స్ ఇన్ ఇండియన్ సినిమా” అనే అంశం పై చేయాలనే ఆలోచన ఉంది. చూద్దాం .
*గురువుగా విద్య నేర్పించడానికి కారణం? స్ఫూర్తి?
మా నాన్న, పెద్ద నాన్న ఇంగ్లీష్ లెక్చరర్స్ , మా బాబాయి కూడా గణితం భోదించేవారు. ఇలా మా కుటుంబ నేపథ్యం లోనే భోదించడం ఉంది.అలాగే చిన్నప్పుడు నాన్న నేర్పిన సమాజ సేవ , నేర్చుకున్న విద్యనూ మనం మాత్రమే ప్రదర్శిస్తే కొంతకాలమే ఉంటుంది .ఆ కళను నలుగురి కి పంచితే కలకాలం నిలిచిపోతుంది. అదే నా స్ఫూర్తి
*మీరు గురువుగా ఎప్పటి నుండి నృత్య శిక్షణ ఇస్తున్నారు?
ఆరు సంవత్సరాలుగా గురువుగా శిక్షణ ఇస్తున్నాను. ప్రారంభించినప్పుడు ముగ్గురు. ఇప్పుడు 150 మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ పిల్లలలో 40 మందికి మా నృత్య శిక్షణాలయం ద్వారా ఉచితంగా నాట్యం నేర్పిస్తున్నాము.
*మీ నృత్య శిక్షణాలయం పేరు, ఎపుడు ప్రారంభించారు ?
‘అభినయ కూచిపూడి కళాక్షేత్రం’ ,2006 లో ఫ్రారంభించాము.
*మీ నృత్య కళాక్షేత్రం ద్వారా ఇచ్చిన తొలి ప్రదర్శన గురించి చెప్పండి ?
2009 లో కోయంబత్తూర్ లో పేరూరు అనే గ్రామంలో సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన నటరాజ స్వామి ఆలయంలో ‘నాట్యాంజలి’ ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలలోమా నృత్య కళాక్షేత్రంలోని విద్యార్ధులచే తొలి ప్రదర్శన ఇవ్వడం జరిగింది.
*మీరు ప్రతి సంవత్సరం మీ కళానికేతన్ చేసే నృత్య ప్రదర్శనలు?
మా కళాక్షేత్రం ద్వారా ‘గురువందనం’ అనే కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నాము. నృత్య, సంగీత విభాగంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను సత్కరిస్తున్నాము. 2011 లో సేతురాం గారిని , 2012 లో పద్మాంజలి గారిని గౌరవించుకున్నాము.
*మీ విద్యార్ధులు ప్రదర్శించిన వాటిలో గుర్తున్న కొన్ని ప్రదర్శనల వివరాలు మాతో పంచుకుంటారా ?
తప్పకుండా , కొత్తగూడెం లో బాలోత్సవం మూడు రోజులు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పోటిలలో ప్రత్యేక అవార్డు, సబ్ జూనియర్ విభాగంలో మా విద్యార్ధులు ప్రశంసలు పొందారు.’నవ్య నాటక సమితి’ జాతీయ పోటిలలో బహుమతి సాధించారు .
*మీకు నృత్యం లో కాకుండా ఇంకా వేటిలో ప్రవేశం ఉంది ?
నేను డిగ్రీ చదువుతున్నప్పుడు శ్యామల గారి వద్ద సంగీతం నేర్చుకున్నాను.
మీ విద్యార్ధుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలను బాగా ప్రోత్సహిస్తారు. ఇప్పటి వరకు వాళ్ళ నుండి ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను ఒక్కొక్క విద్యార్ధి దగ్గర నెలకు 200 రూపాయలు తీసుకునే దానిని,కాని విద్యార్ధుల తల్లిదండ్రులే ఈ రోజుల్లో అది చాలా తక్కువ అని 300 ఇవ్వడం ఫ్రారంభించారు.
*మీ నృత్య కళాకేతన్ నుండి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉంది?
ముందుగా మా కళాక్షేత్రంకు భవనం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము .సోమ,మంగళ,బుధ మూడు రోజులు నాట్య శిక్షణ జరుగుతుంది. మిగిలిన మూడు రోజులు సంగీతం ఏర్పాటు చేయాలని ఉంది.
*ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే వారికి మీరిచ్చే సందేశం ?
విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు ఒక్కటే మనవి ప్రదర్శన కోసం విద్యను అభ్యసించకండి. మనల్ని మనం తెలుసుకోవడానికి నేర్చుకోవాలని అలా కాకపోతే ఆ అభ్యసన క్రిందకి వెళ్ళుతుంది కాని పైకి వెళ్ళదు.*
మీ ఆలోచనలు,ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు .
– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4 Responses to నర్తన కేళి- 2