గౌతమి గంగ

                   

              భట్టోజీ దీక్షితుల శిష్యుడైన వరదరాజు అనే ఆయన రచించిన లఘు కౌముది సూత్రాలను పాఠం చెప్పి, ఆ తరువాత కాశీ పరిక్షకు తయారవుతున్న శిష్యులకు సిద్ధాంత కౌముది పాఠం చెప్పే సరికి  11 గంటలు అవుతుంది. అప్పుడు శాస్త్రిగారు లోనికేగి మధ్యాహ్న స్నానం ముగించి, భోజనశాలకు చేరి అక్కడ ఉత్తరాభిముఖంగా పెద్ద పీటపై ఆశీనులై దేవతార్చన సంపుటి తీసి దేవతార్చన చేస్తారు. దర్భ గడ్డితో అల్లిన ఆ పెద్ద భరిణలో అనేక దేవతా మూర్తులతో పాటు సంతాన గోపాలస్వామి సాల గ్రామ శిల వుంటుంది. అతడిని అర్చించిన వారికి సంతాన సౌభాగ్యం చేకూరుతుంది.
   

                 మూడు తరాలనాడు శాస్త్రిగారి వంశీకులు ఆస్తులు పంచుకునేటప్పుడు ఎంతో మహిమ కల  ఈ సాలగ్రామ శిలను కుటుంబపు పెద్ద శాఖకు, రెండవ శాఖ వారికి పుట్టెడు భూమిని (సుమారు 8 ఎకరాలు) వాటాగా వుంచి మీకు ఏది కావాలో కోరుకోమంటే ధనం కన్నా దైవాన్నే మిన్నగా తలచే పెద్దింటి వారు సాలగ్రామ శిలనే కోరారని, పరిశేష న్యాయం చేత శిలను పొందలేకపోయినా సంతాన గోపాలస్వామిని మాత్రం చిన్నింటి వారు నిత్యం మనసా ధ్యానించి, సేవించేవారని చెబుతారు.. సంధ్యావందనం, దేవతార్చన ముగిసే సరికి భూదేవమ్మగారు వంటపొయ్యిలోని కణకణలాడే నిప్పుల్ని ఒకచోట రాశిగా చేసి వుంచుతారు. వంట ముగిసాక పొయ్యిలోని నిప్పును ఆర్పడం నాటి అహితాగ్నులకు నిషిద్ధం. దానివలన కొన్ని తాటాకుల ఇళ్ళు దగ్ధం అయినా ఆచారాన్ని వీడడానికి లేదు కదా. కుంచెడు గిన్నెను వార్చిన భూదేవమ్మ గారు గిన్నెలోని    పై అన్నాన్ని 3 గరిటలు ఓ పళ్ళెంలోకి తీస్తారు. దానిపై నెయ్యి అభిగరించి పప్పు, కూరలు, పులుసు కాస్త కాస్త వేస్తారు. శాస్త్రిగారు వచ్చి ఆ అన్నాన్ని మూడు ముద్దలుగా చేసి గార్హపత్యాగ్ని అనే పొయ్యిలోని అగ్నిలో మంత్రయుక్తంగా  ఆహుతి చేస్తారు. ఈ వైదిక కర్మ వైశ్య దేవం అంటారు. ఈ ఇష్టిని అహితాగ్నులు నిత్యం ఆచరించాలి. వైశ్య దేవం చేసాకనే ద్విజులు భోజనాలు ఆరంభించాలి.
   

              వంట పని ముగిసాక భూదేవమ్మగారు పెరటిలోకి వెళ్ళి శుభ్రంగా చేతులూ, కాళ్ళు, ముఖం కడుగుకొని, ఉతికిన చీర, రవిక ధరించి, నుదుట కుంకుమ తిలకం దిద్దుకుని, కాళ్ళకు పసుపు పూసుకుంటారు.  ఆ సరికి ఆడపిల్లలు పెరటిలో వున్న మందార, నంది వర్థనం, గన్నేరు, చేమంతి, గొబ్బి వంటి పువ్వులు పెద్ద పళ్ళేలలో సేకరించి వుంచుతారు. కొన్ని పూలను శాస్త్రిగారు దేవతార్చన సమయంలో పూజ చేస్తారు. కొన్నిటికి భూదేవమ్మగారు మహాలక్ష్మీ పెట్టి అనే గృహదేవత గౌరీ దేవి పూజా మంటపంలోని రాతితో చేసి పసుపు కుంకుమలు అలదిన గౌరీ దేవిపైనా, ఇతర దేవతామూర్తుల పైనా పూలు అలంకరించి ఇంట్లో వున్న పండ్లు నివేదన చేస్తారు. ఆ రోజుల్లో మహా నివేదన అన్నం, ఇతర వంటకాలు నివేదన బాధ్యత పురుషులదే. మంత్రయుక్తమైన పూజ కూడా విశేష దినాల్లో తప్ప స్త్రీలు చేసే వారు కాదు. గృహదేవతని అర్చించాక వడ్డన ప్రారంభం అవుతుంది. నీరు జల్లి బట్టతో తుడిచిన కొన కలిగిన అరటి ఆకులపై మొదట నెయ్యి అభిగారం చేస్తారు. అప్పుడు ఎడమ చివర పచ్చళ్ళు వడ్డిస్తారు. భూదేవమ్మ గారు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణలా వడ్డన పళ్ళెంతో వచ్చి విస్తరి మొదట్లో ఎడమ వైపు ముందు పప్పు, కుడివైపు కూరలు వడ్డించి, మధ్యలో అన్నం వడ్డిస్తారు.  విస్తరి చివరి భాగంలో కొద్ది ముక్కలతో పులుసు వడ్డిస్తారు. ఎవరి రుచికి అనుగుణంగా వారు కలుపుకోవడానికి చిట్ట చివర ఉప్పు వడ్డిస్తారు. చివరగా అన్నంపై నెయ్యి మళ్ళీ అభిగరిస్తారు. ఈ వడ్డన కార్యక్రమం ముగిసాక ఉపనీతులైన పురుషులందరూ ‘‘సత్యంత్వర్తేన పరిషించామి। అమృతమస్తు, అమృతోపస్తరణ మసి’’ పరబ్రహ్మ స్వరూపుడైన అన్నదేవతని ప్రార్థించి, సత్య మార్గాన్ని వీడము అని ప్రతిజ్ఞ చేసి, తన పురిషెడు (మడచిన అరచేతిలోని) లోని నీటిని విస్తరి చుట్టూ తిప్పి విస్తరి మొదట వదిలి మరికొంత నీటిని పురిషెడుతో లోనికి పుచ్చుకొని అన్నపు కుప్పపై కుడి చేతివేళ్లను వుంచి ‘‘ఓం ప్రాణాయస్వాహా! ఓం వ్యానాయిస్వాహా!   ఓం ఉదనాయాస్వాహా! ఓం సమానాయిస్వాహా! ఓం అపానాయస్వాహా! అని పంచ ప్రాణాలకు ఆహుతులు ఇస్తూ 5 సార్లు రెండేసి అన్నపు మెతుకులు నోటిలో వుంచుకొని అప్పుడు అన్నం కలపడం శిష్టాచారం.              

                 ఈ క్రమాన్ని పరిషించడం, లేక పరిష్యం చేయడం అంటారు. నెయ్యి వడ్డించాక పులుసు రాచిప్ప తెస్తారు. నేడు అరుదుగా కనిపించే రుబ్బురోలు వంటి రాతితో చెక్కిన పాత్రలను రాచ్చిప్పలు అంటారు. వాటికి అడుగున మట్టి రాసి బూడిద చల్లి వాటిలో పులుసులు వండేవారు. నేడు మనం ప్లాస్టిక్‌ కంటైనర్లలో పెట్టుకొనే ఊరగాయలు, పచ్చళ్ళు కూడా ఆ రోజుల్లో రాచ్చిప్పల్లోనే భద్రపరిచే వారు. విస్తరి చివరి భాగంలో గట్టులా చేసుకుంటే అందులో పులుసుముక్కలు వడ్డిస్తారు. అప్పుడు ప్రారంభమౌతుంది భోజన కార్యక్రమం కూరలు, పులుసు, పచ్చళ్ళు, పప్పు అన్నంలో కలుపుకుంటూ రెండు మూడుసార్లు అన్నంలో నేయి వేసి కలుపుకొని తిన్నాక, పులుసు అన్నం తిని, ఆఖరుగా మజ్జిగ అన్నం తింటారు. పగటిపూట బాగా చిలికి వెన్న తీసిన మజ్జిగ రాత్రిపూట పెరుగు తినడం నాటి అలవాటు. రాత్రి పూట పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తున్నా, అందులో కొంచెం ఉప్పు కలుపుకుంటే దోషం నివారణ అవుతుందని సవరణ.
         

       భోజనశాలలో శాస్త్రిగారి సహ పంక్తిన భుజించే అవకాశం గొప్ప అదృష్టం గౌరవప్రదం. శిష్యులకు, బంధువులలో ఆశ్రితులలో శిష్టాచార పరులు కాని వారికీ భోజన శాలకు చేరి వున్న వసారాలలో మాత్రమే వడ్డిస్తారు. మజ్జిగ అన్నం తిన్నాక మళ్ళీ పురిషెడులో నీళ్ళు పోసుకొని ‘‘రౌరవేపుణ్య నిలయే పద్మార్బుదనివాసినాం। అర్థినాం ముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు’’ అని ఉత్తరాపోశన (భోజనానంతర) మంత్రం చదువుతూ  నీళ్ళు విస్తరి చుట్టూ తిప్పి విస్తరి చివర వదులుతారు వారు విడిచిన ఈ నీరు రౌరవాది నరకాల్లో వున్న కోట్లాది జీవులకు విమోచనం కలిగిస్తుందని నాటి నమ్మకం. రాత్రిపూట పఠించే ఈ పరిషేచన, ఉత్తరాపోసన మంత్రాలు కొంచెం భేదంగా వుంటాయి. అతిథులంతా అన్నదాతా సుఖీభవా! అని గృహస్తుకు  శుభాభినందనలు చెప్తారు. భోజనాలు ముగిసే సరికి శాస్త్రిగారి అమ్మాయిలు తమలపాకులు శుభ్రంగా నీటితో కడిగి, పొడిబట్టతో తుడిచి ఒక పళ్ళెంలో తమలపాకులు, వక్కలూ, వక్కలు కత్తిరించుకునే అడకత్తెర అనే పరికరం (దానిలో పెట్టి నొక్కితే పోక చెక్క ముక్కలుగా అవుతుంది.) ఏలకులు, లవంగాలూ, జాపత్రి, జాజికాయ, సున్నం, భరిణలు సిద్ధంగా వుంచుతారు. పెద్ద కచేరి సావిడిలో శాస్త్రిగారు విశాలమైన నగిషీలు చెక్కిన కుర్చీలో అధివసిస్తే అతిథులు కవాచీ బల్లలపై కూర్చుంటారు. తాంబూల సేవనం చేస్తూ వివిధ విషయాలు ముచ్చటించుకుంటారు వారు. ‘‘ఖట్వంగరూఢో జాల్మః’’ అని పగటి వేళ మంచం ఎక్కడం నిషేధం పగటి నిద్ర ఆ రోజుల్లో నిషేధమే. మరీ నడుం నిలవని వాళ్లు చాపలపైనా, కవాచి బల్లలపైనా కాసేపు విశ్రమించేవారు.
                         

                   ప్రొద్దువాటారుతుంటే శాస్త్రిగారు బంధుమిత్ర పరివారంతో వ్యాహ్యాళికి బయలుదేరేవారు. ఓ రోజు గోదావరికీ, ఓ రోజు మరో దిశను వున్న గోదావరి కాలువకు వారు వెళ్ళేవారు. స్నానానికి అనుకూలమైన రోజుల్లో సాయం వేళ స్నానాలు అక్కడే కానిచ్చేవారు. కను చీకటి పడే వేళకు అంతా ఇంటికి చేరేవారు. మధ్యాహ్న వేళ అల్పాహారంగా మామిడిపళ్లు, పనస తొనలు, అరటిపళ్లు, పళ్ళేలుతోరలోనుంచి వచ్చేవి. పండ్లు లభించని రోజుల్లో మిఠాయి, మినప సున్ని, అరిసెలు, కజ్జికాయలు, ఏదో ఒక రకం పళ్ళేలలో పెట్టి శిష్యుల చేత సావిడిలోకి పంపేవారు శాస్త్రిగారి అక్కగారు. శాస్త్రిగారు చిన్న కచేరి సావిడిలో ఊరి పెద్దలతోనూ, రైతులతోనూ ఇష్టాగోష్టి జరిపాక అందరు సాయం సంధ్యోపాసన చేసి రాత్రి భోజనాలకు లేచే వారు. అప్పటికి జామురాత్రి అయ్యేది.
                    

                   రాత్రి భోజనంలోకి శాస్త్రిగారికి పెసరపప్పు కలిపిన కూర ఒకటి, ఒక కమ్మని కూర, కొబ్బరి పచ్చడి, వెలగపండు బెల్లం వేసి చేసిన పచ్చడి విధిగా వుండాలి. అరటి చెట్లలోని దూట సన్నగా తరిగి కమ్మటి పెరుగులో కలిపి ఆవ చేర్చి చేసే పచ్చడి రుచి అమోఘం రాత్రివేళ పప్పుచారు తప్పనిసరి. వీటన్నిటితోనూ భోజనాలు ముగించి అతిథులు పెరటిలో చేతులు కడిగే వేళకు అర్థరాత్రి సమీపిస్తూ వుండేది. ఒక పర్యాయం శాస్త్రిగారు పెరటిలో హస్త ప్రక్షాళనం చేస్తుంటే పెరట్లో కొబ్బరి చెట్ల మీద అలికిడి అయ్యింది. ఆయన చిన్న కొడుకును పిలిచి ఏమోయ్‌ సత్యపరబ్రహ్మానందమూర్తీ! పెరట్లో అలికిడి ఏమిటో చూడు అన్నారు. అతడు ఒక చేతిలో దుడ్డు కర్ర, ఒక చేతిలో లాంతరు పట్టుకొని పెరటిలోకి వెళ్లే సరికి ఒక వ్యక్తి దభీమని కొబ్బరిచెట్టు మీంచి క్రిందకు వురికాడు. అతడు శాస్త్రిగారి పాదాలపై పడి బాబా! నెల నాళ్ల నుంచి చెట్ల కాయలు దింపుకొని పోదామని దీపాలు పెడ్తూ వచ్చి ఈ చెట్ల మీద చేరుతున్నా.  తమలోగిలిలో సర్థుమణిగేవేళకు అర్థరాత్రి దాటుతుంది. తెల్లవార్లు చెట్టుమీద జాగారం చేసి చీకటితోనే చెట్టుదిగి పోతున్నా. ఏం చేసినా తమ దయ అని బావురుమాన్నాడు. చిన్నా చితక దొంగతనాలు చేసే వార్ని దొరికితే పట్టుకొని చావగొట్టడం, గృహస్థులకు, ఇంటి వారు కనిపిస్తే కొట్టి, పొడిచి పారిపోవడం, దొంగలకు కూడా నాటి రోజుల్లో తెలియదు. కడుపు కక్కుర్తికి చెడ్డ పనికి పాల్పడ్డ వాడికి ఆకలి తీర్చడం గృహమేధి తన బాధ్యతగా భావించేవాడు. ఒరేయ్‌ ప్రొద్దుటేవచ్చి బాబు బస్తాడు కొబ్బరికాయలు ఇస్తాడు. పట్టుకొనిపో ! ఇకమీదట ఇలాంటి దుడుకు పనులు మాని కష్టపడి బతుకు అని వాడికి చెప్పి వానికి తమ తోటలో ఏమైనా పని ఇమ్మని కుమారునికి చెప్పారు శాస్త్రిగారు.
                              

   **                                     **                                             **                                                   **

               శాస్త్రి గారు ఎంతటి స్ఫురద్రూపో, అజానుబాహువో  ఆయన అర్థాంగి అంత అర్భకురాలు. నాలుగున్నర అడుగుల పొడుగులో సన్నగా చామన చాయగా వుంటారు ఆమె. అయితే అర్భకపు శరీరంలో ఎన్నో రెట్లు ఆత్మ విశ్వాసం, శ్రద్ధాసక్తులతో ఆమె గృహస్థు ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంటారు. గృహ కృత్య నిర్వహణలో, అతిథి సత్కారంలో ఆమెకు ఆమే సాటి. శాస్త్రి గారికి పది సంవత్సరాల వయస్సులో వారి తల్లిదండ్రులు ఆర్షేయ, పౌరుషేయాలు కల కుటుంబంలోని 5 సంవత్సరాల బాలికతో వివాహం జరిపించారు. నాటి కాలంలో అదే యుక్త వయస్సు. ఆమెను పన్నెండవ యేట కాపురానికి తెచ్చుకొన్నారు. పండిత కుటుంబలో పుట్టిన ఆమెకు సంస్కృత పంచకావ్యాలతోను పరిచయం వుంది. రఘువంశ కుమార సంభవంలోని శ్లోకాలు ఆమెకు కంఠస్థం. చక్కని రూపం గుణం కలిగిన ఆమె పుట్టినింట, మెట్టినింట విశేషాదరాభిమానాలు పొందుతూ వుండేది. కాపురానికి వచ్చిన సంవత్సరానికి ఆమె గర్భం దాల్చింది. ప్రసూతి సౌకర్యాలు లేని పల్లెటూళ్లో మగ పిల్లవాడిని కని ఆమె పరమపదించింది. శాస్త్రిగారి మనస్సంతా శూన్యమై పోయింది. ఆయన విరక్తులై పసివానిని మాతామహుల వద్ద వదిలి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. తాను విద్యార్థిగా సందర్శించిన కాశీ నగరంలో కొంతకాలమున్నాక యాత్రిక బృందంతో కలిసి బదరీనాథ్‌, కేదారనాథ్‌, మానససరోవరం యాత్రలు చేశారు. ఐదు సంవత్సరాల అనంతరం శాస్త్రిగారు తిరిగి ఇంటికి వచ్చారు. అంతవరకు ఆస్తి పాస్తులను సంరక్షిస్తూ, అతిథి అభ్యాగతులకు లేదనకుండా అన్నదానం చేస్తూ తమ్ముడు క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకంతో గృహ నిర్వహణ సాగిస్తున్నారు శాస్త్రిగారి అక్కగారు కామమ్మ గారు. ఆమెకు 5వ సంవత్సరంలో వివాహం జరిగి యుక్త వయస్సు రాకుండానే భర్త గతించారు. ఆమె తన సర్వ శక్తులూ తమ్ముని సంసారానికే వినియోగిస్తూ పుట్టినింటనే వుంటారు. అప్పగారు రోజూ తమ్మునితో నాయనా మీ అత్తవారికి కబురు చేసి పసివానిని తీసుకొనిరా.  నా కళ్లలో పెట్టుకొని పెంచుతాను. నీకు తెలియనిది ఏమి లేదు. భార్య ప్రక్కన లేనిదే గృహస్థుకు అగ్ని కార్యాన్ని నెరవేర్చే అర్హత లేదుకదా.  నీ అత్త వారు ఎప్పటికప్పుడు పిల్లవాని యోగక్షేమాలతో పాటు తమ మూడవ కుమార్తెను నీకు చేసుకోమని కబురు చేస్తున్నారు. నువ్వు ఊ.. అను చాలు మిగతా పనులు నేను చక్కబెడతా అని తమ్ముణ్ణి పోరసాగారు. అప్పా! వంశం నిలపడానికి మగ బిడ్డ వున్నాడు కదా ! పెళ్లి ముచ్చట తీరిపోయింది. నా వద్ద ఈ ప్రస్తావన తేవద్దు అనే వారు. వీడు ఇలాగే అంటాడులే అనుకొని కామమ్మ గారు తమ్ముని అత్తవారికి కబురు చేసారు. తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు. మీరు పిల్లను తీసుకొని ఈ ఊరు వస్తే వాళ్ల నెత్తిమీద నాలుగు అక్షింతలు వేసి మన బాధ్యత తీర్చుకుందాం అని.   శాస్త్రి గారి మామ బహు సంతానవంతులు ముగ్గురు కుమారుల తరువాత శాస్త్రి గారి మొదటి కళత్రమైన కుమార్తె జన్మించింది. ఆమె తరువాత ముగ్గురు పిల్లల తరువాతి సంతానం భూదేవి వారికి వయస్సు మళ్లింది. అల్లుడి దేశాటనం ఆయనను కొంత క్రుంగతీసింది. ఈ స్థితిలో కామమ్మ గారి కబురువచ్చింది. భూమి తరువాత తనకు ఇంకా ఇద్దరు ఆడ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు కలిగారు. తన ఆస్తి నంతా తెగనమ్మినా తాను వీరందరికి పెళ్లిళ్లు పేరంటాలు చేయలేడు. నాటి రోజుల్లో కట్న కానుకలు లేకపోయినా 5 రోజులు పెళ్లిళ్లు చేసి, మర్యాదలు చేసి పెళ్లి వారిని, బంధువుల్ని సాగనంపే సరికి సామాన్య సంసారులకు దేవుడు కనపడేవాడు. సంపన్నుడైన అల్లుడి అండ వుంటే తాను ఈ భవసాగరాన్ని ఈదడం కొంచెం సులువవుతుంది. డబ్బు పుచ్చుకొని పిల్లనిస్తున్న రోజుల్లో వరుని ఇంట్లో పెళ్లి చేయడం అనే విషయం పెద్ద అభ్యంతరం కాదు. తాను ఏమి తీసుకోకుండానే కన్యా ప్రదానం చేస్తున్నారు కదా. ఈ ప్రకారంగా ఆలోచించి ఆయన కామమ్మ గారి ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. పెళ్లికి తరలి వెళ్లాలంటే తమ్ముడు ఒప్పుకోడేమో అని కామమ్మ గారు ఈ విధంగా ఏర్పాటు చేసారు.
                                        

                        ఆ విధంగా భూదేవమ్మ గారి ఎనిమిదవ ఏట తనకన్నా ఒక్క వయస్సులోనే కాక అన్నిటా అధికుడైన శాస్త్రిగారితో వివాహం జరిగింది నిరాడంబరంగా. ఆమెకు భర్తను చూస్తే కాళ్లలోంచి వణుకు వచ్చేది. దీనికి తోడు శాస్త్రిగారు మితభాషి. బిడియస్తురాలైన ఈ బాలిక అసలు ఆయన దృష్టికే వచ్చేది కాదు. గృహ కృత్యాలు నెరవేరుస్తూ  మౌనంగా ఇంట తిరిగే ఈ బాలిక పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం కాని, ఆకర్షణ కాని లేదు. వారికి శాస్త్ర చర్చలతో, శిష్యులకు పాఠ ప్రవచనాలతో, వ్యవసాయపు పనుల అజమాయిషీతో గ్రామ తీర్పరితనంతో క్షణం తీరిక వుండేది కాదు. రాత్రి పది గంటలకు పక్క చేరితే తెల్లవారు  జామున  4 గంటలవరకే విశ్రాంతి.*

– కాశీచయనుల వెంకటమహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~                                         

14

 

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో