నా కళ్లతో అమెరికా-12


మౌంట్ శాస్తా (Mount Shasta)

                    ఎన్నాళ్లుగానో మా ఊరి నుంచి కాలిఫోర్నియాకు ఉత్తర భాగాన్ని చూడాలనే కోరిక మా మౌంట్ శాస్తా ప్రయాణంతో సఫలీకృతమైంది.  మౌంట్ శాస్తా ఒక అగ్నిపర్వతం. కాలిఫోర్నియా తూర్పు సరిహద్దుగా ఉన్న సియర్రా నెవాడా పర్వత శ్రేణి కి దూరంగా ఒక ఒంటరి గంభీర పర్వతం గా నిలిచి ఉంటుంది.    నిజానికి ఇది ఉత్తర భాగపు కాస్కేడ్ పర్వత శ్రేణి కి దక్షిణపు అంచు. సముద్ర మట్టం నుంచి 4,322 మీ ఎత్తులో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఆరువందల సంవత్సరాలకొకసారి ఈ అగ్నిపర్వతం తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుందట. ఇప్పటికి రెండు వంద స.రాలకు పూర్వం ఇలాంటి సంఘటన జరిగిందట.

 ఇక చలికాలంలో మౌంట్ శాస్తా మంచు తో కప్పబడి దర్శనీయులకు కనువిందు చేస్తుంది. మా పిల్లలు ఈ చలి కాలపు సీజన్ లో మంచులో స్కేటింగ్ చేసేందుకు లేక్ తాహో వెడదామని పేచీ పెడితే ఆ స్కేటింగేదో  కొత్త ప్రదేశం లో చేసుకోమని నేనిటు తీసుకెళ్లాను.  మా ఇంటి నుంచి దాదాపు 330 మైళ్లు. క్రిస్టమస్ సెలవులు పదిరోజులుండడం వల్ల కనీసం నాలుగైదు రోజులు వెళ్లి రావాలని అనుకున్నాం.

ప్రయాణం: 

 శాస్తా చుట్టుపక్కల ప్రదేశం మౌంట్ శాస్తా,  లేక్ శాస్తా అని రెండు రకాలుగా విభజించబడి ఉంటుంది.  దక్షిణం వైపు  నుంచి  వెళితే ముందుగా లేక్ శాస్తా వస్తుంది. అక్కడ శాస్తా డాం, శాస్తా గుహలు చూడదగ్గవి. ఇవన్నీ మౌంట్ శాస్తా కు దాదాపు అరవై మైళ్ల దూరంలో ఉంటాయి. లేక్ శాస్తా  చుట్టుపక్కల బస చేసేందుకు అనువైన పెద్ద ఊరు Redding. సాధారణం గా చలికాలపు స్కీయింగ్ సమయంలో   మౌంట్ శాస్తా కు డైరక్టుగా వెళ్లిపోతారు. అయితే మేం అలా వెళ్లిపోకుండా ఇవతల గా ఉన్న లేక్ శాస్తా చుట్టుపక్కల విశేషాలు  కూడా చూసుకుని వెళ్దామని  Redding లో మేం బుక్ చేసుకున్న హోటల్ కు  ప్రయాణమయ్యాం. అక్కడికి  ఇంటి నుంచి 250 మైళ్లు. నిజానికి నాలుగైదు గంటల ప్రయాణం. ఉదయమే బయలుదేరినా నేను నేవిగేటర్  మాటని విననీయకుండా మరో దారిలో వెళదామని ఇంకేదో దారిలో తీసుకెళ్లడం వల్ల మధ్యాహ్నం 12.30 దాటినా  మొదటి వంద మైళ్లలోనే తిరుగుతూ ఉన్నాం.  అయితేనేం దారిలో అందమైన సముద్ర పాయలు లోపలికి చొచ్చుకు వచ్చిన దారుల మీద కట్టిన అందమైన బ్రిడ్జీల గుండా,చిన్న రోడ్ల పొలాల గుండా ఆహ్లాదంగా ప్రయాణిస్తూ భోజనానంతరం ఫ్రీవే మీదకు చేరుకున్నాం. దారిలో ఎదురైన రెస్ట్ ఏరియాలలో కావాలని ఆగుతూ మామూలుగానే ఆడుతూ పాడుతూ వెళ్లాం. రెస్ట్ ఏరియాలన్నీ మంచి ఎత్తైన పైన్ చెట్లతో అందంగా ఉన్నాయి. అయితే మేం ప్రయాణించిన ఈ ఫ్రీవే ఉత్తర భాగం  మీంచి చుట్టూ చూస్తే దక్షిణ భాగపు గడ్డి కొండల్లా ఎండి పోయి  నిర్జీవంగా కాకుండా చుట్టు పచ్చదనం తో దూరంగా కనిపించే పర్వత శ్రేణితో రాజమండ్రి నుంచి విశాఖ పట్నం వెళ్లినట్లు ఉంటుంది.

సాయంత్రం ఆరుగంటలకి మా బసకు చేరుకున్నాం. దగ్గర్లోని ఇండియన్ రెస్టారెంటుకి వెళ్లి బఫే తిన్నాం. బాగా ఖరీదెక్కువ, భోజనం బాగా తియ్య తియ్యగానూ ఉంది. అయినా తిన్నామనిపించి హోటల్ లోని హాట్ జకూజీ లో సేదతీరి నిద్రకుపక్రమించాం. సిరి కి బాగా నడక వచ్చేసిందేమో కార్లో కూర్చోవడానికి బాగా పేచీ పెట్టింది. చివరకు నిద్ర దగ్గర కూడా పేచీనే. ఎక్కువ సేపు గదిలో తిరుగుతూ ఆడుతూ ఉంది.

మరుసటి రోజు క్రిస్మస్. మేం ఈ ప్రయాణం లో ఉన్న హోటల్ కాస్త ఖరీదెక్కువైంది కావడం వల్ల వచ్చిన అదనపు సౌకర్యాలతో బాగా సేద తీరినట్లైంది మాకు. ఇక దీని తర్వాత చేసిన అన్ని ప్రయాణాలు అదే గ్రూప్ హోటళ్లనే ఎంచుకోవడం మొదలు పెట్టాం.  ఉదయానే మా హోటల్ లోనే మాంచి కాంటినెంటల్ బ్రేక్ ఫాస్టు తిని స్థిమితంగా శాస్తా లేక్ కు ఆవలి వెపున్న శాస్తా గుహలు చూసేందుకు బయలుదేరేం. తీరా ఇరవై మైళ్లు ప్రయాణించి వెళ్లేక ఆ రోజు సెలవని టిక్కెట్టు కౌంటరు గేటుకి తాళం కనబడింది.

Hedge Creek  falls :

               ఇక నా ప్లాన్ లో తర్వాతి ప్రదేశమైన  Dunsmuir  లో ఉన్న Mossbrae falls  చూసేందుకు దారి తీసాం.  డన్స్ మ్యూర్ అక్కడి నుంచి  మరో ముప్పై అయిదు మైళ్ల దూరం. తీరా అక్కడి వరకు వెళ్లేక అక్కడ క్లియర్ బోర్డులు లేకపోవడం వల్ల  అసలు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. నేను గూగుల్ బాబాయినడిగి రాసుకొచ్చిన వివరాల ప్రకారం వెళితే అక్కడ కారు వెళ్లే త్రోవ లేదు. రైలు పట్టాలు, వాటికి దిగువగా ప్రవహిస్తున్న ఉధృత కాలువ.  ఊరు ఊరంతా అంతా ఖాళీ చేసెళ్లి పోయినట్లు నిశ్శబ్దం గా, నిర్మానుష్యంగా ఉంది. అదృష్టం కొద్దీ రెండడుగుల్లో ఒకింట్లో నుంచి ఒక వ్యక్తి బయటికొచ్చేడు. నేనిక మొహమాటం లేకుండా  జలపాతాలకు దారి అడిగేను అతన్ని. అతను ఆ కాలువ వొడ్డునే రెండు మైళ్లు నడిచెళ్లమని చెప్పేడు. అయితే జాగ్రత్త ముందు ఒడ్డున రాళ్లు దొర్లితే ప్రమాదం అనీ, అయినా చంటి పాప తో సేఫ్ కాదనీ హెచ్చరించేడు. మేము స్వెట్టర్లు, గ్లోవులు తొడుక్కుని ఉన్నాము  కాబట్టి చలైనా, పులైనా వెళ్లే వాళ్లమే. అయితే సిరి తో కష్టమనిపించి ఆగిపోయేం. అయితే మరో చిన్న జలపాతం అయిన Hedge Creek  falls   రోడ్డు వారనే మరో మైలు దూరం కారులో వెళ్లి దిగువకు  కాస్త దిగమని చెప్పేడు.   ఆ దారి వెంబడి వెళ్లేం.  అతను చెప్పిన గుర్తుల వెంబడి వెళ్లినా తప్పిపోయి బాగా ముందుకెళ్లిపోయేం. అతను కిందకు వెళ్లమని చెప్పిన చోటు బయటి నుంచి దారి ఏదీ సరిగా కనబడకుండా ఉంది. మొత్తానికి కనిపెట్టి చిన్న పార్కు లా ఉన్న గొడుగు నుంచి కిందకు కాలిబాట వెంబడి దిగడం మొదలు పెట్టాం.

                దట్టంగా చుట్టూ తీగల చెట్ల దాపునెక్కడో కింద దిగువన వినిపిస్తున్న నీటి రొద, అంతగా వెడల్పులేని చిన్న కాలి బాట.   రెండు రౌండ్లు తిరిగి కిందకు దిగేమో లేదో మహా అయితే ఇరవై అడుగులుంటుందేమో జలపాతం.    పైన రాళ్ల మీంచి కిందకు వెడల్పు ధార గా పడుతోంది.  డిసెంబరు నెల కావడం వల్ల అక్కడ నీళ్లు సున్నా డిగ్రీల దాపున  ఉండడం వల్ల కిందకు పడ్డ చోట గడ్డ కట్టిన తెల్లని మంచు పళ్లెంలోకి పడుతున్నాయి.  బహుశా రాత్రుళ్లు పూర్తిగా గడ్డ కట్టి పోతాయనుకుంటా. ఆ అద్భుత దృశ్యాన్ని చూసేసరికి పిల్లల కేరింతలతో ఆ ప్రదేశమంతా మారు మ్రోగి పోయింది. మా ఆనందానికి అవధుల్లేవు. అటు వంటి దృశ్యం ఇంత వరకు నేనెక్కడా చూళ్లేదు. కెమేరాల్లో ఎంత బంధించినా తనివి తీరలేదు.

             అద్వితీయ ఆనందం తో అందరం పసి పాపలమై  ఆడుకున్నాం. అయితే అతి చలికి పాపాయి బాగా ఏడుపు మొదలు పెట్టింది. ఇంకా జలపాతాన్ని దాటుకుని ముందుకెళ్లి చూసొచ్చాం. జలపాతాన్ని తడవకుండా  రాళ్లమీంచి దాటుతూంటే చల్లని నీటి ఒరవడికి ఎంత చలి దుస్తులైనా ఇంకా చలి వేసింది.  ఇక  మరో మలుపు ముందు కెళితే అక్కడితో కాలి బాట ఆఖరై పోయి అక్కడో ఫెన్సింగు ఉన్న చప్టా పైన కనబడింది.   చప్టా మీంచి చూద్దుము కదా.  అరణ్య చిక్కదనంమీంచి శ్వేత మందహాసం చేస్తూ దూరంగా అత్యద్భుతంగా Mount Shasta కనిపించింది. దిగువన మహా వేగం తో పరవళ్లు తొక్కుతున్న పెద్ద కాలువో, నదో. మా అరుపులు, మాటలు, నీళ్ల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించని నిశ్శబ్దం మా చుట్టూ. అక్కడి నుంచి కొండలు, గుట్టలు ఎక్కి మరెక్కడికో వెళ్లే సాహస కార్యం ఎప్పుడైనా అయితే తప్పక చేసి తీరాలనిపించేది.  పాపాయి ఏడుపు శృతి మించడం తో సత్య పాపనెత్తుకుని ముందు త్వరగా పైకి పరుగెత్తాడు. కింద లోయ లో కంటే బయట రోడ్డు మీద చలి కాస్త నయం మరి. అదీగాక వెంటనే కార్లోకి వెళ్లీ హీటర్ ఆన్ చేసుకోవచ్చు.

               నేను వెను తిరిగి చూస్తూ వచ్చాను. కళ్ల ముందు గడ్డకట్టిన మంచు లోకి ఏటవాలు గా లేత నీలి రంగులా భ్రమింప జేస్తూ పడ్తున్న ఆ నీటి ప్రవాహం  అలా కళ్లలో చెదరని దృశ్యమై కదలాడుతూండగా మేం మధ్యాహ్నం భోజనాల వేళ తిరుగు ప్రయాణమయ్యాం.  అక్కడి నుంచి పది పదిహేను మైళ్లలోనే మౌంట్ శాస్తా.  అయితే మర్నాటి నుంచి మౌంట్ శాస్తా లో హోటల్ బుక్ చేసుకున్నందువల్ల రెడ్డింగు కు తిరిగి ప్రయాణమయ్యాం.

  క్రిస్మస్ భోజనం:

                 దారిలో రెడ్డింగు దగ్గరకొచ్చేవరకూ  పర్వతాల మీద ఏమీ తినేందుకు దొరకదు. రెడ్డింగు లో ఏ హోటలు చూసినా మూసేసి ఉంది క్రిస్టమస్ సందర్భంగా.  విధి లేక  ఒక చోట పెట్రోలు పంపులో ఉన్న చిన్న దుకాణం లోనికెళ్లి వాళ్ల దగ్గర మిగిలిన చివరి బ్రెడ్డు, కాసిన్ని ఏవో స్నాక్ పేకెట్లు కొనుకున్నాం. అయితే చివరి ప్రయత్నంగా మళ్ళీ వెతుకుదామని ఫ్రీవే కు ఆనుకుని ఉన్న కొన్ని హోటళ్ల సముదాయానికి వెళ్లి వెతికేం.   చివరికి ఒక చోట తెరిచి ఉన్న హోటల్ కనిపించింది.  చాలా పెద్ద లైను . ఎలాగో పిల్లలు పాపం ఓర్చుకున్నారు.  చివరికి 4గంటలకి మా వంతు వచ్చింది. ఆర్డరు మరో అరగంట తర్వాత వచ్చింది. ఇలా క్రిస్మస్ వంటి సెలవు రోజుల్లో  సరైన భోజనం ఏర్పాట్లు చేసుకోకుండా పిల్లలతో ఇలా బయటికి రావడం మంచి పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది.  అప్పటికి వరకు దగ్గరున్న పేకెట్లలోని కాస్త కాస్త  వేరుశెనగలు తిని కడుపు నింపుకున్నారు.  భోజనాన్ని ఆవురావురుమని తిన్నారు.  ఇక రాత్రికి ఆ హోటల్ కూడా ఉంటుందని నమ్మకం లేదు.  ఇక్కడ మామూలు రోజుల్లోనే రాత్రి 8 దాటితే భోజనం హోటళ్లు మూసేస్తారు. ఇక అక్కడే మరేదైనా ఆర్దరు చేసి రాత్రికి పట్టుకు పోదామని అనుకున్నాం.  కానీ కడుపు నిండగానే, అమ్మో! రాత్రికి మళ్లీ ఇదే భోజనం తినలేమన్నారు పిల్లలు. ఇక అయితే బ్రెడ్డే శరణ్యమని హెచ్చరించేను. ఆ దగ్గర్లో కాసిన్ని పళ్లు కూడా కొనుక్కుని అంతలో రెడ్డింగు లోని గడియారపు ముల్లు ఆకారం లో కట్టిన బ్రిడ్జి చూసేందుకెళ్లాం.

Sundial Bridge:

                శేక్రమెంటో నది Redding దగ్గర ఉధృతంగా లేకుండా చిన్న కాలువ లాగా ఉంటుంది. దాని మీద కేబుళ్లతో sundial  ఆకారం లో నిర్మించిన బ్రిడ్జ్  2004 లో పూర్తి అయ్యిందట. ఇది ఆకారం లో గడియారపు ముల్లులా ఉండడమే   కాకుండా నిజంగా ఎండ ననుసరించి సమయాన్ని తెలియజేయడం విశేషం.   ఆ ముల్లు కున్న అంచు నీడ నిమిషానికి అడగు చొప్పున  కదుల్తూ భూమి ఆత్మ ప్రదక్షిణాన్ని కళ్లకు కట్టిస్తుంది. స.రం లో  మిగతా రోజుల్లో  కాస్త అటూ ఇటూ గా ఉన్నప్పటికీ జూన్  21 న అత్యంత ఖచ్చితంగా 12గంటలకు మధ్యాహ్నం  సమయం సరిగ్గా కనిపిస్తుందట.  ఆ బ్రిడ్జికి మొదట్లో నిలబడి  చూస్తే ఆకాశం లోకి ఎక్కు పెట్టిన బాణం లా సూర్య గతిని మలుపు తిప్ప గలిగిన కాలపు ముల్లు తీగెలతో బంధించిన వంతెనని మోస్తూ రెండు చేతులూ చాచి మనని అక్కున చేర్చుకుంటున్నట్లు అద్భుతంగా కనిపిస్తుంది.   వంతెన చాలా చిన్నది కేవలం నడవడానికి మాత్రమే ఉద్దేశించినది. కిందంతా టైల్సు పరిచిన గొప్ప కళాకృతి అది.

మేం  చలికాలపు సూర్యాస్తమయంలో ఎండ దాపున దోబూచులాడే చలికి వణుకుతూనే ఆచివర నుంచి ఈ చివర వరకు నడిచి రెండు సార్లు తిరిగేం.  ఈవల పక్కనే ఉన్న Turtle bay Museum వగైరా లు,  ఆవల నున్న ఆర్బొటేరియం చూసేందుకు సమయం, వాతావరణమూ అనుకూలించక వెనక్కు మరలేం. 

MounT Shasta:

 మర్నాడు పొద్దున్నే మేమిక MounT Shasta  కు వెళ్లిపోవాల్సి ఉంది.  అక్కడ మరో రెండ్రోజులు  గడిపి వెనక్కు వచ్చేటప్పుడు లేక్ శాస్తా కు మరలా వద్దామని  బయలుదేరి పోయాం. చిక్కని వంపుల మార్గం గుండా నిన్న వెళ్లిన దారి వెంబడే ప్రయాణించాం. కొంత దూరం వెళ్లగానే దారి పొడవుకీMount Shasta  కనబడుతూ ఉంది.    దగ్గరికి సమిపించే కొలదీ పర్వతం కొన్ని సార్లు  ఎదురుగా రహదారికి అడ్డుగాను మరి కొన్ని సార్లు ఎడమ పక్కకో,  కుడి పక్కకో  దాక్కుంటూ దోబూచులాడుతూండేది.    నల్లని శరీరమ్మీద   ధవళ వస్త్రాల్ని అలవోకగా  కప్పుకున్నట్లు కాస్సేపు, ఆకాశం, భూమీ అన్నీ తనే అయిన ధీమా చూపుల మంచు కళ్లతో సూటిగా చూస్తూ  కాస్సేపు కనిపించింది.   ఇక అసలు పర్వతం దరిదాపుల్లోకి వచ్చేసరికి హఠాత్తుగా మాయమైపోయింది.  

               అక్కడి నుంచి రహదారి మలుపు తిరిగి లోపలికి వెళ్లిపోయి మరో దారి వెంట తిన్నగా పర్వతం వైపు వెళ్తాం.   ఏదీ పర్వతం కనబడదేం అనుకుంటున్నాం కానీ మేం ఉన్నదే  పర్వతమ్మీద  అనేది మర్చి పోయాం. మేం ఎప్పుడో అధిరోహించడం మొదలు పెట్టామన్న మాట.  దారి  మలుపుల్లో రోడ్డు  పక్కనంతా గడ్డ కట్టిన మంచు.   “ఓహోయ్”  అని పిల్లల  అరుపులు, కేరింతలు. మలుపు దాటి మలుపు దాదాపు అరగంట పాటూ  చిక్కని మంచు లోకి వెళుతూనే ఉన్నాం. 

              పిట్ట , మనిషి ఉనికి గాని,  ఎదురొచ్చే వాహనం గానీ  లేవు.  మాకు చాలా ఆశ్చర్యం  వేసింది.  ఎందుకింత నిర్మానుష్యంగా  ఉంది!  మా నేవిగేటర్  చెప్తున్న దారి సరైనదేనా? మేం దారి తప్పి మరెక్కడికో వచ్చామా  అని ఎన్నో  సందేహాలు చుట్టు ముడుతూ ఉండగా  బొత్తిగ మంచు లేని ఒక ఖాళీ స్థలంలోకి వచ్చి చేరేం. ఎదురుగా ఇంకాస్త ఎత్తున రాతి శరీరమ్మీద  మమ్మల్ని వెక్కిరిస్తూ ఎక్కడివక్కడ ఆగిపోయిన లిఫ్ట్ లు.    మధ్య మేం తప్ప ఎవరూ లేని మట్టి పర్వతం కనిపించాయి.   ఇక్కడేదో స్కీయింగ్ చేసెయ్యలని రెండు మూడు  రోజుల  ప్లాన్ తో వచ్చిన  మా పిల్లలు నా వైపు కోపంగా చూడలేక,  నిరాశగా  చూసేరు. 

              నేను పట్టు బట్టి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇక్కడ  అసలు చోట మంచు లేదు. దూరం నించి మంచు చిర్నవ్వులు చిందించి,  ఆకర్షించి, దగ్గరకు రాగానే వందల ఏళ్ల కిందట నించీ నిద్ర పోతున్నట్లున్న ఈ  అగ్ని పర్వతాన్ని  అధిరోహించలేక, కూత వేటు దూరం లో నిలబడి.. కాదు కూలబడి ఏం చెయ్యాలో  అర్థం కాలేదు నాకు . కొసన వేలాడే మంచు బిందువులని కౌగిలించుకుందామనే ఆశ ఎంతకీ మనసులోంచి తొలగి పోవడం లేదు.   పిల్లల్ని  కారులో నే ఉండమని మేమలా నడుస్తూ  చుట్టూ ఎవరైనా ఉన్నారేమోనని చూసేం. నేను దగ్గర్లో కనిపిస్తున్న చిన్న రేకు  షెడ్ల వంటి వాటి    తలుపుల్ని కొట్టాను.  ఒక తలుపు తిసుంటే సరాసరి లోపలికి వెళ్లాను. చిన్న first aid dispensary  అది.  ఒకతను నన్ను చుసి గతుక్కు మన్నాడు. 

           నా నిరశా వాలకం చూసి  “అయ్యో,  ఏం  చేస్తాం ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చేసినా ఇంక సరిగా  మంచు కురవలేదు.  ఈ వారాంతం   మంచు తుఫాను పడితే  ఏదైనా స్కీయింగ్  చేసే అవకాశం ఉంటుంది.   లేకపోతే  ఇక మళ్లా తుఫాను వచ్చినపుడే  రండి” అని వెళ్లిపోయాడు.   దుమ్ము రేగుతున్న మట్టి పర్వతాన్ని వంగి చేత్తో ముట్టుకుని ఇంకొకసారొస్తానని బుజ్జగించి కారెక్కాను.

             అప్పటికి పిల్లలకి ఉత్సాహం పోయింది.  అయితే మేం బుక్ చేసుకున్న హోటల్  లో ఆ రోజు మధ్యాహ్నం  3 గంటలకు మేం చెకిన్ అవ్వాల్సి ఉంది.    ఇక చేసేదేమి లేక హోటల్ కు వెళ్లాం.  అక్కడా ఇదే పరిస్థితి.  ఎవరు లేని నిర్మానుష్యం.  పైగా హోటల్ చిన్న కేబిన్ ల  విడి  విడి గా ఉంటాయని మేం  expect  చేసుకున్నాం.  తీరా చూస్తే పెట్టి గదుల్లా ఉన్న వరుస గదులు. ఎవరికీ నచ్చలేదు బయటి నుంచి.   ఇక కేన్సిల్  చేసుకుని వెనక్కు మళ్లీ రెడ్డింగ్  వెళ్లిపోదామని  నిర్ణయించుకున్నాం.   కాని అలా చెయ్యడం వల్ల మేం బుక్ చేసుకున్నందుకు కట్టిన డబ్బుల్లో  సగం వెనక్కు రాదు.   డబ్బులు  పోయినా ఇక అక్కడ చేసేదేమీ కనబడక మరో అరగంట లో వెనక్కు బయలు దేరేం. 

లేక్ శాస్తా: 

           దారిలో తిన్నగా మళ్లీ లేక్ శాస్తా కు వెళ్లేం.  బయలుదేరబోతున్న  బోట్ కు టిక్కెట్లు  దొరికాయి మాకు.  అలా మధ్యాహ్నం  పన్నెండు  గంటల వేళ అందమైన విశాల మైన సరస్సు మీద అటు వొడ్డుకు చేరేం.  అది నిజానికి సరస్సు లా కాకుండా,  గొప్ప నదిలా ఎక్కడి నుంచి వస్తుందో తెలియనంత భీకర జల చిత్రంలా ఉంటుంది.   ఇక అటు ఒడ్డుకు దిగి ఎత్తుకు నడవడం  అంతా గోదావరి మీద పాపికొండల దర్శనానికి  వెళ్లినట్లే ఉంది. 

Shasta Caves: 

అక్కడి  నుంచి కొంత మేర లోపలికి అడవిలో  కొండ ఎగువకి బస్సులో తీసుకు వెళతారు.  అక్కడ కొండ గుహల లోపలికి బేచ్ ల వారి గా వెళతాం.    నాకు నచ్చిందేమిటంటే  మొత్తం ప్రయాణంలో ఒక బోట్, బస్సు మారినా  టిక్కెట్టు ఒక్కటే (దాదాపు 25 డాలర్లు).  ఇక గుహలు మరీ పెద్దవి కాదు కాని ఇటు నుంచి కొండ పైకి ఎక్కుతూ వెళ్లి తిరిగి దిగువకి దిగుతూ వస్తాం.  ఇంత క్రితం యూసోమిటీ లో మేం చూసిన గుహలు భూమి లోపలికి దిగుతాం. ఇక్కడ కొండ లోపలికి ఎక్కుతాం.  Shasta Caves గా పిలుస్తారు వీటిని.   చంటి పాపతో అన్నేసి మెట్లెక్కి దిగడం బాగా కష్టమే  అయ్యింది.  పైగ పిల్ల ఏడుపొకటి.  గుహల్లో మనకే నచ్చని వాసన, వాతావరణం ఉంటాయి.   ఇక పిల్లలకు వేరే చెప్పాలా- చీకటి గుహల్లో చిన్న లైట్ల కాంతి లో చల్లని నీటి చుక్కలు పడే చప్పుళ్ల మధ్య బయటి ప్రపంచపు  వెలుగు కనబడే లోగా ఎన్నెన్నో విశేషాద్భుత మలుపులు. కనబడే రాతి ఊడల్లో కనిపించేవి,  కనబడనివి ప్రతిరూపాలెన్నో.  చిత్తరువులా నడుస్తూ తిరిగాను. చేతుల్లో పాప ఎడుపు, పిల్లని మోస్తున్న ఆయాసం ఏమీ తెలీని ఏదో చల్లదనం గుండెల్లో.

           ముందంత మంది ఉన్నా   ఎక్కడికెళ్తున్నామో  గమ్యం తెలీని గమ్మత్తు గా ఉంటుంది ఇలాంటి చోట.   బయటికి రాగానే మిరుమిట్లు గొలిపే సూర్య  కాంతిలో కొండ అంచుని ఆనుకుని మెట్లు దిగడం కస్టమైంది.  చుట్టూ కొండను కప్పుతూ వృక్ష రాజాలు, అడవి తీగలు, అల్లుకున్న చెట్ల ఆకుల నడుమ నుంచి సూటి సూర్య కిరణాలు. గుహలు కనిపెట్టిన వాళ్లు గుహల్లోపల కష్ట పడి ఎగబ్రాకుతున్న దృశ్యం,   బయట రాతి కొసల్ని పట్టుకుని   జారుకుంటూ దిగుతున్న దృశ్యం  కనబడింది నాకు. తిరిగి నది ఒడ్డుకు వచ్చాక లాంచి కోసం ఎదురు చూసేం కాస్సేపు.  ఎదురుగా నీటి అలల అందమైన గాలి కొసలు పట్టుకుని హొయలు పోతున్న శాస్తా సరస్సు.  ముందెక్కడో డ్యాం నిర్మించడం వల్ల ఇక్కడ ఎంత వరకు మునిగి పోయిందో,  ఒక్కోసారి నిజంగా వరదలు వస్తే నీళ్లు ఎక్కడి వరకు వస్తాయో చెప్పుకెళ్తూంది గైడు.

                నేను అలా గమ్మత్తైన గాలి తెమ్మెరలు కను రెప్పల మీద ఆహ్లాదం గా పరచుకుంటుంటే   మంత్రముగ్ధురాలినై  చూస్తూ ఉన్నాను.  పిల్లలు కాలి బాట కిందకు పరుగెడ్తూ మళ్లీ పైకొస్తూ ఆడుకుంటున్నారు.  చంటి పాపను తీసుకుని సత్య నీడకి నిలబడ్డాడు.   అక్కడ దిగువన కనబడుతూన్న విశాలమైన సరస్సు,  ఎదురుగా ఆవలి తీరం,  అటూ ఇటూ చెట్ల వరుసలు  కళ్లని  చుట్టుముడ్తూన్న  చిక్కని దృశ్యం లోకి పున:పున: ప్రవేశిస్తూ నిలబడ్డాను పడవ బయలుదేరేంత వరకు. 

           తిరిగి పడవ దిగి అంత ఎత్తున ఉన్న Tourist Center  కి ఎక్కి వచ్చే సరికి ఓపికలై పోయాయి అందరికీ.  అయినా మధ్య లో ఆగి శాస్తా డాం ను ఒక సారి తిరిగి చూసొచ్చాం. గోదావరి, కృష్ణా బ్యారేజ్లు జ్ఞాపకం వచ్చాయి నాకు.  అయితే మేం తప్ప ఎవరూ లేని నిశ్శబ్దపు ఒంటరి ఆనకట్ట ఇది.  త్వరగా వచ్చేసాం ఆకలి వేస్తూండడంతో . బయట పడి తిన్నగా మరో గంటలో Redding కు వచ్చి భోజనాలు కానిచ్చాం.

           అనుకున్న స్కీయింగ్ చెయ్యడానికి  అక్కడి  నుంచి తిన్నగా మళ్ళీ లేక్ తాహో వెళుతున్నామని  మేం చెప్పేవరకు పిల్లల మొహల్లో నిరాశ పోలేదు.

             కానీ నాకు ఏదో లభ్యమైందక్కడ. ధీర గంభీర నిలువెత్తు హిమవన్నగమో, చలచల్లని నీటి తెరల సరస్సు మందహాసమొ, సూర్య కిరణాల గతికి ఎదురు ఎక్కుపెట్టిన ఖడ్గమో, మంచు గుండెల్లోకి గభాలున దుముకుతూన్న   చల్లని నీటి జలపాతమో నన్ను వెంటాడాయి.  రాత్రి వరకు ఏకబిగిన ప్రయాణం  చేసి మధ్య బస చేసిన చోట కారు లోంచి బయటకు రాగానే అన్యాపదేశం  గా ఆకాశం  లోకి  Mount Shastaనుంచి వచ్చిన దిక్కుకి  అనుకోకుండా చూసేను.  నక్షత్ర మొకటి రాలి పడి దూరాన నిశీధిలో దూసుకెళ్లి మాయమైంది.  అది బహుశా: మౌంట్ శాస్తా ని చూసేందుకొచ్చుంటుంది అని అన్నాను పరాకుగా.

-డా. కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో