స్త్రీ యాత్రికులు

          నిరంతర బాటసారి-అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌-2

          సిక్కిం ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లోని మోనాష్టరీలో తిరుగుతున్నప్పుడు దూరంగా కనిపించే టిబెట్‌ పర్వతాలను చూసి ఎంతో సంతోషపడుతుంది. అలెగ్జాండ్రా. ఆ పర్వతాల్లో నివసించే ప్రజలతోనూ, బౌద్ధ సన్యాసులతోనూ టిబెటన్‌ భాషలో ఎప్పడు మాట్లాడతానా అని ఉవ్విళ్లూరిపోయేది. ఆ ఎత్తైన మంచు పర్వతాలని దాటి, తనకి మార్గం చూపిన ఆ దలైలామాని పోతాళా భవనంలో ఎప్పుడు చూద్దామా అని ఆశపడేది.
            తన పనులు చేయటానికి, సామాన్లు మోయటానికి ఒక సేవకుడి అవసరం ఉందని గమనించిన    అలెగ్జాండ్రా ఒక సిక్కిం బౌద్ధ సన్యాసిని తోడుగా తీసుకొంటుంది. రాజుగారే అంతా ఏర్పాటుచేస్తారు. పదిహేను సం||ల వయసున్న ఆ కుర్రవాడు చిన్నప్పుడే మఠంలో చేరాడు. బౌద్ధుల పూజా విధానాలు కూడా బాగా తెలుసు. ఇతర దేశాలు తిరిగి చూద్దామని అతనికీ మనసులో ఉందట. అతడు ఎప్పుడో ఫిలిప్పైన్స్‌ దీవులు గురించి విన్నాడట. అప్పటినుండి ఆ దీవుల్ని చూద్దామనే కోరిక ఉండిపోయింది. ఎనిమిది సంవత్సరాల వయస్సునుండీ బుద్ధ చర్యని పాటిస్తూ ఉండటం వలన, సరైన ప్రవర్తనా నియమావళితో మెలగడం అతనికి ఎంతో ఇష్టం. ఇలాంటి విశ్వాసపాత్రుడు, మిత్రుడు, సేవకుడు అలెగ్జాండ్రాకి తన జీవితాంతం సేవలు అందించ గలిగాడు. ఇతడి పేరు యాంగ్డెన్‌. తన సొంత కొడుకు లాగానే చూసుకొం టుంది. అతనికి చదువుకూడా నేర్పి ‘లామా యాంగ్డెన్‌’ అని గౌరవంగా పిలిచేది. యాంగ్డెన్‌ బ్రిటీషు వారి ఆధీనంలో ఉన్న సిక్కిం నుండి వచ్చాడు కాబట్టి ‘బ్రిటీషు పాస్‌పోర్టు’ ఇచ్చారు. అందులో ‘యాంగ్డెన్‌ బుద్ధిష్టు ప్రీస్టు, పరిశోధకుడు’ అని రాయించింది. ఇతని సహాయంతో తాను అనుకొన్న ‘టిబెట్‌ యాత్రలు సులభంగా పూర్తి చేయగలను’  అనే విశ్వాసం ఏర్పడింది.
                   ఇంటికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యింది కాబట్టి, 1914 వ సం||లో పారిస్‌ వెళదామని ఆలోచన చేసింది అలెగ్జాండ్రా. కానీ అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటం వలన వీసాలు రాలేదు. యుద్ధ వాతావరణం అంతా చల్లబడిందాకా సిక్కింలోనే ఉండక తప్పద నుకొని పరిసరాల్లోని బౌద్ధాలయాలు పరిశోధించేందుకు వెళుతుంది. దూరంగా ‘ఛోర్టెన్‌ నైమా’ అనే అందమైన మోనాష్టరీ కనిపించింది. కానీ అది బార్డర్‌కి అవతల ఉంది, అంటే టిబెట్‌లో. అయినా సరే యాంగ్డెన్‌ని తోడు తీసుకుని అక్కడికి వెళ్ళి వారిని ఒప్పించి ఆ చలికాలం అంతా అక్కడే ఉండి టిబెటన్‌ భాష నేర్చుకోవటంలో గడుపుతుంది.
చోర్టెన్‌ నైమాకి యూరప్‌ నుండి తపాలా కూడా వచ్చేది. దాంతో అసలు కాలం ఎలా గడిచిపోయిందో తెలిసేదికాదు.
                     అక్కడకి ఇంకా పైభాగంలో ఉన్న షిగా ట్సేకి ప్రయాణం చేద్దామనుకొంది. ఆ మోనా ష్టరీలో ఉండే ‘పంచన్‌లామా’ గొప్ప పండితుడు, దలైలామా తరవాత టిబెట్‌లో ప్రముఖ వ్యక్తిగా పరిగణింపబడేవాడు ఇతడే.
అందువలన అక్కడికి చేరాలనే ఉద్దేశం తో బయలుదేరతారు. వీళ్ళ ప్రయాణం గురించి బ్రిటీషువారికి తెలియదు. నాలుగు రోజుల కఠినమైన పర్వత ప్రయాణం తరవాత దారిలో వచ్చిన ‘టాషిలున్‌పో’ చేరుకొంటారు. అక్కడి లామాగారి తల్లి అలెగ్జాండ్రాని ఎంతగానో మెచ్చుకొంటుంది. వళ్ళంతా బంగారు ఆభరణాలతో మునిగిన ఆవిడ ముఖంలో ఒక ఆటవిక సౌందర్యాన్ని చూస్తుంది అలెగ్జాండ్రా.
                     అక్కడ ఉన్న బౌద్ధ సన్యాసులు మనిషి ఎముకలతో తయారు చేయబడిన ఆభరణాలను ధరించి ఉంటారు. అవి సహజంగా తమ పూర్వీకులవే అయి ఉంటాయి. ఎందుకంటే వాటిలో వారి వంశానుగత శక్తి దాగిఉంటుందని, వారి ఎముకలతో చేయబడిన ఆభరణాలు ధరించిన వారికి ఆ శక్తి సంక్రమిస్తుందని వారి నమ్మకం.    టాషిలున్‌పోలో ఉండే బౌద్ధ పండితులూ, భికక్షువులు అందరూ అలెగ్జాండ్రా బౌద్ధమత పాండిత్యానికి ఆశ్చర్యపడతారు. లామాల సమక్షంలో ఆమెకి సన్మానం చేసి పట్టభద్రులకిచ్చే సర్టిఫికెట్‌ ఇస్తారు. వారు తన టిబెట్‌ భాషా పాండిత్యాన్ని గుర్తించి గౌరవించినందుకు సంతోషపడి, లాసా వెళ్ళి సేరా విశ్వవిద్యాలయంలో బౌద్ధమతం గురించి చదువుకొందామని ఆలోచన చేస్తుంది.
                         ఇంతలో బ్రిటీషు ప్రభుత్వంవారు అలెగ్జాండ్రాను తక్షణమే వెనక్కి మరలవలసిందింగా ఉత్తరువు జారీచేస్తారు. 1904వ సంవత్సరంలో కెప్టెన్‌ యంగ్‌ హజ్బెండ్‌ లాసామీదకి దండయాత్ర చేసిన తరవాత, సరిహద్దులు దాటి టిబెట్‌కి వెళ్ళటానికి బ్రిటిషువారి అనుమతి కావాలి. ఎలాంటి పాస్‌పోర్టు లేకుండా అలెగ్జాండ్రా టిబెట్‌ వెళ్ళటానికి బయలుదేరినందుకు చట్టం ఒప్పుకోదు. విధిలేక తక్షణం సిక్కిం చేరుకుంటారు. గాంగ్‌టాక్‌ ఆఫీసులో ‘అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌’ని డిపోర్టు చేస్తున్నట్లుగా బ్రిటీషు వారి ఉత్తరం అందుకొంటుంది. బార్డర్‌ పాస్‌ లేకుండా సిక్కిం-టిబెట్‌ సరిహద్దు దాటినందుకే ఈ చట్టపరమైన శిక్ష. పైగా ఆమె ఇప్పుడు సిక్కింలో కూడా పధ్నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండకూడదని ఆంక్షలు విధిస్తారు.
                  ఈవిధంగా ఆమె యాత్రా స్వాతంత్య్రాన్ని అడ్డుకొనేసరికి అలెగ్జాండ్రాకి అహం దెబ్బతింటుంది. ఎంతో బాధపడుతుంది. కానీ ఆక్షణంలో అలెగ్జాండ్రా తీసుకొన్న నిర్ణయంతో తన పారిస్‌ ప్రయాణం మరికొన్ని సంవత్సరాలు వాయిదా వేయవలసి వచ్చింది. ‘యాత్రా స్వాతంత్య్రాన్ని అనుభవించే హక్కు అందరికీ ఉంది. సరిహద్దు రేఖలన్నీ అగ్రరాజ్యాల వారు ఊహించేవి మాత్రమే. నేను టిబెట్‌ రాజధాని లాసాకి కూడా వెళ్ళగలను’ అని శపధం చేస్తుంది.
యుద్ధం అయ్యాక ఇంటికి వెళ్ళాలి అనుకొన్న అలెగ్జాండ్రా ఇలాంటి శపధం చేయాల్సివస్తుందని ఊహించి ఉండదు. ఇక ఆలస్యం చేయటం ఎందుకని 1916 వ సం|| చివరిలో యాంగ్డెన్‌ని తీసుకుని, తన శపథం నెరవేర్చు కోవటానికి బయలు దేరుతుంది. చైనా పైభాగంలో ఉండే నదుల వెంటవెళితే లాసాకు సులభంగా చేరు కోవచ్చని దేశపటాలను అధ్యయనం చేసి తెలుసుకొంటుంది. అందుకని సిక్కిం, జపాన్‌, కొరియా దేశాల మీదుగా, 1917 వ సం|| అక్టోబరు ఎనిమిది నాటికి చైనా రాజధాని పెకింగ్‌ చేరుకుని, అక్కడ ఉన్న ఫ్రెంచి కాన్సొలేట్‌ నుండి వారి ప్రయాణానికి అవసరమైన ఉత్తరాలు అన్నీ తీసుకొంటారు.
                       ఎలాంటి పరిస్థితుల్లో తాను ఇంటికి రాలేకపోతుందో ఫిలిప్‌కి రాస్తూ ‘టిబెట్‌ ఎడారి ప్రాంతంలో మరణించటానికైనా సిద్ధమే. లాసా వెళ్ళకుండా మాత్రం ఇంటికి రాను’ అని తెలియజేస్తుంది.
                  అలాంటి నిర్ణయం తీసుకొన్న అలెగ్జాండ్రాకి ఎడారులు, పర్వతాలు, అడవి ప్రాంతాలు పెద్ద లెక్కలోని విషయాలు కావు. ‘లాంగ్‌ మార్చ్‌ మార్గంలో పర్వతాలే గులకరాళ్ళు’ అని చెప్పినట్లుగా ఆమె ఎలాంటి ఆటంకాల్నీ లెక్క చేయదలచుకోలేదు. లాసా చేరిందాకా ఆమె కోపాగ్ని చల్లారదు. పెకింగ్‌ నుండి కుంబుం మోనాష్టరీ ప్రాంతాలకి వెళుతున్న ఒక టిబెటన్‌ లామా తోడు దొరకటంతో వారి ప్రయాణం ఆనందంగా మొదలవుతుంది. స్థానిక టిబెటన్లతో పాటుగా ప్రయాణం చేయడంతో ఎవరికీ అనుమానం రాదు. ఇది యాంగ్డెన్‌కి కూడా మంచిది. అలాగా వారు 1918 వ సం|| జనవరి కల్లా చైనా ఉత్తర ప్రాంతాలకి చేరుకొంటారు.
పెకింగ్‌ నుండి బయలుదేరిన ఏడు నెలలకి 3200 కి.మీ. ప్రయా ణించి, కుంబుం మోనాష్టరీ చేరుకొంటారు.
కొండల అంచులమీద నిర్మించిన కుంబుం మోనాష్టరీని చూడగానే వారికి ఆనందం ఉప్పొంగింది. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈ మోనాష్టరీ టిబెట్‌ బౌద్ధమత చరిత్రలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించింది.  3000 మంది సన్యాసులు తిరుగాడే ఆ ప్రాంతం ఎంతో సందడిగా ఉంటుంది. 1840 వ సం||లో లాసా యాత్ర చేసిన యబ్బే హక్‌, గాబెట్‌ అనే ఫ్రెంచి యాత్రికులు కూడా ఇక్కడ కొన్ని వారాలు గడిపారు.
                       యాంగ్డెన్‌ ఉండేందుకై మోనాష్టరీ ముఖ్య లామా వేరేగా పెద్ద గది ఇస్తాడు. అలెగ్జాండ్రా వద్ద   తాషిలామా (పంచెన్‌ లామా) ఇచ్చిన సర్టిఫికెట్‌ ఉంది కాబట్టి ఆమెకి నివాసం సులభంగానే దొరుకుతుంది. తన గది బాల్కనీ నుండి బయటకి చూస్తుంటే ఒంటెలు, జడల బర్రెలు, వర్తక బిడారులు కనిపిస్తూ ఉండేవి. పచ్చిక మోసుకుపోయే పశువుల మెడగంటల శబ్దంలో ఏదో గొప్ప సంగీతం వినిపించేది అలెగ్జాండ్రాకి. టిబెట్‌ నుండి వచ్చేపోయే లామాలు, బౌద్ధ సన్యాసులు, యాత్రికులతో మఠం అంతా నిత్యం కళకళలాడుతూ ఉండేది.
                      కుంబుం మఠంలో అలెగ్జాండ్రా అద్భుతమైన రోజులు గడిపింది. ఆమె చదువుకి ఎలాంటి ఆటంకం కలగలేదు. మంచి వాతావరణం. ఆమె పండితురాలు కాబట్టి ప్రత్యేక గౌరవం దక్కేది. అప్పుడప్పుడు పరిసరాల్లో ఉన్న ఆరామాల వద్దకి వెళ్ళేది. అలాంటి వాతావరణంలో ఒక జీవితకాలం గడపటం చాలా తేలిక అనిపించింది. ఆమె అక్కడ ఉండదలచుకొంటే ఆపేవాళ్ళెవరూ లేరు. కానీ ఆమె ఆశయం వేరు. కదలిపోవటమే ఆమె ప్రస్తుత కర్తవ్యం. కానీ వెళ్ళేముందుగా టిబెట్‌భాషని మాతృ భాషలాగా నేర్చుకుంది. ఆ భాషలో మరింత పాండిత్యం సంపాదించటానికే లాసావైపు తన అడుగులు కదిపింది.
                      కుంబుంలో ఉన్నంత కాలం టిబెట్‌ బౌద్ధమతస్థుల జీవన విధానా లను గురించి తెలుసుకుంటూ ఉండేది. యాంగ్డెన్‌ ఆమెకి టిబెట్‌ ఆచారాలను గురించి వివరిస్తూ, వారు ఎదుర్కోబోయే సమస్యల్ని పరిష్క రించుకోవటం ఎలాగో విశదీకరిస్తాడు. టిబెటన్‌ బుద్ధిజంలో, పశ్చిమ దేశాల తత్వంలో కనిపించని శాంతి, సామరస్యం ఉందని తెలుసుకొని. అలాంటి దేశ పరిసరాల్లో జీవిస్తున్నందుకు తన జన్మ ధన్యం అయిందనుకొంటుంది. అలెగ్జాండ్రా ఇలాంటి పవిత్ర ప్రదేశాలను వదులుకొని అసలు ఎప్పటికీ యూరప్‌లో అడుగుపెట్టకూడదు అనుకొనేది.
కానీ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి. అందువలన తన ముందున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒక ప్రణాళిక తయారుచేసు కొంటుంది. తాను ఒక వంద సం||లు జీవిస్తేకాని తాను అనుకున్న పనులు, రాయవలసిన పుస్తకాలు పూర్తికావు. కుంబుంలో ఉన్నంతవరకూ భర్తనుండి డబ్బు వస్తూనే ఉండేది. ఈ కుంబుంలో తాను గడిపిన ఐదు సం||లు అంతా ‘స్వర్గంలో గడిపినట్లుగా ఉంది’ అని రాసుకొంది తన డైరీల్లో.
                     తన యాభై ఐదవ సం||లో అంటే తాను కుంబుంకి వచ్చిన ఐదు సం||లకి అంతా సర్దుకుని తగినన్ని బరువులు మోసే సేవకులు, గుర్రాలు అన్నీ సిద్ధం చేసుకుని, చివరికి లాసా యాత్రకి సిద్ధం అయ్యారు తల్లీ కొడుకులు. తన వేషాన్ని ఒక భిక్షగత్తెగా మార్చుకొంది.
1923 వ సం||లో ఉత్తర టిబెట్‌ నుండి ఒక ముసలి భిక్షగత్తె తన కొడుకుని తోడుగా తీసుకుని లాసా తీర్ధ యాత్రలకి బయలుదేరింది. టిబెట్‌లో యాత్రలుచేసే ముసలి స్త్రీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎవ్వరికీ అనుమానం రాదు. బహు భర్తృత్వం వల్ల మిగిలిన స్త్రీలు అందరూ యాత్రలు చేస్తూనే గడుపుతారు. ఇది అక్కడి సంప్రదాయం.

(ఇంకా వుంది)

 – ప్రొ.ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

108

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , Permalink

Comments are closed.