గౌతమీ గంగ

         (రెండవ  భాగం)        

                 శాస్త్రి గారు జాతకాన్ని క్షుణ్ణంగా పరీక్షించి రాజుగారు” ఈ జాతకుడు మహా భోగి, పెదవి విప్పి మాట్లాడని మితభాషి, కాని వీడు అల్పాయుష్కుడు. పది సంవత్సరాలు దాటి బ్రతకడు” అని చెప్పి అయ్యా! మీరు మీ ఇంటి కుక్క జాతకం తెచ్చి నన్ను పరిక్షించ తలిచారు పాండిత్యాన్ని పరీక్షించవచ్చు కానీ అవజ్ఞ తగదు. మీరు ఇక మీదట మా దర్శనానికి రానవసరం లేదు అని చెప్పారని , రాజు గారు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని వారికి పుట్టెడు భూమి (సుమారు 8 ఎకరాలు ) అపరాధ రుసుముగా వ్రాసి ఇచ్చారని చెప్పుకొంటారు.
                శాస్త్రి గారి నివాస గృహం క్షత్రియ సంప్రదాయానుగుణం గా వుంటుంది. చుట్టూ ప్రహరి గోడ, ప్రవేశ ద్వారం కలిగిన ఆ ఇల్లు ఉత్తరాభిముఖంగా వుంటుంది. ద్వారం దాటి లోన ప్రవేశించగానే ఖాళీ స్థలం. ఆ స్థలంలో మామిడి,పనస నేరేడు, వృక్షాలు చల్లని నిడనిస్తూ వుంటాయి. అవి దాటి లోనికి వెడితే సువిశాల గృహం. ఇంటికి ఇరువైపులా పెద్ద పెద్ద అరుగులు, ఆ అరుగుల్ని ఆనుకుని చిన్న అరుగులు వున్నాయి నేలబారుగా శాస్త్రిగారి కోసం వచ్చే నిమ్న జాతుల వారు ఆ అరుగులపైన మాత్రమే కూర్చోవాలి. మెట్లు ఎక్కి ఎత్తయిన అరుగుల్ని అధిష్టించే అవకాశం వారికి లేదు. ఒక వైపు ఎత్తయిన అరుగులపై కార్యార్ధులై శాస్త్రి గారి వద్దకు వచ్చిన పండితులు కూర్చొని శాస్త్రార్ధాల్ని చర్చించుకుంటూ వుంటారు.               

               ఎడమ చేతివైపు అరుగుల మీద శాస్త్రిగారి శిష్యులు వేదాన్ని, వ్యాకరణ పాఠాల్ని వల్లె వేసుకుంటూ వుంటారు. ఆ అరుగులు దాటి లోనికి వెడితే విశాలమైన సావిడి వుంటుంది. దాన్ని చిన్న కచేరి సావిడి అంటారు. సావిట్లో నరసరావు పేట కుర్చీలో సుఖాసీనులై శాస్త్రిగారు తమ కొరకు వచ్చిన ఊరి పెద్దలతోను, రైతులతోనూ వ్యవహారాలు మాట్లాడుతూ వుంటారు. సావిడి గుమ్మం దాటి వెడితే కొంత ఖాళీ స్థలం. ఆ స్థలం దాటాక ప్రధాన గృహం. ఆ భవనపు ప్రధాన ద్వారం టేకు కలపతో చేసి, అనేక నగిషీలు కలిగి వుంటుంది. దాని తలుపులు ఒక చేత్తో మూయలేనంత బరువుగా ఇత్తడి గుబ్బలు కలిగివుంటాయి. గడపలు నిత్యం పసుకు కుంకుమలతో నావ సుద్దబొట్లతో అలంకరించబడి, గుమ్మాలు నిత్యం ఇంట జరిగే ఏదో ఒక శుభకార్యానికి కట్టే పచ్చని మామిడాకు తోరణాలతో నిత్య కళ్యాణం. పచ్చతోరణం అన్నట్లుగా వుంటుంది. రెండు ఇళ్ళ నడుమ ఉన్న ఖాళీ స్థలంలో పని మనుషులు నిత్యం ఆవు పేడతో కల్లాపి చల్లి,ముగ్గులతో తీర్చి వుంచుతారు.ఆ ద్వారానికి రెండు వైపులా సన్నని అరుగులు పైన చూరుకు వరి కంకులు వేలాడగట్టి వుంటాయి. ఆ ధాన్యం తినడానికి వచ్చిన చిలుకలు,గోరింకల కలస్వనాలతో ఆ ముంగిలి మండన మిశ్రుల గేహాన్ని తలపింప చేస్తూ వుంటుంది. ఆ ద్వారాన్ని దాటి లోపలకు వెడితే పెద్దకచేరి సావిడి. అందులో ప్రధానాసనం అధివసించి శాస్త్రిగారు శిష్యులకు వేద పాఠాలు చెపుతూ ఉంటారు.

                            ఒక వైపున శాస్త్రిగారితో శాస్త్ర చర్చలకు వచ్చే పండితులు కూర్చోవడానికి కవాచి బల్లలు ఉంటాయి. శిష్యులు మాత్రం శాస్త్రిగారి ఎదురుగా నేలపై దర్భాసనాలు పరుచుకొని కూర్చుంటారు.ఆ సావిడిని ఆనుకుని మూడు గదులు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న గది శాస్త్రిగారు విశ్రాంతి తీసుకునేది. దాని తరువాతది అతిథి గృహం. దానిలో నాలుగు మంచాలు, పరుపులు, దిండ్లు ఉంటాయి. శాస్త్రిగారి కొరకు వచ్చే పెద్దలు ఆ గదిలో విశ్రమిస్తారు. చివరిది విద్యార్థుల గది వారు తమ పెట్టెలు, పుస్తకాలు అందులో భద్రపరుచుకుంటారు. రాత్రివేళ పెద్ద సావిడిలో చాపలు పరుచుకొని నిద్రిస్తారు. ఈ ఇంట్లోకి ఇంటిలోని స్త్రీలు అడుగుపెట్టరాదు. ఈ ఇల్లు దాటాక తూర్పుగా నివాస గృహం. అందులో తూర్పువైపున స్త్రీల కొరకు మూడు గదులు. మధ్యగా విశాలమైన సావిడి. పడమటి వైపున వంటకు, భోజనాలకూ గృహాలున్నాయి.

                    వంటశాలలో తూర్పువైపు గోడకు చేర్చి పొయ్యిలు. ఆ పొయ్యిలకు కుడి ప్రక్కగా భోజనాలశాలకు చేరి మూడు అడుగుల గోడ. ఈ గోడ అర్థగోడ వ్యవహారంలో అద్దగోడ అయింది. ‘‘పెద్ద కోడలికి అద్దగోడకు రాపిడెక్కువని’’ సామెత. వండిన వంటలు ఇతరులకు కనపడకుండా కట్టిన ఈ గోడపై వంట వండేవారు తమ చేతిలోని వస్తువుల్ని తరచుగా పెడుతూ వుంటారు. మొట్టమొదటిగా ఆ ఇంటిని మెట్టిన పెద్దకోడలు చిరకాల అనుబంధం వల్లా, బాధ్యత వల్లా ఇంటి బాధ్యత వహిస్తూ చిన్న పని, పెద్ద పని అని లేకుండా అంతా చూసుకోవాలని నాటి వారి భావం. ఇటుకల్ని అర్థ చంద్రాకారంగా పేర్చి కుడివైపున రంధ్రంగా అమర్చి ఆ రంధ్రం ద్వారాన గుండ్రంగా అమరుస్తారు. దానినంతా పచ్చమట్టితో అలుకుతారు. అర్థచంద్రాకారపు పొయ్యిలో కట్టెలు వుంచి మంట చేస్తే ఆ మంట సెగ రెండిటి నడుమ రంధ్రం ద్వారా గుండ్రటి ప్రక్కభాగానికి చేరుతుంది. పప్పు, సన్నటి సెగపై ఉడకవలసిన కూరలు, ముక్కల పులుసూ ఈ పెడపై వండుతారు. దీనిని పెడ పోయ్యి అంటారు. ప్రక్కకు సెగ చేరే మార్గంకల పొయ్యి అన్నమాట. దాన్ని నిర్మించడానికి చాలా నేర్పు కావాలి. ఈ పెడ పొయ్యిని కొందరు తరతరాలుగా నిర్మించుకొంటూ ఆనవాయితిగా భావించేవారు. కొందరు ఇది తమకు ఆనవాయితీ లేదని ఏర్పరచుకొనేవారు కాదు. రాత్రిపూట వంట ముగించాక ఈ పొయ్యిల్ని చల్లార్చి ఆవుపేడలో గుడ్డ ముంచి ఆలికి ముగ్గులు పెట్టి వుంచేవారు. మరునాటి వంట వేళకు అవి ఆరి సిద్ధంగా వుండేవి.

                    ‘‘బ్రహ్మీముహూర్తే ఉత్తిష్ఠిత। స్వస్తోరక్షార్థమాయుషః’’ అన్న ఆయుర్వేద సూక్తి ప్రకారం శాస్త్రిగారు తెల్లవారురaామునే నిద్రలేచేవారు. మంచంపై కూర్చొని కొంతసేపు స్మృతిలో పారిన శాస్త్ర విషయాల్ని మననం చేసుకొని ‘‘భగవతి విశ్వభరే పాదన్యాసం క్షమస్వమే’’ అన్న శ్లోకాన్ని చదువుకొని సర్వభూతధాత్రి అయిన భూదేవిని ఆమెపై పాదాలను వుంచుతున్నందుకు క్షమార్పణ వేడుకొని, కరాగ్రేవర్తతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలేతు గోవిందాః ప్రభాతే కరదర్శనమ్‌’’ అని కుడి అరచేతిని చూచుకొని మంచం దిగి పెరటిలోకి వెళ్ళేవారు. అక్కడ వారి అక్కగారు పీట వాల్చి చక్కని లతలు చెక్కిన చిన్న సైజు బిందెవంటి రాగి చెంబుతో ఉదకం, వేపపుల్ల సిద్ధంగా వుంచేవారు. ఆ పీటపై కూర్చొని గంటసేపు దంతధావనం చేసేవారు. అప్పటికి తూర్పున వెలుగురేకలు విచ్చుకొంటూ వుండేవి. ఆ సరికి ఇంటి పెద్దపాలేరు వచ్చి శాస్త్రిగారిని అనుసరించడానికి సిద్ధంగా తలగుడ్డ తీసి భుజంపై వేసుకొని నిలిచి వుండేవాడు. వ్యవసాయ పనులలో శాస్రిగారికి ఇతడు ముఖ్య అనుచరుడు. అతడు వెంటరాగా శాస్త్త్రిగారు మొదట కొబ్బరి తోటకు వెళ్ళేవారు. కోనసీమ కొబ్బరి పంటకు పేరు పొందింది కదా. కొబ్బరి మొక్కల యాజమాన్యాన్ని గూర్చి పెద్ద పాలేరుని అడిగి తెలుసుకుంటూ, దింపు చేయవలసిన చెట్లనూ, వచ్చే ఆదాయాన్ని మనసులో అంచనా వేసుకుంటూ పంట పొలాల వద్దకు వచ్చేవారు వారు. వారికి వరి పండే మాగాణీ క్షేత్రాలు, కంది, పెసర, మినుము మొదలైన ఆపరాలు పండే మెట్ట చేలూ ఉన్నాయి. వీటిలో పంటల్ని అజమాయిషీ చేస్తూ, చేయవలసిన పనుల్ని పాలేర్లకు చెప్తూ, అతడు చెప్పే సూచనలు వింటూ కర్తవ్యాన్ని నిర్ణయించేవారు. అక్కడి నుంచి కూరగాయల పెరటికి వచ్చి ఆ రోజు వంటకు కావలసిన కూరలు పాలేరు చేత కోయించేవారు.

                 శాస్త్రిగారికి అరటికాయ, ఆవ పెట్టిన కూర చాలా ఇష్టం. వారి భోజనంలో రోజూ ఆకు కూర వుండవలసిందే. వంకాయ కూరలకే రాజు కదా. లేత వంకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చీ కారంపెట్టి, ముదురు కాయలు వుడకబెట్టి వార్చి, అల్లం, పచ్చిమిర్చి చేర్చి వండటంలోనూ కోనసీమవారు బహు నేర్పరులు. పనసకాయ సన్నగా పొట్టులా వడ్లాబత్తుని చేత కొట్టించి పులుసూ ఆవ పెట్టి వండిన కూర గోదావరి జిల్లాల ఆంధ్రుల ప్రత్యేక వంటకం. వీటికి తోడు కంద బచ్చలి, బెండకాయ రవ్వ పులుసు వేసి వండిన కూర వంటివి నాటికీ, నేటికీ కోస్తా జిల్లాల వారి ప్రత్యేక వంటకాలు. శాస్త్రిగారికి మధ్యాహ్న భోజనంలో 2 కూరలు, 2 పచ్చళ్లు, గుమ్మడికాయ, ములగకాడ వంటి ముక్కలతో చేసిన ధప్పళం విధిగా వుండాలి. వారికి పెసరపప్పు చాలా ఇష్టం. రోజూ మెత్తగా ఉడకబెట్టిన పెసరపప్పు వుండాలి. రాత్రిపూట పప్పుచారు. కోబ్బరి, వెలగ పచ్చళ్ళు, శాస్త్రిగారికి చాలా ఇష్టం. ఆహితాగ్నులైన వారు ఒక పూట చేసిన వంటకం మరోపూటకు తినరుకనుక ఏ పూటకు ఆ పూట పదార్థాలన్నీ తయారు చేయవలసిందే.
                 

                      వంట ఇంటికి చేర్చి ఓ వసరా వుంది. వసారా వెనుక వున్నది విశాలమైన భోజనశాల. ఆ సావిడిని (వసారా)ని ఆవుపేడతో అలికి నావసుద్ధ నీటిలో నానబెట్టిన పేస్టుతో ముగ్గులు తీరుస్తారు ఇంటి స్త్రీలు. భోజనశాలలో పెద్ద పెద్ద టేకు పీటలు ఆనుకోవడానికి అ ఆకారంతో ఆనుడు పీటలూ వుంటాయి. పీటలకు చక్కగా వార్నీసు పూసి వెండి పువ్వులు అతికారు. తెల్లగా మెరిసేటట్లు తోమిన పెద్ద సైజు కంచు చెంబులు, వీని ప్రక్కన మంచినీళ్ళు పోసుకొని త్రాగడానికి బుడ్డి చెంబులు వుంటాయి. చక్కగా విప్పారిన మూడు మూర్ల పొడవు కల అరటి ఆకులు పీటల ముందు పరుస్తారు. ఆకులపై నీరు చల్లి బట్టతో తుడిచి శుభ్రపరుస్తారు. ఈ లోగడ శాస్త్రిగారి శిష్యులు మంచిగంధం సానపై అరగతీసి, అరటి పూవు డిప్పలు మంటలో కాల్చి తయారు చేసిన మసి అందులో కొంతభాగంలో కలిపి గంధం, అక్షతలు అనే పదార్థాలు తయారుచేస్తారు. ఈ అక్షతలు తలపై దాల్చే పసుపు కలిపిన బియ్యం కాదు. గంధాక్షతలు స్మార్త బ్రాహ్మణులు నుదుట దాల్చే ఓ విధమైన తిలకం అన్నమాట. ఈ గంధాక్షతలు వుంచడానికి ఇత్తడి పళ్ళాలు బుల్లివి 2 అరలు కలవి వుండేవి. వాటిని అక్షతల పుడకలు అనేవారు.

                    ఇంటి మగవారు, అతిథి, అభ్యాగతులూ, స్నానాలు కానిచ్చి, పొడి ధోవతులు దాల్చి ఆవుపేడ పిడకలు కాల్చిన విభూతి, భస్మత్రిపుండ్రాలుగా చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, మూడు దగ్గరగా చేర్చి విభూతిలో ముంచి రెండు బాహువులపైనా ముంచేతి మణికట్లపైన, నుదుట దాలుస్తారు. ఆ పైన నుదుట ఈ గంధాక్షతలు దాలుస్తారు. అప్పుడు మధ్యాహ్న సంధ్యోపాసన చేస్తారు. గంధాక్షతలు మధ్యాహ్నం వేళనే దాలుస్తారు గాని, విభూతిధారణ మాత్రం మూడు పూటలు జరుగుతుంది. విభూతి దాల్చాకనే సంధ్యను ఉపాసించే పవిత్రత కలుగుతుంది. తీవ్రమైన అనారోగ్యం కలిగి స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడితే విభూతి స్నానం అనే పేర భస్మధారణతో మానవులు పవిత్రులై దైవ ధ్యానానికి అర్హత పొందుతారు. ఈ విధంగా మనవారు ఎంత కఠిన నియమాలు ఏర్పరచారో, అత్యవసర పరిస్థితుల్లో అంతగానూ వెసులుబాట్లు కూడా కల్పించారు.
                    శాస్త్రిగారు ఇంటికి వచ్చే దారిలోనే పశువుల శాల వుంది. వీరు పశువుల ఆరోగ్యం, పోషణ విశేషాలు పశుపాలకులతో చర్చించి వారికి తగిన సలహాలు ఇస్తారు. లేగ దూడలను ముద్దు చేసి ఎదుగుతున్న కోడె (మగ)దూడల్ని పెయ్య(ఆడ)దూడల్ని లాలించి, లేత, పచ్చిక మేపి బయలుదేరే సరికి పాలేర్లు ఆవుల పాలు పితికి కావిళ్లతో సిద్ధంగా వుంటారు శాస్త్రిగారు ముందు నడవగా వారు వెనుకగా ఇంటిదారి పడతారు. వారు వచ్చే దారిలో బ్రాహ్మణులు మడి నీరు తెచ్చుకొనే మంచినీటి చెరువు వుంది. శాస్త్రిగారు ఇంటికి చేరే వేళ వరకూ ఊరి స్త్రీలు ఆ చెరువుకు నీటికి రారు. ఏ స్త్రీ అయినా తొందరలో వస్తే శాస్త్రిగార్ని అంతదూరాన చూడగానే దారి తొలిగి చాటుగా నిలిచి వారు సాగిపోయాక ఇంటి దారి పడతారు.
శాస్త్రిగారి స్నాన కార్యక్రమం చాలా వైభవమైనది ‘‘అభ్యంజ మాచరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే’’ అని అయుష్షూ ఐశ్వర్యం కోరేవారు నిత్యం అంభ్యంజన విధి నెరవేర్చాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తూంది. ‘‘నిత్యతలగడుగూ, వారభోజనం’’ అని లోకోక్తి భోజననానికి శక్తి లేకపోయినా తలంటు మానవద్దని, ఛలోక్తిగా చెప్తున్నారు పెద్దలు. ఇంటి పాలేర్లు కాగులలో నీరు మరిగించి సిద్ధంగా వుంచుతారు. చాకలివాడు వచ్చి ఒక పెద్ద గంగాళం నిండా వేడినీరు తొలుపుకొని, రెండు పెద్ద సైజు బిందెల్లో పెరటిలోని నూతి నీరుతోడి సిద్ధం చేస్తాడు. కొద్ది పాటి ఎత్తుకల పీటపై శాస్త్రిగారు కూర్చుంటే ఇంటి వారు సిద్ధంగా వుంచిన చిన్న గిన్నెలోని నువ్వులనూనె శాస్త్రిగారి తలకు, వంటికి బాగా మర్థన చేస్తాడు. పెసలు, ఖచ్చూరాలు కలిపి విసిరిన సున్నిపిండితో ఒళ్లంతా నలుగు పెడతాడు. ఆ తరువాత రాతితో చితుకకొట్టి వేడినీటిలో నానపెట్టిన కుంకుడుకాయ రసంతో తల, ఒళ్లు శుభ్రంగా తోముతాడు. గంటసేపు సాగే ఈ కార్యక్రమం చివరిదశలో శాస్త్రిగారి అప్పగారు తులసి మృత్తిక, తులసి కోటలోని మట్టి తెచ్చి ఆయన చేతిలో వేసేవారు అది రాసుకున్నాక చిన్న బిందెడు మడి నీరు వారి మీద పోస్తారు. అప్పటికీ స్నాన విధి పూర్తి అవుతుంది.

                    వయస్సు మళ్ళిన స్త్రీలు, వితంతువులే కాని, సుమంగళులు, యుక్త వయస్సు స్త్రీలు, చాకలి, మంగళుల ఎదుట కనిపించరాదు నాటి రోజులలో నీరు పోసి ఆమె శ్రీరామరక్ష పెట్టాక చాకలి మెత్తని పెద్దపంచతో వారి తలా, ఒళ్ళు తుడుస్తాడు. ఉతికిన తెల్లని రుద్రాక్షంచు ధోవతి, ఉత్తరీయం ధరించి పడమటింటిలో తూర్పు ముఖంగా వాల్చిన పీటపై కూర్చొని భస్మత్రిపుండ్రాలు మంత్రయుక్తంగా నుదుట, రెండు దండల పైన మణికట్లు పైన ధరించి ప్రాతః సంధ్యా వందనం చేస్తారు. అది ముగిసాక పెద్దకచేరి సావిట్లో వారి ప్రత్యేకాసనంపై కూర్చొని శిష్యులకు వేద ప్రవచనం, వ్యాకరణ శాస్త్రాధ్యయనం ప్రారంభిస్తారు.

                        శాస్త్రిగారిది దబ్బ పండుచాయ, బలిష్ఠమైన దేహ యష్టితో ఆరడుగుల 3 అంగుళాల విగ్రహం వారిది. నాటి సాంప్రదాయానుగుణంగా జుట్టు నుదుటిపై భాగాన నున్నగా క్షౌరంచేసి వెనుక పట్టెడు కేశపాశం వుంటుంది. ఉదయ స్నానానంతరం ఆరడం కోసం దాన్ని కొసల చివర వేలు ముడివేసి వుంచుతారు. మధ్యాహ్నం భోజనానంతరం ఇంచుక విశ్రమించాక వారి అక్కగారు భృంగామలక తైలం అనే ఆయుర్వేద తైలం రాసి చిక్కు తీసి ముడివేస్తారు. నాటికాలంలో మగవారికి భార్యలు పరిచర్య చేయడమనేది శిష్టాచారం కాదు. పైగా నిషిద్ధం కూడా. ఇంట వున్న అప్ప చెల్లెళ్ళో, కుమార్తెలో వారి సంరక్షణా బాధ్యత వహించవలసిందే. ఒక్క భోజనాల వేళ వడ్డన చేస్తూ మాత్రమే భార్య, భర్త కంట పడేది. రాత్రి అందరూ పడుకున్నాక మాత్రమే వారు ఒకరినొకరు చూసుకొన్నా, మాట్లాడుకున్నా. శాస్త్రిగారి చెవులకు వజ్రాలు పొదిగిన కుండలాలు, మెడలో రుద్రాక్షలు బంగారం పొదిగిన హారం రెండు పేటలది, బంగారంతో పొదిగిన స్పటికాక్ష మాలిక నిత్యం ధరిస్తారు. చేతులకు సింహ తలాటం మురుగులు బొటన వేళ్ళకు తప్ప మిగతా 8 వేళ్ళకు దర్భముడి ఉంగరం, నవరత్నాలు పొదిగిన ఉంగరాలు వుంటాయి. ఒక పర్యాయం ఓ పండితుడు శాస్త్రి గారితో స్పర్థ వహించి పండిత పరిషత్తులో వివాదానికి దిగాడు. శాస్త్రిగారి ముందు నిలువలేక అతడు ఓటమిని అంగీకరించారు.

                             ఆ సభకు అధ్యక్షత వహించిన ఓ జమిందారు వీరి కుడి కాలికి గండపెండేరం వేయించారు. మూర్తి దాల్చిన సాంబ శివునిలా శాస్త్రిగారు ప్రధానాసనాన్ని అధివసించే సరికి శిష్యులు స్నానం, సంధ్యాదనుష్ఠానాలు నెరవేర్చుకొని అధ్యయనానికి సిద్ధంగా వుంటారు. వారి పాఠాలు ముగిసే సరికి అపరాహ్ణం సమీపిస్తూ వుంటుంది. వ్యాకరణ శాస్త్రాధ్యయనం ప్రాతః కాలాన మాత్రమే జరగాలి. వేదపాఠం మధ్యాహ్నం, సాయం సమయాల్లో వల్లె వేసుకోవడానికి అభ్యంతరం లేదు. వ్యాకరణ శాస్త్రం మాత్రం ‘‘న భుక్త్వీ ననిశిప్రబ్రూయాత్‌’’ అన్న శాస్త్ర విధి చేత భోజనాననంతరం కాని, రాత్రి వేళ కాని చదువరాదు. ప్రాతఃకాలాన మాత్రమే పఠించాలి. ‘‘ఆ బాహుపురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్ర శిరసంశ్వేతం పతంజలిముపాస్మహే’’ అని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన పతంజలిని స్తుతిస్తూ ‘‘యోగేన చిత్తస్య పదేశవాచాంమలం శరీరస్యచవైద్యకేన। యోపాకరోత్తం ప్రవరంమునీనాం పతంజలిం ప్రాంజినానతోస్మి’’ అన్న రెండో శ్లోకం ముగించే సరికి శాస్త్రిగారి మనస్సు నిశ్చల సమాధిగతునిలా శాస్త్రం తప్ప వేరు విషయ స్పురణకు తావు లేనిదవుతుంది.*

(ఇంకా వుంది)

 – కాశీచయనుల వేంకట మహాలక్ష్మి

రచయిత్రి పరిచయం:
కాశీ చయనుల వెంకట మహా లక్ష్మి గారు సంస్కృత పంచకావ్యాలు గురుముఖత: నేర్చుకుని ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలలో స్వయంకృషితో ఎన్నో గ్రంథాలను పఠించి విశ్వనాధ వారి ’రామాయణ కల్పవృక్షం’ వంటి గ్రంథాలను ఆకళింపు జేసుకున్న విదుషీమణి. జటావల్లభులవారి వంశంలో జన్మించిన ఈమె తండ్రి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద విశారద డా.జ.లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు. తల్లి శ్రీమతి వేంకట సీతామహాలక్ష్మి సంగీత సరస్వతి. గాత్రం,హార్మోనియం, వీణలలో నిష్ణాతురాలు. స్వయంగా అనేక పాటలను వ్రాసి బాణీలు కట్టి గానం చేసిన వాగ్గేయకారిణి. సోదరి సాహిత్య శ్రీ డా. సుబ్బలక్ష్మి మర్ల ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సోదరుడు జ.కృష్ణమూర్తి కూడా రచయిత. ఆర్ష విద్యా భూషణ బ్రహ్మశ్రీ జటా వల్లభుల పురుషోత్తం ఈమె పిన తండ్రి. ఈ మె రచించిన వ్యాసాలు ఇది వరలో భక్తి రంజని, పాటలీ పుత్ర తెలుగు వాహిని వంటి పత్రికలలోను ఇటీవల ’విహంగ’ లోను ప్రచురితమయ్యాయి. భర్త కా.కృష్ణమూర్తి గారు ప్రముఖ వైద్యులు.’కాశీచయనుల కృష్ణమూర్తి ట్రస్ట్ ఫర్ హెల్త్ కేర్’ అనే పేరు తో ట్రస్టును స్థాపించి పేద రోగులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10

ఆత్మ కథలు, , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో