ఈ మనసుని ఏం చెయ్యాలి?

     గబగబా పేజీలు తిరగవేస్తోంది పొందికగా గుండ్రంగా వున్న అక్షరాల వెంట ఆత్రంగా… ఆశ్చర్యంగా…
పరుగులు తీస్తూన్నకళ్ళకిఏదో రహస్యం పొరలువిప్పుకుంటూ సిగ్గుపడేలా చేస్తోంది.
ఒక స్త్రీ చుట్టూ అల్లుకున్నఊహలు,చదువుతున్నకొద్దీ వేడి నెత్తురు చెంపలమీద జరజరా పాకుతోంది….
ఖరీదైన కారు  రోడ్డుమీద గుంతల్ని తప్పించుకోలేనట్లే  ”ఇండ్రస్ట్రియలిస్ట్” భార్యగా , ఒక డైర్కెక్టర్ గా వుండి కూడా కిరణ్  పర్సనల్  డైరీని చదువుతూ చలించి పోయింది.
విసురుగా  మూసేసి  పక్కన పడేసినా, అక్షరాలు వెంటాడు తున్నాయి, “నయనతార” పేరు పదేపదే గుర్తుకొస్తోంది.ఎవరీ “నయన తార”?
పర్సనల్  డైరీని  ఇంత నిర్లక్ష్యంగా  ఎలా మరచి పోయాడు?  అన్నట్లు ఇది కిరణ్ కారు కదూ.
తన కారు  రిపేరులో వుంటే కిరణ్ కారులోవెళుతోంది.కిరణ్  ఢిల్లి  వెళ్లాడు  ఈ రాత్రికి వస్తాడు, అడగాలా వద్దా? ఏమని అడగాలి?
వేగంగా దూసుకుపోతున్న కారు అద్దంలో ఎన్నడు లేంది  తనని తాను చూసుకుంది “అనిత”నీట్ గా ట్రిమ్ చేసిన  అందమైన  క్రాఫ్ చెవులకి  కనీకనిపించని చిన్న డైమన్డ్ ఇయర్ రింగ్స్,జీన్స్ కుర్తా మోడరన్ కంఫర్ట్ డ్రస్.ఈ లుక్స్ కిరణ్కి నచ్చలేదా?
ఆలోచిస్తూనే ఆఫీస్ ఛాంబర్లోకిఅడుగుపెట్టింది.
అసలు కిరణ్కి జీవితంలో లోటు అంటూ ఉందా?
ఆలోచనలు వదలక పోవడంతో ఎన్నో ప్రశ్నలు.
జీవితం అంటే అన్నీ అమర్చిన విస్తరిలాఉండాలనే కోరుకుంటారు అందరు
కొందరినే అది వరిస్తుంది, .”కిరణ్కిఅలాంటిజీవితం వరించింది,వరించిన జీవితం సాఫీగా సాగిపోతోంది.
మహా నగరంలో  ”ఇంటర్ నేషనల్ స్కూలు చదువు దగ్గరనుంచి   తండ్రిఇచ్చిన  ”ఇండస్ట్రీ,  మోడ్రన్ లుక్స్ గల భార్య అనిత దాక.
ధనవంతులేఅనిపించుకోదగ్గ  జీవితం .” అందరూ ఈర్ష్య పడేంత.మరి ఇప్పుడు ఇంకా ఏం కావాలి?అలా అని నేనుఅనుకుంటున్నానా? తన మనసులో ఏదో వెలితి   వుందా?అది నేనేనా?
అన్నీ ప్రశ్నలే సమాధానం దొరకటంలేదు.పని మీద ఏకాగ్రతకుదరడంలేదు మీటింగ్స్ అన్నీ యధాలాపంగా ముగించి ,తనని డిస్ట్రబ్ చెయ్యదని చెప్పి ఒంటరిగా కూర్చున్నా ఆలోచనలు వాటంతటవే పరుగులు పెడుతున్నాయి.
మళ్ళీ కళ్లముందుకి కిరణ్ డైరీలో అక్షరాలు వచ్చి వెంటాడుతున్నాయి.

            ****                              *****                                       ****

నన్ను అందరు చాలా అందమైయింది, తెలివైందిఅంటారు
ఇల్లు,పిల్లలు భర్త … అందర్నిచుట్టూతిప్పుకునే  ఓ అందమైన స్కూలు టీచర్ నువ్వు.
కిరణ్ఎన్నిసార్లు అన్నా నవ్వేసి ఊరుకునేది,ఇదంతా నాఒక్కదాని గురించి కాదుగా అంటూ..
కిరణ్ మాటల్ని పట్టించుకోలేదు.లేచిందగ్గరనుంచి మార్నింగ్ వాక్ ,లేదా త్రెడ్మిమీల్ మీద నడకలు శరీరంలోఇంచీ ఎవరూ పెరగ కూడదు,ఇంట్లో ఎక్కడా అనవసరమైన  తినుబండారాలు వుండవు.
అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రశంసలవర్షం.తల్లీకూతుళ్ళని అక్కా చెల్లెళ్ళాఅని,
తండ్రీ కొడుకులని అన్నదమ్ములా అని.!వీటన్నింటివెనక ఎంత శ్రమ.
కిరణ్ సహజంగా చాలా అందమైన వాడు,దానికి తోడు ఫిట్నెస్, మీసాలకి రంగు వేసుకోడు .సహజంగా వుండాలనుకుంటాడు.అయినా అందరూ మెచ్చుకుంటారు.
బి.టెక్ ఆఖరి సంవత్సరంలో వున్న అబ్బాయి,మెడికల్ లో మాస్టర్స్ చేస్తున్న అమ్మాయి,ఇండస్ట్రీలో చేదోడువాదోడుగా వున్న భార్య,ఇవ్వన్నీ
కాకుండా బొద్దుగా జాకెట్టు అంచుదాక వున్న జడ .జడలో మల్లెపూలుపెట్టుకున్న ఆవిడ “నయనతార” కిరణ్ మనసులో తిష్ట వేసుకుని
పర్సనల్ డైరీలో రోజు ఒక భాగం అయిపోయాక..మనసంతా మొద్దుబారిపోయింది.ఆ అక్షరాలు వెంటాడి వేధిస్తున్నాయి.కిరణ్ డైరీలో అక్షరాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి.
” హాయిగా సాగిపోయే జీవితం అన్ని విషయాల్లో తోడుగా వుండే అనిత…
ఇన్నింటి మధ్య చిన్నప్పటి జ్ఞాపకం. ఎదురింటి  మాస్టారి గారి అమ్మాయి  పట్టుపరికిణి,పొడుగు జడ ,బంగారు జడకుప్పెలు.మనసులో ముద్రించుకుపోయాయి.
బాపు హీరోయిన్  జడ అంత జడ కాకపోయినా  జాకట్టు  అంచులదాక వున్న జడ ఆ జడలో   మండు వేసవిలో   జాజి మాల. ఆ రూపం చాలా ఇష్టం.
అనితని అలాగే చూడాలని అనిపించేది చిన్నకోరిక  ఎవరైన వింటే నవ్వుతారేమో భార్యని అడగడానికి మొహమాటమేమిటి? మొహమాటం కాదు ఎవరి స్వేచ్ఛ వారిది వేసుకునే డ్రస్ ని కూడా నియత్రించడం ఇష్టం లేక.
అనిత ,కూతురు లాస్య ,కొడుకు భరత్  అందరు  నీట్ గా టీమ్ వర్కర్స్ లా   కొంచంకూడా పెరగనివ్వని  శరీరం కొలతలతో అందరూ మొగవాళ్ళల్లాతిరుగుతూంటే,ఎవరికి తీరిక ? చిన్న జాజిపూలదండ జడలో పెట్టుకోవడానికి?.మొగాళ్ళలాగ అని నేను అనుకుంటే సరిపోతుందా వాళ్ళూ అనుకోవాలిగా.
వాళ్ళకి ఆ ఫిట్నస్ ఆరోగ్యానికి సంబంధించింది .కాని నేనే వాళ్ళలో ఇమడలేక సతమవుతున్నాను అనుకుంటూ నిట్టూర్చిన రోజులు ఎన్నో.
పూల బొకేలు షాపు దగ్గర డ్రయివర్   నిలబడి బొకే  కొంటున్నాడు. సరిగ్గా అప్పుడే చూసాను ఆమెని.   కారులో కూర్చున్న నాకు ఆమె స్పష్టంగా కనిపిస్తోంది.
కొంచంబొద్దుగా ఒత్తుగా వున్న జుత్తు  చక్కటి కాటన్ శారి ప్రత్యేకమైన అందం కాక పోయినా  మన్సులో ఆమె రూపం ముద్ర పడి పోయింది..కారు పక్కనేవున్న”స్కూటి తీసుకుని” వెళ్ళి పోయింది.
అది చాలా మాములు విషయం ,ఇష్టమైన విషయాలు ఎదురు పడగానే మనసులో అవి  బలంగా  ముద్రించుకు పోతాయి, నావిషయంలో  అదేజరిగింది.
మనసులో    కోరిక బలంగా వుంటే   అది అయి తీరుతుంది అంటారు.  ఆదే జరిగింది  మళ్ళీ    . అనుకోకుండా అమే కనిపించింది.పింక్ కలర్ కాటన్ శారీలో   జడలో  జాజిమాలతో   అలా చూస్తూ వుండిపోయాను.         . .
కొంచం  పక్కకి  జరుగుతారా   అడిగింది  నావైపు చూసి.   సభ్యత మరచి పోయి  ఆమేనే చూస్తూ నిలబడి పోయినప్పుడు,
చెవులకి ముత్యాల జుంకాలు , మెరూన్ కలర్ కుంకుమ బొట్టు ..గ్రీన్ కలర్  బెంగాల్ కాటన్ శారి…..
అచ్చం”సాగర సంగమమం ” సినిమాలో జయప్రదలాగ.
అంద మైన కాటన్ చీరలు….జడలో జాజులు  కాకపోయినా   గూలాబి పువ్వైనా వుండాలి  …. కళ్ళకి సన్నని కాటుక,స్ర్తీకి తేచ్చే అదనపు అందాలు,నామన్సుకి నచ్చినట్లుగా కనిపించింది ఆమె
అందుకే  ”నయన తార” అనుకునేవాడ్నిఆ పేరుతోనే రాసుకునేవాడిని
నాడైరీలో   రోజు ఒక ముఖ్యమైన పేజిలాగ మారిపోయింది.ఆమె కనబడాలని అనుకోవడం.
కనబడితే మురిసిపోవడం లాంటి చిన్నచిన్న ఆనందాలు.ఆమె ఎవరో తెలియదు.కాని రోజూ కనబడాలని కోరుకునేవాడిని.ఒక రోజు హఠాత్తుగా మార్నింగ్ వాక్ లోకనిపించింది.
,నాఆనందం అంతా ఇంతాకాదు నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో.
నన్ను గుర్తుపట్టినట్లుగా పల్చని చిరునవ్వు.
ఠక్కున పేజీ మూసైనా ..
వద్దు …అనుకుంటూనే ,సభ్యతకాదు అనుకుంటూనే డైరీలో  విషయాలు తలచుకుంటే   ఎక్కడో ఓడి పోయిన  ఫీలింగ్ అనితని నిలవనివ్వలేదు …సక్సెస్ కి చిరునామా తనజీవితం  అన్నివిషయాల్లో .   గెలుపుపొందడం ఒక మత్తులాంటిది ,ఆ మత్తుని ”కిరణ్”  బద్దలు కొట్టాడా? కిరణ్ మీద అనుమానమా? అలాంటి మాటలు వాడడానికి కూడ మనసు   ఇష్టపడం లేదు.
కిరణ్ డైరీ నిండా  అమె గురించిన అభిప్ర్రాయాలు. ఎంతటి ఆత్మీయులైనా, భార్య భర్తలైనా  ,ఎన్నివిషయాలు తెలుసుకున్నా  ఒక స్పేస్  వుంటుంది…అ స్పేస్ మంచిదా చెడ్దదా?
అది ఆలోచించే  వ్వక్తుల మీద ఆధార  పడి వుంటుంది.
కిరణ్  స్పేస్  అదా? దాన్ని అంగీక రీంచాలా,మనసులో మాట అడిగేయాలా? అవును అంటే   …అది భయంకర మైన ఓటమి…..
డైరీలో   అక్షరాలు  వెంటాడుతున్నాయి .కిరణ్  మనసు   అద్దంలో   ప్రతిబింబంలా కనబడుతోంది,కల్మషంలేని,స్వఛ్చమైన   అభిప్రాయాలు..
ఇంటికి రాగానే కూతురు లాస్యని అడగడానికి మొహమాట పడి.చాలా క్యాజువల్గా అడిగినట్లు అడిగింది.
,నాకు నిజం అనిపించటంలేదు ..బహుశ అతను ఊహించుకున్న జీవితమేమో? ఆలోచించు  నాన్న అలా ఇంకొకరితో వుంటూ మన దగ్గర దాచాల్సినంత అగత్యం లేదు  . మన ఇంట్లో అందరం ఫ్రీ గా వుంటాము ,అయినా ఒకసారి  ఆలోచించి  ఆమె ఎవరో కనుక్కో   అంది.
అంటే ఆ మనిషి మీద  నిఘా వుంచడమా?  నన్ను నేను అవమానించు కునట్లే…….తెగని ఆలోచనలతో   తనకి తేలియకుండానే  ”కిరణ్”ని  గమనించడం మొదలు పెట్టింది అనిత.
అనితలో  అంతర్ యుద్దం మొదలు అయ్యింది. అనుకోకుండానే  కొన్ని సార్లు  కాఫి కేఫేలని వెతికేది,మళ్లి  తనలో తానే  సిగ్గుపడేది ఇది కాదు నా వ్యక్తిత్వం.
వెంటాడి నిజం తెలుసుకుని  సాధించేది ఏముంది  ? మరి నోరు మూసుకోవాలా? ఏమిటి ఈ నోరు మూసుకోవడాలు సాధింపులు?   సాధారణ స్ర్తీగా ఎన్నడు అనుకోలేదు..అని
మనసు ప్రశ్నించింది…ప్రతీవిషయంలో  స్వేచ్చ కావాలనుకుంటూనే  కిరణ్  స్వేచ్చని  అంగీకరించటంలేదా?  పర్సనల్ …అన్నీ  లాప్ టాప్ దగ్గర నుంచి  సెల్  ఫోన్ దాక అన్నీ పర్సనల్ గా
వుండాలని,  సమస్య వస్తే  అందరూ ఓపన్  గా చర్చించుకోవాలన్న ధీమా కబుర్లు  చెదిరిపోయాయని దిగులా?  దేనినీ అంగీకరించని  అనిత  మనసు  ఆలోచనల వరదలో కొట్టుకుపోయింది….
ఊహించని విధంగా  అనితకి  ఏక్సిడెంట్ జరిగి   పాదం ఫ్రాక్చర్  అవడంతో   ఆరునెలలు ఇంచుమించుగా  ఇంట్లో  వుండి పోవాల్సి వచ్చింది…ఆ తరువాత  అనుకోకుండా  లాస్యకి పెళ్ళి సంబంధం రావడం  అందరు కలసి   మగపెళ్లివారు  రమ్మని మరీ మరీ బలవంతంపెడితే  లండన్  వెళ్ళివచ్చిన హడావిడీ , ఆతరువాత పెళ్ళి పనులు…..
లాస్య  పెళ్ళి అయ్యాక లండన్ వెళ్ళి పోయింది  …హడావిడి తగ్గి  ఫ్యాక్టరీకి   వెళ్ళడం మొదలు పెట్టాక ..బ్యూటీషియన్  ”మేడమ్  ” ఈ నెల అయినా వస్తారా ..అని పోన్ చేసినప్పుడు తీరిగ్గా
అద్దంలో  చూసుకుంది   అనిత, పొడుగ్గా పెరిగిన జుత్తుని,  పెరుగుతోందని  తెలుస్తున్నా  ..కాలు కింద పేట్టలేని పరి స్థితులు..అమ్మాయి పెళ్ళి..మెల్లగా సంవత్సరం పాటు  ఒదిలేసి జుత్తు భుజాలు దాటి పెరిగింది….
తరవాత వారం వస్తానని  బ్యూటీషియన్ కి చెప్పి , స్నానం చేసి  గదిలోకి  రాగానే   ..మంచంమీద లైట్ కలర్  పింక్ కలర్   చీర  చాలా పాతది.  ఎప్పుడు కట్టు కోలేదు కాబట్టి కొత్తగానే వుంది.
దాని మీద జాజి పూల దండ .అలా చూస్తూ వుండిపోయింది  ,ఈరోజు కొత్తకాదు ఒక ఆరు నెలలుగా సాగుతోంది  సీజనల్ జాజులు కాక పోయినా ,వాసన లేని  జాజిమాల అయినా మంచంమీద వుంటోంది….
కిరణ్   రే్పటితో  ఇంకవీటి  అవసరం వుండదు అంది చీరకట్టుకుంటూ..ఏ జాజిపూలతో  బోరు కొట్టిందా  గదిలో   లైటు తీసేస్తూ అడిగాడు  కిరణ్…
రేపు బ్యూటీషియన్ కి  సమయం ఇచ్చాను…

అంటే  హైర్ కట్ కూడానా?

అవును నాహైర్  స్టయిల్  అదేగా..

ఇలాగే బాగుంది  వుంచేయకూడదూ ఆచిన్న జడనే సవరిస్తూ అంది .
మనసులో ఎప్పటిదో కసి …అప్రయత్నంగా బయటికి వచ్చింది  అనిత మాటల్లో   ..

ఏమీ నయన తార” మిమ్మల్ని వదిలేసిందా?

పడక గదీలో ఇంత మౌనం  ఎప్పుడూ అనుభవించలేదు.
అ తరువాత కిరణ్ బయటికి వెళ్ళి పోయాడు…..

ఛా  ఎందుకు  ఇంత తొందర పడ్డాను  అడిగి   తేలిక అయిపోయాను.

ఎలా వున్న జీవితం  అలాగేవుంది  అదే ప్రేమ  అదే మనిషి…..
ఎక్కడ  చిన్న మార్పు లేదు ..ఓడి పోయాను పూర్తిగా  ఇప్పుడు నా మీద ”నయన తార”గెలిచింది….
మొట్ట మొదటి సారిగా ఇన్నేళ్ళ సంసార జీవితంలో  జరిగిన వింత..కిరణ్  అలా వెళ్ళి పోవడం..

అనిత కళ్ళల్లో నీరు”.ఏడవడం అంటే  ఓడి పోవడమే ”

ఓటమిని  అసహ్యించుకునే అనిత కళ్ళలో తడి………..
బ్యూటి పార్లర్   అద్దంలో   చూసుకుంటూన్న  అనితలో  ఏదో అశాంతి.  మళ్ళీ   పాత హైర్ కట్  మొన్న పెళ్ళి కోసం  కొనుకున్న డైమండ్ డ్రాప్స్ వున్న ముత్యాల ఇయర్ రింగ్స్
చాలా బాగున్నారు  మేడమ్ మీరు  బ్యూటీషియన్ పొగడ్త   ….
హాయ్ యూ ఆర్   వండ్రఫుల్  ఫ్రెండ్స్   పొగడ్తల పూల గొడుగు…..ఇన్నింటి మధ్య  ఒంటరిగా అనిపించింది….
కిరణ్  గెలిచాడన్న  కోపం. మళ్ళీ ” నయన తార ” కిరణ్ కి దగ్గర అవుతుందా? అసలు  ఎక్కడుంది  ఈవిడ? మళ్ళీ అన్వేషణ  మొదలా?
కిరణ్  ఫోన్  హలో  అంది  ఎక్కడ వున్నావు  అడిగాడు.. పార్లర్లో పని అయిపోయింది   ఇంటికి వచ్చేస్తున్నా….
అనిత  హైర్ కట్ చేయించు కున్నావా ?  అవును అంది అనిత  …పోన్ కట్ చేసాడు కిరణ్….
మళ్ళీ అనిత కూడా చెయ్యలేదు..కారులో కూర్చుంటుంటే   ఒక   మేసేజ్  వచ్చింది. కిరణ్ దగ్గర నుంచి  ”నయన తార” నన్ను ఒదిలి ఎప్పటికి వెళ్లదు   అనితా నువ్వు వెళ్ళిపోయావు…
ఆ మేసెజ్ చూడగానే  దుఃఖం  వచ్చింది  …. ఓడి పోయింది  పూర్తిగా ఓడిపోయింది……….

– రేణుక అయోల

*                                *                         *                                  *                        *                                   *

కథలు, , , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఈ మనసుని ఏం చెయ్యాలి?

  1. Chaitra says:

    నేటి పరిస్థితుల్లో తప్పక చర్చించుకోవలసిన సున్నితమైన అంశం. భార్య ఆహార్యం, వ్యక్తిత్వం – ఈ రెండూ ఎంతో కొంత కలవరపాటుకో, అసహనానికో గురిచేస్తూనే ఉన్నాయి భర్తని, ఇప్పటికీ! కథ చెప్పిన పధ్ధతి బాగుంది.. ముగింపు సహజంగా ఉంది కానీ, న్యాయంగా లేదు.

    – చైత్ర.