సెప్టెంబరు సంపాదకీయం

                    స్త్రీలకు, శూద్రులకు  చదువుని నిషేధించిన  హిందూ సమాజానికి  ఎదురు నిలిచి మహిళల  కోసం ఒక  పాఠశాల ను  ప్రారంభించిన  సావిత్రీబాయి ఫులేని  స్త్రీలు తమ తొలి ఉపాధ్యాయినిగా అంగీకరించడంలో తప్పు లేదు. అప్పటి వరకు స్త్రీని ఒక అబలగా, చంచల స్వభావిగా, పామరురాలిగా భావిస్తూ  వంటిల్లు దాటి  బయటకు రానియ్యలేదు.  స్త్రీని    ఎప్పుడు  ఒక వ్యక్తిగా  గౌరవించలేదు. చెప్పులు వేసుకుని  తిరగవద్దని,  పగలు భర్తతో  మాట్లాడవద్దని, గొడుగు వేసుకుని  తిరగవద్దని  ఆంక్షలు  విధిస్తూ  ఉండేవారు.  పైగా ఆడపిల్ల చదువుకుంటే  తాను వైధవ్యానికి  గురి అవుతుందని, చదువుల పేర్లతో  బయటకు  వెళ్ళితే  చెడు  దారులు తొక్కుతుందనీ   ప్రచారం చేసి  నాలుగు అక్షరం ముక్కలకి కూడా  దూరం చేసారు.

               నేటి  విద్యావంతులైన  స్త్రీలకి  ఈ అక్షర భాగ్యాన్ని  ప్రసాదించడంతో  తీవ్రమైన కృషి  చేసిన జ్యోతిరావు ఫులే ని  అబినందించక తప్పదు. మత ఛాందసులను ఎదుర్కొంటూ    మూఢనమ్మకాలపై  తిరుగుబాటు చేస్తూ  పూనా నగరంలో పెద్ద సంచలనం సృష్టించాడు ఫులే. శూద్రులు, అస్పృశ్యులు   పాఠశాల   దరిదాపులకు కూడా  వెళ్ళే సాహసం చేయలేని రోజుల్లో జ్యోతిబా స్త్రీల కోసం  ఒక పాఠశాలని  ప్రారంభించాడు.

ఆ  పాఠశాలలో చదువు చెప్పటానికి ఏ ఉపాధ్యాయుడూ ముందుకు రాలేదు.ఇక ఉపాధ్యాయినులు ఉంటారనే ఆలోచన రాని రోజుల్లో తన భార్య సావిత్రి బాయి కి చదువు నేర్పించి విద్యావంతురాలిని చేసి పాఠశాలకి ఉపాధ్యాయినిగా  పంపాడు.అప్పటివరకు గడపదాటని స్త్రీ,పైగా శూద్రురాలు   అతి శూద్రులకి చదువు చెప్పటానికి పూనుకోవటం ఎంత సంచలనాన్ని సృష్టించి వుంటుందో మనం ఊహించలేనిదేమీ కాదు.  ప్రతి రోజూ బడికి వెళ్ళే దారిలో రాళ్ళ దెబ్బలు  తిన్నా ,బురద చల్లించుకున్నా, జనాలు తిట్ల దండకాలతో శపిస్తూ వున్నా   అన్నిటినీ భరిస్తూ ‘మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు’ అంటూ అడుగు  ముందుకే  వేసింది  తప్ప  వెనకడుగు  వేయలేదు.

అప్పటికి క్రైస్తవ  మిషనరీలు   స్థాపించిన  బాలికల పాఠశాలలు వున్నా కూడా  బోధించే భారతీయ స్త్రీలు లేరు.సావిత్రీ బాయి తొలి భారతీయ  ఉపాధ్యాయిని గా సామాజిక  రంగంలోకి అడుగు పెట్టి ఈ బాధ్యతని సమర్ధవంతంగా నిర్వహించిన ధైర్య శాలి.

            ఆ కాలంలో చదువు నేర్పడానికి ముందుకు వచ్చినందుకు సావిత్రీబాయిని చీత్కారాలతో అవమానిస్తే , ఈ రోజు ఉపాధ్యాయినుల్ని విద్యార్ధులనుండి సినిమా దర్శకుల వరకు  అసభ్య ప్రేలాపనలతో , చెత్త డైలాగులతో వెండి తెర మీద ఒక విలాస వస్తువుగా చేసి అవమానిస్తున్నారు.

   ‘రౌడీ టీచర్’ అయినా  ‘సారీ టీచర్  ‘అయినా    ‘ఖతర్నాక్’ అయినా  నేటి టీచర్ల దుస్థితిని , సమాజం వారికి ఇస్తున్న గౌరవాన్ని తలుచుకుంటూ ఇవే ‘హ్యాపీ డేస్ ‘ అనుకుంటూ ఈ సినిమాల్ని చూస్తూ…. భేష్ …భేష్… ,అంటూ మరో వైపు ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటూనే ఉందాం!

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

సంపాదకీయం, , , , , , , , , , , , Permalink

9 Responses to సెప్టెంబరు సంపాదకీయం

 1. జాషువా says:

  హేమలత గారు…….చాలా బాగా చెప్పారు Thank you.

 2. జాషువా says:

  హేమలత గారు….చాలాబాగా వివరించారు Thank you.

 3. mulugu sarada says:

  హేమలత గారూ,
  సంపాదకీయం చాలా బాగుంది.ఈనాటి స్త్రీ చదువుకి కారణమైన ఆ నాటి జ్యోతిరావు పూలే, సావిత్రీ పూలే ల ను టీచర్స్ డే
  సందర్భంగా సంస్మరించుకోవడం ముదావహం.మీరు చెప్పిన ఈ నాటి టీచర్స్ కి గౌరవం అనేది, ఎప్పుడైతే స్త్రీ విలాస వస్తువుగా, మార్చబడిందో
  అప్పుడే, ఆమెకి ఇచ్చేగౌరవం కూడా తగ్గిపోయింది.ఇది కేవలం ఉపాధ్యాయులే కాదు, పూర్తిగా వివిధ రంగాలలోని స్త్రీలకూ కూడా వర్తిస్తుంది.
  స్త్రీ పట్ల ఈ అభిప్రాయం మారనతవరకూ స్త్రీకి పూర్తీ గౌరవం దొరకదు ఈ సమాజంలో.
  అభినందనలతో
  శారద.

 4. M.V.S.Lakshmi. says:

  Dr.Hemalatha garu,
  The Sampadakeeyam of this month is more apt reg Savitri bhai phule contribution to the education and upliftment of women and girl child on the eve of teachers day. – M.V.S.Lakshmi.

 5. Dadala Venkateswara Rao says:

  హేమలత గారూ
  ఒక ఉపాధ్యాయుడిగా మీ సంపాదకీయాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. చాలా క్లుప్తంగా బాగుంది. ఉపాధ్యాయులకు జరిగే అవమానాల్ని నేటి విద్యార్దులకు గురువులమీద ఉండే మర్యాదలగురించి మరియు తెరమీద విలాసవస్తువుగా చూపిస్తున్నారని వ్రాసారు.
  ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చెప్పుకునేటప్పుడు తెరమీద చూపించే విషయాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదనుకుంటాను.
  ఉపాధ్యాయులు జన్మిస్తారు. చేయబడరు. చూపించబడరు. సమాజం ఇచ్చే గౌరవం కోసం వారు పనిచేయరు. సమాజాన్ని మంచి
  మార్గంలో నడిపిచడానికి జీవితాంతం కృషి చేస్తారు. సమాజంపై సినీమాల ప్రభావం పడకుండా చూసేవారు కూడా ఉపాధ్యాయులే.
  ఉపాధ్యాయుల్ని గుర్తించని, మెచ్చుకోని, గౌరవించని విద్యార్దులు ఎవరూ ఉండరు. అలాకానిచో వారిని విద్యార్దులు అనరు.

  సినీమాలు సినిమాలే – కొంచెం సేపు నవ్వుకోవడానికి కష్టాల్ని మరచిపోవడానికి
  విద్యార్దులు విధ్యార్దులే – చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి – మంచి పౌరులుగా మారడానికి
  ఉపాద్యాయులు ఉపాధ్యాయులే – మంచి మార్గంలో ఉంచడానికి- భవిష్యత్తును తీర్చి దిద్దడానికి
  అన్ని “హ్యాపీ డేస్” లే – హాయిగా జీవించడానికి – జీవిత పరమార్దం తెలుసుకోవడానికి

 6. Jahnavi says:

  చాలా బాగుంది అండి సంపాదకీయం.

  సావిత్రి గారి కోసం తెలుసుకోవడం చాలా ఆనందం గా ఉంది.

  ఆనాడు వారు చేసిన కృషి ఫలితమే ఈనాటి మా చదువులు… ఉద్యోగాలు..

  సావిత్రి గారికి, వారి భర్త గారికి మనస్పూర్తిగా ప్రNaమిల్లుతున్నాను.

  ధన్యవాదములు మేడం.

 7. vanaja says:

  మేడం మీరు చాల మంచి విషయాలు చెప్పారు

 8. lakshmans says:

  మేడం ,
  ఈ నెల సంపాదకీయం చాలా బాగుంది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిభాయి ఫులే గురించి తెలియ జేసినందుకు మీకు దన్యవాదములు,
  ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు

 9. -ఆర్.దమయంతి. says:

  తొలి మహిళా ఉపాధ్యాయిని – సావిత్రి భాయి ఫూలే గురించి రాసిన మీ సంపాదకీయం బాగుంది. భార్యని విద్యావంతు రాలిగా చేసి, బోధకురాలిగా తీర్చి దిద్దిన జ్యోతి రావ్ ఫూలే వంటి సంస్కారవంతుల్ని – స్త్రీ జాతి ఎప్పటికీ మరవదు.

  లేడీ టీచర్లని కించపరిచే విధం గా సినిమాలు తీయడం ఎంతైనా శోచనీయం. సమాజంలో – మహిళా ఉపాధ్యాయిని పాత్ర ఎంత ఆదర్శవంతమైనదో.. వివరించే మంచి చిత్రాలు రావాలని కోరుకుందాం.
  ఈ శుభ సందర్భంగా
  విహంగ ద్వారా టీచర్లందరికీ నా శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..
  -ఆర్.దమయంతి.