పరమపావని భరతధాత్రిలో ఆర్యావర్తాన గంగ, సింధూ, యమున, బ్రహ్మపుత్రలు,దక్షిణా పధాన కృష్ణ, గోదావరి, పెన్న, కావేరులూ సతత జీవ నదులై ప్రవహిస్తూ అమృత తుల్యమైన తమ జీవధారలతో భూదేవిని సస్యశ్యామలం చేస్తూ, జీవ జాతులకు ఆవాస భూములై, మహత్తర సంస్కృతీ, నాగరికతలకు క్షేత్ర భూములుగా నిలిచి వున్నాయి.
సహ్యాద్రిపై వెలసిన గోదావరి త్య్రంబకేశ్వరుని పాద పద్మాలను ఆరాధించుకుంటూ పడమటి కనుమలు
దిగి పీఠభూములు, మైదానాల మీదుగా ప్రవహిస్తూ, తూర్పు సముద్రాన్ని చేరేలోగా ఎన్నెన్నో జనపదాల మీదుగా, కొండలు, కోనల మీదుగా ప్రవహిస్తూ, గరువాల నడలతో పరవళ్లు తొక్కుతూ, శంఖాలు పూరించి కిన్నరులు మీటుతూ, ఎందరెందరో వీరవరుల విజయగాధలకూ, కవి వర్యుల మధుర భావనలకూ, గాయకుల గంధర్వ గానాలకూ శిల్పిశ్రేష్టుల అపూర్వ సృష్టికి, శాస్త్రజ్ఞుల విజ్ఞాన వైభవానికి ఆలవాలంగా అలరారుతోంది.
ఆంధ్రదేశంలో ఈ గోదావరి తెలంగాణాలో ప్రారంభించిన తన యాత్ర తూర్పు సాగరాభిముఖంగా సాగిస్తూ, సప్త శాఖలుగా సాగర సంగమం చేస్తూంది. గోదావరి పొడుగునా వేదవిదులు, ఆర్ష నాగరికతా ధౌరేయులు అయిన ఎందరో విప్రవంశాల వారు నివసిస్తూ, వేద విద్యకు అధీతి, బోధ, ఆచరణ ప్రచారణలతో చతుర్ముఖుని నాలుగు ముఖాల్లా విలసిల్లజేస్తున్నారు. విదేశీ దండయాత్రలూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా వీరు తమ ప్రశాంత నివాసాలను వీడి వలస పోవలసి వస్తున్నా, వారు గోదావరి మాత ఒడిని మాత్రం వీడలేదు. ఆ నదీమతల్లి ననుసరించి పయనిస్తూ, గోదావరీ సాగర సంగమ ప్రాంతాన్ని చేరుకొన్నారు. కొన్ని విప్రవంశాల వారు పావన గౌతమీ తీరాన నివసిస్తూ, వేదమాతనుపాసిస్తూన్న విప్రులలో జటావల్లభుల వారు, కాశీచయనుల వారు కొందరు సంప్రదాయ బద్ధంగా సంవత్సరాల పాటు నియమనిష్ఠలతో అభ్యసించిన వేద విద్యను శిష్యులకు ఆదరంగా నేర్పారు వారు.
ఆ వేద ప్రతిపాదితాలైన యజ్ఞ యాగాది కర్మలను తాము ఆచరిస్తూ, తోటి వారిని ఆచరింప చేయడానికి వారు కృషి చేసారు. ఋత్విక్కు అధ్వర్యుడు, ఉద్గాత, ఉపద్రష్ట, అను నలుగురు యజ్ఞ విధులను నిర్వర్తించేవారు. యజ్ఞం చేసి సోమయాజి కావడం నాటి విప్రుల జీవిత పరమావధి.
వీరిలో జటావల్లభుల వారు మొదట్లో తెలంగాణాలోని వెదురుచర్ల అనే గ్రామంలో నివసిస్తూ ఆ గ్రామ నామమే ఇంటిపేరుగా ధరిస్తూ వుండేవారు. వేదమాతకు వారు కూరిమి బిడ్డలు, జటా, ఘన అనేవి వేదంలో క్లిష్టమైన అంశాలు వాటిని నిర్దుష్టంగా పఠించి పండిత పరిషత్తులో జటావల్లభ అనే బిరుదు నామాన్ని పొందారు ఆ వంశంలోని ఓ ధన్యజీవి. నాడు దేశాన్ని పాలిస్తున్నది తురుష్కులైనా, వారిలో కొందరు వేదవిద్య పట్ల గౌరవాభిమానాలు కలిగి వుండేవారు. అటువంటి నవాబు ఒకరు వీరికి ఈనాములు ఇచ్చి గౌరవించారు.
కాలక్రమాన వచ్చిన యుద్ధాల వలన ప్రజా జీవితం కలత చెంది అనుష్టానాలకు భంగం వాటిల్లుతూ వుండటం వలన వారు ఆ ఊరు విడిచి పెట్టవలసి వచ్చింది. ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు కదా ! ఉన్న ఊరు విడిచినా గోదావరి తీరవాసాన్ని మాత్రం వీడలేని వారు ఆ నది వెంబడే సుదీర్ఘ పయనాలు సాగిస్తూ వచ్చి పెద్దాపురం సంస్థానం చేరారు.
ఆ రోజుల్లో పెద్దాపురం సంస్థానం మంచి ఆదాయం కలిగివుండి ధర్మపరుడు, శాంతి భద్రతలు పరిరక్షించగల సమర్థుడు అయిన ప్రభువు పాలన ఉండేది. ఈ వేద పండితుల్ని సగౌరవంగా ఆదరించి, కొన్ని ఈనాములు ఇచ్చి తమ కొలువులో నెలకొల్పుకొన్నారు ఆ ప్రభువులు. ఒక పర్యాయం పెద్దాపురం ప్రభువులకు స్వప్నంలో సాక్షాత్కరించి తాను గౌతమీ తీరాన వెలుస్తున్నానని తనకు గుడి గోపురాలు నిర్మించి, పూజా పురస్కారాలకు ఏర్పాట్లు చేయమని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశించాడు. గోదావరి డెల్టాలో వాడపల్లి అనే గ్రామం వద్ద గోదావరిలో బెస్తవారికి వేంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. దాన్ని వారు ఒక పాకలో వుంచి వారికి తోచిన విధంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. రాజ పురుషులు అక్కడికి వచ్చి స్వయంగా చూసి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదించారు. మహారాజు అశ్వారూఢుడై బయలుదేరి వచ్చాడు. ఆలయ నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేసారు. ఆలయంతో పాటు స్వామి సేవకు అర్చకులూ, మహా ప్రసాదం తయారు చేయడానికి వంటవారు, స్వామి సేవకులు, వాద్యకారులైన మంగలులు, నృత్య గీతాదికైంకర్యానికి దేవదాసీలు వచ్చి చేరారు. ఆలయ ధర్మకర్తలుగా తమ సంస్థానంలో వున్న వేద పండితులైన జటావల్లభుల వారి వంశంలో ఒక శాఖను వాడపల్లి పంపారు పెద్దాపురం సంస్థానాధీశులు. వీరితో పాటు మరికొన్ని బ్రహ్మణ వంశాల వారు గౌతమీ తీర వాసాన్ని కోరి వచ్చారు. వారందరికీ ప్రభువు వాడపల్లి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో నివేశన స్థలాలు, జీవికకై పంట పొలాలు ఇచ్చి ఆత్రేయపురం అగ్రహారాన్ని ఏర్పరచారు. అష్టాదశ వర్ణాల వారు వచ్చి అగ్రహారానికి అనతి దూరంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఆత్రేయపురం గ్రామం ఆ విధంగా ఏర్పడింది .
మొదట్లో అగ్రహారం గోదావరి గట్టు క్రింద ఉండేది. వారి స్నానాద్యనుష్ఠానాలకు నదీ మాత సమీపాన వుండుట అనుకూలమని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు వారు. ఒక పర్యాయం వచ్చిన గోదావరి వరదల్లో అగ్రహారం కొట్టుకొని పోయింది. అగ్రహార వాసులంతా మెరక ప్రాంతానికి తరలివచ్చారు. వారి స్థితి చూసి గ్రామంలో కొందరు ధనికులు గోదావరికి కొద్ది దూరంగా కొంత మెరక ప్రాంతంలో వారికి నివేశన స్థలాలు బహుకరించారు. వారు అక్కడ గృహాలు నిర్మించుకొని సుఖంగా జీవించసాగారు. పాత అగ్రహారంలోని విశాలమైన నివేశన స్థలాలు పంట పొలాలుగా మారి వారికి కొంత ఆదాయాన్ని సమకూర్చసాగాయి. గోదావరీ తీరానికి తరలివచ్చిన విప్రవంశాలలో కాశీచయనులవారు, శిష్టావారు, భమిడిపల్లివారు, తణుకువారు, పొదిలి వారు కొందరు. గ్రామ రెవెన్యూ పనులను నిర్వహించడానికి కొన్ని నియోగి బ్రాహ్మణ కుటుంబాలను తెచ్చి గ్రామ కరణాలుగా ఉద్యోగాలిచ్చి వారికి వసతులు కల్పించారు ప్రభువులు. వారికి ఆ గ్రామ నామమే ఇంటి పేరుగా ఏర్పడిరది. అక్కడి సుఖజీవనాన్ని కోరి మరికొందరు నియోగి బ్రాహ్మణ వంశాల వారు కూడా ఆ గ్రామానికి తరలివచ్చారు. జటావల్లభుల వారు అంగీరస, ఆయాస్య, గౌతమ సగోత్రీకులు ఆంగీరసుడు బృహస్పతి దేవగురువు. త్రైలోక్యాధిపతికి గురుస్థానంలో నిలిచిన మతివిభవం అతడిది. గౌతముడి సంతతియైన వారు గౌతమీ తీర వాసాన్నే సదా కోరుతూ కొన్ని వందల మైళ్ళు ప్రయాణిస్తూ వచ్చి ఇచ్చట స్థిరపడినారు. మరొకరు శిష్టావారు శిష్టాచార సంపన్నులవడం వలన వీరికి ఈ వంశనామం స్థిరపడిరది. వీరికి ఏదైనా పూర్వ నామం వుందో లేదో, వీరి మొదటి నివాస స్థానం ఏమిటో తెలియరావడం లేదు. వీరి వంశీకులు ఆంధ్రరాష్ట్రమంతటా వ్యాపించియున్నారు. శిష్టావారి పుట్ట అనివేళాకోళం చేస్తూ వుంటారు. వీరి వంశ ఋషులు వశిష్ట మైత్రావరుణ, కౌండిన్యులు, కౌండిన్య సగోత్రీకులు వీరు. వశిష్టుడు వైదిక ఋషులలో ముఖ్యుడు. హరిశ్చంద్రుడు, భగీరధుడు, శ్రీరామచంద్రుడు వంటి మహాపురుషులకు కుల గురువులైన గురు పరంపర వీరిది. వీరి వంశం విస్త్తృతమైనది కావడం వల్ల కృష్టా గౌతమీ తీరాల్లో నివసించే అశేష బంధుపరంపర వలన నిత్య నైమిత్తిక కర్మలకు విఘ్నం వాటిల్లుతూ వుండేది తరుచుగా. ఏదైనా క్లిష్టమైన యజ్ఞకర్మ తలపెట్టినప్పుడు తాము ఏనాడు ముఖమైన చూడని తమ వంశీకులకెవరికైనా జాతాశౌచం కాని, మరణాశౌచం కాని ఏర్పడితే వీరి కార్యానికి విఘాతం సంభవించేది. విజ్ఞులైన పెద్దలతో సంప్రదించారు వీరు. కాశీలో మీరు చయనం చేస్తే మిగతా కుటుంబాల వారికి మీకు బాంధవ్యం విడివడి మీ చయనం చేసిన వారి కుటుంబాల వారికి మిగతా కుటుంబాల వారి ఆశౌచం అంటదు అని చెప్పారు వారు. వీరు కాశీ నగరం చేరి అక్కడ చయనం అనే యజ్ఞ ప్రక్రియ చేసి కాశీచయనులవారు అయ్యారు. సంప్రదాయపు సంకెళ్ళనుండి విడివడాలనే భావన సంస్కరణాభిలాష వీరిలో అనాది నుండి వున్నాయి. పూర్వపు రోజుల్లో ఒక యువకుని బ్రాహ్మణ్యమంతా వెలివేశారు. అతడు వారి పూర్వ గ్రామం నడవపల్లి నుండి వచ్చి వీరికి జరిగింది చెప్పాడు. వీరి వంశంలోని యువకులు ఈ వెలిని మేము బహిష్కరిస్తున్నాం. నీకు బాసటగా మేము ఉంటాం అని ఆ యువకునికి ధైర్యం చెప్పారు. పడమటింటిలో తమ సహపంక్తిన అతడికి పంక్తి భోజనం పెట్టారు. ఇంటి పెద్ద అయిన శతవృద్ధు ఈ సంగతి తెలిసి మా తరం అయిపోయింది. నేటి రోజు వీరిది వీరు ఆలోచించి చేసిన పనికి దేనికి నేను ఆటంకపరచను అన్నారు. క్రమంగా కాంగ్రెస్ ఉద్యమం నాటికి వీరి సంస్కరణాభిలాష సమగ్రరూపాన్ని ధరించింది. అస్పృశ్యతా నివారణకు గాంధీ మహాత్ముడిచ్చిన పిలుపును వీరు సర్వాత్మనా పాటించారు.
** ** ** ** ** ** ** ** ** ** ** **
నడవపల్లి గ్రామం కోనసీమలో చిట్టచివరి ప్రాంతం. గోదావరి పాయ సముద్రంలో కలిసే ప్రాంతంలో కుండలేశ్వరం గ్రామం వుంది. సాగర సంగమంలో వెలసిన దేవుడు కుండలేశ్వరుడు. ఆయన దేవేరి కుండలీభవాని. ఈ క్షేత్రానికి సుమారు 2 మైళ్ళ దూరంలో ఎగువన వుంది నడవపల్లి గ్రామం. ఆ ఊరు నుండి కాలి నడకన గాని, ఎడ్లబండిపై కాని గోదావరి కాలువ వద్దకు చేరి, కాలువపై పడవలో ప్రయాణించడం మాత్రమే. సుమారు వంద సంవత్సరాల నాడు ఆ ప్రాంతంలో అదే రవాణా సాధనం. నడవపల్లి గ్రామంలో క్షత్రియులు అధిక జనాభా కలిగి, వ్యవసాయం ప్రధానవృత్తిగా, వడ్డీ వ్యాపారం ఉపవృత్తిగాచేస్తూ ఆ చుట్టుపక్కల సంపన్నులుగా పలుకుబడి కలిగి వుండేవారు.
చాలా గ్రామాలకు క్షత్రియులే గ్రామ మునసబులుగా వున్నారు. బ్రిటీష్ వారి హయాం నుంచి శాంతిభద్రతలకు పూచీగా వుండేవారు. అలాగే క్షత్రియులు రాజసాన్ని గూర్చి ఒక సామెత వాడుకలో ఉండేది. ఒక వైదిక బ్రాహ్మణుడు, ఒక నియోగి బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు కలిసి యాచనకు బయలుదేరారట వైదిక బ్రాహ్మణుడు. ‘‘సీతా రామాభ్యాంనమః అమ్మా!యాయ వారం బ్రాహ్మడిని వచ్చాను.’’ అని సంప్రదాయ బద్దంగా అడిగాడట నియోగి బ్రాహ్మణుడు తన రాజస స్వభావంతో కొంత పరిహాసంగా కుండలో బియ్యం, చెంబులో తగలెయ్యవమ్మా! అన్నాడట. క్షత్రియుడు మీసం మెలివేస్తూ, కళ్ళెర్ర జేసి రాజుగారు వచ్చారని ఎరగవా ?’’ అన్నాడట. క్షత్రియ సంప్రదాయమైన ఘోషా పద్దతి ఆ ఊరిలో సంపన్నులైన ఇతర వర్ణాల స్త్రీలు కూడా పాటించేవారు. ఇంటి గడప దాటి బయటకు వచ్చేవారు కారు. ఆ స్త్రీలు చెరువులో స్నానం చేసి మడి నీరు తెచ్చుకొనేవేళ మగవారెవరు ఆ తీరానికి వెళ్ళేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కాని, పొరపాటున కాని వెళ్ళవలసి వస్తే గౌరవనీయులైన ఇండ్ల స్త్రీలను చూడగానే దారి తొలగి వారు వెళ్ళాక తమ దారిని పోయేవారు. డబ్బుతో నిమిత్తం లేకుండా సత్ప్రవర్తన, ఉత్తమ వంశం కలిగిన స్త్రీలకు ఈ గౌరవం లభించేది. బ్రాహ్మణ గృహ సముదాయంలో లక్ష్మీనారాయణశాస్త్రి గారి గృహం ప్రధానమైంది. వారు తర్క వ్యాకరణ, జ్యోతిషశాస్త్రాల్లో ఆరితేరి కాశీ పండిత పరిషత్తులో పట్టా పొంది వచ్చారు. చుట్టుపట్ల ఈనాందార్లు, సంపన్న గృహస్థులు శాస్త్రిగారి పాండిత్యాన్ని మెచ్చి ఇచ్చిన భూములు, ధనం, పిత్రార్జితంతో కలిసి శాస్త్రిగారి ఆస్తి లక్ష రూపాయలు చేస్తుంది. ఆ ప్రాంతాల బ్రాహ్మణులలో వారే లక్షాధికారి. ఒకసారి సంపన్న క్షత్రియులొకరు శాస్త్రిగారి జ్యోతిష్య పాండిత్యాన్ని పరీక్షించగోరి ఒక కుక్క పుట్టిన సమయానికి జాతకం వేయించి తెచ్చి అయ్యా ! ఇది నా కుమారుని జాతకం. ఈ చక్రాన్ని చూసి వాడి జీవితం ఎలా ఉంటుందో సెలవియ్యండి అన్నారుట
One Response to గౌతమీ గంగ