తేనె సోక నోరు తియ్యనగు రీతి…

“తేనె  సోక నోరు తియ్యనగు రీతి 
పచ్చదనం చూడ కళ్ళలో వెలుగు దివ్యకాంతి  
 త్యాగరాజ కీర్తన చెవుల కింపైన  రీతి 
సంపెంగను చూడ నాసిక పొందే మధురానుభూతి ” 

మన మాతృ భాష అయిన తెలుగును ప్రేమిస్తే ఇంత మధురంగా ఉంటుంది అని అంటే వొప్పుకొని వారు లేరు ఆ రోజుల్లో.ఒప్పుకొనే వారే కరువయ్యారు ఈరోజుల్లో.మన్ను తో తెలుగు భాష ను పోల్చితే కవులను, రచయితలను రైతులతో పోల్చవచ్చు.ఆ రైతు పంటలు పండిస్తాడు, ఈ రైతు కధలు, కవితలు పండిస్తాడు.ఒకరు భుక్తి, మరొకరు యుక్తి ని ఇస్తారన్న మాట.
       ఇతర మతాల వారు భాష పై తీసుకునే శ్రద్ధ  మనం తీసుకోక పోవడం బాధాకరమైన విషయం. ఉదాహరణకు ముస్లిం సోదరులు వారి పవిత్ర గ్రంధమైన ఖురాన్ ని చదివేందుకు ప్రత్యేకంగా అరబిక్ నేర్చుకుంటారు.మనం మన పవిత్ర గ్రంధమైన భగవద్గీత కాదు కదా కనీసం పిల్లలు వారి వారి తెలుగు పాఠ్య పుస్తకాలను చదివించ డానికి కూడా  శ్రద్ధ  చూపించడం లేదు తల్లి తండ్రులు. మా అమ్మాయి ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతుందో అని మురిసి పోయే తల్లి తండ్రులు, అయ్యో తెలుగు భాషని  మా పిల్లలు కనీసం  చదవలేక పోతున్నారు అని మధన పడటం లేదు.ఏదైతేనేమి తెలుగు భాషని  ద్వంసం చేయడం లో తల్లి తండ్రులు వారి పాత్ర బాగానే పోషిస్తున్నారు.
        ఈ రోజుల్లో లెక్కలు, సైన్సు, వంటి గ్రూప్ సబ్జెక్టులకు మరియు ఆంగ్ల భాషకు మాత్రమే ఆదరణ పెరిగింది.ఇతర భాషలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు.అందుకేనేమో శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పిన “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే వాక్యం లో లెస్స అనే పదాన్ని గణిత పరి భాష లో “లెస్” గా తీసుకుని తెలుగును ఇతర ప్రాధాన్య సబ్జెక్టుల నుండి లెస్ చేసేస్తున్నారు .పాశ్చాత్య భాషే కాదు, పాశ్చాత్య సంస్కృతి నీడలు మర్రి చెట్టు వూడల మాదిరి మనల్ని పట్టి పీడిస్తున్నై.
         ఇక్కడ కొస మెరుపు ఏమిటంటే తెలుగు ఉపాద్యాయులు కూడా ఆంగ్ల భాష లోనే మాట్లాడాలంట.కేవలం పాఠాలు  మాత్రమే తెలుగు లో చెప్పాలంట.ఉపాద్యాయుల కోసం వేసే ప్రకటనలలో “Fluency in English is must” అనే నిబంధన క్రొత్తగా చేర్చారు.ఈ నిబంధన తెలుగు ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది.ఇలా వుంది కార్పోరేట్ బడుల శైలి. తప్పని సరి  సబ్జెక్టు గా మాత్రమే తెలుగు ని భావించడం దురదృష్టకరం.
              అందరం ఆసక్తి  చూపించే సినిమాల  గురించి మాట్లాడుకుందాం.ఆ రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం,కలవారి కోడలు, చదరంగం , అర్ధాంగి, ఉమ్మడి కుటుంబం  ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు పదాల్లో ఎన్ని సినిమా పేర్లు పెట్టేవారండి,మరి ఇప్పుడు ఇడియట్ ,ఎస్సెమ్మెస్ , బిజినెస్  మాన్ ,రోబో,ఆరంజ్, ఓహ్ మై ఫ్రెండ్ ఇలా ఇంగ్లీష్ భాషలోనే పేర్లు పెడుతున్నారు.తెలుగు లోను పేర్లు వస్తున్నై .వాటికీ కాప్షన్ అనే సంప్రదాయం వొకటి మొదలైంది “బాలు ABCDEFG, దూకుడు daring & dashing, అత్తిలి సత్తిబాబు lkg,గౌతం ssc,ఈ  విధంగా విచిత్ర విన్యాసాలు చేస్తుంది ఆంగ్ల భాష.సినిమా పేర్లే కాదు పాటల విషయం లోను అదే పరిస్థి తి మొదలైంది.తెలుగు పదాలు యేవో తెలియనంత గా ఆంగ్ల భాషను  పాటలలో కలిపేస్తున్నారు ‘ పగలే వెన్నెల జగమే ఊయల’, అంటూ అప్పటి రోజుల్లో పాటలు వింటూ వుంటే ఎంత హాయిగా వుంటుంది. ‘చిట పట చినుకులు పడుతూ వుంటే’ అనే పాత లో వర్షం లో తడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటి పాటలు సంగీతం మరియు ఆంగ్ల భాష పదాల ఆదిపత్యపు హోరు లో తెలుగు పదాలు మగ్గి పోతున్నై.
తమిళ నాట సినిమా పేర్లు కాదు కదా, వారి మాతృ భాషనే తప్ప మరి ఏ ఇతర భాష మాట్లాడడానికి ఒప్పుకోరంట .మనం ఎందుకు మన భాష మీద అంత ప్రేమ చూపించలేక పోతున్నాం? తెలుగు వారు అందరిని ఆప్యాయంగా పలకరిస్తారు, చూస్తారు అది నిజమే కాని హద్దు అనేది ఏ విషయం లో లోపించినా మన ఉనికినే కోల్పోయే విపత్తు సంభవిస్తుంది.
గాంధీ గారు,అల్లూరి సీతారామ రాజు వంటి గొప్ప నాయకులు ఈ రోజుల్లో వుంటే భాషా  స్వాతంత్య్రం కోసం పోరాడేవారేమో.ఇప్పుడు అటువంటి నాయకులు లేరు.భాషను అరువు తెచ్చుకొని వాడుకుంటున్న ఇప్పటి వారు భాషా స్వాతంత్య్రం కోసం కాదు ,స్వాతంత్య్రం గూర్చే ఆలోచించే పరిస్తితుల్లో వుండే వారు కాదేమో.
       ఆంగ్ల భాష అవసరమే, నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి ఆధునిక ప్రపంచం లో ఆంగ్ల భాష పట్టు మీద ఉద్యోగాలు వచ్చే రోజులివి.ఇటువంటి పరిస్థితుల్లో ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పని సరి, కాని ఆంగ్ల భాష మీద బంధు ప్రీతి మాత్రమే చూపించాలి,ఏమంటే బంధువులను ప్రేమ తో చూస్తాం కాని సొంత మనుషులకంటే ఎక్కువ ప్రేమ ను చూపించము కదా!
        మాతృ భాష అయినంత మాత్రాన తెలుగు లోనే ఎందుకు మాట్లాడాలి, ఇంగ్లీష్ భాష వారి సొత్తా? భాష ఎవరి సొంతం కాదు కదా అనే అభిప్రాయం చాల మంది లో ఉండొచ్చు కాని మనిషి అన్నాక స్వార్ధం ఉండక పోదు.నా తల్లి, నా తండ్రి, నా  భార్య , నా కుటుంబం   నా పిల్లలు అనే భావన  భాష విషయం లో కూడా ఉంటే  బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా అదే ఐతే,
                            మమ్మీ , డాడీ సంస్కృతి  కి వీడ్కోలు పలికి 
                            అమ్మ, నాన్న, సంస్కృతికి స్వాగతిద్దాం.
              తెలుగు భాష తియ్యదనం తేనెను మించు 
              తేజస్సు అనే వెలుగును తెలుగు పంచు
              తామరాకు ఫై నీటి బొట్టు వంటి పరిస్థితి ఈనాడు తెలుగుకి దాపరించు
              తెరమరుగు అగుచున్న తెలుగు భాష దుస్థితికి భాద్యత వహించు 
              తల్లి వంటి తెలుగు ను అంత్య స్థితి నుండి రక్షించు.

– మల్లెమొగ్గల శేషు కుమారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
arasi
arasi
8 years ago

అవును శేషుకుమారి గారు మీరు చెప్పింది నిజం. ముందు ప్రజలలో మార్పు వస్తే కానీ ఈ విషయం లో మార్పురాదు.
చూద్దాం ఇకనైన మారుతుందేమో