‘‘గురుబ్రహ్మ: గురువిష్ణు:
గురుదేవో: మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:’’
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్యదేవోభవ: అన్నారు. అంటే తల్లితండ్రుల తర్వాత అంతటిస్థానాన్ని పొందేది గురువే. పిల్లలు తల్లితండ్రులతో గడిపే సమయం కంటే గురువులతో గడిపే సమయమే ఎక్కువ. పిల్లలకు పాఠశాల మరో ప్రపంచం లాంటిది. విజ్ఞాన సముపార్జనకోసం వారిని మనం పాఠశాలకు పంపిస్తూంటాం. రాతిని సానపట్టి వజ్రంగా మలిచే వాడు ` గురువు’. శిలనుసైతం అందమైన శిల్పంగా మలిచే శిల్పి ` గురువు’. స్వర్ణాన్ని ఆభరణంగా మలిచే స్వర్ణకారుడు ` గురువు’. మట్టి ముద్దను పాత్రగా మలిచే కుమ్మరి ` గురువు. విద్యార్ధికి ప్రేమతో విద్య, బుద్ధి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత నేర్పించి, ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేవాడు ` గురువు’. తల్లి తన బిడ్డలకు తొలి గురువే అయినా, ఒక విద్యార్ధి జీవితంలో అధిక ప్రభావాన్ని చూపేది గురువే. అంతటి ఉత్తముడు కాబట్టే గురువు దైవ స్వరూపంగాను, తల్లితండ్రుల తర్వాత స్థానాన్ని పొందాడు గురువు. విద్యార్ధులపై గురువుల ప్రభావం ఎంతగా ఉంటుందంటే, మంచిగా చదవడం గానో, లేక వారికిష్టమైనట్లు ఉండడం వలనో గురువు మెప్పుపొంది వారి వారి కనుసన్నలలో ఉండడానికి ప్రయత్నిస్తుంటారు విద్యార్ధులు. గురువు పొగిడితే పొంగిపోతారు. గురువు కించపరిస్తే కృంగి పోతారు. నిజానికి చెప్పాలంటే గురువే వారికి ఆదర్శప్రాయుడు (రోల్‌మోడల్). ఇంతటి ఉన్నతమైన గురువులను ఈనాడు జోకర్లు గాను, తోటి ఉపాధ్యాయురాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించేటట్లు, సినిమాల్లో చూపడం శోచనీయం. టి.వీ.లలో సైతం అవే ముక్కల్ని హాస్య సన్నివేశాలపేరిట పదే, పదే ప్రసారం చేస్తూ, గురువులపై గౌరవం తగ్గిపోయేలా చేస్తున్నారు.
ఉత్తమ చిత్రాల దర్శకుడుగా పేరున్న శేఖర్ కమ్ముల సైతం, తన సినిమాలో విద్యార్ధి లెక్చరర్‌ను ప్రేమిస్తూ వెంటపడినట్లు చూపడం దారుణం. దానివలన విద్యార్ధులు తప్పుదోవ పడ్తారు. చాలామంది సినీ హీరోలు సైతం మీ తొలిప్రేమ (ఫస్ట్‌క్రష్) గురించి చెప్పమన్నప్పుడు ఇంగ్లీషు టీచర్‌నో, లేక మరో లెక్చరర్‌నోనని చెప్తూ అదో ఫ్యాషన్ అనుకొంటారే తప్ప, అది తెలిసీ తెలియని వయసులో ఉన్న విద్యార్ధులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వారికి పట్టదు.
ఏదైనా ఒక విద్య నేర్చినవారిని గానీ, చదువులో రాణించిన వారిని గానీ, అడిగితే వారు, తమ విజయం వెనుక ఉన్న గురువు పేరే చెప్తారు, లేదా మీ గురువెవరని ఎదుటివారే వారిని అడుగుతారు. కొన్నాళ్ళక్రితం వచ్చిన ‘ఖతర్నాక్’ అనే సినిమాలో టీచరుగా నటించిన కథానాయికకి కురచ దుస్తులు ధరింపచేసి వెకిలిహాస్యం చిత్రీకరించాడో దర్శకుడు. నేడు సైతం ‘‘సారీ టీచర్’’ అనే పేరుతో చిత్రీకరింపబడిన సినిమా గురు, శిష్య సంబంధాలను దెబ్బతీసేలా నిర్మించారని, ఆ చిత్రాన్ని విడుదల చేయడం ఆపాలని, అనేక సంఘాలవారు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం మనకు తెలిసినదే. ఇదివరలో గురువుపై వచ్చిన ‘‘బడిపంతులు’ వంటి చిత్రాలు ఎంతో సందేశాత్మకమైనవి. సినీ దర్శక, నిర్మాతలు ఇకనైనా గురువుల ఔన్నత్యాన్ని భంగపరిచే వెకిలిహాస్యం చిత్రీకరించడం మానుకోవాలి. అది వారు, వారి గురువుకిచ్చే గురుదక్షిణగా భావించాలి. చాలామంది, తాము చదువు పూర్తిచేసి ఉన్నతస్థానాల్లో ఉన్నప్పుడు గురువులు కన్పిస్తే తెలీనట్లు ప్రవర్తించడం చాలా తప్పు. తన శిష్యులు ఎంత ఉన్నతస్థానాల్లో ఉన్నారో చూచి గర్విస్తారు గురువులు. వారికి నమస్కరిస్తే మనసారా ఆనందిస్తారు. అంతకుమించిన గురుదక్షిణ ఏముంటుంది గురువులకి. తన ఆదర్శాలకణుగుణంగా శిష్యుణ్ణి తయారు చేసేవాడే నిజమైన గురువు. తన గురువు వ్యక్తిత్వాన్ని తనలో ప్రతిబింబింపచేసేవాడే నిజమైన శిష్యుడు.
గురుపూజోత్సవం అంటూ ఓరోజును కేటాయించి ఆరోజు గురువును సన్మానించడమే కాదు. గురువంటే గౌరవాభిమానాలు ఎప్పుడూ ఉండాలి. అలాంటి నడవడిక గురువు కలిగిఉండాలి. అలా గౌరవించే సంస్కృతి మనం మన పిల్లలకు నేర్పాలి. వినయంతో విద్య రాణిస్తుంది. ఎంతో ప్రతిభావంతులైన సుశిక్షణ పొందిన ఉపాధ్యాయులు మున్సిపల్ పాఠశాలలకు పరిమితం అవుతోంటే, మనం వేలకు వేలు ఫీజులు చెల్లించి మన పిల్లల్ని అంతగా ప్రతిభ, శిక్షణ లేని వారివద్ద చదివించడం ఏం భావ్యం. గురువులు సహనంతో వెనుకబడిన విద్యార్ధిని కించపర్చక చక్కని ప్రోత్సాహాన్నిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడాలి. తోటమాలికి తోటలోని పూలన్నీ ఎలా సమానమో, గురువు కూడా తరగతిలోని ప్రతి విద్యార్ధినీ ఒకేలా ప్రోత్సహించాలి. గురువులు తమ విద్యార్ధులకు విద్యతోపాటు సేవాగుణం పెంపొందించాలి. మనదేశంలో అత్యంత ఉన్నతస్థానాన్ని అధిష్టించిన డా॥ సర్వేపల్లి రాధాక్రిష్ణన్, డా॥ అబ్దుల్ కలాం ఉపాధ్యాయులే. అలాగే ప్రపంచంలో సర్వోత్తమ సేవలనందించిన మదర్ థెరిస్సా కూడా ఉపాధ్యాయురాలే. చంద్రునిపై తొలి అడుగు మోపిన వ్యోమగామిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చివరికి ఉపాధ్యాయుడిగానే స్థిరపడ్డాడు. ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిబాఫూలే భార్య సావిత్రిబాఫూలే భారతదేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయిని. మరో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం న్యాయవాద వృత్తి వదిలి ఉపాధ్యాయ వృత్తిపైనా మక్కువ చూపించాడు. డా॥ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ 75వ జయంతి గురుపూజోత్సవంగా ప్రకటింపబడిన నాటినుండి,సెప్టెంబరు5వ తేదీ గురుపూజోత్సవంగా జరుపబడుతోంది.
ఈ గురుపూజోత్సవంనాడు నాకు విద్యనేర్పిన ప్రతి గురువును స్మరించుకొంటూ వారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దుతోన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటూ …
– కె.రాజకుమారి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to గురువే గురి