మూగబోయిన అందెల రవళి – అరసి

 

ISSN 2278 – 4780

భారతావని అనేక శాస్త్రీయ కళలకు నిలయం. భారత దేశం లోని ఏడు ప్రముఖ శాస్త్రీయ నృత్యాలలో కూచిపూడి  ఒకటి. కూచిపూడి నృత్యాన్ని రూపకల్పన చేసింది సిద్దేంద్ర యోగి అయితే ఆ నాట్యానికి ఖండాంతర  ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వెంపటి చినసత్యం.కూచిపూడి కి పర్యాయపదంగా మారిన ఆ  అభినవ సిద్ధేంద్రయోగి జూలై 29 ఈ లోకంనుండి శాశ్వతంగా తరలిపోయారు.

                           కృష్ణ జిల్లా లోని కూచిపూడి అగ్రహారంలో1928 అక్టోబర్ 25 న  చలమయ్య వరలక్ష్మమ్మ  దంపతులకు  జన్మిం చారు వెంపటి చినసత్యం . ఆరు సంవత్సరాల వయస్సు  నుండి శాస్త్రీయ నృత్యం లో శిక్షణ

ప్రారంభించారు.తొలుత  వేదాంతం లక్ష్మీ  నారాయణశాస్త్రి వద్ద, తరువాత తాడేపల్లి పేరయ్య శాస్త్రిగారి వద్దను విద్యని అభ్యసించారు.  వెంపటి  పెద సత్యం  వద్ద సుమారు 15 ఏళ్ళు పాటు నాట్యం లో  మెళకువలు నేర్చుకున్నారు.కూచిపూడి నాట్యం అనేది ఆంధ్ర దేశానికి పరిమితం కాకూడదు అనే ఉద్దేశ్యంతో కళలకు  కేంద్రంగా ఉన్న మద్రాసు వెళ్లి అక్కడ నుండి కూచిపూడి వ్యాప్తి చేయగలిగితే ఈ నృత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో  నిలబెట్ట వచ్చు  అనే అభిప్రాయంతో వెంపటి చినసత్యం మద్రాసులో నృత్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడానికి తనకు  19 సంవత్సరాల  వయస్సులో  కాలినడకన మద్రాసు బయలుదేరారు. మద్రాసు వెళ్ళిన తరవాత తన పూర్తి సమయాన్ని నృత్యం పై  దృష్తి పెట్టి కూచిపూడి ప్రచారంలో ఆయనే స్వయంగా నాట్యప్రదర్శనలి చ్చారు .అప్పటికే  సినిమా నృత్య దర్శకుడిగా ఉన్న వెంపటి పెద సత్యం దగ్గర సహాయ నృత్యదర్శకుడిగా పని చేసి  తరవాత తానే స్వయంగా కొన్ని  సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అవి దేవదాసు, రోజులు మారాయి, శ్రీకృష్ణ విజయం, లవకుశ, నర్తనశాల.  అయితే  శాస్త్రం  తెలిసిన ఆయన ఎక్కువ కాలం సినిమా రంగం లో  ఇమడలేకపోయారు.

                           కూచిపూడి నృత్యాన్ని అంతర్జాతీయ ఖ్యాతి రావాలన్న  కోరికతో   నృత్యశిక్షణాలయం  వైపు తన దృష్టిని సారించారు. 1963 లో    మద్రాసులో “కూచిపూడి ఆర్ట్ అకాడమి”ని ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణాన్ని తలపిచే విధంగా రూపొందించారు వెంపటి చినసత్యం. తాండవ, లాస్య రీతులను మేళవిస్తూ శిక్షణ నిచ్చేవారు , కేవలం పురుషులకు  మాత్రమే పరిమితం  అయిన నృత్యంలో  స్త్రీలకు శిక్షణనిచ్చి, స్త్రీ ల చేత  పురుష పాత్రలు వేయించడంలో లోకధర్మి, నాట్యధర్మిలను పాటించి నృత్య రూపకాలను రూపొందించేవారు.ఈయన వద్ద శిక్షణ  పొందిన వారు నేడు  అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గడించారు , చినసత్యం  వద్ద విద్యను  అభ్యసించిన వారిలో రాజసులోచన, హేమమాలిని,రేఖ, శోభానాయుడు, ప్రభ, మంజుభార్గవి, వాణిశ్రీ ,  కేంద్రమంత్రి  పురంధరేశ్వరి ,’నాట్యభారతి’ ఉమా భారతి   వున్నారు.

వెంపటి చినసత్యం రూ పొందించిన నృత్య రూపకాలు  పురాణ సంబంధమైనవే. అయన 1961లొ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో  “క్షీరసాగర మథనం ” నృత్యరూపకాన్ని రూపొందించారు .   తరవాత  కాలంలో  శ్రీకృష్ణ విజయం, విప్రనారాయణ, మేనకా విశ్వామిత్ర, హరవిలాసం, రుక్మిణి  కళ్యాణం, భామా కలాపం, అన్నమాచార్య, అర్థ నారీశ్వర రూపకాలను తెలుగులో ,  శ్రీనివాస కళ్యాణం  రూపకాన్ని తమిళం,తెలుగు భాషల్లో  రూపొందించారు, అంతేకాకుండా టాగూర్ విరచితమైన సామాజిక కథాంశంతో   కూడిన చండాలిక  సైతం చినసత్యం  చేతిలో  రూపకంగా మలచబడి ఎన్నో ప్రదర్శనలు పొందింది.   1971లో  లండన్ తో  మొదలైన  ఆయన విదేశీ పర్యటనలు ప్యారిస్,మలేసియ, శ్రీలంక, జర్మని , యూరప్  దేశాలలో  తన శిష్యులతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

  ప్రతి నిమిషం  కూచిపూడి వ్యాప్తికి  అహర్నిశలు శ్రమించిన  ఆయనను ఎన్నో పురస్కారాలు వరించాయి.1967 లో సంగీత  నాటక అకాడమి ఫెలోషిప్ , 1980లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ , తమిళనాడు ప్రభుత్వం  కలైమామణి, కాళిదాసు పురస్కారం , సర్. సింగార్ , కళాసాగర్  అవార్డ్ , భారత ప్రభుత్వం పద్మ భూషణ్  అవార్డ్, జీవన సాఫల్య పురస్కారం   మొదలైన తిరుమల తిరుపతి దేవస్థానం  ఆస్థాన నాట్యాచార్యులుగా, అమెరికాలోని  పిట్స్ బర్గ్ లోని వెంకటేశ్వర  స్వామి దేవస్థానంలో కూడా ఆస్థాన నాట్యాచార్యుల పదవులను అలంకరించారు.   ఎన్నో పురస్కారాలు, అవార్డ్ లు  ఆయనను వరించి ఆయన కాలి అందెల సవ్వడితో  పరవశించిపోయాయి.

ఆయన తన నృత్య అకాడమి ద్వారా సుమారు పదివేల  మంది విద్యార్దులకు శిక్షణ ఇచ్చారు.  వారిలో చాల మంది  దేశ  విదేశాలలో గురువులుగా కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం  చేస్తున్నారు  అనడంలో ఎటువంటి సందేహం  లేదు. తన  శ్వాస  ధ్యాస కూచిపూడి  నృత్యంగా జీవించిన ఆ అభినవ సిద్దేంద్రయోగి  అనారోగ్యం తో  తన కలల రూపమైన కూచిపూడి ఆర్ట్ అకాడమీలో తుదిశ్వాస విడిచారు, తాను భౌతికంగా మన మధ్య  లేకపోయినా ఆయన అందించిన నాట్యాచార్యులు, నర్తక, నర్తకిమణులు , వారి అభినయంలో ప్రాణం పోసుకున్న  నృత్య  రూపకాలలోను, కూచిపూడి అందెల రవళిలోను ఆచంద్రతారార్కం  నిలిచే ఉంటారు.

– అరసి  

“““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““`

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

6 Responses to మూగబోయిన అందెల రవళి – అరసి

 1. ANAND says:

  నీవు విహగ పత్రిక లో రాయటం నాకు బాగా నచ్చింది .ని గురువు గురించి బాగా రాసావ్ ఇంకా మంచి మంచి గా రాయాలని కోరుతున్నాన్ ..

 2. jhansi says:

  హాయ్ అరసిగారు మీరు చాలా మంచి విషయాలు సేకరించి మాకు తెలియని విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు

 3. హాయ్ అరసి గారు, మీ వ్యాసం చాల బాగుంది……… రియల్లీ వండర్ ఫుల్

 4. vanaja says:

  అరసి గారు మీరు నాట్యం గురించి చాల మంచి విషయాలు చెప్పారు .చాల బాగుంది .ఇలాగే మీరు మరిన్ని వ్యాసాలు రాసి మాకు కొత్త విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను .

 5. spandana says:

  mi vyasam chala bagundhi….kuchipudi nrutyam jathiya,antharjatiya kyathi pondhela chesina Vempati Chinasatyam garu gurinchi chala vishayalu telsukunanu…..

 6. చిన్ని says:

  అరసి , నీ వ్యాసం చాలా చాలా బాగుంది.
  చినసత్యం గారిపై మంచి విషయాలు తెలిసాయి.అభినందనలు. మాకు treat ఇవ్వాలి.