స్త్రీ యాత్రికులు

నిరంతర బాటసారి-అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌ 


తూర్పు దేశాల్లోని విజ్ఞానం, మతం, మార్మిక శక్తులు, సాంప్ర దాయాల పట్ల పశ్చిమ దేశాలవారికి ఎప్పుడూ ఆశ్చర్యం, ఆనందం కలుగు తూనే ఉంటాయి. ఇండియా, చైనా, జపాన్‌, టిబెట్‌, బర్మా దేశాల్లోని ప్రాచీనమైన నాగరికతల పట్ల ఆసక్తితో అక్కడి విజ్ఞానాన్ని ఆస్వాదించేందుకై సాహసయాత్రలు చేసిన ఘనత అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌కి దక్కుతుంది. నిషేధించబడిన లాసా నగరానికి మొదటగా చేరుకొన్న యురోపియన్‌ యాత్రికురాలుగా డేవిడ్‌నీల్‌ చరిత్రలో నిలిచిపోయింది.
    ఎక్కువ దూరం కఠినమైన ప్రయాణాలు చేసి, ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి, తన జీవితకాలంలోనే ఒక గాథగా మారిన ఈ స్త్రీ యాత్రికు రాలు ఇరవై గ్రంథాలు ముద్రించి, యాత్రా సాహిత్యాన్నీ, బౌద్ధమత అధ్యయ నాన్నీ ప్రోత్సహించింది. ఆనాటి పాహియాన్‌, హుయాన్‌ సాంగ్‌ల మాదిరిగా బౌద్ధమతం  మీద ప్రేమ చూపించిన ఆధునిక  స్త్రీ యాత్రికురాలు అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌.
         ఈమె ఫ్రాన్సు దేశస్థురాలు. అమ్మా నాన్నలకి ఒకే బిడ్డ. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవటంతో అలెగ్జాండ్రాని ప్రేమగా చూసేవారు కరువ య్యారు. అందువలన నర్సుల శిక్షణలోనే పెరగవలసి వచ్చింది.  వాళ్ళు ఈమెని ఎక్కడికీ వెళ్ళకుండా నిర్బంధించేవారు. మూసిన గేటు కన్నాల ద్వారానే కదిలిపోయే బయటి ప్రపంచాన్ని చూడవలసి వచ్చేది. ఫ్రెంచి రచయిత ‘జూల్స్‌ వెర్న్‌’ రాసిన కాల్పనిక యాత్రా సాహిత్యం చదువుకొంటూ, ఆయా దేశాల పటాలు తెచ్చి చూస్తూ, తాను ప్రయాణాలు చేస్తున్నట్లుగా ఊహించుకొని ఆనందించేది. మరీ ముఖ్యంగా అతని నవల  “Around The World In Eighty Days’ లో హీరో ఫిలియాస్‌ ఫాగ్‌ మాదిరిగా ప్రపంచ యాత్రలు చేయాలని కలలుకనేది.
 
                   తెలిసిన బంధువుల్ని కలిసినప్పుడు ‘నాకు పుస్తకాలు కావాలి’ అని మాత్రమే అడిగేది. రైల్వే స్టేషన్లో పట్టాలు చూసినప్పుడు అవి ఎంతదూరం పోతాయో అని ఊహించుకొంటూ ఉండేది.  అలాంటి ఆలోచనలతో రెండుసార్లు కాన్వెంట్‌ నుండి పారిపోయింది కూడా.
             పారిస్‌లోని ‘మ్యూజీ గూమెట్‌’కి తరచుగా వెళ్ళి తూర్పు దేశాలకి సంబంధించిన అనేక పురాతన వస్తువులు, చిత్రాలు, బౌద్ధ శిల్పాలు చూసేది. ఆ దేశాలకి వెళ్ళి అలాంటి శిల్ప సంపదని, ప్రజల్ని, నిజంగా తన కళ్ళారా చూద్దామనుకునేది.
                         అక్కడ ఉన్న బుద్ధ విగ్రహం ముందు గంటలుతరబడి కూర్చుని ధ్యానం చేసేది. ఆ పవిత్ర ప్రదేశంలో కూర్చున్నంతసేపూ తనకి ఆత్మ జ్ఞానం వచ్చినట్లుగా అనుభూతి చెందేది. పారిస్‌ జనసముద్రానికి దూరంగా, నిశ్శబ్దంగా ఉండే ఈ లైబ్రరీలో ఆమెకు ఎక్కడా దొరకని ప్రశాంతత దొరికేది. అక్కడి పుస్తకాల్లోని పేజీలు గాలికి గలగలమంటూంటే అదొక విజ్ఞాన విపంచి అనుకునేది.
                      తల్లిదండ్రులు తమ బిడ్డని ఒక కాథలిక్‌ నన్‌గా తయారు చేయాలను కొంటారు. అది ఆమెకు ఇష్టం ఉండదు. ఇంతలో అలెగ్జాండ్రాకి వాళ్ళ అమ్మమ్మ ద్వారా కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకుని ఒంటరిగా ఓడ మీద తాను అనుకొంటున్న  ఇండియాకి బయలు దేరుతుంది. అప్పుడామె వయసు 25 సం||లు మాత్రమే.
                      ఇండియాలో తిరిగి సంస్కృతం నేర్చుకోవాలనీ, ఉపనిషత్తుల సారం అంతా గ్రహించి మంచి పాండిత్యం సంపాదించాలనీ ఆమె ఆశయం. ఇండియా చేరుకొన్నాక, దక్షిణ భారతదేశం అంతా రైళ్ళమీద ప్రయాణం చేసి చాలా ప్రదేశాలు చూస్తుంది. తాను ఊహించిన దానికంటే భారతదేశం చాలా పెద్దది అని తెలుసుకొని, ‘మరోసారి తీరిగ్గా ఇండియాకి వచ్చి, తూర్పుదేశాల ప్రాచీన సాహిత్యాన్ని ఆస్వాదించాలి’ అనుకొంటుంది. ‘నాన్నగారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వెంటనే రావాలి’  అని ఇంటి వద్దనుండి సమాచారం రావటంతో వెంటనే అలెగ్జాండ్రా ఇల్లుచేరుకొని, డబ్బుకోసం నాటకాల కంపెనీలో ‘ఓపెరా సింగర్‌’గా చేరిపోతుంది. కాన్వెం ట్‌లో ఉండగా నేర్చుకొన్న పియానో సంగీతం ఈ సమయంలో పనికి వస్తుంది. ఆ ఓపెరా టూరింగ్‌ కంపెనీతో పాటుగా 1896 నుండి 1902 వరకు హవాయ్‌, గ్రీసు దేశాల్లో తిరిగి పాటలు పాడి సంపాదించిన డబ్బు ఇంటికి పంపిస్తూ ఉంటుంది. ఆ తరవాత వాళ్ళ నాన్నలాగా జర్నలిజంలోకి ప్రవేశించి వార్తా పత్రికలకి వ్యాసాలు రాయటం ద్వారా ఆర్ధికంగా నిలదొక్కు కుంటుంది.
    అప్పటికి 35 సం||ల వయసు వస్తుంది అలెగ్జాండ్రాకి. చాలాకాలం నుండీ బుద్ధిజం గురించి మంచి అవగాహనతో ఉండడంవల్ల ఆ మతం గురించి దినపత్రికలలో అనేక వ్యాసాలు రాస్తూ ఉండేది.
    తాను ఒక వ్యాస రచయిత్రిగా బాగా పేరు తెచ్చుకొంటున్న సమ యంలో అలెగ్జాండ్రాకి పెళ్ళవుతుంది. భర్త పేరు ఫిలిప్‌ ఫ్రాంకాయిస్‌ నీల్‌. ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీరుగా ఉంటాడు.
    ‘హాయిగా ప్రపంచం అంతా తిరుగుదాం’ అనే ఆలోచనలతో ఉన్న తనకి అకస్మాత్తుగా పెళ్ళికావడంతో ఎంతో బాధపడుతుంది. తెలిసికూడా ఇలాంటి సంసార బంధాల్లోకి ఎలా చిక్కుకుందో ఆమెకు అర్ధం కాలేదు. ‘ఇక నా కలలన్నీ కూలిపోయినట్లే’ అనుకొని బాధపడుతూ కూర్చోవలసిన స్థితికి చేరుకొంటుంది అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌.
    ముప్ఫైఆరు సంవత్సరాల వరకూ ఏకాంతంగా బతికి, ఒక్కసారిగా స్వాతంత్య్రం కోల్పేయేసరికి దిగులుపడసాగింది. ఆ పరిస్థితుల్లో అలెగ్జాండ్రా తండ్రి మరణిస్తాడు. తల్లి తనదారి తాను చూసుకొంటుంది.
    తనకేమో దేశాలు తిరగాలని ఉంది. కానీ తనకి పెళ్ళి అయి పోతుంది. తనకి పిల్లలు పుడితే వాళ్ళని చూడడానికి ఎవరున్నారు?  అందుకని ఒక నిర్ణయానికి వచ్చి, ఆ విషయాన్ని భర్తతో చెప్పింది. ‘మనకి పిల్లలు వద్దు’ అనే భావన ఆయన పూర్తిగా జీర్ణించుకోలేక పోయినా ‘నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు. అది మరచిపోయేందుకు కొన్నాళ్ళపాటు ఏదైనా యాత్ర చేస్తే మంచిది’ అని సలహా ఇస్తాడు భర్త.
    ‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక బాధ్యతలు తీసుకోలేను’ అని నిష్కర్షగా చెప్పింది. దానికి ఆయన ఏమీ అనుకోలేదు. ‘పిల్లల్ని కనాల్సిందే అని బలవంతంగా ఒప్పించడం ఎందుకు? అనుకొని ‘మనం భార్యా భర్తలుగా ఏకం అయినా, స్నేహితుల మాదిరిగా ఉండి, ఒకరికొకరం సహాయం చేసుకొంటూ జీవిద్దాం’ అని నిర్ణయించుకొంటారు.
    ఇలాగా ఇద్దరూ కలతలు లేకుండా ఒకరినొకరు అర్ధం చేసు కొనటానికి ప్రయత్నించారేగానీ, ‘విడాకులు తీసుకొందాం’ అని ఎప్పుడూ అనుకోలేదు.
       ఫిలిప్‌ అన్ని షరతులకూ ఒప్పుకొంటాడు. పైగా ‘తన భార్య ఎక్కడ ఉన్నా సహాయం చేయాలి!’ అని దృఢంగా నిర్ణయించుకొంటాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఫిలిప్‌కి ఉత్తర ఆఫ్రికాలో ఉద్యోగం వస్తుంది. తనే ముందుగా అలెగ్జాండ్రా వద్ద శెలవు తీసుకొని బయలుదేరతాడు.
    మిత్రులందరూ అలెగ్జాండ్రాని పారిస్‌లో ఉండిపొమ్మని, యూని వర్సిటీలో ఉపన్యాసాలు ఇవ్వమనీకోరుతారు. ‘చదవటం, చదివించటం కంటే అనుభవం ముఖ్యం. నాకు తూర్పుదేశాల జీవితాన్ని అనుభవిద్దామని ఉంది. వెళ్ళక తప్పదు’. అని తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది.
    ఇలాంటి పరిస్థితుల్లో అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌ తన నలభైమూడవ సం||లో, 1911 వ సం|| ఆగస్టు మూడవ తేదీన, ఇండియాకి బయలుదేరింది. కానీ తన యాత్ర నిర్విరామంగా శ్రీరాముడి వనవాసం మాదిరిగా, పధ్నా లుగు సంవత్సరాలపాటు జరుగుతుందని తనకు తెలియదు. తన జ్ఞాన అన్వేషణలో ఎన్నో సాహస సంచారాలు చేయవలసివస్తుంది. తనకి ఇల్లూ, వాకిలీ సర్వం ఆ దేశాలే అయ్యాయి.
    అలెగ్జాండ్రా ఇండియాకి రాగానే నేరుగా కలకత్తా యూనివర్సిటీకి చేరుకొంది. అక్కడి మేధావుల ఉపన్యాసాలు వినటం, తాను నేర్చుకొన్న భారతీయ తత్వశాస్త్రాన్ని వారికి చెప్పటంలాంటి విజ్ఞాన కార్యక్రమాలలో మునిగిపోతుంది. భారతీయ తత్వశాస్త్రంలో అలెగ్జాండ్రాకి ఉన్న పరిజ్ఞానానికి వారు ఆశ్చర్యపోయి ఆమెని చదువుల తల్లి సరస్వతితో పోలుస్తారు. అక్కడున్నంత కాలం పుస్తకాలు చదివి తన జ్ఞానాన్ని మరింత పెంచుకొంది. బౌద్ధమతం గురించి మరింత తెలుసుకోవాలనే కోరికతో టిబెట్‌ దేశానికి ప్రయాణాలు చేయాలనీ, లాసానగరంలోని పోతాళా రాజభవనంలో కొలువుండే దలైలామాని కలుసుకోవాలనీ అనుకొంది. ఊహించని విధంగా అలాంటి అవకాశం అలెగ్జాండ్రా దగ్గిరకే వస్తుంది. ఎలాగంటే 1910 వ సం||లో టిబెట్‌లో జరిగిన తిరుగుబాటు కారణంగా దలైలామా పారిపోయి డార్జిలింగ్‌లో తలదాచుకొంటాడ్ష్ము తన పరివారంతో సహా. దలైలామాని సులభంగా కలుసుకోవచ్చు అని తెలియగానే వెంటనే డార్జిలింగ్‌ వెళుతుంది.
    కాంచెన్‌జుంగా మంచుపర్వతాల నీడలో ఉన్న డార్జిలింగ్‌ నగరంలోని బౌద్ధఆరామం ముందు ఉన్న, ముదురు ఎరుపురంగు దుస్తులు ధరించిన దలైలామా పరివారం అలెగ్జాండ్రాని ఆహ్వానిస్తుంది. దలైలామా అంతవరకు ఏ ఐరోపా స్త్రీకి వ్యక్తిగతంగా దర్శనం ఇవ్వలేదు, మాట్లాడలేదు. ఆ కౌమార ప్రాయపు దలైలామా డేవిడ్‌ నీల్‌ పాండిత్యానికి ఆశ్చర్యపోతాడు. ముదురు ఎరుపురంగు బట్టల్లో ఉన్న దలైలామాని దర్శించిన డేవీడ్‌ నీల్‌ ఎంతో సంతోషపడుతుంది. అతని తలమీద ఉన్న పొడవైన పసుపు రంగు టోపీలో, హస్తాలు ముకుళించుకొని ప్రార్ధన చేస్తున్న ఒక హిమాలయ శిఖరాన్ని చూడగలిగింది. సన్నని శరీరం, కోరమీసంతో  ఉన్న  ఆ దలైలామాలో డేవిడ్‌ నీల్‌కి దేవుడు కనిపిస్తాడు. ఈ పదమూడవ దలైలామా డేవిడ్‌నీల్‌ భక్తికి, పాండిత్యానికి ఆశ్చర్యపడి, ఎన్నో తాత్విక విషయాలు చర్చించి, ‘టిబెటన్‌ భాషనేర్చుకో’ అని సలహా ఇస్తాడు. ఆయన ఆమోదాన్ని ఒక ఆజ్ఞగా స్వీకరిస్తుంది అలెగ్జాండ్రా. ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపుకి కారణం ఈ దలైలామా పరిచయం.
    డార్జిలింగ్‌ నుండి బయలుదేరి, సిక్కిం వెళ్ళి అక్కడి రాజాని కలుస్తుంది. ఆయన కూడా బౌద్ధమత లామా. పైగా ఆయన ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకోవటం వలన మాతృభాష కంటే ఇంగ్లీషులోనే బాగా మాట్లాడుతున్నాడు. అలెగ్జాండ్రా జ్ఞాన దాహాన్ని అర్ధం చేసుకున్న రాజా ఆమెచేత ప్రతి మోనాష్టరీలో ఉపన్యాసాలు ఇప్పిస్తాడు.
    ఇంతలో టిబెట్‌లోని రాజకీయ పరిస్థితులు చక్కబడినందువల్ల 1912 వ సం|| జూన్‌ నెలలో దలైలామా డార్జిలింగ్‌ వదలి లాసాలోని తన నివాసానికి ప్రయాణమయ్యాడు. ఈ సందర్భంగా ఆయన్ని మరోసారి చూద్దామనుకొని ‘ఫేర్‌ వెల్‌’ చెప్పటానికి సిక్కిం దగ్గరలో ఉన్న ‘జెలప్‌లా’ అనే కనుమ వరకూ వెళ్ళి ఆయన్ని మనసారా పలకరించి, హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తుంది. ఈ పదమూడవ దలైలామా పేరు థుప్టేన్‌ గ్యాట్సో.
    సిక్కింలో కొంతకాలం ఉండిన తర్వాత నేపాల్‌కి వెళుతుంది అలెగ్జాండ్రా. అక్కడ నుండి తిరిగి బెనారస్‌ వచ్చి, దివ్యజ్ఞాన సమాజం వారి సహాయంతో గంగానది ఒడ్డునే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, కాశీ సంస్కృత పండితుల సహాయంతో భారతీయ తత్వ శాస్త్రాన్ని సంస్కృతంలో చదవ టానికి ఆరంభిస్తుంది. తనకు గురువు అక్కరలేదు అనే ధైర్యం వచ్చాక మరలా సిక్కిం రాజా వద్దకి వెళుతుంది. ఈ సారి టిబెటన్‌ భాష నేర్చు కోవటానికి ఒక గురువుని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాష నేర్చుకొని కొంతకాలం టిబెట్‌లో సంచారంచేసి, తిరుగు ప్రయాణంలో జపాన్‌ మీదుగా పారిస్‌ చేరుకుందామని ఒక ప్రణాళిక తయారుచేసుకొంటుంది.
    తన భర్త ఆఫ్రికా నుండి ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉండే వాడు. ఇద్దరి మధ్యా ప్రేమాభిమానాలు బాగానే ఉండేవి. డబ్బు అవస రమైన ప్రతీసారీ పంపుతుండేవాడు. ‘నీవు రమ్మంటే ఇప్పుడే ఇవన్నీ వదిలి పెట్టి ఆఫ్రికా వచ్చేస్తాను’ అని అలెగ్జాండ్రా ఎంతో  గౌరవంగా, ప్రేమగా సమాధానం  ఇస్తూ  ఉండేది.

ప్రొ.ఆది నారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

100

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో