మళ్ళీ మాట్లాడుకుందాం…

 

                ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో రాజ్ కపూర్ ఒక మగవాడి మనసుకి సంబంధించిన ప్రేమ వైఫల్యాలను సున్నితంగా జాగ్రత్తగా మలచుకుంటూ ఆ సినిమా తీసినట్టు గుర్తు.  అందులో హీరో చాలా చిన్న వయసులోనే తనకు చదువు చెప్పే టీచర్ని ఇష్టపడతాడు.  ఆ ఇష్టమేమిటో  ఆ కుర్రవాడికే తెలీని అవస్థ, వయసు కూడా.  టీచర్ కి ఆ విషయం ఎప్పటికీ తెలియదు.  తెలియవలసిన అవసరం కుడా లేదు.  కానీ నాయకుడు మాత్రం పెద్ద వాడయ్యాక ఆ చిన్నప్పటి బాల్య స్మృతిని గుర్తు చేసుకుంటాడు.

ఆ చిన్న వయసులో మగపిల్లల్లో తమ కంటే పెద్ద వాళ్ళ పట్ల ఆసక్తి, ఆకర్షణ కలుగుతాయని ఆ కథలో రాజ్ కపూర్ చెప్పాడు గానీ దాన్ని తుంచేసాడు.  పెంచలేదు.  అది ఆ రోజుల నాటి సంస్కారం.

కాని నిన్నటి న్యూస్ పేపర్లో ‘సారీ టీచర్’ అనే సినిమా విడుదల కాకుండా ఆపాలని ఉపాద్యాయ సంఘాలు ధర్నా చేస్తున్న వార్త చదివాను.  గత వారం రోజుల కిందట టి.వి లో సారీ టీచర్ అంటూ హీరో హీరోయిన్ తో గెంతులు వేస్తూ పాడే పాట చూసాను.  ఆ పాటలోని పదాలు – దాన్ని సాహిత్యం అనకూడదు, అంటే సాహిత్యం పట్ల మహాపరాధం అవుతుంది – విని ఆశ్చర్యపోయాను.  సినిమా శృంగారాన్ని ఇంకా ఇంకా ఘాటుగా చూపెట్టడానికి చివరకు స్టూడెంట్-టీచరమ్మల  మద్య కుడా అఫైర్  పెట్టడానికి భయపడటం లేదుకదా !

ఇక హై స్కూల్ లో చదువుకునే నిక్కర్ల  మగ పిల్లలు ఇలాంటి దరిద్రగొట్టు కథలతో వచ్చే సినిమాల వల్ల ఏమైపోతారు.  సినిమాల్లో చూపెడితే వాళ్ళ దృష్టిలో లైసెన్సు ఇచ్చేసినట్టే కదా!

మగవాడి మనసు స్త్రీ విషయంలో ఎంత చంచలమో చెప్పడానికే “బ్రహ్మచారీ శతమర్కట: ” అన్నారు.  ఒకటి కాదు రెండు కాదు వంద కోతులతో సమానం అని ఆ తర్వాత పెళ్లి అయ్యాక గృహస్తునీ వదలలేదు.  “గృహస్తు సహస్ర మర్కట: ” మనిషి రక్తం రుచి చుసిన పులిలాగా గృహస్తు బుద్ది వెయ్యి కోతులతో సమానమని. ఈ సూక్తులు పురుషులే ప్రవచించారు.

వయసులో ఎంత పెద్దవాడయినా తనకన్నా ఎంత చిన్న ఆడపిల్లనయినా ఒకే దృష్టితో చూసే మగవాడికి మత ధర్మాలు ఎన్నో నీతులు చెప్పాయి.  అయినా పెడ చెవిని పెడుతూనే  ఉన్నాడు.  ఇక తన కంటే పెద్దదయిన స్త్రీ పట్ల కుడా ఎలా ఉండాలో ధర్మాలు ఘోషిస్తూనే ఉన్నాయి.  లోక భయం, పాప భీతితో కొందరు, ధార్మిక బుద్దితో కొద్ది మంది తమ బుద్దిని హద్దుల్లో పెట్టుకుని మర్యాద హద్దు దాటరు.

కానీ ఎక్కువ మందికి ఏ నియంత్రణా లేదు.  అవకాశం కోసం చూస్తుంటారు. వారికి స్త్రీ శరీరం వయసుతో నిమిత్తం లేకుండా ఒక భోగ వస్తువు.  అలాంటి వాళ్లకి ఇలాంటి సినిమాలు తీసి చూపిస్తుంటే వాళ్ళని అచ్చువేసి వదిలి పెట్టడమే కదా!” “అచ్చోసిన ఆంబోతులా” అని కదా సామెత.

పోతన గారు భాగవతంలో ప్రహ్లాదుడి కథలో ప్రహ్లాదుడి గుణగణాలు వర్ణిస్తూ “కనుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృ  భావము జూపి మరలు వాడు” అని రాస్తారు.  ప్రహ్లాదుడు బాలుడు కదా! అతనికి అన్య కాంతల మీద మాతృ  భావం కలగడం సహజమే కదా! మరి దాన్ని ప్రత్యేకించి ఎందుకు చెప్పారు -? అని నన్ను చాల మంది అడిగారు.  నాకు వెంటనే  ఏ సమాధానం తోచలేదు. కానీ మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణలు తెలుసుకున్నాక ఒకటే అనిపించింది.  చిన్నప్పటి నుంచీ తెలీకుండానే సహజాతాలుగా కొన్ని భావాలు కలుగుతు ఉంటాయని, అలాంటప్పుడు పిల్లల్లో అవి వెర్రి తలలు వెయ్యకుండా అదుపులో ఉండేలా సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచవలసిన భాద్యత అందరికీ ఉంది.  మరీ ముఖ్యంగా మొదటి యవ్వనంలో ఉన్న పిల్లలు అంటే టీన్ ఏజ్  వాళ్ళు తొందరగా ప్రభావాల్లో పడిపోతారు.  వాళ్ళని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తియ్యాలని మన తెలుగు సినిమా పరిశ్రమకి ఎప్పుడు తెలుస్తుంది ?  మన వస్త్రధారణ మన ఇష్టం.  కాని మన శరీరావయవ ప్రదర్శన కూడా వాళ్ళ మనోభావాల మీద ఎలా పనిచేస్తుందో మనం గ్రహించుకోవడం అవసరం.  మన ఇష్టాల వల్ల ఎందరికో నష్టం కలుగుతుంటే ఇక ఆ స్వేచ్చ దుర్వినియోగామవుతున్నట్టే కదా ?  ఎవరెలా పోయినా మన ఇష్టం మనదే అని అనుకునే సమాజంలో ఉన్నాం కనుకనే ‘సారీ టీచర్’ సినిమా లాంటి సినిమాలు వస్తూ ఉంటాయి.  – యువతరం ఆలోచనల్లో ‘లవ్’ పోయి ‘లస్ట్’ మిగులుతుంది.  దీన్ని మనం ప్రతిఘటించలేమా? !.

                                                                                                                                                           -వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , Permalink

One Response to మళ్ళీ మాట్లాడుకుందాం…