వచ్చాను ఇక చూస్తాను…

ఎవరు నేను….
ఎక్కడ నుండి వచ్చాను…
దేని కోసం వచ్చాను…
ఏం బావుకుందామని వచ్చాను…
ఏ ఆనందం కోసం తపించి వచ్చాను …
ఏ సుఖ సంతోషాల సావాసం చేద్దామని వచ్చాను…
ఏ దిక్కు మొక్కులను నా దిక్కు చేద్దామని వచ్చాను…
ఏదో వచ్చాను…
అమ్మ నాన్నల అలంకారంగా వచ్చాను…
ఆకలి దప్పుల బాధ తెలుసుకోగ వచ్చాను…
బాధల రోదనల దీన గాద కనగా వచ్చాను…
వేదన నిర్వేదన నీడను చేరగా వచ్చాను…
అనురాగ పీడిత అమాయక నీడగా వచ్చాను…
ఆప్యాయతల బంధాల బందీనవ్వగా వచ్చాను…
బ్రతుకు బాటలో ముళ్ళు పూలు
ముక్కల చెక్కల చిక్కులు చింతించగా వచ్చాను…
నిన్న నేడు రేపుల నడుమ నాటకాన్ని
నా ఇష్టం చేయలేక తపిస్తున్నాను…
పగలు రేయి పరిపాటి గమన పోటిలో
ఆటు పోట్లు పట్టి పీడించగా శుష్కించాను…
ఆనందం వెంట విషాద కౌగిలి
తరిమి తరిమి కొట్టగా తల వంచాను…
నవ్వు వెనక కన్నీళ్లు దాచుకుని
కడగండ్ల వాకిలోలో ముగ్గుని గీసుకున్నాను…
వెన్నెల కప్పుకున్న బడబాగ్ని జ్వాలని గుండెల్లో పొదువుకున్నాను…
కాలం ఆడే కుమ్ములాటలలో కీలుబొమ్మనై
వెలిగి నలిగి విరిగి ఒరిగి విహరిస్తూ ఒదిగి వున్నాను…
మనసు మమతల మాయల మహా నాటకంలో
మమకారాన్ని పొంది పొందక కలత చెంది చెందక
కదలక మెదలక కఠిన గుండెని అలంకరించుకున్నాను…
నేనొచ్చాను…
వచ్చి సాధించాను…
రోదించాను..
బాధించాను…
హిమ శిఖరాన్ని కోరుకున్నాను…
బడబాగ్నిని అనుభవించాను…
సున్నితాన్ని చూడాలనుకున్నాను…
కాఠిన్యాన్ని పెనవేసుకున్నాను…
ఏదో వచ్చాను…
బ్రతకాలి కదా అని బ్రతికే బ్రతుకుని భరించలేక
నా బ్రతుకు కోసం తపిస్తున్నాను…
నడవాలి కదా అని ముళ్ళ మీద పరిగెత్తలేక
పూల బాట పరవాలనుకుంటున్నాను…
నా కోసం నా ఇష్టం నా సొంతం చేసుకోవాలని పోరాడుతున్నాను…
నా నవ్వు నా మది నుండి వచ్చి విరబూయాలని తపిస్తున్నాను…
పై పై మెరుగులు పూసుకుని బ్రతకలేక
నా అడుగులకి స్వచ్చమైన మెరుపులు సంతరించుకోవాలి అనుకుంటున్నాను….
వచ్చాను కదా అని వల్ల కాని బ్రతుకు బ్రతకను…
ఏదేమైనా నాకు నచ్చిన నేను మెచ్చిన నా క్షణాలు
నా కోసం నేను రాశులు పోసుకుంటాను…
నా మదిని నలిపేసే ప్రశ్నలకి నా నుండే సమాధానం సాధిస్తాను….

– అభిలాష

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to వచ్చాను ఇక చూస్తాను…

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    మీ కవిత తప్పటడుగులు వేస్తూ చివరికి దారికి వచ్చింది

  2. mehdi ali says:

    ఆర్ద్రంగా , అందంగా ఉండి మనసుకు స్పృశించేలా ఉంది