వర్షాన్ని పడనీ!!!

గాలి చొరని తలగడలో వాటిని నింపి,
నా ఆకాశంపైకి వాటిని పంపు…
ఆ అందమైన నల్లటి మేఘాలను!
పాతదైపోయిన జీవితాన్ని మళ్ళీ క్రొత్తదిగా చేద్దాం
విడిచిపోయిన హరితాన్ని మళ్ళీ ఆహ్వానిద్దాం
పూల జల్లోలే కురిసే చిరుజల్లుల పవిత్రతలో
మన రాగద్వేషాలన్నింటినీ కరిగించేద్దాం
వర్షాన్ని పడనీ!!!
మరిగిన ఈ ఆవేశపు ఉష్ణాన్నిచల్లబడిపోనీ
తలవంచి నిల్చిన భావాలు…కనులెత్తి శిఖరాలను చూడనీ
రక్తసిక్తమైన మనఃగాయాలు ఇప్పుడైనా మానిపోనీ
చిరు మువ్వల ఆకులు తొడిగిన చిన్నారి మొక్కలు…తడిసి, మురిసి ఆడనీ
తలదిండులోకి కొద్ది కొద్దిగా గాలిని చొరబడనీ…
కొంటెగా కవ్విస్తూ గిలిగింతలు పెట్టనీ…
మేఘం గాలితో సంగమించగా…చిరుజల్లులు పుట్టనీ
అవనిని పునీతం చేస్తూ ముత్యాలపోతగా…నిండుగా కురవనీ..
మౌనం రాజ్యమేలు గొంతులు ఇపుడు ఎలుగెత్తి పాడనీ
మేలిముసుగు తొలగించి, అనుభూతులు మందహాసం చేయనీ
వర్షాన్ని పడనీ!!!

నిశీధిని కప్పుకున్న చూపుల్లోకి వెలుగులు నిండనీ
చెప్పులు విడిచిన కాళ్ళు బురదలో తమ గాంభీర్యాన్ని కడగనీ
చిన్నారుల చిలిపితనాన్ని ఒంటినిండా పేర్చుకుని చిట్టి కప్పలవలే గెంతనీ
మనసుల కలయికతో…దూరాలు చేరువ కానీ
ప్రేమికులు మనసు విప్పి ప్రేమను తెలియపర్చనీ
మగువల ముంగురుల నుండి చినుకులను బిందువులుగా రాలనీ
ప్రియుల మనసులను అవి ముప్పుతిప్పలు పెట్టనీ
విత్తుల్లో నిదురించే పచ్చదనాన్ని ప్రేరేపించనీ
అవనిని ముద్దగా తడిపి ముద్దాడనీ
మంత్రించిన అనుభూతులు స్వప్న జగత్తు ద్వారాలు మరలా తెరవనీ
వర్షాన్ని పడనీ!!!

సంకోచపు వస్త్రాలను వదిలి…
మంత్రముగ్ధనై మైమరచి…
తన్మయత్వాన్ని దోసిళ్ళనిండా నింపుకుని…
నన్ను ఈ దివి ధారలో పూర్తిగా తడవనీ
వర్షాన్ని పడనీ!!!

– విజయ భాను కోటే

Let it rain

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


కవితలు, , , , , , , , , , , , , , , , , Permalink

16 Responses to వర్షాన్ని పడనీ!!!

 1. Buha says:

  Now we know who the seinsble one is here. Great post!

 2. dhanalakshmi says:

  చాల బావుంది మీ వర్షం

 3. c.bhavani devi says:

  వర్షం చాలా బాగుంది. మళ్లీ చదివితే మరింతగా మనసును ఆకట్టుకుంది. కంగ్రాట్స్ భవాని

 4. రాణి says:

  నిజం చెప్పనా ? మీ కవిత ఎంత బాగుందో ఆ కవితకి వేసిన ఛాయాచిత్రం కూడా అంత బాగుంది. ఆ బొమ్మే లేకపోతె నేను ఈ కవిత చదివి ఉండను. నిజానికి కవిత్వానికి అర్థం అయ్యీ కాని గీతలు గీసి కవిత్వం అంటే మరింత భయపడేలా చేస్తూంటారు. కానీ మీ అదృష్టం బాగుంది. గీతాల బదులు అందమైన ఛాయాచిత్రం పడింది.

 5. Dadala Venkateswara Rao says:

  విజయ భాను కోటి గారు!
  నిజానికి మీ కవిత నాకూ చాలా బాగా నచ్చింది
  మొదటి బాగం అర్దంకాలేదు అంతే
  అన్ని ప్రదేశాలలోనూ ఒకేసారి వర్షం కురవదు
  ఏదో పొరపాటున ఇక్కడ కురవలేదు
  మీ అభిమానులు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు
  మీ అభిమాని ‘వినూత్న గారు’ చెప్పినట్లు నీను నిజంగా ‘కవి’ ని కాదు
  నాకు కవిత్వం గురించి ఏమి తెలీదు
  ఏపత్రిక లోనూ నా కవిత ఇప్పటివరకు ప్రచురించ బడలేదు
  ‘విహంగ’ వల్ల ఏదో ఇలా కవితలగురించి తెలుసుకుంటున్నాను
  వృత్తిరీత్యా విమర్శించడం అలవాటయ్యింది
  తప్పుగా అర్ధం చేసుకోకండి
  వర్షాన్ని వరదలా పంపకండి

  ఎన్నో విషయాల మిలితమవడం వల్ల నాకు మీ కవితలో కొంతబాగం అర్ధం కాలేదు

  ఉదాహరణకి నాకు తెలియని అర్ధం కాని విషయాలు ఇవి……
  గాలి చొరని తలగడ అంటే తెలియలేదు
  వాటిని నింపి అని వ్రాసారు. వేటినో నాకు తెలియలేదు
  నల్లటి మేఘాలు అందంగా ఉంటాయని నిజంగా నాకు తేలీదు
  జీవితం పాతదైపోతుందని నీననుకోను.
  నా దృష్టిలో పాతవైపోయేవి వస్తువులు మాత్రమె
  హరితం విడిచిపోవడం ఉండదు
  చిరుజల్లులకు పవిత్రత ఉండదు
  మన రాగద్వేషాలన్నింటినీ ‘కరిగించేద్దాం’ అని వ్రాసారు
  చినుకులతో దేనినైనా కడగడం సాధ్యపడుతుంది అనుకుంటాను నీను
  ఆవేశం చల్లబడిపోతే ఎలాగండి? ఆవేశం ఉండాలి కదా !
  భావాలు తలవంచి నిలవడం నీను చూడలేదు
  రక్తసిక్తమైన మనఃగాయాలు ఉంటాయా? ఏమో
  తలదిండులోకి కొద్ది కొద్దిగా గాలిని చొరబడనీ అంటే ఏమిటో చెప్పండి
  మేఘం గాలితో సంగమించగా…చిరుజల్లులు పుడతాయని ఇప్పుడే తెలుసుకున్నా

  మీ కవిత ఆఖరి నాలుగు వరుసలు నీనేప్పటికి మరువలేను
  వర్షం పడినప్పుడల్లా ఆ పదాలు గుర్తుకొస్తాయి

  • 🙂 ఇంత చక్కగా అనలైజ్ చేసినందుకు థాంక్స్ సార్ 🙂 నేనెప్పుడూ నా కవిత్వానికి వివరణ ఇవ్వలేదు. ఇది ఒక ఫీలింగ్ మాత్రమె! వర్షాన్ని చాలా విషయాలతో మిళితం చేసాను మీరన్నట్లు! ఇప్పుడు నేను వివరణ ఇస్తే….మొదటి సారి ఆ ప్రయత్నం చేసినట్లు 🙂 నా దృష్టిలో కవిత్వం ఒక భావం నుండి జనించి ఒక ప్రవాహంలా వచ్చేస్తుంది. నేను ఒకలా అనుకోని రాయొచ్చు. చదివిన వారి దృక్కోణం, ఆ కవితను ఆస్వాదించే అనుభూతి వేరుగా ఉండొచ్చు.
   నేను కూడా కవయిత్రిని కాదు. ఒక పాటర్న్ అనుకోను. అనిపించింది రాసేస్తూ ఉంటాను. మీరు ఇంకోక్కసారి చదివి చూడండి. ఇంకా నచ్చకపోతే మనిద్దరం కలిసి మార్చే ప్రయత్నం చేద్దాం 🙂
   రిగార్డ్స్,
   భాను.

 6. lakshman says:

  విజయ భానుగారు మీ వర్షం చాలాబాగుంది. ఒక మనిషి జీవితం లోని అన్ని కోణాలలో మీరు వర్షాన్ని కురిపించారు. నీ నైతే మీ వర్షం లో పూర్తిగా తడిచాను. ఈ వర్షాన్ని కొనసాగించగలరు.

  • థాంక్స్ లక్ష్మణ్ గారు 🙂 మీకు నచ్చినందుకు….నా వర్షంలో తడిచినందుకు ధన్యవాదాలు 🙂

 7. vinootna says:

  డి .వి.ఆర్ . గారికి వర్షం గురించే తెలుసు కవితా వర్షం అర్ధం కాలేదంటే ఆయనకీ అసలు కవిత్వం తెలియదన్న మాట . పాపం ఆయన అర్ధమయ్యే “లా” చెప్పాలంటే తెలుగు నేర్తుకుంటే అయిన కాస్త అర్ధం ఆటుందేమో చూద్దాం. ఎలాంటి అన్ని పట్టించుకోకండి మీ కవితా వర్షాలను వరదలా పారించండి …. ఆ వరద తాకిడికి అయినా అర్ధం కావచ్హు……

  • థాంక్స్ వినూత్న గారు…మీ పేరు నాకు చాల నచ్చింది. నా తర్వాతి కథలో వాడుకోవచ్చా? ప్లీజ్? 🙂

  • -ఆర్.దమయంతి. says:

   వినూత్న గారు..బాగా చెప్పారు!

 8. Dadala Venkateswara Rao says:

  విజయ భాను కోటి గారు!
  నీనేమి ఆ వర్షాన్ని ఆపలేదు
  మీరు కురిపించిన వర్షం నామీద పడలేదు
  ఎందుకో ఈ కవిత నాకు అర్దం కాలేదు
  పూర్తిగా తడిచేలా ఆ వర్షాన్ని కురిపిస్తారా
  అదే కొంచెం అర్ధమయ్యేలా చెబుతారా?

  • ఈ మధ్య నా కవితల్లో క్లారిటీ ఉండడం లేదేమో వెంకటేశ్వర రావు గారు….మీ మెయిల్ ఐడి ఇవ్వండి..తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను 🙂 కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు 🙂

 9. -ఆర్.దమయంతి. says:

  వర్షం కురిసింది.. విజయ భాను కోటి గారు!