సమకాలీనం – సవరణలు

         నాకో సందేహం! పాతదే అయినా…ఎందుకో…ఇపుడు ఆ చట్టం మారిపోయి, క్రొత్తదేమైనా వచ్చిందేమో…నేనేమైనా జనరల్ నాలెడ్జిలో వెనుకబడిపోతానేమోనని భయం. “ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి వయసెంత ఉండాలి?” వార్నీ ఇంతేనా? అనకండి. నా అనుమానాలు నాకున్నాయి.నాకిపుడో క్రొత్త సందేహం. తీర్చండి మరి! అమ్మాయికి పెళ్ళికి కనీస వయసెంత? పద్దెనిమిదని మీరే సందేహంగా గొణుగుతున్నారా? ప్రక్కవాళ్ళనెవరినైనా అడుగుతున్నారా? ఎందుకంటే ఈ మధ్య అన్నింటికీ సవరణలు జరుగుతున్నాయి. పురోగమనం కోసమైతే పర్వాలేదు. తిరోగమనంలో ప్రయాణించడానికి కొన్ని ఏర్పాట్లైతే జరుగుతున్నాయి.

          కోర్టులే తికమకకు లోనౌతుంటే, పాఠశాలలే ఏం చెయ్యాలో తెలియక మకతిక పడుతుంటే మనమెంతలెండి. మీ ఇళ్ళల్లోనో, సమూహంలోనో ఎమైనా క్రొత్తగా ( పూర్వ పద్ధతుల్లో) సంఘటనలో, పనులో జరిగితే ఇక భయం లేదు. మనం సవరణలకోసం ప్రయత్నించక్కర్లేకుండా ప్రభుత్వమే ఆ పని చేస్తుంది. మీకు నచ్చినట్లు చెయ్యండి. తర్వాత మీకు అనుకూలంగా కోర్టును ఆశ్రయించండి.
     

             ఇపుడు ఏడో తరగతి నుండి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వారి మానసిక జీవితానికి, ఆరోగ్యానికి బాధ్యత తీసుకోని తల్లిదండ్రులు, వారి పిల్లలను పెళ్ళి చేసుకున్న పెళ్ళికొడుకులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తే మాత్రం విద్యా హక్కు తలుపు తడుతున్నారు. ఆడపిల్లకు పెళ్ళి వయసు పద్దెనిమిదని వారికి తెలియదా? వారి జీవన హక్కును హరించి, విద్యా హక్కు చట్టం తలుపు అంత ధీమాగా తడుతున్నందుకు ముందుగా వారిని అభినందిద్దాం. ఇలా చూస్తే మనం మళ్ళీ బాల్యవివాహాలు బహిరంగంగానే మొదలుపెట్టవచ్చు. ఇలాంటి పెళ్ళికొడుకు మళ్ళీ దొరకడని మా అమ్మాయికి పెళ్ళి చేసేసాను. అతను చదువుకోవడానికి అనుమతి ఇచ్చాడు. తాళితో మా అమ్మాయిని తరగతి గదిలో కూర్చోనివ్వండి అని నిస్సంకోచంగా, చట్టానికి భయపడకుండా అడగవచ్చు. వరకట్నం నిషేధించబడినా, గొడవొస్తేనో, విడిపోయే రోజొస్తేనో, మా అమ్మాయికి అంత కట్నం ఇచ్చాం, ఇంత కట్నం ఇచ్చాం….అయినా…వాళ్ళు ఇబ్బందులు పెట్టారు అని చెప్పుకోవడం లేదూ?! పోలీసులను, కోర్టునూ ఆశ్రయించి, ఆ కట్నం డబ్బులు వెనక్కి వచ్చేలా చర్యలు తీసుకోవడం లేదూ?!

           వరకట్నం ఇవ్వడం నేరం, మీరెందుకు ఇచ్చారు అని వాళ్ళు మనల్ని ప్రశ్నించి, మనపై చర్యలు తీసుకుంటున్నారా ఏమిటి? ఇదీ అంతే! ఇహ మనకి భయాలు, అపోహలూ లేనే లేవు. సాహసం సేయరా ఢింభకా! అనుకుంటూ నచ్చినట్లు వివాహ వ్యవస్థను మార్చుదాం.మదురైలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కానీ చాలా మంది ఆడపిల్లలకు పెళ్ళి తర్వాత చదువుకునే ఆస్కారం ఉండదు.
   

               ఇహ మనవాళ్ళు ఈ ఇష్యూకి సంబంధించి వార్తాపత్రికల నిండా రాతలు రాసారు. ఆ హెడ్మిస్ట్రెస్ పిల్లలకు అడ్మిషన్ నిరాకరించడం పట్ల కొంత హడావుడి జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయిలకు అడ్మిషన్ దొరికింది. చదువు సాగిపోతుంది (భర్త దుబాయ్ నుండి తిరిగిరానంతవరకు)
  

              మొన్నామధ్య మన కోర్టు ముస్లిం యువతులు పదహారేళ్ళకే వారికి నచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చని, ఒకమ్మాయి పెట్టిన కేసుకు తీర్పుగా చెప్పారు. యువతులకు పెళ్ళి వయసెంత? పద్దెనిమిదే కదా?! ముస్లిం యువతులు మనుషులు కారా? సవరణలు ఏ దిశగా సాగుతున్నాయి? మనల్ని ఎటు నడిపిస్తున్నాయి? ఆలోచించాల్సిన విషయం!!!

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.