మళ్ళీ మాట్లాడుకుందాం…

నిన్న టివిలో అమీర్ ఖాన్ సత్యమేవ జయతే కార్యక్రమం చూస్తుంటే కన్నీళ్ళతో పాటు నిత్యమూ కళ్ళముందు కనిపించే విషయం

మా అపార్టుమెంట్ లో కింది వాటాలో ఒక కుటుంబం అద్దెకు ఉంది.  కొడుకు కోడలు మనుమలు ఇద్దరు.  వీళ్ళతో పాటు అతని తల్లి.  ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్ ఉద్యోగంలో ఉంది. కొడుకుకి సరయిన ఉద్యోగం లేదు.  తల్లి జీతం మీదే ఇంచుమించు కుటుంబం అంతా ఆధారపడి ఉంది.  ఆమె యవ్వనమంతా మంచంలో ఉన్న అత్తగారికి సేవ చేస్తూ ఆఫీసుకి వెళ్లి అక్కడ రెండస్తుల భవనమంతా శుభ్రం చేస్తూ, అంత దూరం నుంచి డబ్బులు మిగల్చడానికని నడిచి వస్తూ కుటుంబాన్ని లాగింది.  భర్త మామూలుగాచాలా మంది లాగే  తాగుబోతు.  ఆఫీసులో ఇంత చాకిరీ చేసి తాగుబోతు మొగుడి చేత దెబ్బలు తింటూ ప్రభుత్యోద్యోగిగా ముప్ఫై ఏళ్ళ సర్వీసు సర్వీసు అనే అసలయిన అర్థంలోనే చేసింది.

చూస్తుండగా ఆమె మాటల్లో ధోరణిలో తేడా రావడం మొదలయింది.  ఏదేదో మాట్లాడడం, మాటిమాటికీ ఎక్కడ బడితే అక్కడ చీపురుతో ఊడవడం, ఊరికే అటూ ఇటూ తిరగడం లాంటి చేష్టలు మొదలయి పెరిగాయి.

బయటి వాళ్ళంతా గమనించి చెప్పేదాకా కొడుక్కి కోడలుకీ తెలియలేదు.

ఇది మొదలయి నాలుగేల్లయింది .  ఆమెకు ఏదో నామకార్థం వైద్యం చేయించారు.  మనిషి ఎండుకట్టెలా అయింది.  కానీ అవే మాటలు, అదే తిరుగుడు.

ప్రతివాళ్ళనీ పలకరిస్తుంది.  ఏదేదో చెప్తుంది.  అల్జీమర్స్ వ్యాధి కావచ్చు, లేదా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు, ఏదైనా పరీక్ష చేయిస్తే కదా తెలిసేది.

ఆమెను ఆ కొడుకు దగ్గరుండి సిటీ బస్ ఎక్కించి ఆఫీసుకి తీసికెల్తాడు. రిజిస్టర్లో ఆమె చేత సంతకం చేయిస్తాడు.  అక్కడున్న తోటి వర్కర్లకి అప్పజెప్పి వచ్చేస్తాడు.  సాయంతం వెళ్లి తీసుకొస్తాడు.

ఇంకా రెండేళ్లు సర్వీసు ఉంది.  ఆమె అలా ఇంకా రెండేళ్లు పనిచెయ్యాలి.  ఆమెకి నెల నెలా వచ్చే ముప్ఫై వేల రూపాయల జీతం కోసం ఆమె క్రమంగా స్థిమితం తప్పుతున్న మతితో ఉద్యోగం చేస్తోంది.  చేస్తోంది కాదు చేయిస్తున్నారు.  ఆ జీతం ఆ కుటుంబానికి అవసరం.  కానీ ఆమెకి ఆ డబ్బు తాలుకు స్పృహే లేదు.  చీపురుతో ఊడవడం అన్నదే బుర్రలో నాటుకుపోయింది.  అది మానేస్తే ఎవరు తిడతారో అనే భయం మనసులో స్థిరపడి పోయింది.

ఉద్యోగ భద్రత ఆర్ధిక భద్రత ఈ ఆడమనిషికి ఏం ఉపయోగపడుతున్నాయి?  ఆ కొడుకు తన తల్లి చేత ఉద్యోగం మాన్పించి వచ్చే ఆ కాస్త పెన్షన్ తో ఆమె సుఖంగా ఇంటిపట్టున ఉండే వీలు కలిగిస్తే ఎంతో మంచి చేసినట్లు ఆ తల్లికి అని రోజూ అనుకుంటాను.

కానీ అలా జరగదు.  ఆమె పూర్తిగా పిచ్చిదయ్యేదాకా ఆఫీసులో తుడిచే ఉద్యోగానికి వెళ్లితీరాలి.  తనకి సంబంధించని జీతం రాళ్ళు తన కొడుకు కుటుంబం కోసం సంపాదించి తీరాలి.

గుండె భారమయిపోతుంది.  ఆడవాళ్ళ ఆర్ధిక భద్రత వాళ్ళకి ఏం మిగులుస్తుంది అని ఆలోచిస్తుంటే.

కాని పాపం అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అంటూ కంట తడి పెడుతూనే ఉంటాడు వారం వారం.*

– వాడ్రేవు వీరలక్ష్మిదేవి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , Permalink

One Response to మళ్ళీ మాట్లాడుకుందాం…

  1. lakshman says:

    నిజమే వీరలక్ష్మి దేవిగారు మీరు చెప్పింది అక్షర సత్యాలు, నేను ఆ కార్యక్రమం చూడలేదు కానీ , మీ చెప్పిన విషయం చదువుతుంతే ఆవిడ పరిస్థితి పాపం కదా అనిపిస్తుంది . కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.