మాతృదేశ విముక్తి కోసం ఉరిని లెక్క చేయని సాహసి హబీబా బేగం(1833-1857)

                   పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాభిమానులైన బిడ్డలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారన్న విషయం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర నిరూపిస్తుంది. అటువంటి నిరూపణలకు దృష్టాంతరంగా నిలుస్తారు శ్రీమతి హబీబా బేగం.
హబీబా బేగం 1833లో  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో జన్మించారు.  చిన్నతనం నుండే బానిస భావాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించిన హబీబా మనస్సును బ్రిటీషర్ల బానిసత్వంలో మగ్గుతున్న మాతృభూమి దయనీయ స్థితి కలచివేసింది.  ఆ వ్యధ నుండి వలస పాలకుల విూద ఆగ్రహం ప్రజ్వరిల్లింది. తెల్లపాలకులను శత్రువులుగా పరిగణించి, మాతృభూమిని బ్రిటీషర్ల నుండి విముక్తం చేసుకునేందుకు సరైన అదనుకోసం ఎదురు చూడసాగారు.
1857లో ఆమెకు ఆ అవకాశం లభించింది.  భారతావనిలోని పలు ప్రాంతాలలో హబీబా లాంటి వీర నారీమణులు, వీర పుత్రులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల, అధికారుల విూద కత్తులు దూశారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న హబీబా తిరుగుబాటు యోధులతో కలసి రణరంగ ప్రవేశం చేశారు. సోదర తిరుగుబాటు వీరులతో కలిసి  బ్రిటీష్‌ సైనికపటాలాల విూద తిరగబడ్డారు. ఆ నేరానికి ఆమెను అరెస్టు చేశారు.
నాటి దేశభక్తులకు ప్రాణాలు లెక్కలోనివి కావు. మాతృభూమి పరిరక్షణలో  ప్రాణాలు విడవడం ఎంతో గర్వంగా భావించారు.  హబీబా కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. పరాయి  ప్రభుత్వంపై తిరగబడిన నేరానికి 1857లో బ్రిటీషు సైనిక న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ యోధురాలు హబీబా సంతోషంగా ఉరిని స్వీకరించారు*.

గెరిల్లా దాడులతో బ్రిటీష్‌ సైనిక దళాలను హడలెత్తించిన ఆకుపచ్చ దుస్తుల” యోధురాలు

భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో ప్రథమ స్వాతంత్య్రపోరాటం మహత్తర ఘట్టం. ఈ పోరాటంలో అసమాన్యులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఆయుధాలు చేపట్టి మాతృభూమి రక్షణకు శత్రువుతో పోరాటం చేశారు. ప్రాణాలను అర్పించారు. ఈ అర్పణకు వయస్సుతో నిమిత్తం లేకుండా పోయింది. అందరి లక్ష్యం ఒక్కటే ! పరాయి పాలకుల పెత్తనం నుండి మాతృభూమికి విముక్తి కలిగించటం. అందుకోసం  ప్రతిఒక్కరూ కొదమసింగాలై పోరాడారు,  సివంగులై గర్జించారు.  ఈ మేరకు శత్రువును గడగడలాడిస్తూ  పోరాటపథంలో అమరత్వం పొందిన అజ్ఞాత మహిళలు పలువురున్నారు. ఆ కోవకు చెందిన  ఆకుపచ్చ దుస్తుల మహిళ  గా ఖ్యాతి చెందిన ఓ మహిళ చరిత్రపుటలలో  అస్పష్టంగా దర్శనమిస్తారు.
చరిత్రలో ఆమె పేరు ప్రస్తావన లేదు. ఆమె ఆకుపచ్చ దుస్తుల మహిళ గా మిత్రులు-శత్రువులచే గుర్తించబడ్డారు. ఆమె ఎల్లప్పుడు ఆకు పచ్చరంగు దుస్తులు ధరించటంతో ప్రజలతోపాటుగా శత్రువు కూడా ఆ పేరుతో ఆమెను పిలుచుకున్నాడు.  ఆమె మగదుస్తులతో కన్పించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆమె పిలుపులో ఉన్న ఆకర్షణ ఫలితంగా ప్రజలు అసంఖ్యాకంగా ఆమెను అనుసరించారు. ఆ విధంగా ఆమె వెంట నడిచిన దేశభక్తి ప్రపూరితులైన ప్రజలతో ఆంగ్లేయ సైనికుల శిబిరాల విూద దాడులు నిర్వహించారు.  ప్రజలలో మాతృదేశ భక్తి భావనలను రెచ్చగొట్టి, శత్రువుకు వ్యతిరేకంగా ప్రేరేపించి, ప్రజలను తన వెంట తీసుకుని, ప్రళయ భీకరంగా గర్జిస్తూ బ్రిటీష్‌్‌ సైనికుల విూద విరుచుకుపడ్డారు. స్వంత దళాలతో అకస్మికంగా దర్శనమిచ్చి, అద్భుత కౌశల్యంతో కత్తి తిప్పుతూ, గురితప్పకుండా తుపాకి పేల్చుతూ శత్రుమూకలను చీల్చి చెండాడిన ఈమె పలుసార్లు శత్రుస్థావరాల విూద విజయవంతంగా దాడులు నిర్వహించారు. అనుచరులు యుద్ధ్దరంగం వదలి వెళ్ళినా ఆమె మాత్రం చెక్కుచెదరని ధైర్యసాహసాలతో శత్రువును ఎదుర్కొని, శత్రువు కంట పడకుండా చాకచక్యంగా గెరిల్లా పోరు జరిపి తప్పించుకున్న ఘట్టాలున్నాయి. ఆ విధంగా తప్పించుకున్న ఆమె  ఎక్కడకు వెడుతుందో, మళ్ళీ ఆమె ఎక్కడ నుండి వస్తుందో, ఎలా వస్తుందో, ఏం చేస్తుందో, ఏలా మాయమౌతుందో శత్రుగూఢచారులకు అంతుబట్టలేదు.
ఈ మేరకు  బ్రిటీష్‌ సైనికుల విూద, సైనిక స్థావరాల విూద  ఆమె చేసిన దాడులు, ఆ దాడుల  తీరుతెన్నులను దర్శించిన అదృష్టవంతులు వివరించిన కథనాలు, బ్రిటీష్‌ అధికారులు రాసుకున్న అధికార, అనధికార లేఖలు, ప్రభుత్వ రికార్డులు ఆమె సాహస కృత్యాలను వెల్లడిస్తున్నాయి. ఈ  పచ్చదుస్తుల మహిళ సాహసాన్ని ప్రస్తావిస్తూ, ‘ బేగమత్‌ కి అంశూఁ ‘ అను గ్రంథంలో రచయిత పేర్కొనట్లు ‘ భారత్‌ కే స్వాతంత్య్ర సంగ్రామం మేఁ ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ ‘ అను పుస్తకంలో రచయిత్రి, అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ అచార్యులు డాక్టర్‌ అబిదా సవిూయుద్దీన్‌ (పేజి. 44లో) ఈ విధంగా  ఉటంకించారు.
‘..ఆ మహిళ అద్వితీయ ధైర్యశాలి. ఆమెకు మృత్యుభయం ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు  గుండ్లను వర్షిస్తున్నా అత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్ని సార్లు నడిచి వస్తుంటే  చూశాం. మరికొన్నిసార్లు గుర్రం విూద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గవిన్యాసంలో, గురి తప్పకుండా తుపాకి పేల్చటంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది..’. ఈ వర్ణన ద్వారా ఆమె గెరిల్లా పోరు సాగించేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో శత్రువుకు తెలియకుండా దాడులు జరిపిన తీరు ఆమె గెరిల్లా రణతంత్రాన్ని స్ఫురణకు తెస్తుంది.
బ్రిటీష్‌ స్థావరం విూద దాడి చేసి శత్రుసైనికులతో  పోరాడుతూ ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయం కారణంగా అమె గుర్రం విూద నుండి కింద పడిపోయారు. ఆ సమయాన్ని అదనుగా ఉపయోగించుకుని శత్రువు ఆమెను చుట్టుముట్టి బంధించాడు. అక్కడి నుండి ఆమెను  సైనిక స్థావరానికి తరలించాడు. ఆమెను బ్రిటీషు అధికారి లెఫ్టినంట్‌ హడ్సన్‌ కట్టుదిట్టమైన బందోబస్తుతో అంబాలాలోని బ్రిటీషు సైనిక స్థావరానికి పంపాడు. ఆ సమయంలో అంబాలాలోని ఆంగ్లేయ సైనికాధికారులకు ఆమె గురించి, ఆమె నిర్వహించిన దాడుల గురించి, ఆమె తిరుగుబాటు కార్యకలాపాల వివరాలను, ఆమె ధైర్యసాహసాలను వివరంగా ఎకరువు పెడుతూ, జాగ్రత్తలు చెబుతూ అంబాలా సైనిక స్థావరం డిప్యూటీ కవిూషనర్‌కు 1857 జూలై 29న లేఖ రాశాడు.
ఆ లేఖలో, నేను విూ వద్దకు ఒక ముస్లిం ముదుసలిని పంపుతున్నాను. ఆమె విచిత్రమైన  మహిళ. ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరిస్తుంది. కంపెనీ విూద తిరుగుబాటు చేయమని  ప్రజలను రెచ్చగొట్టడం ఆమె పని. స్వయంగా ఆయుధాలు చేపట్టి  తిరుగుబాటు దారులకు నాయకత్వం వహించి  మన స్థ్ధావరాల విూద దాడులు చేస్తుంది.  పలుమార్లు మన స్థావరాలపై ధైర్యసాహసాలతో విరుచుకుపడింది. ఆమె ఆయుధం చేపడితే ఐదుగురు సాయుధ పురుషులతో పోరాడగల శక్తిమంతురాలని, ఆమె బారిన పడిన మన సిపాయిలు, అధికారులు  చెబుతున్నారు. ఆమె పట్టుబడిన రోజున, శిక్షణ పొందిన సైనికాధికారిలా నగరంలోని తిరుగుబాటుదారులను కూడేసుకుని, మన స్థావరాల విూద దాడి చేసి పోరాడుతూ  పట్టుబడింది. ఆమె కడు ప్రమాదకారి. జాగ్రత్త సుమా, అని పేర్కొన్నాడు.
ఈ లేఖను ఖుర్షీద్‌ ముస్తఫా రజ్వీ రాసిన జంగ్‌-యే-ఆజాది 1857  అను ఉర్దూ గ్రంథంలో ప్రచురించారని, ‘ భారత్‌ కే స్వాతంత్య్ర సంగ్రామం మేఁ ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ ‘ గ్రంథŠ రచయిత్రి డాక్టర్‌ ఆబిదా సవిూయుద్దీన్‌ తన గ్రంథంలో (45వ పేజిలో) వివరంగా ఉటంకించారు. ఈ లేఖతో పాటుగా అంబాలాలోని ఇతర ఆంగ్లేయాధికారులకు పలు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఆకుపచ్చ దుస్తుల మహిళను అంబాలలోని బ్రిటీషు సైనిక స్థావరానికి పటిష్టమైన బందోబస్తుతో తరలించారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత క్రూరుడిగానూ, ఇచ్చిన మాట తప్పటంలో ప్రప్రథమునిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న  ఆంగ్లేయాధికారి లెఫ్టినెంట్‌  హడ్సన్‌ లాంటి బ్రిటీష్‌ సైనికాధికారి ఆమె ధైర్యసాహసాలను స్వయంగా  ప్రశంసించాడు. ఈ మేరకు ఆయన తన సహచర అధికారులకు లేఖల ద్వారా తెలియచేశాడు. మాతృదేశం పట్ల ఆమెకున్న గౌరవం అతడిని అమితంగా ఆకట్టుకుంది. అ ప్రభావంతో ‘ జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ‘ తో ఆమెను పోల్చుతూ  కీర్తించాడు. (భారత్‌ కే స్వాతంత్య్ర సంగ్రామం మేఁ ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌,  డాక్టర్‌ ఆబిదా సవిూయుద్దీన్‌, పేజి.45)
ఆ  ఆంగ్లేయాధికారి రాసిన లేఖలలోని హెచ్చరికలను, ఆమె చర్యలను అధికారిక లేఖలలో ఆమె కార్యకలాపాలను వివరించిన తీరు, ఆ సందర్భంగా లేఖలో వాడిన భాష తీవ్రతను బట్టి ఆకుపచ్చ దుస్తుల మహిళ గా ఖ్యాతిగాంచిన ఆ యోధురాలు బ్రిటీష్‌ సైనికాధికారుల గుండెల్లో ఎంతటి గుబులు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మేరకు అంబాలా సైనిక స్థావరానికి పంపబడిన ఆమె ఆ తరువాత ఏమైందో   తెలియరాలేదు. శత్రుదళాలలో అంతటి భయోత్పాతం సృష్టించి ఆంగ్లేయ అధికారులను హడలగొట్టడం కాకుండా  కడు జాగ్రత్త సుమా  అంటూ పరస్పరం ముందస్తు జాగ్రత్తలు తెలుపుకోవాల్సినంత భయానక పరిస్థితులను బ్రిటీషు సైనిక స్థావరాలలో కల్పించిన ఆ యోధురాలిని శత్రువు ఏం చేసి ఉంటాడన్న విషయం మనం ఊహించలేనిది ఏమాత్రం కాదు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
హిందూ-ముస్లింలకు ధర్మం, ఆత్మ గౌరవం,ప్రాణం,దానం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో ,స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు.కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు.ఆత్మ గౌరవాన్ని మంట కలుపుతున్నారు.స్త్రీల మీద అఘాయిత్యాలు ,అత్యాచారాలు జరుపుతున్నారు.హిందూ-ముస్లిం పౌరులను  హెచ్చరిస్తున్నాం.ఆత్మ గౌరవంతో ,ధర్మబద్ధంగా ప్రశాంత జీవనం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి.స్వదేశీ సైన్యంలో భర్తీ కండి. మాతృదేశం కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములు కండి.శత్రువుకు సహకరించకండి.ఆశ్రయం ఇవ్వకండి.

-బేగం హజరత్ మహల్

– సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Uncategorized, Permalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Syed Naseer Ahaemd
Syed Naseer Ahaemd
8 years ago

ధన్యవాదాలమ్మ

-ఆర్.దమయంతి.
-ఆర్.దమయంతి.
8 years ago

తెల్లపాలకుల పాలనని నిరసిస్తూ.. మాతృ గడ్డ ని రక్షించుకునే ప్రయతంలో..ముస్లిం సోదరీ మణులు చూపిన తెగువ, సాహసాలు, చేసిన మాన,ప్రాణ త్యాగాలు చదువుతుంటే..ఆవేదన కలుగుతుంది.
ఆకుపచ్చ దుస్తుల యోధురాలి గురించి తెలుసుకున్నప్పుడు గుండె నీరవుతుంది. దేశ స్వాతంత్ర పోరాటం లో ముస్లిం వీర వనితల ధైర్య సాహసాలను వెలుగులోకి తీసుకొచ్చిన రచయిత – శ్రీ
సయ్యద్ నశీర్ అహ్మద్ గారు ఎంతైన అభినందనలు!
-ఆర్.దమయంతి.