మళ్ళీ మాట్లాడుకుందాం…

           చలం గారి వంటి వాళ్ళు  పదేపదే చెప్పిన స్వేచ్ఛ,ప్రేమ అన్న పదాలు ఎప్పటికో గాని అర్ధమయ్యే పదాలు కావనిపిస్తుంది.ఒడిదుడుకులతో నిండిన ఎంతో జీవితం చూసాక ,కొందరు ప్రత్యేకవ్యక్తుల జీవితాలు చూసాక మాత్రమే ఆ మాటల అంతరార్ధం బోధపడవచ్చు..విశృంఖలత  స్వేచ్ఛగాను,ఆకర్షణ  ప్రేమ గాను భ్రమించే అవకాశం ఎంతో వుంది.అలా భావించి అక్కడ జీవితం మొదలు పెట్టిన వారు ఎక్కడి దాకా  ప్రయాణిస్తున్నారో  చూస్తూనేవున్నాం .                                                       తన మనసు చెప్పినట్టే జీవించడం స్వేచ్ఛఅనుకుంటే ఆ మనసు మీద నియంత్రణ వారికి వుంటుందా?మనసు మీద నియంత్రణ యెంత కష్టమో మన అందరికీ తెలుసు.అందుకే చలం గారు లోక భీతి లేకుండా వుండడమే ఒక స్వయంనియంత్రణ అని చెప్పారనిపిస్తుంది.తనకు నచ్చిన పని చెయ్యడానికి ఎవరికీ భయపడని మనోధైర్యం వుండాలి.దాపరికాలు ,దొంగతనాలూ  లేకుండా వుండగలగాలి అదీ స్వేచ్చగా జీవించడం  అంటే.అలా జీవించగలగడం  స్తీపురుషులు ఇద్దరికీ కూడా ఎంతో కష్టమైన విషయమే.

           కానీ అలా జీవిస్తే ఆ జీవితం చివరకు వాళ్ళని ఎక్కడకు చేరుస్తుందో ఈ మధ్య నా కళ్ళతో నేను చూసాను.కొత్త కాక పోయిన ప్రతీసారీ కొత్తగానే వుంటుంది అలాంటి అనుభవం నాకు.
చిన్నప్పుడు అంటే  టీన్స్ లో  వున్నప్పుడు మా అమ్మమ్మా వాళ్ళ ఊరువెడుతూ ఉండేదాన్ని.ఆ ఊరంటే నాకు యెంత ఇష్టమంటే చింత చెట్ల మధ్య ఉన్న ఆ చిన్న ఊరు నా స్పిరిట్యువల్ హోంఅనిపించేది.అమ్మమ్మా వాళ్ళ ఇంటి వెనక నించి పారే ఏరు ఓ గొప్ప సంగతి.,ఆ ఏటి పాట వింటుంటే సుబ్బారావు గారి ఎంకి పాటల ఏరు ఇదే అనిపించేది.

అలాంటి ఉళ్ళోఅత్యంత సౌందర్యం తో మెరిసిపోయే ఒకామెను చూసాను.ఆమె వూరంతా కలయతిరుగుతూ వుండేది.అప్పుడప్పుడు మా ఇంటికీ వచ్చేది.ఆమె మాట,నడక, చూపు ఒకేలా రాజసం వుట్టిపడుతూ ఉండేవి.పెళ్ళితో పాటు పిల్లల్ని కూడా సంపాదించుకుంది. ఐనా ఆ యవ్వనోన్మాదం అడుగడుగునా కనిపిస్తునేవుండేది .

        నాకు ఆమెను చూసినప్పుడల్లా ఒక ఉన్నతమైన కట్టడాన్ని చూసినట్టు,మెలికలు తిరుగుతూ కనిపించే కాలిబాటను చూసినట్టు ,మండే అరణ్యాన్ని దూరం నుంచి ఆశ్చర్యంగా చూస్తున్నట్టు ఉండేది.

ఆమె ఆచిన్న ఉళ్ళో మగవాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడేది.ఆరోజుల్లో అలాంటి పల్లెల్లో పరాయి మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎదురు పడేవారు కూడా కాదు.కాని ఆమె అక్కడ మగవాళ్ళకి పెద్ద ఆకర్షణ కేంద్రం .ఆ విషయం ఆమెకు తెలిసి నట్టే వుండేది.

         ఆవూళ్ళో ఆమె గురించి చాలా  విన్నాను. వినకపోతే ఆశ్చర్యం.ఎవరెవరితోనో ఆమెకు సంబంధాలు ఉండేవని వూరంతా గుసగుసలాడేది. కాని ఆమె లేక్కచేసేది కాదు,సరికదా భయపడేది కూడా కాదు.సంసార జీవితం అధ్వాన్నం గా వుండేది.మొగుడిచేత చావు దెబ్బలు మాత్రం తింటూ వుండేది.బహుశా ఆమె ఆ బంధానికి ఇచ్చిన గౌరవం అదేనేమో.
చలం పుస్తకాలు అప్పటికి కొద్దిగా చదివి వున్నానేమో ఇదంతా నాకు ఫాసినేటింగ్ గా వుండేది.ఆమెది స్వేచ్ఛాలేక  విచ్చలవిడి తనమో తెలిసేదికాదు.కానీ ఆమెని అందరి లాగ తప్పుపట్ట బుద్ధి అయ్యేది కాదు .

          ఎన్నో ఏళ్ళ తర్వాత,, ఎంతో చదువుకుని, ఎంతో కొంత జీవితం చూసాక, మళ్ళీ ఈ మధ్య ఆ ఊరు వెళ్ళాను.ఇప్పుడు అక్కడ మా అమ్మమ్మ గానీ  ఆ తరం స్త్రీలు గానీ లేరు.ఊరు మారింది.ఎంకి నాయుడు బావ ల ఏరు ఎండిపోయింది.చింత తోపు అలానే వుంది.నేనూ వెళ్ళిన మర్నాడు మా మావయ్య కూతుర్ని అడిగాను ఆమె గురించి.ఇంతకాలంగా ఆమె నా స్మృతి లో చెరగలేదు,
ఆవిడ ఎక్కడికి వెడుతుండీ?ఈ వూళ్ళోనేవుంది,కానీపూర్వం మనిషి కాదుసుమా యెంత మారిపోయిందో!అంది. నాకోరిక మీద వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళింది కూడా.

          వాళ్లకి పెద్ద పెద్ద అరుగుల దేవిడీ లాంటి ఇల్లువుండేది,అది మాయం అయి దాని స్థానం లో చిన్న పూరిల్లు,చుట్టూ మామిడి చెట్లు తోటలాగ .లోపల అరుగు మీద ఎవరెవరో వున్నారు.అమె పెద్దదయింది.అప్పటి అందం అంతా పోయింది.వయసు డెబ్బయ్ దాటి వుంటుంది.ఆ అరుగు మీద గోనెగుడ్డ పరిచి కత్తితో మామిడి కాయలు ఆవకాయకి ముక్కలు కొడుతోంది,కత్తి మంచి పదును మీద వుంది,ఒక్కొక్క దెబ్బ కే  కాయ రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది ముక్కలవుతోంది .నిజానికి ఇది మగవాళ్ళు చెయ్యగలిగిన పని.ఇంటి చుట్టూ వున్న మొక్కలు, పాదులు ఆమె కాయ కష్టాన్ని చెప్తున్నాయి.నీటి  ఎద్దడి వున్నవూరు.

             ఆమె వయసు వల్ల వడలలేదు.బాధల వల్ల బడలి నట్టు లేదు.ఓపికగా, స్తిమితంగా వుంది.ఇలా వూళ్ళో వాళ్ళందరికీ కావలసిన పనులు చేసి పెడుతుండట.మమ్మల్ని చూసి హాయిగా నవ్వింది.అ పని అయాక లేచి గంగాబొండాం కొట్టి నీళ్ళు ఇచ్చింది.క్రమంగా కాసేపటికి ఆమెలో నాకు  మునుపటి కంటే ఎక్కువ అందం కనిపించడం మొదలైంది.

          ఇన్ని సంవత్సరాల ప్రయాణం లో ఆమె స్వేఛ్చ సేవ గాను, ఆకర్షణ ప్రేమ గాను మారడం గుర్తుపట్టాను,గుర్తు పట్టగల శక్తి ఇన్నేళ్ళ ప్రయాణం నాకూ ఇవ్వబట్టి.!!
ఒంటరి గా ఆ అడవి ఉళ్ళో పేదరికానికి గానీ, అనారోగ్యాలకి గానీ ,ఒంటరితనానికి గానీ భయపడ కుండా, జీవితానికి పని లోనూ,సేవ లోనూ అర్ధం కల్పించు కుంటూ బతకగలిగే స్వేచ్ఛని ఆమె ఎలా సంపాదించ గలిగిందీఅని ఆలోచించాను.

         ఒకప్పటి ఆమె విశృంఖలత ఆమెలోని నిష్కపటం లేదా నిజాయితీ కారణంగా ఇటువంటి  స్వేఛ్చ లోకి పరిణామం చెందిందని అర్ధమైంది.మనం ఎన్నుకున్న దారయినా ,మనకి నిర్ణయించ బడ్డ దారైనా, ఏ దారిన నడిచినా ,ఏ దారిని మీరినా నిబద్ధత ,నిజాయితీ అన్నవి వదలక పొతే అవి మనని సరి అయిన  గమ్యానికే చేరుస్తాయని మరోసారి రుజువు అయిన్దనిపించింది.
చలం గారు చెప్పిన స్వేఛ్చ మరీ మరీ ఆలోచించుకోవలసినదనీ,అవగాహన చేసుకోవలసినదనీ మరో సారి అర్ధమైంది.*

–  వాడ్రేవు వీరలక్ష్మీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, Permalink

One Response to మళ్ళీ మాట్లాడుకుందాం…

  1. bhasker.koorapati says:

    చాలా సరళంగా, సూటిగా మనసుకు హత్తుకునేలా రాసారు. ప్రతి నెలా విడవకుండా చదువుతున్నాను. రచయిత్రి గారికి అభినందనలు.