తెలుగు నాడును నవల ఏలినంతగా మరే ఇతర సాహిత్య ప్రక్రియ ఏలలేదంటే అది అతిశయోక్తి కాదు. కారణం నవల నేలలో పుట్టి నేలను విడువని ప్రక్రియ. మనిషి జీవితానికి సామాజిక స్థితికి అతి చేరువలో ఉన్న ప్రక్రియ నవల మాత్రమే. నవల ఆవిర్భావానికి సామాజిక పరిస్థితులే కారణం.
అది సమాజము లోంచి పుట్టి సమాజానికి పట్టం కట్టింది.నవల రాయడానికి పాండిత్యం అక్కర్లేదు. సామాజిక స్థితిగతులను చూసి స్పందించగల హృదయం ఉంటే చాలును. ఇంగ్లీషులో తొలి నవల రాబిన్ సన్ క్రూసో. వ్రాసిన నవలా రచయిత డెఫో పండితుడూ కాదు, రచయితా కాదు. ఒక సామాన్య వ్యాపారి. అలాగే తెలుగులో తొలినవల “శ్రీ రంగరాజ చరిత్ర” రాసిన నరహరి గోపాల క్రిష్ణమశెట్టి గారు కూడా తెలుగులో పండితులు కారు. సామాజిక స్థితిగతులను రచన ద్వారా తెలుపవలెనన్న ఆతురత అటు డెఫోకి ఇటు శెట్టికీ ఉన్న సమాన లక్షణం. చెట్టి గారి వచన రచన జటిలం అన్న విషయాన్నీ, “శ్రీ రంగరాజ చరిత్ర” తొలి తెలుగు నవల అవునా కాదా అన్న విషయం జోలికి పోకుండా రచనోద్దేశం గమనిస్తే ప్రగతిశీలత ప్రధానం అన్నది సుస్పష్టం.
సామాజిక స్పృహ అనేసరికి ఉలిక్కిపడి భయపడే పాఠకులే కాదు.రచయితలూ ఈ నాటికీ ఉన్నా- నవలా రచనకు సామాజిక స్పృహ ప్రధానావసరం అని ఎప్పుడో తేలిపోయిన అంశం.
19 70 దశకం నవలా రచనకు చైతన్య దశకం అని పేరొచ్చింది. కారణం రాజకీయాలు స్వాతంత్ర్యం వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్న స్పృహ జనంలో వ్యాప్తి చెందింది. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమై యువతరాన్ని ఉర్రూతలూగించింది. 1964-65 ప్రాంతాలలో ప్రముఖ దినపత్రికలు వ్రాసిన సంపాదకీయాలు కూడా యువతను ఆలోచింపజేశాయి.హిందు ఆ రోజుల్లో సంపాదకీయం లో వ్రాసిన ఒక వాక్యం ఆలోచనా పరులను కుదిపి పారేసింది.
“The paupers of 1947 have become multi millionaires of India Today”
సమాజంలో వచ్చిన ఈ చైతన్యం నవలా రంగం లోనూ కనిపించింది. ఫలితంగా దాశరథి రంగాచార్య “చిల్లర దేవుళ్ళు”, “మోదుగుపూలు”,”జనపదం” రాశారు.
అదేక్రమంలో వాసిరెడ్డి సీతాదేవి రాజకీయాల్లో ఉన్న కుళ్ళును చిత్రిస్తూ “సమత” రాశారు. వారి “మట్టిమనిషి: ప్రజల భాషలో సజీవపాత్ర చిత్రణతో రాసిన సజీవ నవల.ఇది భారతీయ భాషలన్నింటిలోకీ అనువదితమైన నవల. సీతాదేవి”మరీచిక” నక్సలైట్ ఉద్యమాన్ని చిత్రించిన నవల.
ఈ నవల 1979 లోనే వచ్చినా 1982 ఏప్రిల్ ఒకటిన గెజిట్ లో’మరీచిక’ నవలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.
ఈ దశకంలోనే వర్గ సంఘర్షణలను పోరాటాలను చిత్రిస్తూ చాలా నవలను వచ్చాయి. భూస్వాముల అన్యాయాలకు, దోపిడీకి గురవుతున్న వ్యవసాయకూలీలను,హూస్వామ్య వ్యవస్థ క్రింద నలిగిపోతూన్న దురవ్స్థలు వర్ణించే నవలలు వస్తూ ఉన్న క్రమంలోనే వసిరెడి సీతాదేవి గారి ’రాబందులు-రామచిలుకలూ’ వెలువడినది.
సీతాదేవి రచనలలో సామాజిక స్పృహ పుష్కలంగా ఉందనడానికి ఈ పై ఉదహరించిన నవలలు చాలు.
’కేవలం పాండిత్యం వలననే ఉత్తమ రచనలు రావు. రచయిత నేటి సమాజములోకి చొచ్చుకుపోయి చూస్తేనేగాని క్రుతక్రుత్యుడు కాలేడు.సుంకర సత్యనారాయణ సామాజిక స్పృహ లేనిదే రచన విజయవంతం కాలేదనే ఆ మాటలకు అర్ధం.
వాసిరెడ్డి సీతాదేవి గారు నవలా రచయిత్రి గా కథారచయిత్రిగా సమసమాజములోకి చొచ్చుకుపోయి రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన వారు.
ఆమె అన్ని నవలల్నీ కథల్నీ పట్టుకుని చెప్పడం ఒక వ్యాసానికి సాధ్యం కాదు. కారణం సుమారు నలభై నవలలూ,ఆరు కథా సంపుటాలను ఆమె వివిధాంశాలమీద వెలువరించారు. 1971-72 సంవత్సరాలలో వెలువడిన ’సమత’ సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన నవలలోని సామాజిక,రాజకీయాల్ను పరిశీలిద్దాం.
సమత లోని నాయిక అరుంధతి. అపురూప సౌందర్యవతి. ఆ అందం తోనే ఆమె విప్లవ కారుడు రాజారావు మనసు చెదరగొట్టి అతడిలోని నీతిని చంపి,స్వార్ధపరుడిగా పిరికివాడుగా మారుస్తుంది. విప్లవకారుడైన రాజారావు వ్యక్తిత్వం,అతడి ఆదర్శాలు, వీరత్వంతో అరుంధతి ముగ్ధురాలౌతుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరికి గల ప్రేమ,ఆకర్షణ,లైంగికాసక్తి కారణం గా వారి వారి ధర్మాలను త్యజించి భ్రష్టులై ఒకటౌతారు. భర్తను బిడ్డను వదిలి రాజారావును చేరిన అరుంధతి అతడి ఉంపుడు కత్తెగా మారుతుంది. రాజారావు విప్లవానికి నీళ్ళొదిలి అధికార పార్టీలో చేరి డబ్బు-హోదా-పేరు-ప్రతిష్టలతో వెలుగుతూ ఉంటాడు. ఇంటినీ,భర్తనీ,బిడ్డనీ వదిలి తాను ఏంపొందిందీ, ఎంత సుఖపడిందీ తెలుసుకుంటుంది అరుంధతి. కానీ సమయం మించిపోయింది.లేచిపోయిన దాని బిడ్దగా ముద్రపడిన అరుంధతి బిడ్డ మాధవి పెళ్ళి కాకుండా, ప్రేమలో మోసగింపబడి , బిడ్డకి తల్లై ఆత్మహత్య చేసుకుంటుంది. అంతటా ఓడిపోయిన అరుంధతి తన శేష జీవితం తన మనవరాలు ’సమత’తో గడపాలని గుంటూరు ఆసుపత్రికి వెళ్ళి, అక్కడ ఆసుపత్రి సిబ్బందికీ పోలీసులకూ జరుగుతున్న ఘర్షణలో పాల్గొని దిక్కులేని చావు చస్తుంది అరుంధతి.
కాపురాన్ని ఇంటినీ వదిలిన స్త్రీకి సమాజము ఇచ్చే గౌరవం ఎటువంటిదీ చెపుతుంది ఈ నవల.’సమత’ను సాధించే మార్గం చెప్పలేక పోవడం వైఫల్యమే అయినా, సామాజిక స్పృహ ను మెచ్చుకోకుండా ఉండలేం. ట్రీట్ మెంట్ విషయానికి వస్తే ’అడవిమల్లె’, ’తిరస్కృతి’ నవలలు సీతాదేవి గారికి పేరు తెచ్చిపెట్టిన నవలలు.
సరే,’మరీచిక నవలా గొప్పదనం నవలా ప్రియిలందరకూ అనుభవైకవేద్యమే. సామాజిక ప్రయోజనాన్నీ, సమకాలీన సమాజాన్ని తీర్చి దిద్దాలన్న ఆర్తితో వ్రాసిన నవల ’మరీచిక’.
నాటి యువత రెండు చీలికలై- ఒక చీలిక కక్షచ్యుతులై, మరొక చీలిక లక్షదృతిలో తెంపరితనంతో తన బలిమి,ఎదురి బలిమినీ అంచనా వేసుకోలేక మిడతల్లా మంటల్లో పడి మాడిపోతున్న యువతీ యువకుల్ని ’కళ్ళు తెరవండి’ అని హెచ్చరిస్తూ చాలా సమర్ధవంతంగా హెచ్చరించబోయారు.
1982 లో ప్రభుత్వం ఈ నవలను నిషేధించి ఆమెకూ నవలకూ ఉపకారమే చేసింది అనాలి. మరెంతో మంది పాఠకులు పెరిగారు ఆ నవలకు. నిషేధం మీద వచ్చిన ఖండన మండనల పర్వం చాలా పెద్దది. ’యువజనులలో వ్యాపిస్తున్న నిరుత్సాహ నిర్వేదాలు వారి దృష్టికి తెచ్చి, హెచ్చరించడం చెయ్యకూడని పనా?’ అంటూ ప్రముఖ అభ్యుదయ రచయితలు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఫలితం నిషేధం తొలగింపు! రచనా స్వేచ్చాప్రియులకు మేని పులకరింపు!!
ఇంతటి సంచలనాన్ని కలంకారీతో సృష్టించగలిగిన రచయిత్రి మరొకరు ఈ మధ్య కాలం లో లేరు.
నవలా రచయిత ధ్యేయం కథ చెప్పడం గానీ మనల్ని ఆనంద పరవశుల్ని చెయ్యడం గానీ కానే కాదు. అజ్ఞానంగా దాగి ఉన్న సంఘటనల ప్రాధాన్యతను మనం అర్థం చేసుకుని ఆలోచించేటట్లు అతను చెయ్యగలగాలి!’- మొ.పా.సా.
’నవలకు వాతావరణం సంఘం!’- కొడవటిగంటి కుటుంబరావు
ఆ పట్టాల మధ్యనే తన నడకను సాగించి సాఫల్యతనొందిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి!
-స్వస్తి-
- మహీధర రామ శాస్త్రి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~