మళ్ళీ మాట్లాడుకుందాం

ఒకనాటి సాయంతం రాత్రిలోకి జారుతున్న వేళ మిత్రురాలు అమలేందు ఫోన్ చేసింది.  నాకు ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం, గౌరవం కూడా.  ఆమె ‘వట్టిమాటలు కట్టి పెట్టి – గట్టి మేలు” కోసం తన కాలమంతటినీ ధార పోస్తున్న వ్యక్తి.  ఆ రాత్రి దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం.  నిజానికి ఎక్కువగా విన్నాను.  తన అనుభవాలు ఎంతో విస్తృతమైనవి.         మాటల మధ్యలో నేను ఈ మధ్య చేసిన నా కలకత్తా ప్రయాణం గురించి చెప్తూ కలకత్తా చుట్టూ ఉండే పల్లెలు చూడాలని ఉంటుంది నాకు అన్నాను. ” చూసారా ?” అని అడిగింది ఆమె. ” అంత వీలు కుదరలేదు  కానీ బెంగాలీ రచయితలు ముఖ్యంగా శరత్, టాగోర్ల రచనలలో ఆ పల్లెటూళ్ళ ను  చూసాం కదా ! ఆ ఉహా మనసులో రూపుకట్టి  ఉంటుంది.  అందుకని మనం చదివి ఉహించుకున్న ఆ లోకాలు చూడాలని ఎంతగానో అనిపించింది” అన్నాను.

ఆమె ‘నేను పశ్చిమ బెంగాల్ లోని కొన్ని పల్లెల్ని చూసాను’ అంది. ఎలా ఉంటాయి అన్నాను నేను కుతూహలంగా.  ఆమె ఇలా చెప్పింది ఆ పల్లెల్లో పూరిళ్ళు గాని, పెంకుటిళ్ళు గాని ఉంటాయి.  ప్రతి ఇంటి వెనక ఒక చెరువు ఉంటుంది.  ఒక రకంగా ఇంటి పెరటి మెట్లు ఆ చెరువులోకి ఉంటాయి.  ఇంటికి కావలసిన వాడకం నీరు, మంచి నీరు  ఆ చేరువులోదే.  చెరువు దగ్గరే కూరగాయల మొక్కలు.  వాటికీ ఆ నీరే.  ఆ చెరువులో చేపలుంటాయి.అవే వండుకుంటారు.  తామర పూలు కూడా ఉంటాయి.  ఇక ఆ ఇంటి ఆడవాళ్ళకి జీవిత మంతా ఇంటి పెరటిలోను ఇంట్లోనే గడిచిపోతుంది.  ఇది చూసినప్పుడు ఆ ఆడవాళ్ళ పరిస్థితికి నాకు ఉపిరాడలేదు’ అంది.

‘అదేం! అంతా సౌకర్యమే కదా! కష్టం లేదు కదా’ అన్నాను. ‘కష్టం విషయం కాదు ఇక ఆ ఇళ్ళలో ఆడవాళ్లకు ప్రపంచంతో సంబంధం లేదు.  ఊరు విడిచి బయటికి వెళ్ళరు. జీవితమంతా అక్కడే గడిచిపోతుంది. అది తలచుకుంటే నాకు ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది.  ఏం జీవితాలు ఈ ఆడవాళ్లవి అని’ అంది.
             నిజమే నేను అలా ఆలోచించలేకపోయాను.  ‘కలకత్తాకు దగ్గరలో’ అనే నవలలో నిజానికి ఇలాంటి స్త్రీల జీవితమే ఉంటుంది.  ఏళ్ల తరబడి పాడుబడిన ఇల్లు, ఆ ఇంటి వెనక జీబురుమంటూ ఉండే దట్టమైన వెదురు పొద,  కటిక పేదరికమూను .  అలాగే వాళ్ళు ముసలి వాళ్లయిపోతారు.  కనీసం రైలు అయినా చూడకుండా.

ఇప్పటికీ ఆ పల్లెలు పెద్దగా మారి ఉండవు.  ఎందుకంటే కలకత్తా నగరంలోనే పాతదనంతో పాటు ఎంతో వెనుకబాటుతనం  కుడా ఉంది. ఇక పల్లెల సంగతి చెప్పాలా ?

ఇది ఇలా చెప్పుకుంటుంటే నాకు మా ఇంటి సంగతే గుర్తొచ్చింది.  మా ఊరు కూడా కొండల మధ్య  పల్లెటూరు.  రోజుకి అయిదారు సార్లు మాత్రమే అటు ఇటు తిరిగే బస్సు లు  తప్పితే మరో చప్పుడే వుండేది కాదు.  మా అమ్మ జీవితమంతా అక్కడే గడిచింది.  మమ్మల్ని పది మందిని కన్నది, సాకింది కూడాఅక్కడే .  అందరమూ చదువూ  ఉద్యోగాలని ఊరు వదిలి వచ్చేసాం.

        ఆమె డెబ్బయి ఏళ్ళకి చేరువవుతూ ఉండగా జబ్బు పడింది.  తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో చేర్చి వైద్యం చేయించాం.  నయమయి బయటికొచ్చి మందులు వాడుతూ ఉండేది.  అది సరిపోయేది కాదు వాకింగ్ చెయ్యాలనేవారు డాక్టర్.  ఆ మాట పట్టుకుని మేమంతా  ఆవిడని ఊదర గొట్టేసేవాళ్ళం” నడు, నడు” అని.

             అప్పుడు మా మేనత్తతో ఆవిడ ఒక మాట అంది. ‘ఇప్పుడు ఇలా వాకింగ్ వాకింగ్ అంటున్నారు.  ఒక్కసారిగా ఇప్పుడు నడవాలంటే ఎలా వస్తుంది.  ఇన్నేళ్ళుగా మన  ఊళ్లో మనని ఇల్లు వదిలి ఎక్కడికయినా వెళ్ళనిచ్చారా ?  మనకి నడక అన్నదే తెలీదు కదా !  ఎంతకీ వంచిన నడుం ఎత్తకుండా ఇంట్లో పనులు చేసుకోవడం తప్ప.  నేను నడవ లేక పోతున్నాను సీతమ్మా-‘ అని .

                           నాకు ఆ మాట మొహం మీద కొట్టినట్టయింది.  ఎంత సత్యం చెప్పింది ఈవిడ అని.  ఆ మాట గుర్తొచ్చినప్పడల్లా ఎంతో దు:ఖం  గా ఉంటుంది.

మనం అందరం ఇప్పుడు ఆ పల్లెల నుంచి చాలా దూరం వచ్చాం.
      ఆరోగ్యం కోసం నడిచే నడక మాని ఆరాటంతో  పరుగులు పెడుతున్నామేమో ! కాస్త ఆలోచిద్దామా ?*

                                                                                                                          – వాడ్రేవు వీరలక్ష్మీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

UncategorizedPermalink

Comments are closed.