నా జీవన యానంలో…


6 . నా టీచర్స్- స్నేహితులు

– కె.వరలక్ష్మి

 

స్కూల్లో నాకు బాగ్యం అని పిలవబడే కూచి సౌభాగ్య లక్ష్మి మొదటి రోజే స్నేహితురాలైంది. తను వెంకన్న పంతులు గారి మనవరాలు. తను సహజంగానే  అపస్వరాలు లేకుండా చక్కగా మాట్లాడేది.నా మాటలు కొన్నింటికి ” అలా మాట్లాడుతున్నావేమిటి” అని నవ్వేది. నేను నాలాగా మాట్లాడటం బాగాలేదనిపించేది. త్వరలోనే నాకు తన స్లాంగ్ వచ్చేసింది. నాన్నని ’నువ్వు’ అనడం మానేసి ’మీరు’అనడం ప్రారంభించేను.

ఒకటవ తరగతిలో నేను అక్షరాలు దిద్ది నేర్చుకోలేదు. అలా దిద్దడం చాలా విసుగ్గా ఉండేది. టీచర్

రాసిచ్చిన అక్షరాల్ని చూస్తూ పలకకు రెండు వైపులా రాసేసేదాన్ని. పూర్తిగా రాయడం వచ్చేవరకు

అలాగే చేసేదాన్ని.

బోర్డు మీద అక్షరాలు, గుణింతాలు రోజూ వల్లె వేయించేవారు. వాటిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని చూడకుండా రాసేసేదాన్ని.

అంకెలూ అంతే.

ఒకటవ తరగతి టీచర్ కాంతమ్మగారే మాతోబాటు రెండవ తరగతికి మారారు. ఆవిడ తెల్లగా ఉంటారని అందరూ తెల్లమ్మ గారు అనేవారు. ఆవిడ చదువూ ఆగా చెప్పేవారు. పిల్లల్ని కొట్టకుండా చూసేవారు. రోజూ ఇంటర్వెల్ లో మాత్రం మంచినీళ్ళ చెరువవతల కొత్త మాలపల్లిలో ఉన్న వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మాయికిచ్చి రమ్మని ఏవో తినుబండారాలు ఇచ్చి మమ్మల్ని నలుగుర్నో అయిదుగుర్నో పంపేవారు. అలా తరచుగా నేనూ వెళ్ళేదాన్ని. ఆ అమ్మాయి బహుశా హై స్కూల్లో ఏ పదో తరగతో చదువుతుండేదనుకుంటాను. ఆ అమ్మాయిని ’అక్కయ్యగారూ’ అని పిలిచేవాళ్ళం. ప్రస్తుతం ఆ అక్కయ్య, వాళ్ళాయనా టీచర్స్ గా రిటైరై ఈ ఊళ్ళోనే స్థిరపడ్డారు.

అక్షరాలు గుండ్రంగా రాయాలని కాంతమ్మ గారు పదేపదే చెప్పేవారు. నేను డిక్టేషన్ తప్పులు లేకుండా రాసేదాన్నని నన్ను ప్రత్యేకంగా చూసేవారు. ఒకరోజు కొత్తగా వచ్చిన ఒకబ్బాయి చేతిరాతను మెచ్చుకున్నారావిడ. నేను పట్టుదలగా ఆ అబ్బాయికన్నా బాగా రాయడం నేర్చుకున్నాను ఆవిడ మెప్పుకోసం.

రెండో తరగతి మరో డివిజన్ కి కళ్ళజోడు పంతులమ్మగారు టీచర్. ఆవిడెప్పుడూ కోపంగా ఉండేవారు. ఆవిడ రిటైరై చాలా ఏళ్ళైంది. ఆవిడ తోటి వాళ్ళందరూ గతించారు. ఆవిడ మాత్రం ఇంకా పెన్షన్ అందుకుంటూ కోనేటి పక్కన కట్టుకున్న సొంత ఇంట్లో ఉన్నారు.

అప్పుడప్పుడు మా టీచర్ సెలవు పెడితే మమ్మల్ని ఆ క్లాసుకి పంపించేవారు. ఆవిడ పిల్లల్ని ఇంట్లోంచి కారం,చింతపండు లాంటివి తెచ్చి తనకిమ్మని ప్రోత్సహించేది. ఆవిడ క్లాసులో చదివిన మా పక్క వీథి లక్ష్మి, వాళ్ళ తమ్ముడూ క్రిష్ణ  ఇంట్లోంచి దొరికినవన్నీ పట్టుకెళ్ళి ఆవిడకిచ్చేసేవారట. ఆ కారణం గా లక్ష్మి ని రెండో  తరగతిలో చదువు మాన్పించేసారు. క్రిష్ణ మాత్రం ఇంట్లో డబ్బులు, అటక మీద ఇత్తడి సామాగ్రి నుంచి క్రమంగా ఎదిగి దొంగగా ముద్ర వేయించుకుని బోస్టన్ స్కూలుకు కూడా పంపబడ్డాడు.

భాగ్యం నవ్వడం నుంచి నేను ఉచ్చారణ నేర్చుకున్నాను కానీ నాలాగా మాట్లాని వాళ్ళని చూసి నేనెప్పుడూ నవ్వలేదు అసహ్యించుకోలేదు.ఎవరి యాస,భాష వాళ్ళవి. నవ్వితే వాళ్ళూ నాలాగే నొచ్చుకుంటారేమోనని భయపడేదాన్ని.

మూడవతరగతిలో అప్పన్న మాస్టరుగారు మా క్లాసు టీచర్. ఆయన చాలా వరకూ క్లాసులో నిద్రపోతుండేవారు. పాతకాలపు మండువాలోగిలి అప్పటి మా స్కూలు. గదుల్లోను,మండువాలోను క్లాసులే. అంతమంది పిల్లల గందరగోళంలో ఆయనకెలా నిద్ర పట్టేదో మరి.

ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం పాఠాలు బుద్థి గా చదువుకునేదాన్ని. ఇంట్లో చెప్పేవాళ్లెవరూ ఉండేవారు కారు. మా నాన్నమ్మకీ, అమ్మకీ అక్షరాలే తెలీవు. మా నాన్న ఎపుడూ బ్రతుకుపోరాటంలో తిరుగుతూ ఉండేవారు.అందుకని బాగా చదివే స్టూడెంట్స్ భాగ్యం, బేబీ లాంటి వాళ్ళింటికెళ్ళి చదువుకునేదాన్ని.

1957 లో నేను నాలుగో  తరగతిలో ఉన్నాను. అప్పుడే తేదీ వెయ్యడం నేర్చుకున్నాను. స్కూల్లో కల్లా నాలుగోతరగతి మావిడాడ మాస్టారంటే పిల్లలకి సింహ స్వప్నం. స్కూల్లో ఒకేఒక బ్రాహ్మణ పంతులు ఆయనే. చాలా బాగా చదువు చెప్తారని పేరుండేది. ఆయన దగ్గర చింతబరికె ఒకటుండేది. దాన్ని ఝళిపిస్తూ పాఠం చెప్పేవాడాయన. రోజూ సాయంకాలం ఎక్కాలు వల్లె వేయించేవారు. చదువులోకెల్లా ఎక్కాలు, ముఖ్యంగా ఏడవ, తొమ్మిదవ ఎక్కాలు చాలా భయంకరం గా కన్పించేవి. దాంతో ఆ మాస్టారంటే కూడా భయం పట్టుకుంది. ఒక్కసారి తొమ్మిదో ఎక్కం చెప్పలేకపోయినందుకు అరచెయ్యి చూపమని బెత్తంతో చాచి ఒక్కటేసాడాయన. అంతే నా చెయి మీద తట్టు తేలిపోయింది. ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళాను. ఆ రాత్రికి పొంగుకుంటూ జ్వరం వచ్చేసింది. 

మర్నాడు మా నాన్న వెళ్ళి ఆ మాస్టారితో గొడవ పెట్టుకున్నారట. తర్వాత క్లాసులో ఆయన నాకు నచ్చజెప్పారు.” మేమేం చేసినా మీ మేలు కోసమే” అని.

ఆ తర్వాత నుంచి రోజూ బేబీ వాళ్ళింటికెళ్ళి లెక్కలు చేసుకుని ఎక్కాలు చదువుకుని ఇంటికెళ్ళేదాన్ని. బేబీ హెడ్ కానిస్టేబుల్ గారమ్మాయి. క్లాసులోకల్లా నీట్ గా, మంచి మోడ్రన్ ఫ్రాక్స్ వేసుకుని చక్కగా రెండు జడలు పైకి మడిచి కట్టుకుని వచ్చేది. సంతవీథిలో రాజమ్మతల్లి గుడిముందు ఎత్తరుగుల ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. కాకపోతే, రోడ్డు ఎత్తు పెరిగిపోయి అరుగులు నేలబారుకైపోయాయి. బేబీకి హై స్కూల్లో చదివే అందమైన ఓ అక్క ఉండేది. తను అప్పుడప్పుడు మా ఇద్దరికీ లెక్కలు చెప్పేది. నేనూ పెద్దయ్యాక అలా ఉండాలన్పించేది. ఇప్పటికీ ఎన్నో సార్లు ఆ బేబీ వాళ్ళక్కా గుర్తుకొస్తుంటారు. మేమింకా హై స్కూలుకు వెళ్ళకుండానే వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ ఫరై ఈ ఊరినుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాతెప్పుడూ తనని నేను చూడనేలేదు. అంత హడలుకొట్టిన మావిడాడ మాస్టారు రిటైరైన చాన్నాళ్ళకి మనిషి వార్థక్యంతో లొంగిపోయి జగ్గం పేట వచ్చారు. నేను నడుపుతున్న స్కూల్లో టీచర్ గా పని చేస్తానని అడిగారు. ఆడవాళ్ళను మాత్రమే టీచర్స్ గా తీసుకునే నా నియమం వల్ల ఆయనకి ఉద్యోగం ఇవ్వలేకపోయి చాలా బాధపడ్డాను. కొంతపైకం ఆయన చేతుల్లో పెట్టి కాళ్ళకి నమస్కరించేను.*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
6 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Vanaja Tatineni
8 years ago

ఆసక్తిగా ఉంది. చాలా చక్కగా వ్యక్తీకరిస్తున్నారు.

రాణి
రాణి
8 years ago

వరలక్ష్మి గారూ, మీ జీవిత చరిత్ర చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.

nirmala kondepudi
nirmala kondepudi
8 years ago

వరలక్ష్మి ,
చాలా చాలా ఆసక్తి గా వుంది.

కొండేపూడి నిర్మల

Uma
Uma
8 years ago

కథనం చాలా బావుంది. ఇంత చక్కగా జీవిత కథ తెలుపుతున్నందుకు ధన్యవాదాలు.

Surfizenn
Surfizenn
8 years ago

ఈ వ్యాసం చాలా బావుంది.

రచయిత్రిగారి సృజనాత్మక స్వేచ్ఛని అడ్డుకోకూడదు గానీ రమణ కుమార్ గారన్నట్లు కాస్త తెలుగు పదప్రయోగాలు ఎక్కువగా ఉండేలా వ్రాయగలిగితే ఇంకా బావుండేది.

రమణ కుమార్
రమణ కుమార్
8 years ago

టీచర్స్ , స్లాంగ్ , ఇంటర్వెల్ , హై స్కూల్లో, రిటైరై , టీచర్స్ , డిక్టేషన్ , డివిజన్ , పెన్షన్ , క్లాసులో , బోస్టన్ స్కూలు , మాస్టరుగారు , క్లాసు టీచర్ ,
క్లాసులే , స్టూడెంట్స్ , హెడ్ కానిస్టేబుల్ , బేబీ , నీట్ గా, మోడ్రన్ ఫ్రాక్స్ , రోడ్డు , ట్రాన్స్ ఫరై
ఇవన్నీ మీకు తెలియకుండానే మీ రాతలోకి చొచ్చుకుని వచ్చేసాయి. ఎందుకిలా జరిగింది ? దీనిని కనీసం మీలాంటి ఉత్తమ స్థాయి రచయిత్రులైనా అడ్డుకోలేరా ? ఇందులో కనీసం తొంభై శాతం ఆంగ్ల పదాలకి బదులుగా తెలుగు పదాలు వాడి ఉండవచ్చును కదా ?
ఇది విమర్శించడం కోసం రాయలేదు.
తెలుగులోకి సంస్కృతం, ఉర్దూ, పార్సీ మొదలైన ఎన్నో భాషలు వచ్చి చేరగా లేనిది ఇప్పుడీ కాసిని ఆంగ్ల పదాలూ చేరినంత మాత్రాన పోయిందేమిటీ అనుకోకండి. ఎందుకంటే, మన ప్రభుత్వాల అలసత్వం, వ్యాపార విద్యా సంస్థల వికృత విలయ తాండవం, ఆంగ్లం నేర్చుకోకపోతే తమ పిల్లలు ప్రపంచ పౌరులుగా తయారవ్వడంలో వెనుకబడిపోతారేమో అనే తల్లిదండ్రుల అమాయకత్వం ఇవన్నీ కలిసి తెలుగుని ఆంగ్లంలో కలిసిపోఎలా చేస్తున్నాయి.
తెలుగులోకి మసాలా దినుసుల్లా ఇతర భాషా పదాలు వచ్చి చేరడానికీ, తెలుగు భాషని మన తెలుగువాళ్ళే ఆంగ్ల భాషలో నిమజ్జనం చెయ్యడానికీ ఎంత తేడా ఉందో మీకు తెలియదని కాదు. కేవలం గుర్తు చేద్దామని ఇలా రాసాను. అంతే.