భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

   బ్రిటీష్‌ సైనిక తుపాకులకు ఎదురొడ్డి నిలచిన వీరవనిత    బేగం అజీజున్‌ 1832-1857

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో రాజులు, రాణులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  ఈ వర్గాలు తమ రాజ్యాలను, సంస్థానాలను కాపాడుకోవాలని, అధికారాన్ని చేజారనివ్వరాదన్న బలమైన కోరికతో బ్రిటీష్‌ పాలకుల విూద తిరుగుబాటు చేశారు.  ఈ రకమైన కాంక్షలేవీ లేకుండా కేవలం మాతృభూమి విూదగల ప్రేమాభిమానాలతో ప్రాణాలను తృణప్రాయంగా భావించి, నిస్వార్థంగా తిరుగుబాటులో పాల్గొని ప్రాణాలను బలిచ్చిన సామాన్యులు ఉన్నారు. అటువంటి సాధారణ మహిళలలో ఒకరు బేగం అజీజున్‌.
    1832లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బితూర్‌లో బేగం అజీజున్‌ జన్మించారు. తండ్రి హసీనా ఖాన్‌. తల్లి హవిూదా బాను.  చిన్ననాటనే ఆమె అమ్మను కోల్పోయారు. అజీజున్‌ మంచి రూపసి .  అందాలరాశి అజీజున్‌ ఆనాటి ప్రసిద్ధ నర్తకి ఉమరావ్‌జాన్‌ బృందంలో చేరారు. మంచి నర్తకిగా ఖ్యాతిగాంచారు. నాట్య కళ విూద మంచి అభినివేశాన్ని సాధించి ఆ కళను ప్రదర్శిస్తూ అపారంగా ధనాన్ని సంపాదించారు.
పరాయి పాలకులైన ఆంగ్లేయులంటే ఆమెకు విపరీతమైన ద్వేషం. బ్రిటీషు సైన్యంలో  సుబేదారుగా పనిచేస్తూన్న షంషుద్దీన్‌ అను సాహసి ఆమెను ప్రేమించాడు. ఆయన బ్రిటీషు సైన్యం నుండి తొలిగి ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు నానా సాహెబ్‌ కొలువులో చేరేంతవరకు అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు. ఆమె హృదయం షంషుద్దీన్‌ కోసం ఎంతగా తపించిపోయేదో, భారత స్వాతంత్య్రము కోసం కూడా అంతగా తపించిపోయేది. (1857 స్వరాజ్య సంగ్రామం, సావర్కార్‌, నవయుగభారతి, హైదరాబాద్‌, 2001, పేజి. 88)
    కాన్పూరు పాలకుడు నానా సాహెబ్‌ పీష్వా అంటే అజీజున్‌కు అమిత భక్తి- గౌరవం.  స్వదేశీ సంస్థానాలను అక్రమంగా ఆక్రమించుకుంటున్న కంపెనీ అధికారులంటే అసహ్యం. పరదేశీయులు సాగిస్తున్న అధర్మాన్ని,అన్యాయాన్ని ఎదుర్కొవాలని  ఆమె ప్రగాఢంగా వాంఛించారు. ఆ కోర్కె బలపడే కొద్ది, సారంగి మహల్‌ లోని సంగీత నృత్య వినోదాలను, త్యజించి, విలాస జీవితాన్ని వదిలి, నానా సాహెబ్‌ పక్షాన నిలిచి, బ్రిటీషర్ల దాష్టీకాలకు అడ్డుకట్టవేయాలని భావించారు.
    ఆ అవకాశం 1857లో ఆమెకు లభించింది. 1857 జూన్‌ 4న కాన్పూరులో తిరుగుబాటు ఆరంభమైంది. నానాసాహెబ్‌ బ్రిటీషర్ల విూద జూన్‌ 7న సమరశంఖారావం పూరించారు. హిందూ-ముస్లింలను తేడా లేకుండా ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకు కాన్పూరు ప్రజలంతా ఆయుధాలు చేపట్టాల్సిందిగా ఆయన హిందీ-ఉర్దూ భాషలలో పిలుపునిచ్చారు.  ఆ పిలుపునందుకున్న అజీజున్‌ సుకుమార, సౌకర్యవంత, సుఖమయ  జీవితాన్ని వదిలి, పరాయి పాలకుల విూద యుద్ధం చేసేందుకు  నానా సాహెబ్‌ పక్షంలో చేరారు.
    సహచరుడు షంషుద్దీన్‌ సహకారంతో అజీజున్‌  ఆయుధాలు ఉపయోగించటం, గుర్రపు స్వారి నేర్చుకున్నారు. ఆమె సైనిక దుస్తులు ధరించి రణరంగానికి సిద్ధమయ్యారు. మాతృదేశ భక్తిభావనలు గల యువతులను సవిూకరించి, ప్రత్యేక మహిళా సైనిక దళం ఏర్పాటు చేశారు.  మహిళా సైనిక దళం ఏర్పాటు చేయటమే కాకుండా, వారికి స్వయంగా చక్కని శిక్షణ గరిపి, ఎటువంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోగలిగేట్టుగా ఆ దళాలను తీర్చిదిద్దారు.  తుపాకి పేల్చటం, కత్తి తిప్పటం, గుర్రపుస్వారి చేయటంలో ప్రత్యేక శిక్షణ కల్పించి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేశారు. ప్రజల రక్షణతోపాటు, రాజ్యరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడతామని శపథాలు చేయించి, శత్రువును దునుమాడేందుకు, ఏ క్షణాన్నైనా రణరంగ ప్రవేశం చేయడానికి బలగాలను సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు మహిళా సైనిక దళాన్ని స్థాపించిన ప్రప్రథమ మహిళగా అజీజున్‌ను అభివర్ణిస్తూ, ప్రముఖ రచయిత ఆనంద స్వరూప్‌ మిశ్రా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన “Nana Saheb Peshwa and the War in Independence” అను గ్రంథంలో  పేర్కొన్నారు.
    అజీజున్‌ సమర్థవంతమైన నాయకత్వంలో మహిళా సైనిక దళాలు పలు  కార్యక్రమాల భారాన్ని స్వీకరించి నానా సాహెబ్‌ పోరాటానికి ఎంతగానో తోడ్పడ్డాయి.  ఆమె తన బలగంతో నగరంలోని ప్రతి ఇల్లూ తిరుగుతూ, ‘ విూ లాంటి యువకుల్లో రక్తం చల్లబడిపోయింది. విూలో పౌరుషం చచ్చిపోయిందా? విూ రక్తం ప్రతీకార జ్వాలతో వేడెక్కుతుందా? లేదా? మన మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మనపై పెత్తనం చలాయిస్తున్నారు. దానిని మనం మౌనంగా భరిస్తున్నాం. మన వీరత్వం, శౌర్య పరాక్రమాలు ఏమైపోయాయి?  అని ప్రశ్నిస్తూ యువకుల్లో రోషాగ్నిని ప్రజ్వరిల్లచేశారు. (అజ్ఞాత వీర గాథలు, గోవిందస్వరూప్‌ సింహాల్‌, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1999, పేజి. 30-31)
    యుద్ధ భయంతో సైన్యంలో చేర నిరాకరించిన పురుషుల చేతులకు స్వయంగా గాజులు తొడిగి, వారిలో రోషం రగిలించి తిరుగుబాటు సైనిక బలగాలను బాగా పెంచగలిగారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఆహారం, ఆయుధాలను సమకూర్చి పెట్టడం, నాయకులు, సైనికుల మధ్యన సంధానకర్తల్లా వ్యవహరించటం, బ్రిటీష్‌ సైనికుల కదలికలు గమనించి ఆ సమాచారాన్ని తిరుగుబాటు దళాల నాయకులకు చేరవేయటం తదితర బాధ్యతలను ఆమె నిర్వహించారు. దళ సభ్యులతో ఇల్లిల్లు తిరిగి బట్టలు, ఆహార పదార్థాలను సేకరించి తిరుగుబాటు యోధుల అవసరాలను తీర్చుతూ వారికి ఎటువంటి లోటు కలుగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా రణరంగంలో గాయపడిన స్వదేశీ సైనికుల చికిత్సకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించటం పట్ల ఆమె శ్రద్ధను చూపారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులు గాయపడి అనాధలుగా ప్రాణాలు విడవటం పట్ల కలతచెందిన ఆమె క్షతగాత్రులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలందించారు.
    అజీజున్‌ తరుచుగా తన మహిళా సైనిక బలగాలతో కాన్పూరు పురవీధుల్లో కవాతు చేసి ప్రజలను ఉత్సాహపర్చేందుకు కృషి సల్పారు. సంపూర్ణ సైనికాధికారి దుస్తులతో, పలు సైనిక చిహ్నాలను అలంకరించుకుని, తుపాకి ఒకవైపు, ఖడ్గం మరోవైపున ధరించి కవాతులలో పాల్గొనటం ఆమెకు అలవాటు. ఆమె నేతృత్వంలో కవాతు సాగుతున్న బజార్లలో ప్రజలు బారులు తీరి నిలబడి ఆమె రాకకోసం ఎదురు చూస్తూ, ‘ నానాసాహెబ్‌ జిందాబాద్‌-బేగం అజీజున్‌ జిందాబాద్‌ ‘ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలను చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసేవారు. ఈ విషయం 1857 జూన్‌ 16న నానక్‌ చంద్‌ అను వ్యక్తి తన డైరీలో రాసిపెట్టిన సమాచారాన్ని బట్టి వెల్లడవుతుంది.  ఆమె కృషి, నిస్వార్థ సేవాతత్పరత, కార్యదక్షత, ప్రగతిశీల ఆలోచనలను, నానా సాహెబ్‌ పట్ల చూపుతున్న విధేయతను గమనించి నానాకు కుడి భుజంగా ఖ్యాతి చెందిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు, నానా సాహెబ్‌ ప్రధాన సహచరులు అజీముల్లా ఖాన్‌్‌ ఆమె  సేవలను ఎంతగానో ప్రశంసించారని  ఆనాటి ప్రముఖ వ్యాపారి నానక్‌ చంద్‌ తన దస్తావేజులలలో రాసుకున్నాడు. (Encyclopaedia of Muslim Biography, Vol.I,  Ed. by Nagendra Kr. Singh, APH, 2001, page. 585)
    ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అంతమైన తరువాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటులో పాల్గొన్న సంస్థానాధీశులు, సైనికాధికారులు, ప్రజల విూద భయంకరంగా విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి  col.William తయారు చేసిన కాన్పూరు తిరుగుబాటుదారుల జాబితాలో అజీజున్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా కాన్పూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి జానకీ ప్రసాద్‌ సాక్ష్యం పలుకుతూ, ఆమె సదా సైనికాధికారి దుస్తులలో ఉంటూ, నానా సాహెబ్‌ కోసం ఆమె మహిళా దళాలు పనిచేశాయి. ఆమెకు పీష్వా సైనిక దళాలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. తిరుగుబాటు పతాకం ఎగరగానే ఆమె తిరుగుబాటు యోధులతో కలసి పోరుబాటన నడిచారని, ఆంగ్లేయ న్యాయస్థానంలో వివరించాడు. ఈ మేరకు ఆమె తిరుగుబాటు యోధులతో కలసి పనిచేసిందని బ్రిటీషు అధికారుల విచారణలో పలువురు వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. (Encyclopaedia of Muslim Biography, Vol.I,  Ed. by Nagendra Kr. Singh, APH, 2001, page. 585)
    ఈ విచారణలో భాగంగా, బేగం అజీజున్‌ను ఉన్నత సైనికాధికారి(Encyclopaedia of Muslim Biography, Vol.I, page. 585)ఎదుట హాజరు పర్చారు. ఆమె సాహసకృత్యాల గురించి విన్న ఆ అధికారి, ఆమె రూపురేఖలను చూసి ఆశ్చర్యపోయాడు. మగదుస్తుల నుండి ఆమె బయట పడగానే ఆమె అందచందాలను చూసి  అవాక్కయ్యాడు. ఆమె రణరంగంలో అరివీర భయంకరంగా వ్యవహరించడాన్ని నమ్మలేకపోయాడు. ఆమె కనుక తన అపరాధాన్ని అంగీకరించి, క్షమాపణ వేడుకుంటే ఆరోపణలన్నీ రద్దుచేస్తానని, ఆమెను క్షమించి విడిచిపెట్టగలనని హావిూ ఇచ్చాడు. ఆ ప్రతిపాదనలను బేగం అజీజున్‌ నిర్ద్వంద్వంగా నిరాకరించారు. ప్రాణ భయం ఏమాత్రంలేని ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన ఆ అధికారి , ‘ నీకేం కావాలి? ‘ అని ప్రశ్నించాడు. నాకు ‘ బ్రిటీష్‌ పాలన అంతం చూడాలనుంది ‘,(‘I want to see the end of the British rule ‘,  – ibid page. 586), అని  ఆమె నిర్భయంగా, చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. అ సమాధానంతో  ఆగ్రహించిన  General Have lock  ఆమెను కాల్చివేయాల్సిందిగా  సైనికులకు ఆదేశాలిచ్చాడు.
    ఆ ఆదేశాలను విన్న అజీజున్‌ చిరునవ్వు చిందిస్తూ, తుపాకి గుండ్లకు ఎదురుగా నిలబడ్డారు. బ్రిటీష్‌ సైనికుల తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి. ఆ తుపాకుల్లో నుండి గుళ్ళ బయల్పడి ఆమె సుకుమార శరీరాన్ని ఛేదించుకుని దూసుకపోతుండగానే  నానా సాహెబ్‌ జిందాబాద్‌  అంటూ ఆ అసమాన పోరాటయోధురాలు నినదించారు. ఆ సింహనాదంతో ఆంగ్లేయ సైనికులు ఒక్కక్షణం స్థంభించి పోయారు.  మహాయోధ బేగం అజీజున్‌  ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి.
    ఆ మహత్తర త్యాగమూర్తికి చరిత్రలో తగినంత స్థానం లభించలేదు. ఆ యోధురాలి గత జీవితాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా బ్రిటీషు చరిత్రకారులు, బ్రిటీషు సామ్రాజ్యవాదుల ఏజెంట్లు ఆమె గురించి అవాకులు చవాకులు రాశారు. నిజానికి ఆమె ప్రేమను బజారులో అమ్ముకొనలేదు. స్వతంత్ర సమర రంగంలో దేశభక్తికి కానుకగా అర్పించింది. (1857 స్వరాజ్య సంగ్రామం, సావర్కార్‌, పేజి.88)  ఆ తరువాత జరిగిన పరిశోధనలు బ్రిటీషర్ల కుట్రలను బయట పెడుతూ, అజీజున్‌ త్యాగమయ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. ఆనాటి అసత్యాలను, అభూత కల్పనలను బట్టబయలు చేశాయి. ఈ మేరకు సాగిన కృషి ఫలితంగా ఆ నాటి కుట్రల కారుమబ్బులను చీల్చుకుంటూ మధ్యాహ్న మార్తాండుడిలా ఆమె సాహసోపేత చరిత్ర వెలుగులు చిమ్మడంతో  బేగం అజీజున్‌ ఉత్తమ చరిత్ర ప్రపంచానికి వెల్లడయ్యింది.  *

– సయ్యద్  నశీర్  అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)