నా కళ్లతో అమెరికా-8

మోంటెరే 


      మోంటెరే శాంతా క్రూజ్ కు దక్షిణంగా నలభై మైళ్లలోనూ , శాన్ ఫ్రాన్సిస్కో  నుంచి దాదాపు

120 మైళ్లు దూరంలోనూ ఉంటుంది.  చిన్న చిన్న ద్వీపాలతో, చమక్కుమనే రాళ్ల తీరాలని

చుట్టుముట్టిన   సైప్రస్ చెట్ల సహజ సిద్ధమైన అందంతో అలరారే  మోంటెరే పలు

కళాకారులకుస్ఫూర్తిదాయక ప్రదేశం.

1962 లో నోబెల్ బహుమతి గ్రహీత, గొప్ప అమెరికన్ నవలా రచయిత అయిన John Steinbeck స్వస్థలం ఇదే.

ఆయన రచనల్లో అడుగడుగునా ఈ ప్రాంతపు ప్రసక్తి కనిపిస్తుంది. కొన్నిటికి ఇదే భూమిక కూడా.  ఇక Treasure

Island వంటి అద్భుత నవలా రచయిత Robert Louis Stevenson కొంత కాలం ఈ ప్రాంతం లో నివసించి Monterey

పరిసర ప్రాంతాల గురించి The Old Pacific Capital అనే పేరుతో వ్యాసం రాసాడు. అసలు ఈ ప్రాంతంలో

సంచరిస్తున్నప్పుడే Treasure Island కు అంకురార్పణ జరిగిందని కూడా ప్రతీతి.

ప్రయాణం

మంచి  నునువెచ్చని ఎండాకాలం, ఒక జూలై నెల లో రెండు, మూడు రోజులు గడిపేందుకు అనువైన ప్రదేశంగా మోంటెరే

ని ఎంచుకున్నాం. మా ఊరి నించి దాదాపు 85 మైళ్లు ఉంటుంది. మహా అయితే గంటన్నర,రెండు గంటల్లో  వెళ్లిపోవచ్చు.

ముఖ్యంగా అక్కడ ఉన్న Bay Aquarium,  సముద్ర తీరాలు, 17 miles drive తప్పని సరిగా చూడాల్సినవి. ఇక్కడ

హోటళ్ల చెకిన్ టైం మధ్యాహ్నం 3 నించి ప్రారంభం, చెకవుట్ ఉదయం 11. కాబట్టి మేం సాధారణంగా ఉదయమే ఇంటి

నించి బయలుదేరిపోయి మధ్యాహ్నం హోటల్ లో చేరే సమయం వరకు ఏదో ఒక attraction ప్లాన్ చేసుకుంటాం. అలాగే

తిరిగి వచ్చేసే రోజు ఉదయమే 9 గంటలకల్లా చెకవుట్ చేసి ఆ రోజంతా చుట్టూనో, దారిలోనో చూసుకుంటూ వస్తాం. అలా

అయితే హోటల్ కు కేవలం రెండు రాత్రుళ్లు పెట్టుకున్నా మూడు రోజులు పూర్తిగా తిరిగినట్టవుతుంది.

బాగా ఉదయానే ఇంటి దగ్గర త్వరగా బయలుదేరి 9.30 కల్లా ఆక్వేరియం ఎంట్రెన్సుకి చేరుకున్నాం. టిక్కెట్టు పెద్దవాళ్లకు

దాదాపు 33, పిల్లలకు 20 డాలర్లు.Monterey Bay Aquarium:

ఆక్వేరియం అంటే మన దగ్గరలాగా చిన్న చిన్న తొట్లలో చిన్న చిన్న చేపలని ఊహించుకుంటే పొరబాటే. రెండస్థుల లో

అన్నీ కలిపి దాదాపు రెండు వందల రకాల చేపలు, సముద్ర పక్షులు, ఆక్టోపస్లు, ఆల్చిప్పలు, సముద్ర జంతువులు

ఒకటేమిటి అతి పెద్ద  షార్క్ చేపల  దగ్గర్నించీ, అతిచిన్న నీటి గుర్రం వరకు అన్నీ చూడొచ్చు ఇక్కడ. ఇక తొట్టెలు కొన్ని

మొత్తం గదంతా వ్యాపించి ఉంటాయి. రెండంతస్థుల్నీ కలుపుతూ పై నించి కింద వరకు కూడా ఉన్న  కొన్ని గాజుతొట్లను

ఏ అంతస్థు నించైనా చూడొచ్చు. కొన్ని కింద నడుస్తూ ఉంటే తలమీద గాజు అద్దాల వెనక  ఉంటాయి. ఇదే రకపు

ఆక్వేరియం ను మేం సింగపూర్ లో చూసాం. అయితే అంత కంటే ఇదే పెద్దదని చెప్పుకోవచ్చు. మొదటి సారి చూసిన

వారెవరికైనా అలా మన తల మీంచి సముద్రచరాలు తిరుగుతూ ఉంటే మనమే సముద్ర అంతర్భాగంలోకి  వెళ్లిన

అత్యద్భుత  అనుభూతి  కలుగుతుంది. ఇక ముఖ్యంగా అత్యంత సుందరమైన జెల్లీ ఫిష్ లు తమ గొడుగుల వంటి మెత్తటి

దేహాలతో నాట్యమాడుతున్నట్లు కదులుతూ  కనువిందు చేస్తాయి. నాకు అక్కడ ఒక చోట ఎక్సిబిట్ లలో రాసి ఉన్న

నెరుడా వాక్యం బాగా నచ్చింది. అది- I spin on the circle of wave upon wave of the sea అనేది.

 ఇక మొత్తం తిరిగి చూడడానికి మధ్య మధ్య feeding టైమింగ్స్ లో ఆగడానికి, విశేషాలు తెలిపే ఆడిటోరియం షోలు

చూడడానికి ఉదయం నించి సాయంత్రం వరకూ పడుతుంది.

కానీ మేం సగం రోజు వరకూ మాత్రమే ఆక్వేరియం ను ప్లాన్ లో పెట్టుకున్నందు వల్ల మధ్యాహ్నం భోజనాల సమయానికి

మొత్తం తిరిగి చూసి బయటకు వచ్చేసాం.  కొంత  ముందర డౌన్ టౌన్ కు వెళ్లి భోజనాలు కానిచ్చి తిరిగి మళ్లా సముద్ర

తీరానికి వచ్చాం. అక్కడ కారు ను కాయిన్ పార్కింగులో పెట్టడానికి  మాకు చిల్లర కావలసి వచ్చింది. ఎదురుగా

కనిపిస్తూన్న షాపింగు మాల్ లో కి వెళ్లాం. అక్కడి పెద్ద చాక్లెట్ల దుకాణం లో ఏవో కొని చిల్లర తీసుకున్నాం. వరు అక్కడి

మినీ గోల్ఫ్ చూసి రానని మొండికేసింది. ఒక గంట అందరం మినీ గోల్ఫ్ ఆడి బయటికొచ్చాం.  ఇంతలో పిల్లలు మళ్లా రిక్షా

అని సరదా పడితే సరే సముద్ర తీరంలో అట్నించిటుకి అంతా చూసేద్దామని రిక్షాని అద్దెకు తీసుకున్నాం.

రిక్షా & కయాక్

అయితే ఇక్కడ రిక్షా అద్దెకు తీసుకున్న ప్రదేశం నించి కొంత దూరం మామూలు రోడ్డు సందుల్లోంచి తొక్కుకుంటూ

వెళ్ళాలి. పైగా ఎత్తు పల్లాలతో కొండ ఎక్కి దిగే లాంటి రోడ్లు. బాగా కష్ట పడ్డారు వీళ్లు ఈ సారి సరిగ్గా బాలెన్స్

చేసుకోవడానికి. కాసేపు నేనూ తొక్కవలసి వచ్చింది.  

అక్కడి నించి  మరో మైలు దూరంలో దిగేందుకు అనువుగా అలలు లేకుండా ఉన్న  బీచ్ లో kayakలు అద్దెకు తీసుకుని

సముద్ర విహారానికి బయలుదేరారు. అక్కడ దగ్గర్లో సముద్రం లోపలికి నీళ్లు చొచ్చుకుని వచ్చినందు వల్ల అలలు లేవని

ధైర్యం గా బయలు దేరారు ముందు. తీరా కయాక్ తీసుకుని కాస్త ముందుకి కొండ అంచుని చుట్టుకుని వెళ్లేసరికి పెద్ద

అలలు రావడం మొదలెట్టాయట. ఎక్కడ  kayak బోల్తా పడుతుందో నని భయపడి వెనక్కు వచ్చేసారు. అయినా గాలి

వాటుకు ఎదురు రావాల్సి ఉండడం వల్ల వీళ్లకు ఇదంతా గంట పట్టింది. ఒడ్డున వరు, నేను గూళ్లు కడుతూ, చల్లని

ఇసుకలో తువ్వాళ్లు పరిచి కూచున్నాం. కొంచెం సేపు పక్కనే ఆనుకుని ఉన్న చిన్న గుట్ట మీద పార్కు లోనికి ఎక్కి

దానిని చుట్టుకుని వస్తున్న వీళ్లను చూసాం. పై నుంచి సముద్ర తీరం లో మనం ఉన్నామో, మన చుట్టూ సముద్రం

మాత్రమే ఉండి ఒక చిన్న భూభాగం మీద ఉన్నామో అన్న భ్రాంతి కలిగింది. తిరిగి వచ్చేటప్పుడు రిక్షా తొక్కేందుకు వీళ్లకు

ఓపిక లేక పోయింది. కొంత దూరం అందరం రిక్షాను తోసుకుంటూ నడుచుకుంటూ వచ్చాం. బిల్లు షాపు వాడికి చెల్లించి,

మేం నడిచి వచ్చామన్న మాట. ఇప్పుడు తల్చుకుంటే బాగా నవ్వు వస్తుంది. కానీ అప్పుడు బాగా అలిసి పోవడం తో

ఎప్పుడెప్పుడు హోటల్ కెళ్లి  నిద్రపోతామా  అనిపించింది..

సాయంత్రమయ్యేసరికి రివ్వున చలి గాలొకటి కాళ్లను వెనక్కు తోసేస్తూ. ఆనుకుని ఉన్న డౌన్ టౌన్ సాయంత్రపు షికార్లకు

జనం సందడి తో త్వరగా ముస్తాబవుతోంది. మేం హోటలు కు చేరి తిరిగి స్నానాలు చేసి మళ్లీ బయటకు వద్దామని

అనుకున్నాం. స్నానాలు కాంగానే తినడం అని కూడా అనకుండా ముసుగు పెట్టి నిద్రపోయారు పిల్లలు.  మా బస

సముద్ర తీరానికి కాస్త లోపలికి దూరం గా ఉండడం వల్ల ఈ సారి రాత్రి పూట సముద్రాన్ని చూడలేదిక్కడ. అదీ గాక

మర్నాడు ఉదయానికి మేం సముద్రం లోపలికి వెళ్లే క్రూయిజ్  ట్రిప్  బుక్ చేసుకున్నందు వల్ల మేమూ పెందరాళే నిద్రకు

ఉపక్రమించాం.

Whale Watching:

మర్నాడు ఉదయానే హార్బర్ కు దగ్గర్లో ఉన్న Cruise బయలుదేరే ప్రదేశానికి చేరుకున్నాం. మేం 

9 గంటలకు బయలుదేరితే తిరిగి రావడానికి ఒంటిగంట, రెండు అవుతుంది.  మొత్తం నాలుగైదు గంటల్లో  మధ్య రెండు

గంటలు Whale Watching. టిక్కెట్టు మనిషికి దాదాపు యాభై డాలర్లు.  నాకు తెలిసి  ఇంత వరకు సముద్రంలోకి

అంతదూరం వెళ్లడం అదే మొదటి సారి. నేను ఊరికే అలా కనుచూపు మేరలో తిప్పి తీసుకొచ్చేస్తాడని  అనుకున్నాను.

అదీ గాక మేం వెళుతున్న పెద్ద సైజు ఫిషింగ్ ట్రాలర్ లాంటి పెద్ద బోట్ ని చూడంగానే మంచి హుషారు కూడా

వచ్చిందందరికీ. అందులోనే చిన్న స్నాక్ స్టాల్ ,  బయట పైన చూసేందుకు సీట్లు, కింద డెక్ అన్నీ ఉన్నాయి.  

మంచి ఎండ కాస్తోంది అయినా ఒక స్వెట్టర్ తెచ్చుకోమన్నారు క్రూయిజ్ వాళ్లు. మేం నవ్వుకున్నాం. ఇంత ఎండ లో

స్వెట్టర్ ఎందుకని. స్వెట్టర్ ఎందుకో మరో పది నిమిషాల్లో అర్థంఅయ్యింది మాకు. కరెక్టు గా బోట్ తీరం వదిలిన పది

నిమిషాల్లో  మా చుట్టు మేం తప్ప ఇంకేమీ కనిపించని పొగ మంచు కమ్మేసింది. దాంతో బాటే మంచు గడ్డ లు

చుట్టుముట్టినట్లు విసురుగా చలి గాలి మొదలైంది. మేం వెంటనే లోపలికి పరుగెత్తాం.  ఉన్న స్వెట్టర్లు తొడుక్కున్నా ఆగని

చలిలో మా అవస్థ చూసి బోట్ వాడు మాక్కాసిన్ని వెచ్చని కోట్లు తెచ్చి ఇచ్చి ఇంకా చల్లగా ఉంటే లోపల గాజు అద్దాలలో

కూర్చో మన్నాడు.

ఇక మంచుని చీల్చుకుంటూ  ఎదురుగా కనిపించని మరో నీలి లోకంలోకి వేగంగా దూసుకు పోతూంది మా బోట్.

దాదాపు అరగంట తర్వాత మంచు వీడి సముద్రం ప్రశాంతంగా కనిపించింది. చుట్టూ  సముద్రపు నీలి రంగు  పూసుకుని

కనిపించకుండా ఎక్కడో వందలాది అడుగుల్లో దాక్కున్న  భూమి ఆనవాలు ని వెక్కిరిస్తూ కళ్ళ లోకి సూటిగా  ఎండ

మెరిపించే  తళుక్కు ఆకాశం.  అలల ఒంటి మీద  నీటి చల్ల దనానికి వొణుకుతూ పొగలై లేస్తూన్న  తెల్లని ఆవిరి. 

ముందుగా దారిలో అక్కడక్కడ ఉన్న పీపా స్తంభాల  మీద ఎక్కి దిగుతూ, సేద తీరుతూ ఉన్న సీ లయన్లు బాగా

కనువిందు చేసాయి. ఇక పూర్తిగా రెండు గంటల  సేపు సముద్రాంతర్భాగంలోకి ప్రయాణించేక బోట్ ని నిలిపి వేసి

నిశ్శబ్దంగా  వచ్చే Whales కోసం ఎదురుచూసేం. మొదటిది కనిపించగానే అందరూ ఆనందంతో కేరింతలు కొట్టేరు. చాలా

చాలా పెద్దవి whales.  ఒక్క సారి పైకి లేచి పడ్డాయంటే మా పడవంతా తలకిందులయ్యే నీళ్లు పైకి లేస్తున్నాయి. అందుకే

కాబోలు తగు జాగ్రత్తగా వాటికి తగిన దూరంగా ఆపి ఉంచేరు మా పడవని.

గంట పాటు అలల మీద ఊరిస్తున్న  ఆకాశాన్ని అందుకోవడం కోసం అన్నట్లు ఎగిరి దుముకుతున్న వాటి తో బాటూ

మేమూ ఆనంద పరవశులమై చూసేం. తిరిగి మళ్లా వెనక్కి వచ్చేసరికి రెండు గంటలు పట్టింది. అయితే చిన్న అపశృతి

మాకు. అలల మీద ఎత్తి పడేస్తూ సాగిన  ప్రయాణానికి నాకు, మా కోమల్ కి  బాగా సుస్తీ చేసింది. వాంతులు

పట్టుకున్నాయి. అదే సీ సిక్ నెస్ అంటారు కాబోలు. పడవలో మాకు లంచ్ టైం అవుతున్నా  మేం తినే స్థితిలో లేం.

అదొక్కటీ తప్ప నిజంగా సముద్రంలోకి వెళ్ళడం ఒక గొప్ప సాహస కార్యం. మంచు గడ్డ లాంటి పసిఫిక్ సముద్రంలోకి

మరీనూ.

సర్ఫింగ్ బీచ్ :

ఆ సాయంత్రం అక్కడికి మరో అయిదారు మైళ్ల దూరంలో సముద్రతీరానికి వెళ్లాం.  పెద్ద పెద్ద  విశాల మైన అలల సర్ఫింగ్

బీచ్ అది. సాయంత్రపు నారింజ వెల్తురు అలల మీద తళుక్కున మెరుస్తూంది. ఈ తీరం ఒడ్డుకు కొంచెమే దిగువన ఉంది.

అందుకే ఒడ్డున నుంచుంటే  అలలు మనుషులంత ఎత్తు ఎగిసి పడ్తున్నాయి. చాలా విశాలంగా దూరం నించి వంపు

తిరుగుతూ దగ్గరకు వచ్చే కొలదీ నెమ్మదిస్తూ ఏటవాలు కిరణాల్లా ఎగిసి పడ్తూన్న అలలు. సర్ఫింగ్ చేసేవారు,  వారిని

చూస్తూ ఆనందించే వారు  దాదాపు వంద మంది వరకూ ఉన్నారు బీచ్ లో. పిల్లలు ఇక్కడే ఇక్కడే అంటూ నీళ్లలోకి దిగి

చలి చలి అంటూ పరుగెత్తుకొచ్చారు అయిదు నిమిషాల్లో. నేను ఎదురుగా కనిపిస్తూన్న సూర్య బింబపు ప్రతి రూపం

నీళ్లలో ముక్కలు చెక్కలవుతున్న దృశ్య పారవశ్యంలో మునిగి తేలాను. బయటంతా కాస్త వెచ్చగానే ఉన్నా ఇసుక

మాత్రం చల్లగానే ఉంది. తడవని ఇసుకే అలా ఉంటే, ఇక తడిసిన ఇసుక గురించి చెప్పాలా!

ఇక పొద్దు పోతుందనగా వెనక్కి బయలుదేరాం. బీచ్ రోడ్డు  నించి తిరిగి మా హోటల్ దగ్గరకు వచ్చే దారి విశాఖలో

ఋషికొండ నుంచి వచ్చేదారిలా ఏదో చిన్న కాలనీ లను దాటుకుని, యూకలిప్టస్ చెట్ల ను దాటుకునీ సాగుతుంది. కొంత

దూరం ఇళ్ల మధ్య నుంచి కూడా వస్తాం. చాలా ఆనందంగా మా బసకు చేరుకున్నాం. తీరా దిగేక సత్య కాళ్లకు బూట్లు

లేవు. అదేమిటని చూస్తే కార్లోనూ లేవు. అప్పుడు చల్లగా చెప్పేడు కారు బయట బూట్లను దులిపి అక్కడే చప్టా మీద

వదిలి వచ్చేసాను మర్చిపోయి అని. మేమసలే రోడ్డు వారగా పార్కు చేసాం. అక్కడ మా కారుతో బాటూ మరో పాతిక కార్లు

వరస ఉన్నాయి. నేను “మళ్లా వెనక్కి వెళదాం కొత్త బూట్లు కదా” అనంటే “ఇంకా అక్కడ ఉంటాయా?ఎవరో పట్టుకు

పోతారని తను.” “ఇది అమెరికా ఇక్కడెవరూ అలా పట్టుకెళ్లరని” నేను వాదన పెట్టుకున్నాం. మొత్తానికి అక్కడ బూట్లు

గనక లేకపోతే ఇంకెప్పుడూ నా మాట విననని ఒప్పందం మీద అరగంట ప్రయాణించి వెనక్కి వెళ్లాం. నిజంగానే  నేను

చెప్పినట్లు ఎక్కడ వదిలాడో అక్కడే ఉన్నాయి బూట్లు. అవి చూడగానే సత్య మొహం లో చిరునవ్వు,  నా మొహంలో

కోపం తన్నుకొచ్చాయి.  ఇంకెప్పుడూ నా మాటే వినాలి అని ఒప్పందం గుర్తు చెయ్యగానే “ఇవేల్టి వరకు మాత్రమే

అన్నాను ఇందాకా” అని బుకాయించాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మా పిల్లలు “హమ్మయ్య! దొరికాయి డాడీ!

లేకపోటే మాట వినడం మాట అటుంచి, మమ్మీ ఈ ప్రయాణమంతా గొడవ చేసేది” అన్నారు.

రాత్రికి భోజనానికి మా రోడ్డుకు ఎదురుగా ఉన్న ఏదో అమెరికన్ రెస్టారెంటుకి వెళ్లి అయ్యిందనిపించి వచ్చాం. రోజంతా

సరిగా తినలేదేమో బాగా నిస్సత్తువ వచ్చింది అందరికీ. అదృష్టం కొలదీ పళ్ళు తెచ్చుకున్నందువల్ల కడుపు నింపుకుని

నిద్రకు ఉపక్రమించాం.

 మర్నాడే మేం వెళ్లేది. అయితే ఆ రోజు 17 మైళ్ల డ్రైవ్ చూసుకుని వెళ్లడానికి ఉదయానే హోటల్ ఖాళీ చేసాం.

17 Mile Drive:

Monterey  నించి సముద్రం ఒడ్డునే  pacific grove మధ్య నుంచి సాగే దాదాపు పదిహేడు మైళ్ల

దూరాన్ని ఆ పేరుతో పిలుస్తారు. వరసగా సముద్ర తీరాలు, గోల్ఫ్ కోర్సులు, భవంతులు, దాటుకుంటూ వెళ్లే ఈ ప్రయాణం

లో ఎక్కడెక్కడక్కడ ఆగాలో తెలిపే బుక్ లెట్ లు అన్ని వైపులా ఉండే ఎంట్రెన్స్ చెక్ పోస్ట్ ల దగ్గర దొరుకుతాయి. లోపలికి

ప్రయాణించాలంటే కారుకు దాదాపు 10 డాలర్లు రుసుము చెల్లించాలి. ఆగుతూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ

వెళితేనే దాదాపు నాలుగైదు గంటలు పడుతుంది. ఇక అక్కడ ఉన్న షాపింగు, భోజనం వంటివి చేస్తే రోజు మొత్తం

పట్టొచ్చు. మేం సముద్రతీరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేం.

గేట్ దగ్గర్నుంచి చిన్న అడవి ప్రారంభమవుతుంది. దీన్ని Del Monte Forest అంటారు. వంపులు తిరిగే రోడ్ల మీంచి

కొద్దిగా లోపలికి వెళ్లగానే ఒక్కొక్క తీరం చొప్పున కానవస్తుంది. మనకు ఇచ్చే టూరిస్టు మేప్ ప్రకారం ఆ 17 మైళ్ల లోనూ

మొత్తం చూడాల్సినవి  21 విశేషాలు ఉంటాయి. కానీ అందులో సముద్ర తీర విశేషాలు పది పన్నెండు వరకు మాత్రమే

ఉంటాయి.  ఇందులో ముందుగా వచ్చేది Spanish Bay. 1769 లో స్పానిష్ అన్వేషకుడైన Don Gaspar de

Portola  మోంటెరే  అన్వేషణ లో భాగంగా తన సిబ్బంది తో పాటూ ఇక్కడ బస చేసాడట. అప్పటి నుండి ఈ తీరానికి ఆ

పేరు వచ్చింది. ఈ చుట్టు పక్కల సముద్ర తీరాన్ని pebble beach అని కూడా అంటారు. నిజంగానే అన్నీ చిన్న సైజు

నించి రెండు అరచేతుల్లో పట్టేటంత, పాదం మోపగలిగేటంత, ఇంకాస్త పెద్దవి ఇలా.. ఉన్న గుండ్రని అందమైన రాళ్లు  ఈ

తీరం నిండా. ఎవరో రోజుల తరబడి కూర్చుని అందంగా చెక్కినట్లు ఉంటాయి. సముద్రం దగ్గరకు వెళ్లడానికి ఈ రాళ్ల మీంచే

నడుచుకుంటూ వెళ్లాలి.  ఇక్కడి రాళ్లను తీసుకెళ్లొద్దని బోర్డులు ఉంటాయి. ఇలాంటి బీచ్ ను నేను ఇంత వరకు ఎక్కడా

చూడలేదు. చూడగానే మహాద్భుతంగా అనిపిస్తుంది. పిల్లలు రాళ్లని ఒకదానిమీదొకటి పేర్చి కాస్సేపు ఆడుకున్నారు. ఏదో

ఒక కొండ ని సముద్రుడు తన పెద్ద అలల ఆయుధాలతో  ఢీకొని అంతటినీ ఒకే లాంటి రాళ్లుగా కూల్చి  తీరుబడిగా వేల

సంవత్సరాల వెంబడి చెక్కుతూ కూర్చున్నట్టున్నాడు. నాకు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు.

అయితే మేం 17 మైళ్ల డ్రైవ్ లో ప్రవేశించగానే మొదట ఆగిన స్టాప్, ఇంకా చూడాల్సినవి ముందు ఎన్నో ఉండడం తో

తప్పక కదిలాను. అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్లగానే వచ్చేది Point Joe. తొలి నావికులు మోంటెరే కు ప్రవేశం

ఇక్కడే అనుకుని పాపం నౌకలు  ఇక్కడి రాళ్లకు గుద్దుకుని  ప్రాణాలు కోల్పోయే వారట. ఇక్కడ రాళ్ల మీదుగా భీకరంగా

పోటెత్తే సముద్రాన్ని ఒడ్డు నుంచి చూస్తేనే భయం వేస్తుంది. అందుకే ఇక్కడి సముద్రాన్ని Restless Sea అంటారు. 

తర్వాత China Rock. 1800 ప్రాంతంలో చైనా నుంచి వచ్చిన నివాసికులు ఇక్కడి రాళ్లనాధారం చేసుకుని  తమ

నివాసాలేర్పాటు చేసుకునేవారట.  ఇక తర్వాత వచ్చేది Bird Rock ఇది పూర్తిగా సముద్రతీరం నించి విడిపోయి ఉన్న

చిన్న ద్వీపం. ఒకటే పెద్ద రాయి. దీనిపై మనకు వందలాది పక్షులు, సీల్స్, సీలయన్సు కనిపిస్తాయి.  అయితే రాయంతా

రంగులు వేసినట్లు ఉన్న వాటి మల మూత్ర నిల్వలు ఆ ప్రాంతాన్ని బాగా దుర్ఘంధంతో నింపి వేసాయి. ఒడ్డున వాసన

భరించలేక త్వరగా కారులోకి పరుగెత్తాం.

అక్కడి  నుంచి మరింత ముందుకు వెళితే వచ్చే సీల్ రాక్ పికనిక్ ఏరియా లో బద్ధకంగా ఒడ్డున నిద్రపోతున్న ఎన్నో

సీల్సు, సీలయన్లు కనిపిస్తాయి. దూరానికి అవి సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద జలగల్లా కనిపిస్తాయి. దగ్గర్నించి చూస్తే

ఒక్కొక్కటి మనిషిని అమాంతం మింగగలిగినట్లు భారీ శరీరంతో ఉంటాయి. అవి చేప జాతికి చెందిన సాధు జంతువులంటే 

నమ్మబుద్ధి కాదు.

ఈ మధ్యలోనే మధ్యాహ్నమైంది. ఒంటిగంట ప్రాంతానికి సముద్రం ఒడ్డున మెత్తటి ఇసుకలో TenT వేసి మాతో

తెచ్చుకున్న ఫలహారాలు తిని విశ్రమించాం. పిల్లలు మహదానందంగా ఇసుకలో ఆట మొదలు పెట్టారు.  సత్య కూడా

పిల్లల వెనకే పరుగుతీసాడు. నీళ్లలోకి వెళ్లి బట్టలు తడుపుకోవద్దని చెప్పాను వీళ్లకి. అయినా వింటేనా! సగం తడిసి

వచ్చారు. ఇక అవి ఆరేంత వరకు అక్కడే ఉన్నాం. మంచి ఎండ కాస్తోంది జూలై నెల కాబట్టి. వెల్తురు ఇసుక మీద పడి

కళ్లల్లోకి సూటిగా ప్రతిబింబిస్తోంది. కానీ గాలి విసురుగా ఉండడం వల్ల వేడి ఒంటికి తగలడం లేదు. పైగా సముద్రపు నీటి

చల్లదనం ఒకటి.

ఇక వెళ్లే ముందు టెంట్ మడత పెడుతూ వాటికి ఆధారమైన మేకులు అన్నీ  ఒక్కసారిగా లాగారు  వీళ్లు. కొన్ని వచ్చాయి

కొన్ని అంత మెత్తటి ఇసుకలో కళ్లు  తెరిచి మూసే లోగా లోపలికి పోయాయి. తమాషాగా అవన్నీ వెతకడానికి మరో

అరగంట పట్టింది మాకు. చివరిదైతే చాలా మేథ్ వేస్తేనే గానీ దొరకలేదు. సత్య ఇక పోదాం అంటాడు. నేను అవన్నీ దొరికే

వరకూ వెళ్లొద్దంటాను. పిల్లలు ఇసుకను అటు ఇటూ తిరగేసి కొత్త ఆట మొదలెట్టారు. చివరికి అన్నీ దొరికేక “పట్టువదలని

విక్రమార్కురాలా! తల్లీ! వస్తావా ఇకనైనా” అన్నాడు సత్య నవ్వుతూ. పిల్లలకు పాఠంలా చెప్పాను “అరే! ఇసుకలో టెంట్లు

ఎప్పుడూ వెయ్యకూడదు” అని.

అక్కడి నుంచి సముద్ర తీరం వెంబడి ముందుకు సాగుతూ పోతే తర్వాత ప్రధానమైన  The Lone Cypress వస్తుంది.

సముద్రం ఒడ్డున ఉన్న ఎత్తైన రాతి కొండమీద చివ్వర నిలబడ్డ ఒకే ఒక్క చెట్టు అది. 250 సంవత్సరాల  వయస్సు కలిగిన

చెట్టుని జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టు దాని చుట్టూ కట్టిన చప్టా,  ఫెన్సింగు వంటివి తెలుపుతాయి. దూరం నించి చూడడమే

గానీ ఆ చెట్టు దగ్గరకు నడిచి వెళ్లేందుకు అనువు గాను ఉండదు, ప్రవేశమూ లేదు. అలా  సముద్రానికి ఎదురు

నిలబడినట్లున్న ఆ గంభీర వృక్షాన్ని  చూస్తే మనం ఎంత చిన్న వాళ్లమో  అర్థం అవుతుంది.

తర్వాత వచ్చే Ghost Tree  ఎప్పటి నుంచో ఆకురాలి  ఎప్పటికీ చిగురించని వంకర్లు తిరిగిన  భయానకమైన మోడు. 

అయితే ఆ చుట్టుపక్కల అలాంటి చెట్లే మరిన్ని ఉండడం విశేషం.
 

Carmel :

అలా దాదాపు సాయంత్రం నాలుగైదు గంటలకు మేం 17 మైళ్ల డ్రైవ్ ను దాటి అటు కొసకు చేరేం. దక్షిణం వైపున ఉన్న

ఊరి పేరు Carmel. అక్కడ సముద్రం ఒడ్డుకు వెళ్లాలంటే ఎక్కడో రోడ్ల మీద కారాపుకుని సందుల్లోంచి నడిచెళ్లాలి. అతి

కష్టమ్మీద ఒక పార్కింగు దొరికింది మాకు. దిగువకి నడుస్తూ ఉంటే నాకు విశాఖ లోని బీచ్ రోడ్ లోకి నడిచెళ్లే సందులు

జ్ఞాపకం వచ్చాయి.  తీరా ఇసుక కనబడే చోట ఎదురుగా చూద్దుము కదా సముద్రం ఎక్కడో దిగువన ఉంది. అక్కడ 

ఒడ్డున లోపలికి వెళ్లే మార్గం ఒక పెద్ద ఇసుక కొండలా ఉంది. ఆ బీచ్ లో నించి పిల్లలు ఇసుకలో ఎడారి ఇసుక మేటలలో

జారి నట్లు జారుకుంటూ వెళ్తున్నారు. సరే అందరం ఉత్సాహంగా బానే దిగేం. బోల్డు మంది జనం. ఆదివారం కావడం వల్ల

కోలాహలంగా ఉంది సముద్ర తీరం. మాకు ఒక గంట కూడా సమయం లేదు. వెనక్కి బయలుదేరాల్సి ఉంది. అరగంట లో

వెనక్కు వద్దామని అలాగే గంటా ఆడుతూ ఉండి పోయాం. ఇక వెనక్కి వచ్చేటప్పుడు చూడాలి మా పాట్లు. ఇసుక కొండని

ఎక్కలేక నా పాట్లు చూసి పిల్లలైతే ఒకటే నవ్వులు. మమ్మీ నువ్వు ఎక్కుతున్నావా- దిగుతున్నావా అని. ఒక అడుగు

ముందుకి, నాలుగడుగులు వెనక్కి అదీ పరిస్థితి. మొత్తానికి చాలా సంతోషంగా గడిచింది అలా మా మోంటెరే ట్రిప్. ఇంటికి

మరో రెండు, మూడు గంటల్లో వచ్చేసేం. పొద్దుట్నించీ అందరం తిరిగి తిరిగీ అలిసి పోయామేమో పిల్లలు కార్లోనే

నిద్రపోయేరు.  అవి పౌర్ణమి రోజులు ఒక పక్క సూర్యుడు అస్తమిస్తూనే మరో వైపు ఆకాశంలో చంద్రబింబం  కనిపిస్తోంది.

ఎందుకో ఇక్కడ చంద్ర బింబం బాగా పెద్దదిగా అనిపిస్తుంది పౌర్ణమి రోజుల్లో. చల్లని రాత్రి మా  కబుర్ల డ్రైవ్ లో  ఇంటికి

ఎప్పుడొచ్చామో తెలీకుండా వచ్చేసేం. బయట దేదీప్యమానమైన వెన్నెల్లా మా మనసులు కూడా ఆనందంతో ప్రశాంత

నిలయాలయ్యాయి*.

– డా\\K గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Uncategorized, Permalink

3 Responses to నా కళ్లతో అమెరికా-8