ప్రేమకు వారసురాలు

జయ ,వసంత్  ప్రక్క ఊరికి పని మీద వెళ్లి తిరిగి సాయంత్రము 7 గంటలకు ప్రాంతంలో వెహికిల్ మీద వస్తున్నారు.
మద్యలో చిన్న అడవి ప్రాంతం  , మద్యలో చిన్న రహదారి లాంటిది. చీకటి పడుతుంది. స్పీడ్ గా   వెహికిల్ నడిపిస్తున్నాడు వసంత్. దగ్గరలో చిన్నపిల్ల ఏడ్పు విన్పించింది. ఇంకా ఆ ఏడ్పు ఎక్కువ వినిపించేసరికి బండి ఆపి జయ,వసంత్ చెట్ల వైపు నడిచారు. చెట్ల పొదలో రక్తంతో ఆడపిల్లను వదిలి వెళ్లారు . చూడగానే తల్లడిల్లిపోయారు. చుట్టూ వెతికారు ఎవరూ  కనిపించలేదు. 

ఏం  చేయాలో అర్థం కాక వారి దగ్గర టవల్ ఉంటే  అందులో పాపను ఉంచి ఇంటికి తీసుకుని వచ్చారు.
  పోలీసు స్టేషన్ కి  వెళ్లి జరిగినదంతా  చెప్పారు. ఒక రోజంతా చూశారు పాపకు సంబధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. ఇంటి చుట్టు  ప్రక్కల వాళ్ళంతా మీకు ఇద్దరు మగపిల్లలు కదా.మీ ఇంటికి  లక్ష్మి వచ్చింది  అనుకుని పెంచుకోండి అని సలహా ఇచ్చారు. పోలీసు వాళ్ళు అనాధ శరణాలయానికి ఇస్తాము అన్నారు కానీ జయ , వసంత్ మేమే పెంచుకుంటాము అని ఆ పాపని తెచ్చుకున్నారు.
  21  రోజున ఉయ్యాల లో  వేసి  సంబరం చేసుకున్నారు. ఆ రోజు మొదలు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆ పాప వచ్చిన క్షణం నుండి వాళ్ళ వస్త్త్రాల వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా    
అభివృద్ధి చెందింది. జయ వసంత్ కుమారులు మా చెల్లి అంటూ అపురూపంగా చూసుకోసాగారు…. మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టుకున్నారు. ముద్దుగా అమ్ములు అని పిలుచుకునే వారు . జయకు పాపనే సర్వం అయింది. రకరకాల డ్రెస్సులు వేస్తూ మురిసిపోయేది. అలా  మూడు సంవత్సరాలు గడిచాయి . అక్షరాభ్యాసం  చేసి స్కూల్లో చేర్పించారు . రోజు అన్నయలతో కలిసి వెళ్తూ ఉండేది. అమ్ములు చూస్తుండగానే 5 వ తరగతి పూర్తి చేసింది. హై స్కూల్లో అడుగు పెట్టింది . ఆటల్లో,పాటల్లో,చదువులో అన్నిట్లో ఉతమశ్రేణి  లో పాసయ్యేది. అందరు  మీరు అదృష్టవంతులు  మీ అమ్మాయి చాల తెలివి గలది అంటుంటే వీరు ఎంతగానో మురిసి పోయేవారు.
హై స్కూలు చదువు పూర్తి చేసుకుని ఇంటర్ లో చేరింది. అమ్ములు ఇంటర్లో కూడా బాగా చదివి రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంకు సంపాదించింది. IIT  లో మంచి ర్యాంకు రావడంతో వేరే చోటుకి చదువుకోడానికి వెళ్ళింది.  వసంత్  వస్త్ర వ్యాపారం జిల్లాలోనే అగ్రశ్రేణి లో అభివృద్ధి చెందింది. కొడుకులిద్దరు వస్త్రవ్యాపారంలో బిజీగా అయ్యారు. వసంత్ వ్యాపారాన్ని  కుమారులకు అప్పగించి తాను సమాజసేవ కార్యక్రమాల్లో తనవంతు సహాయాన్ని చేస్తుంటే జయ తన సహకారాన్ని కూడా అంద చేసేది.
మహాలక్ష్మి చదువు పూర్తి అయ్యింది.
”అమెరికా లో మంచి ఉద్యోగము వచ్చింది, ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్తాను ” అంటూ అమ్మ,నాన్న, అన్నయ్యలతో చెప్పింది. అప్పుడు వాళ్ళు ఆలోచించుకుని ఒంటరిగా పంపించడం కంటే పెండ్లి చేసి పంపిస్తే బాగుంటుంది అనుకుని పెండ్లి సంబంధాలు  చూడటం మొదలు పెట్టారు. ఒక మంచి సంబంధం ఉందని వారికి  తెలుస్తుంది.
కానీ మహాలక్ష్మి తనతో చదివిన శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతనికి కూడా అమెరికాలోనే ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తల్లి దండ్రులకు అన్నయ్య లకు ఎలా చెప్పాలా?  అని ఆలోచించింది .
శ్రీధర్ వాళ్ళది తమ కులం కాదు ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని శ్రీధర్ లేకపోతే తను బ్రతుకలేదు ఈ విషయం ఎలా
చెప్పాలా అనుకుంటున్న  సమయంలో, జయ , వసంత్ మహాలక్ష్మిని పిలిచి పెండ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.
అపుడు తను ప్రేమించిన శ్రీధర్ గురించి చెప్పింది మహాలక్ష్మి .
తమ కులం కాకపోయినా  బుద్ధిమంతుడు కాబట్టి పర్వాలేదు అనుకుంటారు .ఇదే విషయం జయ వసంత్ రాత్రి బోజనాలు అయ్యాక కొడుకులిద్దరి దగ్గర ఈ ప్రస్తావన తీసుకువస్తారు,
వివరాలు అన్ని విని మన కులం వాడు కదా అన్నారు కొడుకులు  .
వసంత్ కొడుకులతో అన్నాడు. ‘బుద్ధిమంతుడు. ఇద్దరిది  ఒకే చోట 
 ఉద్యోగం .చెల్లి ఇష్టపడుతుంది కాబట్టి చేద్దాం’
‘అంటే మీరు చేయడానికి సిద్ధం అయ్యారా ?’ అని ఇద్దరు కొడుకులు ముక్త కంఠం  తో అన్నారు.

అన్నదమ్ములిద్దరు మహాలక్ష్మిని పిలిచారు.
”శ్రీధర్ మన కులం వాడు కాదు నువ్వు మరచిపో .అంతకంటే గొప్ప ఉద్యోగస్తుడిని    చూసి పెండ్లి చేస్తాము” అన్నారు.

”నేను శ్రీధర్ని తప్ప ఎవరిని చేసుకోను. మీరు అర్థం చేసుకోండి.”  బ్రతిమాలింది.
ఇదే  నిర్ణయము అన్నారు. నచ్చజెప్పడానికి ప్రయత్నము చేసింది.
వారు వినకుండా ”నీకు నీ జాతి లక్షణాలు వచ్చుంటాయి, ఎక్కడో అనాధగా చెట్టు కింద పడి  ఉంటే  అమ్మ నాన్న తీసుకుని వచ్చి ఇంట్లో చోటిచ్చి మాతో సమానంగా, ఇంకా ఎక్కువగా పెంచారు నిన్ను .
ఈ రోజు మా పరువు ప్రతిష్టలు మంటగల్పడానికి ప్రయత్నిస్తున్నావు” అంటూ ఆవేశంగా అరిచారు అన్నలు.
”నీలాంటి దానికి ఇంట్లో చోటు లేదు .  ఎవరినైనా పెండ్లి చేసుకో . ఎటైనా  వెళ్ళిపో” అంటూ  అక్కడి నుండి వెళ్ళిపోయారు.
” నేను మీ కూతురిని కాదా నిజం చెప్పండి. అన్నయ్య లిద్దరు ఎందుకు అలా మాట్లాడుతునారు, అమ్మ, నువ్వైనా చెప్పమ్మా ! నువ్వు నన్ను కనలేదా?, చెప్పమ్మా చెప్పు” అని  ఏడ్చింది.
ఎవరు ఏమి మాట్లాడకపోయేసరికి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళింది. ఉదయం ఎనిమిది అయినా  మహాలక్ష్మి టిఫిన్ చేయడానికి రాలేదు. అని జయ మహాలక్ష్మి గదిలోకి వెళ్లి చూసి నివ్వెర పోయింది. ఎంత పని చేశావమ్మా!    అంటూ ఏడుస్తూ వసంత్  దగ్గరకు వెళ్ళింది. వసంత్ కూడా మహాలక్ష్మి గదిలోకి వెళ్లి చూశాడు .అక్కడ ఉత్తరం రాసి పెట్టి ఉంది.
”అమ్మ ,నాన్న ,అన్నయ్యలు… నన్ను క్షమించండి. మీ మనస్సులు నొప్పించి ఉంటే  నన్ను క్షమించండి.
కాని నేను మీ బిడ్డను కాదు, అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతునాను . నేను అనుకున్నదే తడవుగా అన్ని సమకూర్చిపెట్టిన మీకు , నేను ఏమికాను అన్న నిజాన్ని భరించలేక వెళ్లి పోతున్నాను.

మీకు దూరంగా కన్పించనంత దూరంగా వెళ్తున్నాను .  శ్రీధర్ ని పెండ్లి చేసుకుని అమెరికా వెళ్తాను నన్ను క్షమించండి.”
ఆ ఉత్తరం  చదివి కుప్పకూలి పోయాడు వసంత్ . అలా  కొన్ని సంవత్సరాలు గడిచాయి.

శ్రీధర్ , మహాలక్ష్మి ఉద్యోగ రీత్య భారత దేశానికి వస్తారు తమ ఇద్దరి పిల్లలతో సహా. మాతృ దేశానికి రాగానే మహాలక్ష్మికి అమ్మ నాన్నలను చూడాలనిపించి ఆ విషయమే శ్రీధర్ తో చెప్పింది.
”నా పిల్లలను చూసిన తర్వాత వాళ్ళ కోపం పోతుందేమో అనే ఆశ ఉంది నువ్వు ఏమంటావ్ శ్రీధర్”,
తను సరే అన్నాడు.  భర్త పిల్లలతో సహా  మహాలక్ష్మి వాళ్ళ ఊరికి బయలుదేరింది.
ఊరి పొలిమేరలో అడుగు పెట్టగానే చిన్నప్పటి  జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎవరూ  కనిపించలేదు. చుట్టు  ప్రక్క  వాళ్ళని అడిగితే ”మీ అమ్మ నాన్నను మీ అన్నయ్య లిద్దరు వృద్ధాశ్రమం లో వదిలి వ్యాపారం అంటూ వెళ్లి పోయారు ” అని చెప్పారు.
వృద్ధాశ్రమం  అడ్రస్సు తీసుకుని అక్కడకు వెళ్ళారు, అక్కడ అమ్మ నాన్నను చూసి తల్లడిల్లిపోయింది.
మహాలక్ష్మిని చూడగానే జయ వసంత్ ఇద్దరూ  ఏడ్చారు.
” అమ్మా నీకు మేము గుర్తు రాలేదు కదూ! ”
మహాలక్ష్మి తో అన్నారు.
“లేదు నాన్నా ! నా మీద కోపం తగ్గి నన్ను ఎపుడైనా పిలుస్తారని ఆశతోనే బ్రతుకుతున్నాను ”
“నువ్వు మమల్ని వదిలి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకే మీ అన్నయ్యలకు మేము భారంగా ఉన్నాము అని మమల్ని ఇక్కడ వదిలేసి వ్యాపారమంటూ వెళ్ళిపోయారు, అందుకే ఎవరికీ భారం కాకూడదని ఇలా బ్రతుకుతున్నాము .”
ఎందుకు నాన్నా ! అంత  మాటలు  అంటారు .నేను మీ కోసం వచ్చాను. ఇదిగో మీ అల్లుడు, మనవరాలు,మనవడు అంటూ చూపించింది. అల్లుడిని దీవించి మనవరాలిని మనవడిని దగ్గరకి తీసుకున్నారు జయ వసంత్ .
” మీరు మాతో రండి .కలిసే ఉందాం ” అని   అల్లుడు , మనవలు బ్రతిమాలడంతో జయ వసంత్ వారితో బయలుదేరారు.

”నిన్ను ప్రేమగా పెంచినందుకు మా ప్రేమకు వారసురాలివయ్యావు కన్నా!
కన్న  కొడుకులై యుండి కాసులకు వారసులై మమ్ములను దూరంగా ఉంచారు” ఆప్యాయంగా అన్నారు. *

– గంధం విజయలక్ష్మి

కథలుPermalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Dadala Venkateswara Rao
Dadala Venkateswara Rao
8 years ago

తనను అంతగా ప్రేమించిన వారిని వదలిపెట్టి మహాలక్ష్మి ఎలా వెళ్ళ గలిగింది?
తన బిడ్డ కాదని పెళ్లి ఈడు కొచ్చేవరకు తెలియకుండా పెంచిన వారిని ఇల్లువదలివెళ్లి ఎంత కష్టపెట్టింది?
ఇద్దరు పిల్లలు పుట్టేవరకు వారికి ఊహ తెలిసే వరకు అక్కడే ఎలా ఉండగలిగింది?
రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంకు సంపాదించింది. IIT లో మంచి ర్యాంకు సంపాదించిన అమ్మాయి
అన్నింటిలోను ఉత్తమమైన మార్కులతో ముందుకు వెళుతూ వేరేచోట నాలుగైదు సంవత్సరాలు
చదివించబడి ఉద్యోగం రావడంతో తన భాగస్వామిని ఎన్నుకొని తిరిగివచ్చి అమెరికా పయనమయ్యింది
అంతవరకు బాగానే ఉంది కాని నిజం తెలిసిన తరువాత ఆ పెంచిన ప్రేమను ఎందుకు అర్ధం చేసుకోలేకపోయింది?
అమెరికాలో ఇద్దరి సంపాదనతో హాయిగా సంవత్సరాలు గడిపిన దంపతులకు హటాత్తుగా వీరు ఎందుకు గుర్తుకువచ్చ్హారు
తప్పుగా అనుకోకపోతే పిల్లల సంరక్షణ కోరకై తనవారేవరైనా ఇంటిదగ్గర ఉంటె బాగుంటుందని అనుకోలేదు కదా?
విధిలేక తల్లిదండ్రులకు పెంచిన అమ్మాయి పిలిచిన వెంటనే ప్రేమకు వారసురాలిగా చేసుకున్నారని అనుకోవచ్చా?
అన్నయ్యలు తమకు తెలిసిన నిజాన్ని ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చేవరకు చెప్పనేలేదు
కలసి పెరిగిన అన్నయ్యలకోసం ఆమె వెతికినట్లు కనిపించలేదు
ప్రేమగా పెంచినందుకు మా ప్రేమకు వారసురాలివయ్యావు కన్నా! అని అన్నా
“అవసరాలకు వారసులు” అని టైటిల్ ఉంటె బాగుంటుందని అనుకుంటున్నాను

ఇక్కడ
వారసత్వం అవసరం
మానవత్వం సూన్యం
సమానత్వం రక్తం
బంధుత్వం కులం

రాణి
రాణి
8 years ago

గంధం విజయ లక్ష్మి గారూ, మీ కథ బాగుంది. మీలాంటివారు విరివిగా రాయాలి. రాయడంతో బాటుగా చదవడాన్ని కూడా కొనసాగించాలి. మీ నించీ మరిన్ని మంచి కథలు రావాలని మనసారా కోరుకుంటున్నాను.

yarnagula sudhakararao

మీ కథ బావుంది మరిన్ని రాయగలరు
యర్నగుల సుధాకరరావు