నా జీవన యానంలో…

అప్పటికి మా ఇంటి బైట పుంత వైపు కొట్లు నాలుగూ కట్టలేదు. ఆ చివర ఈశాన్యం

మూలలో నూతికి ఆనుకుని ఒక కొట్టు గది ఉండేది . సీసాల్లో బిళ్ళలూ వగైరాలు చుట్టలు,

బీడీలు లాంటివి పెట్టుకుని మానాన్నమ్మ తీరికైనప్పుడు ఆకొట్లో కూచుని అమ్ముతుండేది

.కొట్టు మెట్లు దిగితే కిందంతా పుంత దారి.ఒకరోజు ఆ పుంత వాకిట్లో ఎండ

పొడలో మానాన్నమ్మ , ఆవిడ ఒళ్లో నేనూ కూర్చుని ఉన్నాం .  దూరంగా నది దగ్గర్నుంచి

రోడ్డు దిగి హనుమంతవఝుల వెంకన్నపంతులు గారునడిచి వస్తున్నారు, ఆయన

వూళ్ళో పేరుగడించిన పురోహితుడు. ఆయనకి  సంతానంలేదు,పిల్లల్నిబాగా ముద్దు చేసే వారాయన.అదుగో, అదుగో

తాతయ్యగారొస్తున్నారు, ఎల్లి దణ్ణవెట్టు” అంది  మానాన్నమ్మ .నేను పరుగున ఆయనకి ఎదురెల్లి ఆ పుంత మట్టిలో 

ఆయన పాదాలకి సాష్టాంగ పడ్డాను. ఆయన నన్నులేవదీసి తనతో బాటు తీసుకొచ్చి మా కొట్టు అరుగు మీద

కూర్చున్నారు. 

మా నాన్నమ్మ లేచి నిలబడి చేతులు జోడించింది. నేను ఆయన్ని”నన్ను మంచి బడిలో ఎయ్యండి తాతగారూ” అని

అడిగేసాను.

 ” ఈ పిల్ల మొహంలో మంచి సరస్వతీ కళ తాండవిస్తోంది. నేను మంచి ముహూర్తం పెడతాను. తీసుకొచ్చి మా ఇంటి

దగ్గరున్న బళ్ళో చేర్పించు సత్తెమ్మా” అని చెప్పి, పంచాంగం తెరిచి అక్కడే ముహూర్తం నిర్ణయించి వెళ్లిపోయరాయన.

“సరస్వతీ కళంటే ఏంటి నాన్నమ్మా? “అని మా నాన్నమ్మ నడిగాను.

“అంటే సదువుకునీ కళ” అంది నాన్నమ్మ.నేను పరుగెత్తి లోపలికి పోయి అద్దం ముందు నిలబడి నా మొహంలో

అలాంటిదేదైనా కనపడుతుందేమోనని చాలా సేపు పరిశీలించాను. ఆ ముహూర్తం రోజు మా ఇంట్లో పండగలాగా

సంబరపడిపోయారందరూ. ఉదయాన్నేనలుగు

నా చిన్నప్పుడు

పెట్టి తల స్నానం చేయించింది నాన్నమ్మ. కొత్తగా కుట్టించిన పైట, పరికిణీ తొడిగింది.

మా అమ్మ. నేను నడుస్తానన్నా వినకుండా నాన్నమ్మ నన్ను చంకనెత్తుకుని

తీసుకెళ్ళింది. సంచిలో అటుకులు, బెల్లం, సెనగపప్పు కలిపి తెచ్చింది. కొత్త పలకా

బలపంతో పాటు. వెంకన్న పంతులుగారు వాళ్ళ అరుగు మీద మడత కుర్చీలో

కూర్చుని ఆశీర్వచనం చదివేరు. అందుకు మానాన్నమ్మ తాంబూలంతో అయిదో

పదో రూపాయలు పెట్టి ఇచ్చింది. ఆయన నాచేత ‘ఓంనమః , శివాయః , సిద్ధంనమః ‘

అని దిద్దించారు. మరోసారి ఆయన కాళ్ళకి మొక్కించి ఆయన ఇంటి ఎదుట, కొంగలరావిచెట్టు దగ్గర్లో ఉన్న

ఎలిమెంటరీ స్కూల్లో నా పేరు రాయించి, నన్ను బడిలో చేర్చింది నాన్నమ్మ.

నేను అక్టోబరులో పుట్టడం వలన నా వయసు సరిపోవడం లేదని హెడ్మాస్టరు గారు,  తేదీ, నెల మార్చి రాసారట,

అలా స్కూల్ రిజిస్టర్లో  నా పుట్టిన తేదీ 20.3.1948 అయ్యింది. బోలెడంతమంది పిల్లలు, బోలెడన్ని క్లాసులు, ఆ బడి

నాకు బాగా నచ్చింది. మా క్లాసు పంతులమ్మ గారు మేరీకాంతమ్మ గారు నన్ను వొళ్ళో కూర్చోబెట్టుకుని అ ఆ లు

దిద్దించేరు. బడి విడిచిపెట్టేలోపల చాలా సార్లు నా బుగ్గ నిమిరి ముద్దు పెట్టుకున్నారు. ఇక అంతే, నేను ఒక్క రోజైనా

మానకుండా బడికెళ్ళడం మొదలు పెట్టాను. 

ఆరు నెలల తర్వాత ఒక అవాంతరమొచ్చింది , అది అగ్ర కులాల స్కూలు కాబట్టి బి.సి నైన నేను ఆ స్కూల్లో

చదవకూడదని వెరిఫికేషన్స్లో తేలిందట, నన్ను ఊరికి మరో చివర ఉన్న బి.సి స్కూలుకి, పిల్లల్ని పిలుచుకొచ్చే

అప్పలమ్మతో పంపించేసారు. ఆ బడిలో ఇద్దరో ముగ్గురో టీచర్లున్నా పరిస్థితి మాత్రం చర్చి బడిలాగే ఉంది. నేను

మళ్ళీ ఇంటికొచ్చి ఏడుపు మొదలు పెట్టాను.  నా గోల పడలేక మానాన్న వెళ్లి ఊరి సర్పంచి చిట్టిబాబు గార్ని

పట్టుకుని నా పేరు వెనకటి స్కూల్లోనే ఉండేలాగా చేసాడు.

తర్వాత బి.సి లు ఆ స్కూల్లో చదవడానికి అడ్డులేకపోయింది. ఆ సంఘటన ప్రభావం నా మీద ఎంతగా పని

చేసిందంటే  తర్వాత నేను స్కూలు నడిపినప్పుడు పిల్లల కులం నోట్చేసేదాన్ని కాదు. కులాలు, మతాలవేర్పాటు

వద్దని అన్పించేది. ఏం లాభం! తర్వాత వాళ్ళు హైస్కూలు కెళ్ళేటప్పుడ తప్పనిసరిగా కులం రాయాల్సి వచ్చేది.*

                                                                                                 – కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , Permalink

3 Responses to నా జీవన యానంలో…

 1. రమణ కుమార్ says:

  మేడం,
  మన దేశంలో కులాలు కూడా కుటుంబాల్లా సామాజిక విభజనలో భాగాలే కదా ?
  అయినప్పుడు మన సమాజాన్ని ఎప్పటికయినా కులరహితంగా చూడగలమా ?
  అందుకు సూచనలు ఏమైనా కనపడ్డాయా ? కనపడతాయా ?

 2. saavan says:

  ఇప్పటికి ఇదే మాట? మీరు ఏంటి అని…..

 3. చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమిటో..చదువుల ఒడిలోను కులాల తారతమ్యాలా!? మనం లేవని అనుకున్నా.. కొన్ని చోట్ల వదలవు అన్నట్లు..మళ్ళీ తప్పనిసరి అయ్యేదన్నమాట. ప్చ్.. భాదాకరం.
  మీ ఈ జీవనయానం చూడాలని ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తాను.