నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
ఆమెనెందుకు చంపారు?
ఎందుకా హత్య చేసారు?
కన్న ప్రేగు ఏ నిర్దాక్షిణ్యతను అద్దెకు తెచ్చుకుంది?
కన్న తండ్రి ఏ నరహంతకుడి పిడికిలిని ఆయుధంగా తెచ్చుకున్నాడు?
నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
మంచానికి అతుక్కుపోయిన చెల్లెలు గొణుగుతోంది!
“అమ్మో! జన్మలో ఏ అబ్బాయితోనూ మాట్లాడకూడదు”
“ఎవడు ఎక్కువ కులమో…ఎవడు తక్కువ కులమో ఎవరికి తెలుసు??”
కసిగా హత్యను చూస్తూ అన్నయ్య అంటున్నాడు…
“నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావుగా?”
“స్నేహితుల్లో నా పరువు పోయింది!”
నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
పొరిగింటాయన వచ్చాడు…
“పోనీలే! పరువును కాపాడుకోవడానికి ఇంతకన్నా ఏం చేయగలవు?”
“కడుపునొప్పితో చనిపోయిందని చెప్దాం. మన సంఘస్థులంతా నీకు మద్దతుంటారులే!”
పోలీసాయన వచ్చాడు…
“కడుపునొప్పా? నిజమా? తెలుసు నాకు ఏం జరిగిందో!”
“ఏమిస్తావు?”
నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
ప్రేమించినవాడు వచ్చాడు…
“మానసికంగా చచ్చిపోయాను ప్రియా!”
“నిన్ను పోగుట్టుకున్నాను!”
మౌనంగా,రహస్యంగా…రోదిస్తూనే ఉన్నాడు!
నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
నీ రక్తమాంసాలనిచ్చి…
నీ ప్రేమను పంచి, పెంచి పోషించి….
కులానికి, పరువుకి చేటు తెచ్చిందని…
అనాగరికంగా…అమానుషంగా…
చంపేసావు?
పరువంటే ఏమిటో చెప్పగలవా?
అది కన్నప్రేమ కన్నా గొప్పదంటావా?
పరువు తిరిగొచ్చిందా నీ కూతుర్ని హత్య చేస్తే?
అసలు పరువు హత్యలు చేయడంలో పరువు ఉందా???
నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
- విజయ భాను కోటే

సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా! ఎంతో మంది పరువు పేరిట క్రూరంగా చంపబడిన ఆడ కూతురుల ప్రశ్న.
మనసంతా విషాదం నిండుకుంది. బాగా వ్యక్తీకరించారు.
నావన్నీ ప్రశ్నలే!
మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే!
బాగా చెప్పారు.
థాంక్స్ వనజ గారు…
రియల్లీ గుడ్ ,
“ఎవడు ఎక్కువ కులమో…ఎవడు తక్కువ కులమో ఎవరికి తెలుసు??”
“కడుపునొప్పితో చనిపోయిందని చెప్దాం. మన సంఘస్థులంతా నీకు మద్దతుంటారులే!”.
కుల గజ్జి .. సంపద గజ్జి .. ఇవ్వి ఉన్నత కాలం అంతే ..
పరువంటే ఏమిటో చెప్పగలవా?
అది కన్నప్రేమ కన్నా గొప్పదంటావా?
నిజంగా పరువంటే ఏమిటి?
చాలా థాంక్స్ రామారావు గారు..