ఆ తరువాత బ్రిటీష్ రెసిడెన్సీని బేగం సేనలు చుట్టుముట్టాయి. విజయమో వీర స్వర్గమో అంటూ పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాట సమయంలో బేగం అపూర్వ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. బిడ్డడు బిర్జిష్ ఖధీర్‌ను వెంట పెట్టుకుని ఏనుగు విూద ఆమె స్వయంగా రణభూమికి విచ్చేశారు. (Hazarath Mahal riding on an elephant encouraged her army by her presence on the field of battle, History of Freedom Movement in India, Dr.Tara Chand Page.85) మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను, ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపర్చారు. పోరాటం భయంకరంగా సాగింది. ఆ పోరాటం గురించి తెలుసుకున్న లక్నో కమీషనర్, బ్రిటీష్ అధికారి హెన్రీ లారెన్స్ వ్యాఖ్యానిస్తూ, ‘ ఎక్కడా కూడా ఇంతకుమించిన శౌర్య ప్రతాపాలు మేము చూడలేదు ‘, అంటూ బేగం నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రశంసించాడు. ఈ పోరులో పలువురు కంపెనీ అధికారులు మృత్యువాత పడ్డారు. స్వదేశీ యోధులు ఎంతగా పోరాడినా రెసిడెన్సీ మాత్రం హజరత్ మహాల్ వశం కాలేదు.
ఆ సమయంలో బ్రిటీష్ అధికారుల నుండి సంధి ప్రస్తావన వచ్చింది. తిరుగుబాటుదారులకు క్షమాబిక్ష ప్రసాదిస్తామని, బేగంకు ప్రతినెల 25వేల రూపాయల పెన్షన్ ఇస్తామని, అందుకుగాను బేగం హజరత్ మహాల్ అవధ్ విూద తన అధికారాన్ని పూర్తిగా వదులుకోవాలని కంపెనీ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రస్తావన పట్ల బేగం మండిపడ్డారు. మా గడ్డ విూద మరొకరి పెత్తనమా? మా ప్రాణాలు పోయినా సరే శత్రువుకు లొంగేది లేదన్నారు. బిడ్డడు బిర్జిస్ ఖదీర్ న్యాయమైన హక్కులను, తన వెంట నడిచిన స్వదేశీపాలకులను, సైనికులను, సేనాధిపతులను ప్రజలను కంపెనీ బలగాల దయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టలేనంటూ, ఆ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. నా ప్రాణం విూది తీపితో న్యాయమైన హక్కులను వదులుకునేది లేదని బేగం స్పష్టం చేశారు.
భారతదేశ వ్యాపితంగా పలుప్రాంతాలలో ఆరంభమైన తిరుగుబాట్లను అణచివేసిన, బ్రిటీష్ సైన్యాలు,సేనాధిపతులు చివరకు లక్నో విూద పూర్తిగా దృష్టి సారించారు. లక్నోను వీలయినంత త్వరగా పట్టుకోవలసిందిగా అధికారులకు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ నుండి ఆదేశాలందాయి. 1858 మార్చి 3-4 తేదిలలో బ్రిటీష్ సైన్యాధిపతి కోలిన్ భారీ సైనిక బలగాలతో లక్నోను చుట్టుముట్టాడు. ఆయనకు తోడుగా నేపాల్ ప్రభువు జంగ్ బహుద్దూర్ తన బలగాలతో మార్చి 11వ తేదిన ఆంగ్లేయాధికారులతో కలిశాడు. లక్నోను అన్ని వైపుల నుండి శతృసైన్యాలు పూర్తిగా చుట్టుముట్టాయి. బేగం హజరత్ మహాల్ నివాసం కైసర్‌బాగ్ విూద ఆంగ్లేయ సైన్యాల ఫిరంగులు నిప్పుల వర్షం కురిపిస్తుండగా, సైనికుల తుపాకులు గుండ్ల వర్షం కురిపించసాగాయి.
ఆ సమయంలో బేగం హజరత్ మహాల్ పరిస్థితి ప్రమాదంలో పడిందని గ్రహించిన సహచరులు ఆమెను రక్షిత స్థలానికి వెళ్ళవలసిందిగా సూచించారు. ఆమె అక్కడ నుండి మరోచోటుకు వెడితే అది ఆంగ్లేయులకు విజయం లభించినట్టు కాగలదని భావించిన ఆమె పెనుముప్పు చుట్టుముట్టేంత వరకు ఆ ప్రాంతం నుండి కదలలేదు. చివరకు పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారటంతో, సహచరుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితులలో మార్చి 16న హజరత్ మహాల్ లక్నో నుండి తప్పుకున్నారు.ఆ తరువాత అవధ్ రాజ్యంలోని స్వదేశీ పాలకుల అధీనంలో ఉన్న పలు ప్రాంతాలు తిరుగుతూ పలుచోట్ల శత్రువును ఎదుర్కొంటూ, మరికొన్ని చోట్ల మిత్రుల ఆతిధ్యం పొందుతూ, బ్రిటీషర్ల దాడుల నుండి తప్పించుకుంటూ ఆమె ముందుకు సాగారు. ఆమె ఎక్కడకు వెళ్ళినా బ్రిటీషు సైన్యాలు ఆమెను వెంబడించ సాగాయి. ఓ క్షణం విశ్రమించే తీరికలేకుండా చేశాయి. ఆమెకు ఆశ్రయమిచ్చినవారిని ఇక్కట్లపాలు చేయసాగాయి.
ఆ సమయంలో విద్రోహుల కుట్ర ఫలితంగా యోధుడు మౌల్వీ అహమదుల్లా షాను శత్రువులు బలితీసుకున్నారు. ఈ వార్త ఆమెను బాధించింది. పలు ప్రాంతాలలో తిరుగుబాటు యోధులు సాగిస్తున్న పోరాటాలలో అపజయాలు చవిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆమె సహచరులు, స్వదేశీ పాలకులు రాజా బేని మాధవ్ సింగ్ తదితరుల పరాజయాలు బేగంను బాగా కృంగదీశాయి. ఈ వాతావరణంలో బేగం తన పరివారం తోపాటుగా అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు తలదాచుకుంటూ గడపసాగారు. బేగం పరివారాన్ని వెంటాడుతున్న కంపెనీ బలగాలు ఆమె తలదాచుకున్న చోటల్లా ప్రవేశించి కసికొద్ది బీభత్సం సృష్టించసాగాయి.
ఈ విధంగా బేగం హజరత్ మహల్ ప్రవాసంలో ఉన్నప్పుడు 1858 నవంబర్ 1న విక్టోరియా మహారాణి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, పాలనాధికారాన్ని స్వయంగా స్వీకరించింది. ఈ సందర్భంగా విక్టోరియా రాణి ప్రకటన గా ఖ్యాతి గాంచిన ప్రకటనను ఆమె చేసింది. అందులో స్వదేశీ పాలకులకు, ప్రజలకు ఆమె పలు హావిూలు కుమ్మరించింది. పలు ఆకర్షణీయమైన ఆశలను చూపింది. తిరుగుబాటు వీరులకు, నేతలకు క్షమాబిక్ష ప్రసాదిస్తానంది. తిరుగుబాటులో పాల్గొన్న స్వదేశీ పాలకులను, ప్రజలను ఆ ప్రకటన కొంతలో కొంతగా ఆకర్షించింది. విక్టోరియా రాణి ప్రసాదించే క్షమాబిక్షతో బ్రతికి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న కొందరు సహచరులు, పాలకులు, జవిూందారులు, అధికారులు తిన్నగా బేగం పక్షం నుండి తప్పుకోసాగారు. ఈ పరిణామాలు ఆమెను మరింత కలవరపరిచాయి.
ఆ పరిస్థితులలో ప్రజలలో, సహచరులలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు, బేగం హజరత్ మహాల్ విక్టోరియా ప్రకటనకు దీటుగా 1858 డిసెంబర్ 31న మరో చారిత్రాత్మక ప్రకటనను బిర్జిస్ ఖదీర్ పేరిట విడుదల చేశారు. ఆ ప్రకటనలో సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన ఆంగ్లేయులు ఇండియాలోని స్వదేశీ సంస్థానాలను ఎలా ఆక్రమించుకుందీ, స్వదేశీ పాలకులను ఎలా మోసగించిందీ, స్వదేశీ పాలకులతో పలు ఒప్పందాలు చేసుకుని వాటిని నిస్సిగ్గుగా ఎలా ఉల్లంఘించిందీ, ప్రజల మత విశ్వాసాల విూద, ఆచార సంప్రదాయాల విూద ఎటువంటి డాదులు నిర్వహిస్తున్నదీ సవివరంగా పేర్కొన్నారు. స్వదేశీ పాలకుల విూద ఎంతటి దారుణాలకు ఒడిగట్టిందీ ఆ ప్రకటనలో వివరించారు. ఆంగ్లేయులు అపరాధాన్ని క్షమించినట్టు కలలో కూడా ఎవ్వరూ చూడలేదు అంటూ ఆనాడు లొంగుబాటుకు సిద్ధ్దమౌతున్న యోధులను బేగం హెచ్చరించారు. ( ‘.. no one has ever seen in a dream that the English forgave an offence ..’ -Encyclopaedia of Women Biography Vo. II, Ed. by Nagendra.K.Singh, APH Publishing Corporation, New Delhi, 2001, Page. 66)
ఆంగ్లేయులు స్వదేశీయుల ఆత్మాభిమానాన్ని ఏవిధంగా దెబ్బగొట్టిందీ, స్వదేశీయుల మతధర్మాలను ఏవిధంగా కించపర్చిందీ, మత మనోభావాలను ఏ విధంగా అవమాన పర్చిందీ, తిరుగుబాటుకు భయపడి తిరగబడ్డ సైనికులను, నేతలను మాలిమి చేసుకునేందుకు ఎలాంటి ఆశలు చూపిందీ, గతంలో స్వదేశీ పాలకుల విూద ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడిందీ ఆ సుదీర్ఘమైన చారిత్రాత్మక ప్రకటన సాక్ష్యాధారాలతో సహా వివరించింది. చివరకు మా ప్రజలు మాదేశాన్ని కోరుతున్నప్పుడు ఆమె మాదేశాన్ని మాకెందుకు వదలిపెట్టదూ? ( ‘..Why does her Majesty not restore our country to us. when our people want it..’ – Encyclopaedia of Women Biography Vol. II, Page.66) అని సూటిగా విక్టోరియా రాణిని ప్రశ్నించారు. విక్టోరియా రాణి మభ్యపెట్టు మాటలను నమ్మవద్దని, మోసపోవద్దని ప్రజలకు, స్వదేశీ పాలకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. మాతృభూమి నుండి పరాయిపాలకుల పెత్తనాన్ని రూపుమాపేందుకు కంకణబద్ధులై అంతా కదలాలని ఆమె ప్రజలను కోరారు.
ఈ పరిస్థితులు ఇలా ఉండగా, ఆంగ్లేయాధికారులు లక్నో తిరుగుబాటును క్రూరంగా అణిచివేయడానికి, తిరుగుబాటు నాయకులను తుదముట్టించేందుకు పథకాలు రూపొందించసాగారు. అన్ని వైపుల నుండి తిరుగుబాటు సైన్యాలను తరుముతూ, వారంతా నేపాల్ దిశగా సాగిపోయేందుకు పథకం ప్రకారంగా అనుకూలతను సృష్టించారు. లక్నో నుండి తప్పుకున్న తరువాత బేగం హజరత్ మహాల్ కూడా మిగతా యోధులతో పాటుగా మరో మార్గం లేక నేపాల్ దిశగా సాగాల్సివచ్చింది. ఆ నిర్ణయం వలన ఆమె రక్షణ కూడా ప్రమాదంలో పడింది. బ్రతికుండగా తాను గాని, మరణించాక తన శవం గాని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల చేతుల్లో పడరాదని నిర్ణయించుకున్న ఆమె నానా సాహెబ్ ఇతర తిరుగుబాటు నేతలతో కలిసి నేపాల్ అడవుల్లోకి వెళ్ళిపోయారు.
అక్కడ కూడా ఆమెకు ప్రమాదం తప్పలేదు. ప్రమాదాల నుండి తప్పించుకుంటూ రాత్రి పగలు అని తేడా లేకుండా ఆమె గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా ఆంగ్లేయుల నుండి లొంగుబాటు ప్రతిపాదనలు వచ్చాయి. సుఖవంతమైన జీవితం గడపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కల్పిస్తామని బ్రిటీషు అధికారులు ఆశలు కల్పించినా, స్వతంత్ర జీవనాన్ని, మాతృభూమిని వదలుకోడానికి ఇష్టపడని ఆమె ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. చివరకు నేపాల్ రాజ్యం లోనికి ప్రవేశించిన ఆమెకు నేపాల్ పాలకుడు జంగ్ బహుద్దూర్ నుండి సహకారం లభించక పోగా నేపాల్ అడవులు వదిలి వెళ్ళిపోవాల్సిందిగా అతను ఆదేశించాడు. అనివార్యపరిస్థితులలో ప్రమాదకర వాతావరణాన్ని ఎదుర్కొంటూ బేగం హజరత్ మహాల్, బిర్జిస్ ఖధిర్ నేపాల్ అడవుల్లో సంచరించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఒక వేళ పోరాడి నేలకొరిగే అవకాశం తనకు లభించకుంటే అత్మార్పణ చేసుకునేందుకు బేగం ఎల్లప్పుడు విషంతో కూడిన పాత్రను తనవెంట ఉంచుకుని ఆంగ్లేయుల విూద పోరాటం సాగించేందుకు ప్రయత్నాలను సాగించారు.
ఆ సమయంలో నేపాల్ అడవుల్లోకి బేగం హజరత్ మహాల్ ఛాయా చిత్రం గీసేందుకు వచ్చిన ఒక బ్రిటీష్ చిత్రకారుని ద్వారా, ఆమెకు భారీ నజరానా అందజేస్తామని ఆశ చూపుతూ బ్రిటీష్ పాలకులు, బేగంను లొంగదీసుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ సాగుతుండగా, ఆమె వెంట వచ్చిన యోధులు ఒక్కొక్కరే ఆ కారడవుల్లో, మంచు కొండల్లో మృత్యువువాత పడసాగారు. కాలం గడిచేకొద్ది సంపదతోపాటుగా, సహచరులు తరిగి పోసాగారు.
ఆ పరిస్థితులలో కూడా శత్రువుకు ఏమాత్రం తలవంచడానికి బేగం ఇష్టపడలేదు. ప్రధాన సహచరులు, అనుంగు అనుచరులు మృత్యువాతపడి అదృశ్యమైపోయారు. ఆ సమయంలో ఒంటరిగా మిగిలిన ఆ అసమాన పోరాటయోధురాలు, అతి నిస్సహాయ పరిస్థితులలో సామాన్య జీవితం గడపసాగారు. చివరకు ఆ మంచు కొండల శిఖరాల విూద రెపరెపలాడుతున్న అవధ్ రాజ్యం ఛత్ర ఛాయలో 1874 ఏప్రిల్ మాసంలో బేగం హజరత్ మహాల్ కన్నుమూశారు.
ఆమె భౌతికకాయాన్ని ఖాట్మండులో ఆమె స్వయంగా నిర్మించుకున్న ఇమాం బారాలో ఖననం చేశారు. ప్రస్తుతం ఆ ఇమాంబారా శిథిలమైపోయింది. అక్కడ హజరత్ మహాల్ స్మృతి చిహ్నంగా ఆమె సమాధి మాత్రమే మిగిలింది. అది కూడా ఆక్రమణలకు గురవుతుంది. ఆ సమాధి నూటపాతికేళ్ళుగా అక్కడ ఉన్నా దానిని పట్టించుకున్న వారు లేకపోయారు. 1957లో ప్రథమ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా, బేగం హజరత్ మహాల్ సమాధికి ఏర్పడిన దుస్థితి గురించి ఆమె వంశజుడు విూర్జా ఆజం ఖదీర్ స్వయంగా ఆనాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దృష్టికి తెచ్చారు.
ఆ మహాయోధురాలి స్మృతిగా మిగిలి ఉన్న ఆమె సమాధి నిర్లక్ష్యానికి గురికావడం గురించి తెలుసుకున్న ప్రధాని నెహ్రూ తన బాధను వ్యక్తం చేస్తూ తగిన శ్రద్ద తీసుకుంటానని హవిూ ఇచ్చారు. ఆ సమాధిని ఫోటోలు తీయించి, వాటిని ఆజం ఖదిర్‌కు కూడా పంపారు. ఆ ఫోటోలతోపాటుగా, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ సమాధి సంరక్షణ బాధ్యతను తీసుకుంటుందని ప్రధాని నెహ్రూ హావిూ కూడా ఇచ్చారు. కానీ ఆ హావిూలు అమలుకు నోచుకొలేదు సరికదా ఆ సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ఉత్సవాలలో ఆ మహాయోధ బేగం హజరత్ మహాల్ ప్రస్తావన కూడా రాలేదు. స్వయంగా ప్రధాని పండిత నెహ్రూ ప్రకటించిన హావిూలు ఈనాటికి కూడా నెరవేరలేదు. ఆ కారణంగా బేగం హజరత్ మహాల్ సమాధి మరింతగా విస్మరణకు గురై తిన్నగా శిధిలావస్థకు చేరుకుంటున్నది. ఆ సమాధి పరిసర ప్రాంతాలు పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయని పత్రికలు, ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నా ప్రభుత్వానికి, ప్రభుత్వాధి నేతలకు పట్టకపోవటం కడు విచారకరం. *
* * *
- సయ్యద్ నశీర్ అహమ్మద్
(ఇంకా వుంది)

















