నీకేమో చెలగాటం….నాకేమో ప్రాణసంకటం!!!

నాకు ఈ కాగితాల గొడవలు తెలీదు సామీ
ఫారాలు నింపుడెట్లో కూడా తెలీదు బాబయ్యా!
వయసయ్యిపోయింది
వారసులు కాదన్నారు…
నడుమొంగిపోయింది
నాకు పనివ్వనన్నారు…
వృద్ధాప్య పించనంటా…
గవర్నమెంటు ఆదుకుంటాదంటా…అంటే….
ఆపసోపాలు పడుతూ నీ కాడికొచ్చాను!
నువ్వేమో…విసుక్కుంటావు
పోనీలే…బిడ్డకు పనిభారం అనుకున్నాను
ఒక సీటు కాడ్నించి ఇంకో సీటు
ఒక మడిసి కాడ్నించి ఇంకో మడిసి
సత్తువ తగ్గిపోయిన కాళ్ళను పరిగెట్టిస్తున్నారే!
ఫలానా కాగితం కావాలంటావు
అగ్గగ్గున పారి అట్టుకొచ్చేత్తాను
ఎక్కడో ఇంకో అధికారి సంతకం అంటావు
ఈడ్చుకుంటా పోయి పెట్టించుకొత్తాను
అన్నీ ఒకసారి చెప్పవు
మళ్ళా దేనికో పంపిస్తావు
కూసింత కడుపు కోసం పించను దేహీ అంటాను నేను
నా కష్టాలు నీకు నవ్వులాటగా ఉంటాయి
నా చాదస్తం చూసి చిరబురలాడుతావు
ఈ పించను చూసైనా….
నా కొడుకు రెండు ముద్దలెయ్యకపోతాడా….అని పిచ్చి ఆశ
సందె బతుకు పోరాటం….
భలే దుర్భరమైపోయింది సామీ….
ఇన్ని చేసినా….బల్ల కింద చెయ్యి పెట్టి….
నా ముసలి బతుకుతో బేరాలాడుతావు!
నీకేమో చెలగాటం….
నాకేమో ప్రాణసంకటం!!!

– విజయభాను కోటే

(వృద్ధాప్య పించనులు ఇచ్చేటపుడు, ఆ పనికే కేటాయించబడ్డా…విసుగు, కోపం ప్రదర్శించే

ఉద్యోగస్తులను చూసారా? ముసలి వారి దగ్గర ఎంత దండుకోవచ్చో లెక్కలు వేసే వాళ్ళను నేను

చూసాను)

కవితలు, , , , , , , , , , , , , , , , , Permalink

5 Responses to నీకేమో చెలగాటం….నాకేమో ప్రాణసంకటం!!!

 1. prabhakar says:

  అవును విజయభాను గారూ ! అవినీతి మర్రిచెట్టు వెళ్ళు పాతుకుపోయిన మన సమాజంలో మానవత్వం అన్ని విధాలుగా అడుగంటి పోతోంది. మనం సమాజాన్ని బాగు చెయ్యాలి అంటే అది మన ఇంటి నుంచే మొదలెట్టాలి. ప్రతి ఇంటా పిల్లలకు సద్బుద్ధి అలవర్చాలి. ఎందుకంటే ఈ పిల్లలే పెరిగి నవ భారత నిర్మాణం చేసేది.

 2. srinivas says:

  చాల బాగుంది కవిత… ఈ అవినీతి భారతం లో ఒక విషాద నిజం….

 3. chandu says:

  చాల బాగుంది మేడం గారు
  ప్రభుత్వ చెలగాటం.. ప్రజలు ఆరాటం వీటిపై మీ పోరాటం ఎప్పుడు ఆగదు

 4. Dadala Venkateswara Rao says:

  ముసలి వారి దగ్గర ఎంత దండుకోవచ్చో లెక్కలు వేసే వాళ్ళను ప్రత్యక్షంగా చూచి ఏమిచేసారు – కోటే విజయ భాను గారు
  నా కొడుకు రెండు ముద్దలెయ్యకపోతాడా….అని పిచ్చి ఆశ అని వ్రాసారు
  నా అన్నవాళ్లు ఎవరూ లేని, 65 వయసు పైన గల వారికి మాత్రమె నెలకు 500 రూపాయలు వృద్ధాప్య పించను లభిస్తుంది
  అడగాలనుకుంటే బల్ల కింద చెయ్యి పెట్టి అడగాల్సిన అవసరంలేని రోజులు ….దీన్ని అరికట్టవలసిన పై అధికారులకుంటుంది
  వయసు మల్లినవారి ప్రాణాలతో చెలగాట మాడాలని ఎవరికీ ఉండదు
  మానవతా దృక్పదంతో ఓర్పుతో పనిచేసే ప్రభుతోద్యోగులను సదరు సీట్లలో పనులకు నియమిస్తే
  పించను తీసుకోవడానికి వచ్చిన ముసలి వాళ్ళను ప్రాణ సంకటం నుండి కాపాడవచ్చు

  మీరేదో కవిత రాస్తారు ….
  మాకేదో కలత పంచుతారు
  అదేమిటి అని అడిగితె
  మీకేమో చెలగాటం….
  మాకేమో ప్రాణసంకటం! అంటారు

  • “మానవతా దృక్పదంతో ఓర్పుతో పనిచేసే ప్రభుతోద్యోగులను సదరు సీట్లలో పనులకు నియమిస్తే
   పించను తీసుకోవడానికి వచ్చిన ముసలి వాళ్ళను ప్రాణ సంకటం నుండి కాపాడవచ్చు”
   చాలా చక్కగా చెప్పారు…..
   ఉన్న ఉద్యోగుల్లో కూడా, మానవతా దృక్పథాన్ని పెంచాలి సార్…
   ఇక్కడి పల్లెటూర్లలో ఇది జరుగుతూనే ఉంటుంది…
   పెద్దవాళ్ళను విసుక్కోవడమే నాకు బాధ అనిపిస్తుంది.